Children: తండ్రి బాటలోనే తనయ..!

హాయ్‌ నేస్తాలూ..! మనకు పియానో అంటే.. తెలిసే ఉంటుంది కదా! దానితో చక్కగా సంగీతం వాయిస్తారు. చిన్నప్పుడు మనం పియానో ఆటబొమ్మ కొనుక్కొని ఎంచక్కా ఆడుకొనే ఉంటాం కదా! ఇప్పుడు ఆ సంగతి ఎందుకంటే.. ఓ చిన్నారి ఏకంగా నిజమైన పియానోనే వాయించేస్తోంది.

Published : 13 Jun 2024 00:03 IST

హాయ్‌ నేస్తాలూ..! మనకు పియానో అంటే.. తెలిసే ఉంటుంది కదా! దానితో చక్కగా సంగీతం వాయిస్తారు. చిన్నప్పుడు మనం పియానో ఆటబొమ్మ కొనుక్కొని ఎంచక్కా ఆడుకొనే ఉంటాం కదా! ఇప్పుడు ఆ సంగతి ఎందుకంటే.. ఓ చిన్నారి ఏకంగా నిజమైన పియానోనే వాయించేస్తోంది. తన సంగీతంతో.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి తనెవరో.. ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

థాయ్‌లాండ్‌కు చెందిన ఎమిలీ బార్టన్‌కు తొమ్మిది సంవత్సరాలు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. ఈ వయసు పిల్లలు స్కూల్‌ నుంచి వచ్చాక.. రకరకాల బొమ్మలతో ఆడుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ ఈ చిన్నారి పియానో సాధన చేస్తోంది. మూడేళ్ల వయసు ఉన్నప్పుడే పియానో నేర్చుకోవడం ప్రారంభించిందట. ఇప్పుడు తనే సొంతంగా మ్యూజిక్‌ కూడా కంపోజ్‌ చేయగలదు. ప్రతిరోజూ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పియానో వాయిస్తూనే ఉంటుందట.

ఆయన వల్లే..!

మన ఎమిలీ ఇంత చక్కగా పియానో వాయించడానికి కారణం.. వాళ్ల నాన్న పౌల్‌ బార్టన్‌. ఆయన పియానిస్ట్‌ అట. వాళ్ల అమ్మ కూడా మ్యూజిక్‌ టీచర్‌. అందుకే చిన్నప్పటి నుంచే తనకు కూడా నేర్పించడం ప్రారంభించారట. అనుకున్నదాని కంటే చాలా తక్కువ సమయంలోనే ఆ చిన్నారి నేర్చేసుకుందట. ఎమిలీ వాళ్ల నాన్న.. ఏనుగు కోసం ఎక్కువగా పియానో వాయిస్తాడట. ఆయన బాటలోనే నడుస్తున్న ఈ చిన్నారి కూడా జంతువుల కోసం పియానో వాయిస్తోందట. దానికి సంబంధించిన వీడియోలన్నీ ఓ యూట్యూబ్‌ ఛానెల్లో పోస్ట్‌ చేస్తుందట ఎమిలీ. అలా తను మొదటిసారి పోస్ట్‌ చేసిన వీడియోకు.. వారం రోజుల్లోనే దాదాపు 3లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయట. ఇప్పటికీ ఆమె పోస్ట్‌ చేసిన వీడియోలు అతి తక్కువ సమయంలో కొన్ని లక్షల మంది వీక్షిస్తారట. మరో విషయం ఏంటంటే.. తను పియానో ఒక్కటే కాకుండా డ్రమ్స్‌ కూడా వాయిస్తుంది. ‘నాకు పియానో వాయించడం అంటే చాలా ఇష్టం. సంగీతానికి మనలాగే.. జంతువులు కూడా స్పందిస్తాయి’ అని చెబుతోంది ఎమిలీ. ఎంతైనా ఈ చిన్నారి చాలా గ్రేట్‌ కదూ! 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు