Erectile Dysfunction: స్తంభన మాత్ర వినోదం కోసమా?

అంగస్తంభన లోపం గలవారికి సిల్డినాఫిల్‌ సిట్రేట్‌ (వయాగ్రా వంటివి) బాగా ఉపయోగపడుతుంది.

Updated : 25 Jun 2024 07:13 IST

అంగస్తంభన లోపం గలవారికి సిల్డినాఫిల్‌ సిట్రేట్‌ (వయాగ్రా వంటివి) బాగా ఉపయోగపడుతుంది. ఫాస్ఫోడైస్టెరేజ్‌ టైప్‌ 5 (పీడీఈ5) ఇన్‌హిబిటార్స్‌ రకానికి చెందిన ఇది శృంగార భావన కలిగినప్పుడు అంగానికి రక్త సరఫరా పుంజుకునేలా చేస్తుంది. అంగం గట్టిపడేలా, సంభోగం జరిపేలా చూస్తుంది. అయితే స్తంభన లోపం లేకపోయినా కొందరు వినోదం కోసం ఈ మందును వేసుకోవటం ఎక్కువవుతోంది. మరింత ఎక్కువసేపు అంగం స్తంభించటానికి.. సామర్థ్యం గురించిన ఆందోళన, శీఘ్ర స్ఖలనాన్ని తగ్గించుకోవటానికి.. ఇలా రకరకాల అవసరాలకు దీన్ని వాడుతుంటారు. అయితే స్తంభన లోపం గలవారికే ఇది మేలు చేస్తుంది. అనవసరంగా వాడితే చిక్కులు తప్పవు.

  • ఇతర మందులతో చర్య: పీడీఈ5 ఇన్‌హిబిటార్స్‌ రక్తపోటును తగ్గిస్తాయి. అప్పటికే రక్తపోటు తగ్గటానికి వాడే మందులతో కలిస్తే ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఛాతీనొప్పి తగ్గటానికి ఇచ్చే నైట్రోగ్లిజరిన్, రక్తపోటును తగ్గించే ఐసోసార్బయిడ్‌ వంటి మందులతో ఐడీఈ5 ఇన్‌హిబిటార్స్‌ ప్రమాదకరంగా చర్య జరుపుతాయని తెలుసుకోవాలి.
  • అవాంఛిత దుష్ప్రభావాలు: సిల్డినాఫిల్‌ సిట్రేట్‌తో తలనొప్పి తప్పించి పెద్దగా దుష్ప్రభాలేవీ ఉండవు. కానీ కొందరిలో ఛాతీ మంట, ముఖం ఎర్రబడటం, కండరాల నొప్పులు, ముక్కు బిగుసుకోవటం, చూపు మారటం వంటి దుష్ప్రభావాలూ కనిపించొచ్చు. చాలా అరుదే అయినా కొందరికి ఎక్కువసేపు అంగం అలాగే గట్టిపడి ఉండొచ్చు. ఇలాంటిది కనిపిస్తే అత్యసరంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. 
  • మానసికంగా ఆధారపడటం: కేవలం విశ్వాసం పెరగటం కోసమే తరచూ స్తంభన మాత్రలు వాడితే మానసికంగా వాటిపై ఆధారపడే పరిస్థితి తలెత్తొచ్చు. మాత్రలు వేసుకోకపోతే సంభోగం జరపలేని స్థితికి చేరుకోవచ్చు. ఇది భాగస్వాముల మధ్య వివాదాలకు దారితీయొచ్చు. 
  • మోతాదులో వ్యత్యాసం: డాక్టర్‌ సిఫారసు లేకపోయినా దుకాణాల్లో స్తంభన మాత్రలు అమ్ముతుంటారు. కొన్నిచోట్ల వీటిని విటమిన్‌ లేదా మూలికల మాత్రల రూపంలోనూ విక్రయిస్తుంటారు. అయితే డాక్టర్‌ సిఫారసు చేయకపోతే మాత్రల్లో ఔషధం ఎంత మోతాదులో ఉంది? అసలు మాత్రల్లో ఏయే మందులు ఉన్నాయి? అనేవి తెలియదు. ఇలాంటి నకిలీ మందులు వాడటం చాలా ప్రమాదకరం.
  • అనుచిత సాహసాలు: మద్యం, మాదక ద్రవ్యాలతో కలిపి స్తంభన మాత్రలు తీసుకుంటే అనుచిత లైంగిక సంపర్కాలకు పాల్పొడొచ్చు. ఇది సుఖవ్యాధులు తెచ్చిపెట్టొచ్చు. మొత్తంగా ఆరోగ్యమే దెబ్బతినొచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని