మలి చర్మ సంరక్షణ

వయసు మీద పడుతున్నకొద్దీ జ్ఞానం, ఆత్మ విశ్వాసం పెరుగుతుండొచ్చు. కానీ సమస్యలు, ఇబ్బందులే ఎక్కువవుతుంటాయి.

Updated : 11 Jul 2023 05:57 IST

వయసు మీద పడుతున్నకొద్దీ జ్ఞానం, ఆత్మ విశ్వాసం పెరుగుతుండొచ్చు. కానీ సమస్యలు, ఇబ్బందులే ఎక్కువవుతుంటాయి. మహిళలకు.. ముఖ్యంగా నెలసరి నిలిచాక (మెనోపాజ్‌) హరోన్ల తేడాల వల్ల ఇంకొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిల్లో చర్మ సమస్యలూ తక్కువేమీ కావు. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గటం మూలంగా చర్మం పొడిబారుతుంది, పలుచగా అవుతుంది, సాగిపోతుంది. ముడతలూ పడతాయి. ప్రత్యేకించి మెడ, దవడ, బుగ్గల మీద మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి. కళ్ల పక్క, నుదురు మీద గీతలు ఏర్పడుతుంటాయి. మంచి విషయం ఏంటంటే- ఇలాంటి చర్మ చిక్కులను కొన్నిజాగ్రత్తలతో తగ్గించుకునే వీలుండటం.

శుభ్రత ప్రధానం

చర్మ సంరక్షణలో శుభ్రత చాలా కీలకం. వృద్ధాప్యంలో ఇది మరింత ముఖ్యం. వయసు మీద పడుతున్నకొద్దీ చర్మం పొడి బారుతుంది. కాబట్టి దుమ్ము, మాలిన్యాలను పోగొట్టే క్లీన్సర్లు వాడుకోవాలి. క్రీమ్‌ రూపంలోని క్లీన్సర్లయితే మరీ మంచివి. ఇవి చర్మంలో తేమ తగ్గకుండా కూడా చూస్తాయి. ఫోమ్‌, జెల్‌ క్లీన్సర్లయితే చర్మంలోని తేమను లాగేస్తాయి.

తేమ తగ్గకుండా..

నెలసరి నిలిచాక చర్మంలోని నూనె గ్రంథులు అంత చురుగ్గా పనిచేయవు. దీంతో పొడిబారటం ఎక్కువవుతుంది. కాబట్టి వేడినీటికి బదులు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం మంచిది. స్నానం చేశాక తడి పూర్తిగా ఆరకముందే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇది చర్మంలో తేమ తగ్గకుండా కాపాడుతుంది. అయితే మధుమేహం వంటి సమస్యలు గలవారు వీటి వాడకంలో డాక్టర్‌ సలహా తీసుకోవాలి. ఎండకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్లు రాసుకోవాలి.

ముడతలు పోయేలా

ఎండ ప్రభావంతోనే కాదు.. హార్మోన్లు అస్తవ్యస్తం కావటంతోనూ చర్మం ముడతలు పడుతుంది. హార్మోన్ల మోతాదులు తగ్గుతున్నకొద్దీ చర్మం బిగువు సడలుతుంది. ఇది ముడతలు మరింత ఎక్కువయ్యేలా చేస్తుంది. చర్మం పొడిబారినప్పుడు ముడతలు ఇంకాస్త స్పష్టంగానూ కనిపిస్తుంటాయి. కాబట్టి ముఖానికి, దవడల కింద, మెడ మీద రోజూ మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ముడతలు తగ్గటానికి, బిగువు కాపాడుకోవటానికి తోడ్పడే ఇతరత్రా సౌందర్య సాధనాలనూ వాడుకోవచ్చు.

చేతుల మీదా శ్రద్ధ

నెలసరి నిలిచాక చేతుల వెనక చర్మం కింద కొలాజెన్‌, కొవ్వు తగ్గుతాయి. తేమ కూడా తగ్గుతుంది. దీంతో సిరలు ఇంకాస్త పైకి తేలుతాయి. ముడతలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. తరచూ చేతులకు మాయిశ్చరైజర్లు రాసుకుంటే ముడతలు అంతగా కనిపించవు. అలాగే ఎండ ఎక్కువగా తగలకుండా చూసుకోవాలి. ఇంటి పనులు, తోట పని చేస్తున్నప్పుడు చేతులకు గ్లవుజులు ధరించటం మంచిది.

కూరగాయలు, పండ్లు తినాలి

చర్మం బిగువు, కళకళలాడుతూ కనిపించటంలో కొలాజెన్‌ కీలకపాత్ర పోషిస్తుంది. ఈస్ట్రోజెన్‌ మోతాదులు పడిపోతే ఇదీ తగ్గుతుంది. యాంటీఆక్సిడెంట్లతో కూడిన ఆహార పదార్థాలు తింటే చర్మం లోపలి నుంచి బలోపేతం కావటానికి వీలుంటుంది. అందువల్ల రకరకాల రంగుల కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. వీటికి ఆయా రంగులు యాంటీఆక్సిడెంట్లతోనే లభిస్తాయి మరి. ఏవో ఒకట్రెండు కాకుండా అన్నిరకాల రంగుల పండ్లు, కూరగాయలు తినేలా చూసుకోవాలి.

సోయాతో మేలు

సోయాలో వృక్ష రసాయన మిశ్రమాలు (ఐసోఫ్లేవోన్లు) దండిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్‌ మాదిరిగా పనిచేస్తాయి. అందువల్ల వయసుతో పాటు చర్మం పలుచగా అవటం వంటి సమస్యలను నివారిస్తాయి. రోజుకు 50 మి.గ్రా. ఐసోఫ్లేవోన్లు అవసరమన్నది నిపుణుల భావన. ఇది చర్మం ఆరోగ్యంగా ఉండటానికే కాదు.. మెనోపాజ్‌లో ఎదురయ్యే ఇతరత్రా ఇబ్బందులు తగ్గటానికీ తోడ్పడుతుంది.

ఒత్తిడి దూరం

చదువులు, ఉద్యోగాల కోసం పిల్లలు దూర ప్రాంతాల్లో నివసిస్తుండటంతో ఇప్పుడు ఒంటరితనం ఎక్కువైంది. దీంతో మానసిక ఒత్తిడీ పెరుగుతుంది. ఇది చర్మం మీదా విపరీత ప్రభావం చూపుతుంది. ఒత్తిడి మూలంగా సొరియాసిస్‌ వంటి సమస్యలూ ప్రేరేపితం కావొచ్చు. కాబట్టి ఒత్తిడిని వీలైనంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు యోగా, ధ్యానం వంటి పద్ధతులు ఎంతో మేలు చేస్తాయి. ఇవి మానసిక ప్రశాంతతను కలిగిస్తూ ఒత్తిడిని తగ్గిస్తాయి.

వ్యాయామం మరవద్దు

వయసు మీద పడుతోంది కదాని వ్యాయామాన్ని మరవొద్దు. ఇది కండరాలను బలోపేతం చేయటమే కాకుండా, చర్మ సంరక్షణకూ తోడ్పడుతుంది. వ్యాయామం రెండిందాలా ఉపయోగపడుతుంది. ఒకవైపు మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ ఉత్సాహం, హుషారు కలగజేస్తుంది. మరోవైపు చర్మానికి రక్త ప్రసరణ పెరిగేలా కూడా చేస్తుంది. దీంతో ఎక్కువ ఆక్సిజన్‌ అందుతుంది. ఫలితంగా చర్మం ఆరోగ్యంతో తొణికిసలాడుతుంది. నిగనిగలాడుతూ కనిపిస్తుంది.

కంటి నిండా నిద్ర

రాత్రిపూట తగినంత నిద్ర పోయినప్పుడు ముఖం కళకళలాడుతూ కనిపించటం గమనించే ఉంటారు. నిద్ర మూలంగా శరీరం కొత్త శక్తిని సంతరించుకుంటుంది. నిద్ర సరిగా పట్టకపోతే హార్మోన్ల మోతాదులు, జీవక్రియలు అస్తవ్యస్తమవుతాయి. ఇవి చర్మ సమస్యలను మరింత ఎక్కువయ్యేలా చేస్తాయి. కళ్ల కింద నల్లటి వలయాలూ ఏర్పడతాయి. కాబట్టి రాత్రిపూట 7 నుంచి 9 గంటల సేపు గాఢ నిద్రపోయేలా చూసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని