IDIOTsyndrome: ఇడియట్‌ కావొద్దు

శేషుకు 50 ఏళ్లు. నెల క్రితం నడుం నొప్పి వచ్చింది. పని ఒత్తిడితో డాక్టర్‌ దగ్గరికి వెళ్లటం కుదరలేదు. అంతర్జాలంలో తన లక్షణాల గురించి వెతికాడు.

Updated : 10 Jun 2024 16:54 IST

శేషుకు 50 ఏళ్లు. నెల క్రితం నడుం నొప్పి వచ్చింది. పని ఒత్తిడితో డాక్టర్‌ దగ్గరికి వెళ్లటం కుదరలేదు. అంతర్జాలంలో తన లక్షణాల గురించి వెతికాడు. ఎక్కువసేపు కూర్చోవటం వల్ల వెన్నెముక డిస్కు ఉబ్బుతుందని, దీంతో నడుం నొప్పి వస్తుందని తెలుసుకున్నాడు. తనకు తానే సమస్యను నిర్ధరించుకొని నొప్పి మాత్రలు వాడటం మొదలెట్టాడు. అయినా తగ్గలేదు. చివరికి డాక్టర్‌ను సంప్రదించాడు. పరీక్షలన్నీ చేశాక కిడ్నీ ట్యూమర్‌గా తేలింది. అప్పటికే సమస్య తీవ్రమైంది. ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో ఇలాంటి ధోరణి బాగా పెరిగిపోతోంది. దీన్నే ఇంటర్నెట్‌ డిరైవ్‌డ్‌ ఇన్ఫర్మేషన్‌ అబ్‌స్ట్రక్షన్‌ ట్రీట్‌మెంట్‌ (ఇడియట్‌) సిండ్రోమ్‌ అంటారు. అంటే అంతర్జాల సమాచారం ఆధారంగా తమకు తామే జబ్బులను నిర్ధరించుకొని, తప్పుడు చికిత్స తీసుకోవటం అన్నమాట. 

డియట్‌ సిండ్రోమ్‌ అనేది వ్యంగ్యంగా అనిపించినా ఇప్పుడిది బాగా విస్తరిస్తోంది. దీన్ని సైబర్‌ కాండ్రియా అనీ పిలుచుకుంటారు. వైద్య సమాచారం కోసం అంతర్జాలం మీద ఎక్కువగా ఆధారపడటం దీనికి మూలం. సొంతంగా జబ్బులను నిర్ధరించుకొని, తమకు తామే మందులు కొనుక్కొని వేసుకోవటమూ చూస్తుంటాం. ఆసుపత్రికి వెళ్లకపోవటం వల్ల సరైన చికిత్స తీసుకోరు. పరిస్థితి విషమించి కొన్నిసార్లు ప్రాణాపాయానికీ దారితీయొచ్చు. కాబట్టి దీని విషయంలో ఎవరికివారు జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఎవరికి వస్తుంది?

అంతర్జాలం అందుబాటులో ఉన్న ఎవరికైనా ఇడియట్‌ సిండ్రోమ్‌ రావొచ్చు. కానీ కొందరికి మరింత ఎక్కువగా వచ్చే ప్రమాదం పొంచి ఉంది.

  • అతిగా టెక్నాలజీ వాడుతూ.. ఆన్‌లైన్‌లో త్వరగా పరిష్కారాలు వెదికే యువతీ యువకులకు ఇడియట్‌ సిండ్రోమ్‌ ముప్పు ఎక్కువ. సౌకర్యంగా ఉండటమో, సంప్రదాయ ఆసుపత్రి వ్యవస్థను నమ్మకపోవటమో.. కారణమేదైనా ఇలాంటివారు వైద్య సలహాల కోసం ముందు అంతర్జాలాన్నే ఆశ్రయిస్తుండటం గమనార్హం.
  • ఆరోగ్యం గురించి అతిగా ఆందోళన చెందేవారికీ ఇది అంటుకోవచ్చు. వీళ్లు ప్రతి లక్షణాన్నీ ఎక్కువగా ఊహించుకుంటుంటారు. లేనిపోని జబ్బులను ఆపాదించుకొని ఆన్‌లైన్‌లో వాటి గురించి తరచూ వెదుకుతుంటారు. 
  • పని ఒత్తిడి ఎక్కువగా ఉండేవారు సైతం దీని వలలో పడుతుంటారు. డాక్టర్‌ను సంప్రదించటానికి సమయం దొరక్కపోవటం వల్ల ఆన్‌లైన్‌లో పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తుంటారు.
  • తమ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందేవారూ ఇడియట్‌ సిండ్రోమ్‌కు గురవుతుంటారు. తరచూ డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లటమెందుకని అంతర్జాలంలో ఆయా లక్షణాలను శోధిస్తుంటారు.

లక్షణాలేంటి?

  • నిరంతరం ఆన్‌లైన్‌లో జబ్బుల లక్షణాలను వెతకటం. ఏదో ఒకసారి కాకుండా రోజులో చాలాసార్లు శోధించటం.
  • డాక్టర్‌ను సంప్రదించకుండానే ఆన్‌లైన్‌ సమాచారం ఆధారంగా తమకు తామే జబ్బులను నిర్ధరించుకోవటం. 
  • డాక్టర్‌ దగ్గరికి వెళ్లటానికి విముఖత చూపటం. అప్పటికే తమకు ఆ జబ్బేంటో తెలుసని అనుకోవటం.
  • ఆయా జబ్బుల గురించి చదివి అతిగా ఆందోళన, మానసిక ఒత్తిడికి గురికావటం.
  • నిపుణుల సలహా లేకుండా ఆన్‌లైన్‌లో కనిపించిన ప్రతి చికిత్సనూ ప్రయత్నించటం. ఏదో ఒక చికిత్సకు కట్టుబడకుండా తరచూ మార్చటం. 
  • మామూలు లక్షణాలనూ తీవ్ర సమస్యలకు చెందినవని పొరపడటం. ఉదాహరణకు చిన్న తలనొప్పినీ బ్రెయిన్‌ ట్యూమర్‌గా అనుకోవచ్చు. 
  • ఆన్‌లైన్‌ సమాచారాన్ని బట్టి మందులను మార్చటం. డాక్టర్‌ సలహా లేకుండా ఉన్నట్టుండి మధ్యలో మందులు మానెయ్యటం.

సమస్యలు, చిక్కులు తప్పవు

  • ఇడియట్‌ సిండ్రోమ్‌ గలవారు ఒకరకంగా తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నట్టే. ఈ విషయం తెలియకపోవటం వల్ల రకరకాల చిక్కులు కొని తెచ్చుకునే ప్రమాదముంది. 
  • అన్నింటికన్నా పెద్ద ప్రమాదం జబ్బును సరిగా నిర్ధరించలేకపోవటం. ఆన్‌లైన్‌లో అన్నీ ప్రామాణిక వైబ్‌సైట్లే ఉండకపోవచ్చు. చాలావాటిల్లో ఆరోగ్య సమాచారం చూచాయగానే ఉంటుంది. కచ్చితమైందీ కాకపోవచ్చు. దీంతో లేని సమస్యలనూ ఉన్నట్టుగా నిర్ధరించుకునే అవకాశముంది.
  • చికిత్స ఆలస్యం కావటం మరో సమస్య. అంతర్జాల సమాచారం మీద ఆధారపడి డాక్టర్‌ను సంప్రదించటం ఆలస్యం కావొచ్చు. దీంతో పెద్ద సమస్యలైతే అప్పటికే పరిస్థితి చేయి దాటొచ్చు.
  • అనుచిత చికిత్స మరో ఇబ్బంది. ఆన్‌లైన్‌లో కనిపించే చిట్కాలు లేదా చికిత్సలు అసలు సమస్యకు సరిపడకపోవచ్చు. సురక్షితమూ కాకపోవచ్చు.
  • తమకు తామే జబ్బులను నిర్ధరించుకొని, వాటి గురించి నిరంతరం బాధపడుతూ వస్తుంటే దీర్ఘకాల మానసిక ఒత్తిడి, ఆందోళకు దారితీస్తుంది.
  • అనవసర చికిత్సలు, పరీక్షల కోసం ఖర్చు పెట్టటం వల్ల ఆర్థికంగానూ నష్టం కలుగుతుంది.
  • అంతర్జాల సమాచారంతో సొంత చికిత్స తీసుకోవటం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. మందులను తగు మోతాదుల్లో తీసుకోకపోవటం, సరైన మందులు వాడకపోవటం వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. 
  • మహమ్మారులు వ్యాపించినప్పుడు అంతర్జాలంలో సమాచారం వెల్లువెత్తుతుంది. డాక్టర్ల మీద నమ్మకం సడలేలా చేస్తుంది. నిజానిజాలేంటో తెలుసుకోవటం కష్టమైపోతుంది. కొవిడ్‌ విజృంభించినప్పుడు దీన్ని చూసే ఉంటారు. 

నివారణ ఎలా?

  • చిన్నదైనా, పెద్దదైనా.. ఎలాంటి జబ్బయినా సరే. విధిగా డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్లు సమస్యను కచ్చితంగా నిర్ధరించి, తగు చికిత్స సూచిస్తారు.
  •  మరీ అంతగా ఆన్‌లైన్‌లో ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవాలంటే ప్రభుత్వ వెబ్‌సైట్లు, గుర్తింపు పొందిన వైద్య సంస్థలు, సమీక్షించిన వ్యాసాల వంటి విశ్వసనీయమైన వనరులను చూడాలి.
  •  ఆన్‌లైన్‌లో తరచూ ఆయా సమస్యల లక్షణాలను వెతకటం మానెయ్యాలి. దీంతో అనవసరంగా ఆందోళన చెందటం తప్పుతుంది.
  •  విశ్వసనీయ ఆన్‌లైన్‌ వేదికలను ఎలా మదించాలి? ప్రాథమిక వైద్య సమాచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అనేవి నేర్చుకోవాలి, మెరుగుదిద్దుకోవాలి. 
  •  డాక్టర్లతో మంచి సంబంధాలు ఉండేలా చూసుకోవాలి. దీంతో సందేహాలను మనసు విప్పి చెప్పుకోవచ్చు. సరైన సమాచారాన్ని రాబట్టుకోవచ్చు.
  • ఆన్‌లైన్‌లో ఆరోగ్య సమాచారాన్ని గుడ్డిగా నమ్మితే ఎదురయ్యే ముప్పుల గురించి ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాలి. విమర్శనా దృక్పథంతో ఆలోచించటాన్ని ప్రోత్సహించాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని