ఈ కవలలు అదరగొట్టారు..!

హాయ్‌ నేస్తాలూ..! మనందరం ఇప్పటి వరకు ఎవరెస్టు శిఖరం గురించి చాలాసార్లు వినే ఉంటాం కదా! దాన్ని ఆధిరోహించిన వాళ్ల గురించి కూడా తెలుసుకొనే ఉంటాం.

Published : 08 Jun 2024 00:25 IST

హాయ్‌ నేస్తాలూ..! మనందరం ఇప్పటి వరకు ఎవరెస్టు శిఖరం గురించి చాలాసార్లు వినే ఉంటాం కదా! దాన్ని ఆధిరోహించిన వాళ్ల గురించి కూడా తెలుసుకొనే ఉంటాం. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఓ ఇద్దరు కవలలు, ఒకేసారి ఎవరెస్టును ఎక్కి రికార్డు సాధించారు. వాళ్ల గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వెంటనే ఈ కథనం చదివేయండి మరి!

ముంబయికి చెందిన ఆర్వి రాథి, ఆరవ్‌ రాథి ఇద్దరూ కవలలు. ప్రస్తుతం వారికి ఏడున్నరేళ్లు. ఇప్పుడు వాళ్లు రెండో తరగతి చదువుతున్నారు. వాళ్ల అమ్మ సోహన్‌ రాథి అడ్వకేట్‌. నాన్న ముకేష్‌ రాథి చార్టెడ్‌ అకౌంటెంట్‌. కవలలు అయినంత మాత్రాన ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉండాలనేం లేదు. కానీ ఈ చిన్నారులు మాత్రం.. ఒకే దారిలో నడిచి రికార్డు సృష్టించారు. ఎవరెస్టు శిఖరం బేస్‌ క్యాంపును ఎక్కి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 5363 మీటర్ల దూరం ఎవరెస్టును అధిరోహించిన అతిచిన్న వయసు కలిగిన కవలలుగా పేరు దక్కించుకున్నారు. వీరి ప్రతిభను గుర్తించిన ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు అందులో స్థానం కూడా కల్పించారు. 

ఒకరిని చూసి ఇంకొకరు..!

‘ఇద్దరూ ఏ పని చేసినా ఒకరినొకరు.. అనుసరిస్తారు. అలాగే ట్రెక్కింగ్‌కు కూడా ఇద్దరూ కలిసే వెళ్లారు. మా పిల్లలు ఇంత చిన్న వయసులో రికార్డు సాధించడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్లిద్దరూ చదువులోనూ ఎప్పుడూ ముందే ఉంటారు. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల మీద కూడా ఆసక్తి చూపుతారు’ అని ఆర్వి, ఆరవ్‌ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎంతైనా ఈ చిన్నారులు గ్రేట్‌ కదూ! భవిష్యత్తులో వారు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని