శభాష్‌.. చక్రాల చిచ్చర పిడుగు..!

హయ్‌ నేస్తాలూ... సాధారణంగా పిల్లలకు ఆటలు, పాటలు, నృత్యం ఇలా చాలా వాటిపై ఆసక్తి ఉంటుంది. కానీ కాలక్షేపం కోసం కాకుండా, క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరాలనే సంకల్పంతో ఆడాలని కొంతమందికే ఉంటుంది.

Published : 24 May 2024 00:22 IST

హయ్‌ నేస్తాలూ... సాధారణంగా పిల్లలకు ఆటలు, పాటలు, నృత్యం ఇలా చాలా వాటిపై ఆసక్తి ఉంటుంది. కానీ కాలక్షేపం కోసం కాకుండా, క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరాలనే సంకల్పంతో ఆడాలని కొంతమందికే ఉంటుంది. ఆ కోవకే చెందిన ఈ చిచ్చర పిడుగు రోలర్‌ స్కేటింగ్‌లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతోంది. మరి ఆ చిన్నారి గురించి తెలుసుకుందామా!

వైఎస్‌ఆర్‌ జిల్లా కలసపాడు మండలం దిగువ తంబళ్లపల్లెకు చెందిన ధ్రుతికి ఏడు సంవత్సరాలు. ఒకటో తరగతి పూర్తైంది. తండ్రి పల్లె శివకృష్ణారెడ్డి అనంతపురం జిల్లాలో నీటి పారుదల శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. తల్లి పావని గృహిణి. ధ్రుతికి చిన్నప్పటి నుంచే క్రీడలపై ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఏడాది నుంచి స్కేటింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. చిన్నారి చదువుతో పాటు, స్కేటింగ్‌లో తన ప్రతిభను చాటుతూ ముందుకు సాగుతోంది. 

జాతీయస్థాయిలో సత్తా.. 

కోచ్‌ ఆంజనేయులు సహకారంతో మెలకువలు నేర్చుకుని ఏడాది వ్యవధిలోనే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి సత్తా చాటుతోంది. గోవా రాజధాని పనాజీలో ఈ ఏడాది మే 16 నుంచి 19 వరకు జరిగిన ఆరో నేషనల్‌ ర్యాంకింగ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్స్‌- 2024 పోటీల్లో 1000 మీటర్ల విభాగంలో రజత పతకం కైవసం చేసుకుంది. 7- 9 సంవత్సరాల కేటగిరీలో.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 36 మంది పాల్గొనగా, సత్తా చాటి రెండో స్థానంలో నిలిచింది. గతేడాది అనంతపురంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో రెండు బంగారు పతకాలు సొంతం చేసుకుంది. విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో రజతం, ప్రస్తుతం జాతీయస్థాయిలో రజతం సాధించింది. ఇవేగాక చిన్నప్పటి నుంచి పలు పోటీల్లో పాల్గొని పదుల సంఖ్యలో పతకాలు సాధించింది. చదువు, క్రీడలే కాకుండా ఇటీవల కూచిపూడిలోనూ శిక్షణ తీసుకుంటోంది. ఇలా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న చిన్నారి ధ్రుతి నిజంగా గ్రేట్‌ కదూ! భవిష్యత్తులో మరింతగా రాణించాలని మనం కోరుకుందామా మరి. 

పెద్దిరెడ్డి గారి పవన్‌కుమార్‌రెడ్డి, ఈనాడు డిజిటల్, కడప 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని