Inspiring story: జెస్సీ.. సాధించింది!

హాయ్‌ నేస్తాలూ..! ఆటల్లో, పాటల్లో.. ఇంకా ఇతర అంశాల్లో చాలామంది రికార్డులు, అవార్డులు సాధిస్తూనే ఉంటారు. కానీ.. ఎవరి విజయం వారిదే.. ఎవరి ప్రత్యేకత వారిదే.

Published : 30 Jun 2024 01:43 IST

హాయ్‌ నేస్తాలూ..! ఆటల్లో, పాటల్లో.. ఇంకా ఇతర అంశాల్లో చాలామంది రికార్డులు, అవార్డులు సాధిస్తూనే ఉంటారు. కానీ.. ఎవరి విజయం వారిదే.. ఎవరి ప్రత్యేకత వారిదే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్నారి కూడా.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్కేటింగ్‌లో రికార్డు సాధించింది. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

విజయవాడకు చెందిన మాత్రపు జెస్సీ రాజ్‌కు పదమూడు సంవత్సరాలు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. నాన్న సురేష్‌కుమార్, అమ్మ రాధ. తనకు చిన్నప్పటి నుంచే ఆటలంటే.. ఎక్కువ ఆసక్తి ఉండేదట. అలా కొవిడ్‌ సమయంలో.. ఎక్కువగా ఆటలకు సంబంధించిన వీడియోలు చూసేదట. అప్పుడే తనకు రోలర్‌ స్కేటింగ్, ఆర్టిస్టిక్‌ స్కేటింగ్‌ నేర్చుకోవాలనిపించిదట. అదే విషయం తల్లిదండ్రులతో చెప్పిందట. తన ఆసక్తిని గమనించి.. ఆమెకు స్కేటింగ్‌లో శిక్షణ ఇప్పించారు. ఆరు నెలల పాటు తర్ఫీదు తీసుకున్న తర్వాత, మరింతగా ప్రతిభ చాటేందుకు విశాఖపట్నంలో ఓ శిక్షణ కేంద్రంలో చేర్పించారు. జెస్సీ 2021లో చండీగఢ్‌లో జరిగిన 59వ జాతీయ ఆర్టిస్టిక్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తలపడి రెండు కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. స్కేటింగ్‌ బాగా చేయాలంటే.. శరీరం సహకరించాలి. కాబట్టి తను.. వ్యాయామం కూడా చేస్తుందట. క్రమం తప్పకుండా.. రోజూ స్కేటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూనే ఉంటుందట.

పతకాల పంట..!

మన జెస్సీ.. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు న్యూజిలాండ్‌లో జరిగిన.. ‘పసిఫిక్‌ కప్‌ ఆర్టిస్టిక్‌ ఓపెన్‌ ఇన్విటేషన్‌’ పోటీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. అండర్‌-14 బాలికల విభాగంలో.. ‘ఇన్‌లైన్‌ ఫ్రీ స్టైల్‌ ఈవెంట్‌’లో ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, ఐర్లాండ్, జపాన్, న్యూజిలాండ్‌కు చెందిన 17 మంది క్రీడాకారులతో పోటీ పడి.. 31.98 పాయింట్లు సాధించింది. తన ప్రతిభతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అంతే కాకుండా.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో పతకాలు సాధించి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. త్వరలో.. ఇటలీలో నిర్వహించనున్న ‘వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌’, చైనాలో జరగనున్న ‘ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌’లో పాల్గొనేందుకు శిక్షణ కొనసాగిస్తోంది. మరి తను ఆ పోటీల్లో నెగ్గి.. బంగారు పతకాలు సాధించాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!

తాతినేని శ్రీనివాసరావు,
విజయవాడ, న్యూస్‌టుడే


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని