కుటుంబ బాటలోనే ఈ చిన్నారి..!

హాయ్‌ నేస్తాలూ..! ఆటలు అంటే ఎంత ఇష్టమున్నా.. బాగా కష్టపడి అందులో ఉన్నత స్థానాలకు చేరుకునే వారు చాలా తక్కువ మంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అబ్బాయి కూడా అలా రికార్డు సాధించిన వాడే. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

Published : 22 Jun 2024 05:34 IST

హాయ్‌ నేస్తాలూ..! ఆటలు అంటే ఎంత ఇష్టమున్నా.. బాగా కష్టపడి అందులో ఉన్నత స్థానాలకు చేరుకునే వారు చాలా తక్కువ మంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అబ్బాయి కూడా అలా రికార్డు సాధించిన వాడే. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

అమెరికాకు చెందిన డాషౌన్‌కు పదకొండు సంవత్సరాలు. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ బుడతడు ‘అమెరికన్‌ ఫుట్‌బాల్‌’ ఆడి తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఈ ఆట అంటే.. తనకు చాలా ఇష్టమట. మూడేళ్ల వయసు నుంచే.. ఈ ఫుట్‌బాల్‌ ఆడటం నేర్చుకున్నాడట. అంతే కాకుండా.. తను ఆటలో ఎలాంటి మెలకువలు పాటించాలో కూడా చాలా చక్కగా వివరిస్తున్నాడు తెలుసా!

నాన్న వల్లే..!

మన డాషౌన్‌కి చిన్నప్పటి నుంచే ఈ ఆట మీద ఆసక్తి కలగటానికి కారణం.. వాళ్ల నాన్నేనట. ఆయన కూడా ఫుట్‌బాల్‌ ఆటగాడు అవ్వడంతో.. తనకూ నేర్పించడం ప్రారంభించాడట. ఇంకో విషయం ఏంటంటే వాళ్ల కుటుంబంలో దాదాపుగా అందరూ.. క్రీడాకారులేనట. అందులోనూ  అమెరికన్‌ ఫుట్ బాల్‌ ఆడేవాళ్లే ఎక్కువట. అందుకే.. ‘ఫుట్‌బాల్‌ ఆట నా రక్తంలోనే ఉంది. నేను ఆడకపోతే ఎలా?’ అంటున్నాడు ఈ బుడతడు. ఈ ఆట కాకుండా తనకు పెయింటింగ్‌ వేయడం, వంట చేయడం అంటే చాలా ఇష్టమట.

అప్పుడే హోంవర్క్‌..!

ఫుట్‌బాల్‌ ఆట ఆడాలంటే.. శరీరానికి వ్యాయామం, యోగా చాలా అవసరం. అలాగని అవే చేసుకుంటూ ఉంటే.. చదువులో వెనకబడే అవకాశం ఉంది కదా! అందుకే.. తను వ్యాయామం చేసే చోటుకే.. పుస్తకాలు కూడా తీసుకెళ్లి అక్కడే చదువుకుంటాడట డాషౌన్‌. ఎంత కష్టమైనా కూడా.. ప్రతిరోజు కచ్చితంగా వర్క్‌అవుట్స్‌ చేసి హోంవర్క్‌ పూర్తి చేసేస్తాడట. ‘ఆటల్లోనే కాకుండా మనకు నచ్చిన ఏ రంగంలోనైనా ముందుకు వెళ్లాలంటే.. అందులో మన నైపుణ్యాలను రోజు రోజుకీ మెరుగుపరుచుకోవాలి. అప్పుడే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలం’ అని చెబుతున్నాడీ బుడతడు. తను ఆడేటప్పుడు ఒంటి చేతితో ఒక నిమిషంలో 23 క్యాచ్‌లు పట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు. తన ప్రతిభను గుర్తించి.. ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ వారు అందులో స్థానం కూడా కల్పించారు. ఎంతైనా ఈ చిన్నారి చాలా గ్రేట్‌ కదూ! 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని