క్యాన్సర్‌ చికిత్సకు పేగు బ్యాక్టీరియా ఉత్తేజం

క్యాన్సర్‌ చికిత్సలో ఇమ్యునోథెరపీ రోజురోజుకీ ప్రాచుర్యం పొందుతోంది. ఇది రోగనిరోధక కణాలను కణితుల మీద దాడి చేసేలా పురికొల్పుతుంది.

Published : 28 May 2024 00:11 IST

క్యాన్సర్‌ చికిత్సలో ఇమ్యునోథెరపీ రోజురోజుకీ ప్రాచుర్యం పొందుతోంది. ఇది రోగనిరోధక కణాలను కణితుల మీద దాడి చేసేలా పురికొల్పుతుంది. ఈ చికిత్సలో వాడే ఇమ్యూన్‌ చెక్‌పాయింట్‌ ఇన్‌హిబిటార్‌  మందులు టి కణాలను ప్రశాంతంగా ఉంచే సహజ మార్గాలను సడలించటం ద్వారా రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేస్తాయి. అయితే ఇమ్యునోథెరపీతో సుమారు ప్రతి ఐదుగురిలో ఒకరికే ఫలితం కనిపిస్తుంటుంది. ఎందుకంటే కొన్ని కణితులు రోగనిరోధక కణాలను అణచి వేస్తుంటాయి. మందుల సామర్థ్యాన్ని తగ్గించేస్తుంటాయి. ఇలాంటి ఇబ్బందిని తొలగించటానికి, చికిత్సకు స్పందించనివారికి ఇమ్యునోథెరపీ ఉపయోగపడేలా తీర్చిదిద్దటంలో వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు ముందడుగు వేశారు.  ఎలుకల పేగుల్లో ఉండే రుమినోకాకస్‌ నావస్‌ అనే బ్యాక్టీరియా ఇమ్యునోథెరపీ ప్రభావాన్ని ఇనుమడింప జేస్తున్నట్టు గుర్తించారు. క్యాన్సర్‌ కణాల మీద దాడి చేసేలా శరీర రోగనిరోధక వ్యవస్థను సమీకరించటంలో ఈ బ్యాక్టీరియా ముఖ్య పాత్ర పోషిస్తోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన మాక్రో కొలానా చెబుతున్నారు. ఇమ్యునోథెరపీ మందుల సామర్థ్యాన్ని పెంచే ప్రొబయాటిక్స్‌ను రూపొందించటానికిది తోడ్పడగలదని, ఫలితంగా మరింత ఎక్కువ మంది క్యాన్సర్‌ బాధితులకు ప్రయోజనం చేకూరగలదని ఆశిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు