An inspiring story: కడెన్‌ సాధనతో సాధించాడు..!

]హాయ్‌ నేస్తాలూ..! మీరు స్కేటింగ్‌ చేయడం చూశారా..? మరి హాకీ ఆడటం..? ‘అవి రెండూ తెలుసు కానీ.. అసలు విషయం ఏంటి?’

Published : 18 Jun 2024 00:12 IST

హాయ్‌ నేస్తాలూ..! మీరు స్కేటింగ్‌ చేయడం చూశారా..? మరి హాకీ ఆడటం..? ‘అవి రెండూ తెలుసు కానీ.. అసలు విషయం ఏంటి?’ అనుకుంటున్నారు కదూ! ఇవి రెండూ వేరువేరుగా ఆడటం మనం చాలాసార్లు చూసే ఉంటాం. కానీ ఒకేసారి ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది? అలా ప్రదర్శించి రికార్డు సాధించిన వ్యక్తి గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కథనం చదివేయండి మరి!

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన కడెన్‌ గలాటియుక్‌కి పన్నెండు సంవత్సరాలు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తనకు చిన్నప్పటి నుంచే.. ఆటల మీద ఎక్కువ ఆసక్తి ఉండేదట. అందుకే తనకు రెండేళ్ల వయసున్నప్పుడే.. స్కేటింగ్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించాడట. నాలుగేళ్లు వచ్చాక హాకీ ఆడటం మొదలుపెట్టాడట. అంతే కాకుండా.. పాఠశాలలో నిర్వహించే అన్ని పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటాడట.  

శిక్షణ ఇలా..!

ఈ చిన్నారి ఉదయం 5గంటలకు నిద్రలేచి.. 6గంటల వరకు స్కేటింగ్‌ చేస్తాడట. ఆ తర్వాత స్కూల్‌కి వెళ్లి వచ్చాక మళ్లీ ఒక గంట స్కేటింగ్‌ చేస్తాడట. కాసేపు విశ్రాంతి తీసుకొని.. అప్పుడు హాకీ ఆడటం ప్రారంభిస్తాడట. మీకో విషయం తెలుసా.. తను ప్రతిరోజు కచ్చితంగా 1000 గోల్స్‌ వేస్తాడట! ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఇది నిజమే నేస్తాలూ.. అంత సాధన చేశాడు కాబట్టే ఒక పోటీలో స్కేటింగ్‌ చేస్తూ.. కేవలం ఒక నిమిషంలో 38 గోల్స్‌ వేశాడు. తన ప్రతిభను గుర్తించి ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ వారు అందులో స్థానం కల్పించారు. ‘మనం ఒంటరిగా ఎంత బాగా ఆడినా.. బృందంతో సమన్వయంగా ఆడటం కూడా అంతే ముఖ్యం. అప్పుడే మంచి ఫలితాలు సాధించగలం’ అని చెబుతున్నాడు కడెన్‌. అంతే కాకుండా.. ఆటలో ఎలాంటి మెలకువలు పాటించాలో కూడా వివరిస్తున్నాడు. ఎంతైనా ఈ చిన్నారి చాలా గ్రేట్‌ కదూ! 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు