paralysis: పక్షవాతం మెడ నుంచి మెదడులోకి

పక్షవాతం చెట్టంత మనిషిని నిట్ట నిలువునా కూల్చేస్తుంది. సత్వరం తగు చికిత్స అందకపోతే వైకల్యాన్నీ తెచ్చి పెడుతుంది. దీని మూలంగా ఎంతోమంది మంచానికే పరిమితం కావటం చూస్తూనే ఉంటాం. పక్షవాతం రెండు రకాలు. ఒకటి- మెదడులో రక్తనాళాలు చిట్లి, రక్తం గడ్డ కట్టటం వల్ల వచ్చేది (హెమరేజిక్‌ స్ట్రోక్‌).

Published : 04 Jun 2024 00:21 IST

పక్షవాతం చెట్టంత మనిషిని నిట్ట నిలువునా కూల్చేస్తుంది. సత్వరం తగు చికిత్స అందకపోతే వైకల్యాన్నీ తెచ్చి పెడుతుంది. దీని మూలంగా ఎంతోమంది మంచానికే పరిమితం కావటం చూస్తూనే ఉంటాం. పక్షవాతం రెండు రకాలు. ఒకటి- మెదడులో రక్తనాళాలు చిట్లి, రక్తం గడ్డ కట్టటం వల్ల వచ్చేది (హెమరేజిక్‌ స్ట్రోక్‌). రెండోది- రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి మెదడులో కొంత భాగానికి రక్త ప్రసారం నిలిచిపోవటంతో వచ్చేది (ఇస్కీమిక్‌ స్ట్రోక్‌). ఎక్కువమందిలో కనిపించేది ఇస్కీమిక్‌ రకమే. ఇందులో మెదడుకు మంచి రక్తాన్ని చేరవేసే కెరొటిడ్‌ ధమనిలో ఏర్పడే పూడికలు, క్యాల్షియం పూడికలే కీలకపాత్ర పోషిస్తుండటం.. మధుమేహం వీటికి మరింత ఊతమిస్తుండటం గమనార్హం. కాబట్టి మధుమేహం గలవారు పక్షవాతం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.

పక్షవాతం మూలంగా తమ ఇంట్లో పెద్దవాళ్లు మంచానికే పరిమితమయ్యారని, అంతకుముందు తమ పనులు తాము చేసుకునేవారు ఇప్పుడు తోడు లేకుండా బాత్రూమ్‌కైనా వెళ్లలేకపోతున్నారని తరచూ వింటూనే ఉంటాం. దీని బారినపడ్డవారు తమ స్థితిని తలచుకుంటున్నప్పుడు కళ్లలో నీరు నిండటం గమనిస్తూనే ఉంటాం. కొందరు చీటికీ మాటికీ సహనం కోల్పోయి కోపం తెచ్చుకుంటుంటారు కూడా. మరికొందరికి జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యమూ తగ్గొచ్చు. పక్షవాతం ఒకప్పుడు చాలావరకూ పెద్ద వయసులోనే వస్తుండేది. కానీ ఇప్పుడు మధ్యవయసులోనూ.. ఆ మాటకొస్తే 50 ఏళ్లలోనూ చూస్తున్నాం. రోజురోజుకీ మధుమేహం పెరుగుతుండటం ఈ ధోరణికి కారణమవుతోంది. పక్షవాతం వచ్చినప్పుడు  హఠాత్తుగా స్పృహ తప్పొచ్చు లేదా కాళ్లూ చేతులు చచ్చుబడొచ్చు. కొందరికి ఇవి రెండూ ఒకేసారి రావొచ్చు కూడా. స్పృహ నుంచి కోలుకున్నా అవయవాలు స్వాధీనంలోకి రావు. కొందరికి వైకల్యం శాశ్వతంగానూ ఉండిపోవచ్చు. ఆడవారి కన్నా మగవారికి పక్షవాతం ముప్పు అధికం. దీనికి రకరకాల అంశాలు కారణమవుతుంటాయి. వీటిల్లో మధుమేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మధుమేహం గలవారికి పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ! దీర్ఘకాలం రక్తంలో గ్లూకోజు నియంత్రణలో లేకపోతే కణజాలాలు, రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా పక్షవాతం, గుండెజబ్బులు దాడిచేసే ప్రమాదమూ పెరుగుతుంది. పక్షవాతంతో మరణించే ముప్పూ వీరికి ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారితీస్తున్న జబ్బుల్లో మూడో స్థానం పక్షవాతమే ఆక్రమిస్తోంది. మధుమేహం, గుండెజబ్బులు గలవారిలోనైతే ఇది రెండో అతి పెద్ద కారణంగానూ నిలుస్తోంది. తొలిసారి పక్షవాతం బారినపడ్డ మధుమేహుల్లో 40% మందికిది ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. బతికి బట్ట కట్టినవారిలోనూ రెండోసారి పక్షవాతం వస్తే నూటికి 35 మంది.. మూడోసారి వచ్చినట్టయితే 65 మంది మరణించే ప్రమాదం పొంచి ఉంటోంది. మధుమేహం, పక్షవాతం రెండూ కలిస్తే ఎంతటి అనర్థం సంభవిస్తుందో అనటానికి ఇదే నిదర్శనం.

1. మెడ నాళాల పాత్రే ఎక్కువ

పక్షవాతం తలెత్తటంలో మెదడు, మెడలోని రక్తనాళాలన్నీ పాలు పంచుకుంటాయి. కానీ కెరొటిడ్‌ ధమనుల పాత్రే ఎక్కువ. పక్షవాతం బాధితుల్లో సుమారు 90% మందిలో కెరొటిడ్‌ ధమనిలో కొవ్వు పోగుపడటం, క్యాల్షియం పూడికలు ఏర్పడటమే (అథెరోస్క్లెరోసిస్‌) ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పూడికల మూలంగా మెదడుకు ఆక్సిజన్‌తో కూడిన మంచి రక్తం అందటం తగ్గుతుంది. అంతేకాదు, కొవ్వు పూడికలు విచ్ఛిన్నమై దాని ముక్కలు పైకి వెళ్లొచ్చు, రక్తనాళంలో అడ్డంకులు సృష్టించొచ్చు. ఫలితంగా మెదడులో కొంత భాగానికి రక్త సరఫరా ఆగిపోయి, ఆ భాగం శాశ్వతంగా దెబ్బతినొచ్చు. 

2.  స్వల్పంగానూ..

పక్షవాతం అన్నిసార్లూ తీవ్రంగా రావాలనేమీ లేదు. కొందరికి అతి స్వల్పంగానూ రావొచ్చు. దీన్నే ట్రాన్సియెంట్‌ ఇస్కెమిక్‌ అటాక్‌ (టీఐఏ) అంటారు. ఇందులో కాసేపు స్పృహ కోల్పోవటం, కొద్దిగా బలహీనత ఉంటాయి. ఇవి చాలావరకూ 24 గంటల్లోనే తగ్గిపోతాయి. ఆ తర్వాత పైకి మామూలుగానే ఉంటారు. సమస్య అక్కడితోనే ఆగిపోతే ఇబ్బందేమీ ఉండదని చెప్పుకోవచ్చు. కానీ స్వల్ప పక్షవాతానికి గురైన ఐదేళ్లలో చాలామంది తీవ్ర పక్షవాతం వచ్చే ప్రమాదముంది. కాబట్టి జాగ్రత్త అవసరం. నాడీ వైద్యులతో పాటు రక్తనాళాల సమస్యలకు చికిత్స చేసే వ్యాస్కులర్‌ సర్జన్‌నూ తరచూ సంప్రదించటం ముఖ్యం. స్వల్ప పక్షవాతానికి ప్రధాన కారణం మెడ పక్కల నుంచి మెదడుకు మంచి రక్తాన్ని తీసుకెళ్లే కెరొటిడ్‌ ధమని లోపలి మార్గం సన్నబడటం, అడ్డంకులు ఏర్పడటం. కాబట్టి మెడ రక్తనాళాన్ని క్షుణ్నంగా పరిశీలించటం తప్పనిసరి. 

3. ఎవరికి ముప్పు ఎక్కువ?

మధుమేహం గలవారిలో వృద్ధులకు, స్వల్ప పక్షవాతం వచ్చినవారికి, అధిక రక్తపోటు గలవారికి, గుండెజబ్బులతో బాధపడేవారికి తీవ్ర పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువ. అప్పటికే గుండెపోటు వచ్చి ఉండి, అధిక రక్తపోటు కూడా గల వృద్ధులకైతే రేపో మాపో స్వల్ప లేదా తీవ్ర పక్షవాతం రావొచ్చన్నా అతిశయోక్తి కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం గల ఊబకాయులకు.. సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగేవారికి కూడా దీని ముప్పు పొంచి ఉంటుంది.

తేలికగానే గుర్తించొచ్చు

వ్యాస్కులర్‌ సర్జన్లు మెడ వద్ద చేయితో నొక్కి, స్టెతస్కోప్‌తో పరీక్షించి కెరొటిడ్‌ ధమనుల్లో రక్త ప్రవాహం తీరు తెన్నులను గుర్తిస్తారు. కంపన ధ్వనిని బట్టి పూడికలను అనుమానిస్తారు. కలర్‌ డాప్లర్‌ పరీక్షతో సమస్యను కచ్చితంగా నిర్ధరిస్తారు. అవసరమైతే యాంజియోగ్రఫీ చేస్తారు. 


ఏంటీ ధమనులు?

గుండె నుంచి రక్తాన్ని బయటకు తీసుకొచ్చే బృహద్ధమని నుంచి కెరొటిడ్‌ ధమనులు మొదలవుతాయి. ఇవి మెడకు రెండు వైపుల నుంచి సాగుతూ మెదడుకు రక్తాన్ని తీసుకెళ్తాయి. ఇందులో రెండు భాగాలుంటాయి. ఒక భాగం ముఖం, మెడలోని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. మరోభాగం మెదడుకు రక్తాన్ని, పోషకాలను చేరవేస్తుంటుంది. దీన్నే ఇంటర్నల్‌ కెరొటిడ్‌ ఆర్టరీ అంటారు. ఇందులో రక్త ప్రవాహం తగ్గితే పక్షవాతం వచ్చే అవకాశం పెరుగుతుంది. దీనిలో రక్త ప్రవాహం తగ్గటానికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. ఉదాహరణకు- పుట్టుకతోనే కెరొటిడ్‌ ధమని పొడవు మరీ ఎక్కువగా ఉందనుకోండి. అది తిన్నగా ఉండదు. మధ్యలో ఎక్కడైనా వంకర పోవచ్చు. ఫలితంగా పాక్షికంగా రక్త ప్రవాహం తగ్గుతుంది. బయటి నుంచి పడే ఒత్తిళ్లూ.. అంటే మెడలో కణితి వంటివీ రక్త ప్రవాహానికి అడ్డు తగలొచ్చు. మెడ క్యాన్సర్లకు తీసుకునే రేడియోథెరపీ మూలంగా కణజాలం గట్టిపడటంతోనూ ధమని మీద ఒత్తిడి పడొచ్చు. మరోవైపు ఇది కొవ్వు పోగుపడే ప్రక్రియనూ ప్రేరేపిస్తుంది. ఇవి రెండూ రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించేవే. మధుమేహుల విషయానికి వస్తే- వీరిలో కెరొటిడ్‌ ధమనిలో కొవ్వు పోగుపడే ప్రక్రియ కొనసాగుతూ వస్తుంటుంది. దీంతో రక్త ప్రవాహం తగ్గుతుంటుంది. కొన్నిసార్లు రక్తనాళం గోడ ఉబ్బు, వాపు క్రియకు దారితీసే టకయసు అనే జబ్బుతోనూ రక్త ప్రసరణకు ఇబ్బంది కలగొచ్చు. ప్రమాదాల్లో మెడకు గాయాలై కెరొటిడ్‌ ధమని లోపలి గోడ దెబ్బతింటే రక్తం గడ్డ కట్టొచ్చు. దీంతో మెదడుకు రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోవచ్చు.  మెడ రక్తనాళం గోడ బాగా ఉబ్బటమూ సమస్యను తెచ్చిపెట్టొచ్చు. గుండెలో ఏర్పడే రక్తం గడ్డ కూడా ముఖ్యమైన కారణమే. ఈ గడ్డలో కొంతభాగం కదిలి, అది గుండె నుంచి మెడ వద్ద రక్తనాళాలకూ చేరుకోవచ్చు. అక్కడి నుంచి మెదడులోని రక్తనాళాలకు చేరుకొని, పక్షవాతానికి దారితీయొచ్చు. మెడ వద్ద ఉండే వెర్టిబ్రల్‌ ధమని సమస్యతోనూ 15% వరకూ పక్షవాతం రావొచ్చు.


పూడికలతో ముప్పు ఎలా?

మెడ రక్తనాళాల లోపలి గోడలో కొవ్వు, కొలెస్ట్రాల్‌ పోగు పడినప్పుడు అక్కడ ఉబ్బు, ఎరుపు తలెత్తుతాయి. ఇవి క్యాల్షియం పోగుపడటానికి దారితీస్తాయి. ఫలితంగా రక్తనాళం గోడ మందం పెరుగుతుంది. దీంతో అక్కడ వాపు, రక్తస్రావం మొదలవుతాయి. క్రమంగా ఉబ్బు మరింత ఎక్కువవుతుంది. రక్తనాళం పూర్తిగా మూసుకుపోవచ్చు కూడా. ఫలితంగా మెదడుకు మంచి రక్తం ప్రసారం కావటం గణనీయంగా పడిపోతుంది. మరోవైపు ఉబ్బినచోట రక్తనాళం గోడ పగిలిపోతే పూడిక ముక్కలు రక్తంలో కలిసి మెదడుకు చేరుకోవచ్చు. దీంతో మెదడుకు రక్త ప్రసరణ అస్తవ్యస్తమవుతుంది. అంతేకాదు.. రక్తనాళం ఉబ్బినచోట పుండు ఏర్పడే అవకాశమూ ఉంది. అక్కడ తరచూ రక్తం గడ్డలు ఏర్పడి, పోగుపడుతూ రావొచ్చు. కొన్నిసార్లు ఈ గడ్డలతో పాటు రక్తంలోని ప్లేట్‌లెట్‌ కణాలు పైకి ప్రయాణించి, మెదడు రక్తనాళాల్లో అడ్డుపడొచ్చు. ఇది మాటిమాటికీ పక్షవాతం రావటానికి దారితీయొచ్చు.

మధుమేహులు ఏం చేయాలి?

మధుమేహం గలవారు ఉన్నట్టుండి తల తిప్పటం, బలహీనత వంటివి తలెత్తితే వెంటనే వ్యాస్కులర్‌ సర్జన్‌ను కలవాలి. కెరొటిడ్‌ ధమని ఎలా ఉంది? మెదడుకు తగినంత రక్తం అందుతుందా? లేదా? అనేవి పరీక్షించుకోవాలి. మున్ముందు పక్షవాతం బారినపడకుండా చూసుకోవటానికిది ముఖ్యం. అప్పటికే పక్షవాతం వచ్చి ఉన్నా, చికిత్స తీసుకుంటున్నా కూడా ఒకసారి వ్యాస్కులర్‌ సర్జన్‌ను సంప్రదించటం మంచిది. మరోసారి పక్షవాతం బారినపడకుండా చూసుకోవచ్చు. కెరొటిడ్‌ ధమనులను ఆరోగ్యంగా, పూడికలు ఏర్పడకుండా చూసుకుంటే 85% వరకూ పక్షవాతం కేసులను నివారించుకోవచ్చు.


చికిత్స- అవసరాన్ని బట్టి

మెడ రక్తనాళంలో పూడికలకు తీవ్రతను బట్టి చికిత్స చేస్తారు. పూడిక చిన్నగా ఉంటే మందులనే సూచిస్తారు. మరీ పెద్దగా ఉంటే పూడిక ఉన్న చోట స్టెంటు అమరుస్తారు. దీంతో రక్త ప్రవాహం మెరుగవుతుంది. అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స చేసి పూడికలను తొలగిస్తారు. వీటి ద్వారా పక్షవాతాన్ని చాలావరకూ నివారించుకోవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని