women health: ఆమె గుండె తీరే వేరు!

ఇంటికి గుండె కాయ ఇల్లాలే! మరి ఆమె గుండె సమస్యల్లో పడితే? ఇల్లు మొత్తం అతలాకుతలం అవుతుంది. నిజానికి ఆమె గుండె తీరే వేరు. నెలసరి నిలిచేంతవరకూ మహిళల గుండెకు సహజ రక్షణ ఓ వరంలా కాపాడుతుంటుంది.

Updated : 28 May 2024 10:47 IST

నేడు అంతర్జాతీయ మహిళల ఆరోగ్య దినం

ఇంటికి గుండె కాయ ఇల్లాలే! మరి ఆమె గుండె సమస్యల్లో పడితే? ఇల్లు మొత్తం అతలాకుతలం అవుతుంది. నిజానికి ఆమె గుండె తీరే వేరు. నెలసరి నిలిచేంతవరకూ మహిళల గుండెకు సహజ రక్షణ ఓ వరంలా కాపాడుతుంటుంది. కానీ ఆ తర్వాత గుండెపోటు ముప్పే కాదు.. జబ్బు తీవ్రతా పెరుగుతుంది. ముప్పు కారకాలు, లక్షణాలు సైతం భిన్నమే. ఇందుకు శరీర స్వభావం దగ్గరి నుంచి కుటుంబ చరిత్ర, నెలసరి, గర్భధారణ వరకూ ఎన్నో అంశాలు దోహదం చేస్తుంటాయి. వీటి గురించి తెలుసుకొని, అవగాహన కలిగుండటం ఇంటిల్లిపాదికీ అవసరం. 

నెల నెలా రుతుక్రమం కావటం, గర్భధారణ, నెలసరి నిలిచిపోవటం (మెనోపాజ్‌) అనేవి మహిళలకే ప్రత్యేకం. ఇవి ఆడవారిలో కొన్ని జబ్బులు ఎక్కువయ్యేలా చేస్తాయి కూడా. ఉదాహరణకు గర్భధారణ సమయంలో కొందరికి అధిక రక్తపోటు, మధుమేహం తలెత్తుతుంటాయి. ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని తీసుకొచ్చే నాళాల్లో పీడనం (పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్‌) తీవ్రమైతే తట్టుకోవటం కష్టం. ఇది అదుపులోకి రాకపోతే  ప్రాణాపాయమూ సంభవించొచ్చు. గర్భం ధరించినప్పుడు గుండె జబ్బులు తలెత్తితే కొన్నిసార్లు చికిత్స కూడా కష్టమే. ఎందుకంటే వీరికి కొన్ని పరీక్షలు చేయటం కుదరదు. ఉదాహరణకు రేడియేషన్‌ ప్రభావాన్ని కలగజేసే పరీక్షలతో పిండానికి ఇబ్బంది కలగొచ్చు. అందువల్ల మందులు కొనసాగిస్తూ కాన్పయ్యాక యాంజియోగ్రామ్‌ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా త్రీ డైమెన్షియల్లీ ఇమేజింగ్‌ పద్ధతి వచ్చింది. ఇందులో రేడియేషన్‌ ఎక్కువగా ఉండదు. దీని సాయంతో పేస్‌మేకర్‌ అమర్చటం, అబ్లేషన్‌ వంటి చికిత్సలు చేయొచ్చు. ఇంట్రాకార్డియాక్‌ ఎకో పరీక్ష కూడా ఉపయోగపడుతుంది. 

మున్ముందు సమస్యలకు

గర్భధారణ సమయంలో తలెత్తే అధిక రక్తపోటు, మధుమేహం మూలంగా మున్ముందు గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం, గుండె వైఫల్యం వచ్చే అవకాశమూ పెరుగుతుంది. నెలసరి నిలిచిపోవటం మరో సమస్య. నెలసరి అవుతున్న సమయంలో విడుదలయ్యే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లు కొంతవరకు గుండెను కాపాడతాయి. కానీ నెలసరి నిలిచిన తర్వాత ఈ రక్షణ కొరవడుతుంది. అదే సమయంలో మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి గుండెజబ్బు ముప్పు కారకాలూ  ఎక్కువవుతాయి. పైగా నెలసరి నిలిచాక గుండెపోటు వస్తే ఆడవారిలో తీవ్రంగానూ ఉంటుంది. అయితే ఇదొక్కటే కాదు. చిన్న వయసులోనూ ఎంతోమంది మహిళలు ఇతరత్రా గుండెజబ్బులకు గురవుతుండటం చూస్తున్నాం. హార్మోన్ల ప్రభావంతో గుండె లయ తప్పే ముప్పు ఆడవారికి ఎక్కువ. గుండె కణజాలంలో విద్యుత్‌ ప్రసరణకు అంతరాయం కలగటం దీనికి మూలం. దీంతో గుండె గదులు అస్తవ్యస్తంగా కొట్టుకుంటాయి.

 కుటుంబ చరిత్ర ప్రధానం

గుండెజబ్బు ముప్పు కారకాల దగ్గరికి వస్తే- అధిక రక్తపోటు, మధుమేహం, సరైన ఆహారం తినకపోవటం, కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు రావటం.. కొలెస్ట్రాల్, హోమోసిస్టీన్, లైపోప్రొటీన్‌ ఏ మోతాదుల వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఆడవారిలో కుటుంబ చరిత్ర అతి పెద్ద ముప్పు కారకం. తల్లిదండ్రులు, తోబుట్టువుల్లో ఎవరైనా గుండెజబ్బు బారినపడినట్టయితే అలాంటి మహిళలకు గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. 

గుండె పోటు తలెత్తటంలో అధిక కొలెస్ట్రాల్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది గుండె రక్తనాళాల్లో పోగుపడి, పూడికలకు దారితీస్తుంది. వీటితో రక్తనాళం మూసుకుపోవచ్చు. పూడికలు చిట్లిపోయి రక్తస్రావం కావొచ్చు. ఇవి గుండెపోటుకు దారితీస్తాయి. నెలసరి కావటం, సంతానం కనటం వంటి వాటి మూలంగా మగవారి కన్నా ఆడవారిలో హార్మోన్ల మోతాదులు, జీవ క్రియలు, శరీరం తీరుతెన్నులు కాస్త భిన్నంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ మోతాదుల మీదా కొంతవరకు ప్రభావం చూపుతాయి. కాబట్టి సన్నిహిత కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గుండె పోటు వచ్చి ఉన్నట్టయితే మహిళలు మరింత జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. కొలెస్ట్రాల్‌లో భాగమైన ట్రైగ్లిజరైడ్లు పెరగటమనేది రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి జన్యుపరంగా ఎక్కువగా ఉండొచ్చు. ఆహార అలవాట్లూ కారణం కావొచ్చు. కొందరికి థైరాయిడ్‌ సమస్య వంటి ఇతరత్రా కారణాలతోనూ ట్రైగ్లిజరైడ్లు పెరగొచ్చు. ఇవి మగవారిలో కన్నా ఆడవారిలో మరింత ఎక్కువగా దుష్ప్రభావం చూపుతాయి. అందువల్ల మహిళలు వీటి విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాలి. 

లక్షణాలూ భిన్నమే

గుండెపోటులో సాధారణంగా ఛాతీలో నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు పొడసూపుతుంటాయి. కానీ చాలామంది మహిళల్లో ఇలాంటి స్పష్టమైన లక్షణాలేవీ కనిపించవు. కడుపులో ఎక్కడో నొప్పి పుట్టటం, నడుస్తుంటే ఆయాసం కలగటం, వెన్నునొప్పి తలెత్తటం, మెడలో నొప్పి రావటం వంటి భిన్నమైన లక్షణాలు కనిపిస్తుంటాయి. అందువల్ల గుండెజబ్బు ముప్పు కారకాలు ఉండి, నెలసరి నిలిచిన తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అసలే నిర్లక్ష్యం చేయరాదు. వీటిని కూడా గుండెపోటు అనుమానిత లక్షణాలుగానే భావించాలి. మధుమేహం గలవారి విషయంలోనూ మరింత జాగ్రత్త అవసరం. మధుమేహం  గుండె రక్తనాళాలనూ దెబ్బతీస్తుంది. కాబట్టి మధుమేహం ఉండి, గుండెపోటు అనుమానిత లక్షణాలు కనిపిస్తే మహిళలను నిశితంగా పరీక్షించటం చాలా ముఖ్యం. ఈసీజీ, 2డీ ఎకో ఫలితాలు నార్మల్‌గా ఉన్నా సందేహించాల్సిందే. ఎందుకంటే గుండెపోటు వచ్చినప్పుడు, గుండె పంపింగ్‌ సామర్థ్యం తగ్గినప్పుడు, ఊపిరితిత్తుల్లో పీడనం పెరిగినప్పుడు, కవాటం లీక్‌ అయినప్పుడు మాత్రమే ఎకో పరీక్షలో మార్పులు కనిపిస్తాయి. కాబట్టి తట్టుకోగలిగితే ట్రెడ్‌మిల్‌ పరీక్ష చేసి సమస్యేమీ లేదని కచ్చితంగా నిర్ధరించుకోవాలి. ఇప్పుడు సీటీ కరోనరీ యాంజియోగ్రఫీ, క్యాల్షియం స్కోరింగ్‌ వంటి పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎలాంటి తేడా కనిపించినా, గుండెపోటు అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నా యాంజియోగ్రామ్‌తో నిర్ధరించాల్సి ఉంటుంది. అవసరమైతే కొన్నిసార్లు నేరుగా యాంజియోగ్రామ్‌ చేయాల్సి రావొచ్చు కూడా.

హిమోగ్లోబిన్‌ తగ్గటంతోనూ.. 

నెలసరి అయిన ప్రతీసారీ హిమోగ్లోబిన్‌ తగ్గుతూ వస్తుంది. దీన్ని భర్తీ చేసుకోకపోతే రక్తహీనతకు దారితీస్తుంది. దీనికి గుండెజబ్బుకు నేరుగా సంబంధమేమీ లేదు. కానీ హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉన్నవారికి శరీరంలో ద్రవాల మోతాదు పెరుగుతుంది. ఇది గుండె మీద ఎక్కువ భారం పడేలా చేస్తుంది. ఫలితంగా గుండె వైఫల్యం ముప్పు పెరుగుతుంది.

నివారించుకునేదెలా?

గుండెజబ్బులు వచ్చాక బాధపడేకన్నా నివారించు కోవటం ముఖ్యం. ఇందుకు ఆహార, వ్యాయామ నియమాలు ఉపయోగపడతాయి.

  • వ్యాయామంతో కండరాలు వృద్ధి చెందుతాయి. గుండె కూడా బలోపేతమవుతుంది. రక్తనాళాల ఆరోగ్యం మెరుగవుతుంది. కాబట్టి వ్యాయామాన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. ఉద్యోగాలు చేసేవారికి ఇంటి పనులు చేసుకోవటం కుదరకపోవచ్చు. ఆఫీసు నుంచి వచ్చేసరికే అలసిపోవచ్చు. దీంతో వ్యాయామం, శారీరక శ్రమ మూలకు పడటం చూస్తున్నాం. ఇక గృహిణులేమో ఇంటి పనులనే వ్యాయామంగా భావిస్తుంటారు. ఈ అపోహ నుంచి బయటపడాలి. ఇంటి పనులతో వ్యాయామం భర్తీ కాదని తెలుసుకోవాలి. రోజూ కచ్చితమైన సమయాన్ని నిర్ణయించుకొని, పద్ధతిగా వ్యాయామం చేయాలి. లేకపోతే బరువు పెరుగుతుంది. అధిక బరువు గుండెకు చేటు.
  • ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. జొన్నలు, కొర్రలు, రాగుల వంటి చిరుధాన్యాలను విధిగా తీసుకోవాలి. అన్నం తగ్గించాలి. ఊబకాయం, మధుమేహం గలవారికిది మరింత ముఖ్యం. వీలైనంతవరకూ ఇంట్లో వండినవే తినాలి. నూనె పదార్థాలు, వేపుళ్లు తగ్గించుకోవాలి. పోషకాలు లేని జంక్‌ఫుడ్‌ జోలికి వెళ్లొద్దు. కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నవారు, కుటుంబంలో గుండెజబ్బులు గలవారు మాంసాహారం తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలు, బాదం వంటి గింజపప్పులు ఎక్కువగా తినాలి. ఇప్పుడు ప్యాకెట్లలో అమ్మే ఆహార పదార్థాలను కొనటం ఎక్కువైంది. వీటి మీద రాసే వివరాలను అర్థం చేసుకోవాలి. చక్కెర, ఉప్పు, కేలరీలు, ప్రొటీన్‌ ఎంత మోతాదులో ఉన్నాయో.. ఏ నూనెలతో తయారు చేశారో చూసుకోవాలి. చక్కెర, కేలరీలు మితిమీరితే ఊబకాయానికి, మధుమేహానికి దారితీస్తుంది. ఉప్పుతో అధిక రక్తపోటు తలెత్తే ప్రమాదముంది. మళ్లీ మళ్లీ వేడి చేసిన నూనెలతో ట్రాన్స్‌ఫ్యాట్స్‌ పుట్టుకొస్తాయి. వీటితో కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఇవన్నీ గుండెకు శత్రువులే. ఇంట్లో వంట చేసేది మహిళలే. కాబట్టి అవసరాలకు తగినట్టుగా ఆహారాన్ని మార్చుకునే తీరును నేర్చుకోవాలి. ఆడవారికిది తెలిస్తే ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉంటారు. 
  • కంటి నిండా నిద్ర పోయేలా చూసుకోవాలి. 
  • నిద్రలో గురక (స్లీప్‌ అప్నియా) తగ్గించుకోవటమూ ముఖ్యమే. గురక గుండె మీద విపరీత ప్రభావం చూపుతుంది. ఇది గుండె అదనంగా లేదా నెమ్మదిగా కొట్టుకోవటం, గుండె పోటు, గుండె వైఫల్యం వంటి సమస్యలకు దారితీస్తుంది. 

పరీక్షలు క్రమంగా

మహిళలు 35, 40 ఏళ్లు వచ్చాక కనీసం ఒక్కసారైనా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్, హిమోగ్లోబిన్, విటమిన్‌ డి, బి12, క్రియాటినైన్, ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు చేయించుకోవాలి. గుండె పరీక్షల్లో తేడాలు కనిపిస్తే ట్రెడ్‌మిల్, సీటీ యాంజియో, క్యాల్షియం స్కోర్‌ పరీక్షలు చేయించుకోవాలి. 

సరైన సమయంలో చికిత్స

ఆడవారిలో గుండెజబ్బును సరైన సమయంలో గుర్తించి, చికిత్స చేయటం తప్పనిసరి. లేకపోతే తీవ్రమయ్యే అవకాశం ఎక్కువ. ఒకేరకం ముప్పు కారకాలు గల 65 ఏళ్ల మగవారిని, ఆడవారిని పరిశీలిస్తే- వీరిలో గుండె జబ్బు వచ్చిన మగవారు త్వరగా కోలుకుంటారు. ఆడవారు అంత వేగంగా కుదురుకోరు. నెలసరి నిలిచేంత వరకూ లభించిన రక్షణ కొరవడటం వల్ల వీరి గుండె విపరీత పరిణామాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండదు. దీంతో హఠాత్తుగా గుండెపోటు సంభవించినప్పుడు తీవ్రంగా జబ్బు పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో కోలుకోవటమూ ఆలస్యమవుతుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని