దివ్యాంగులకు మొండి బ్యాక్టీరియా ముప్పు

మొండి బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు పెను సవాలుగా మారుతున్నాయి. వీటి మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని అంచనా.

Published : 02 Jul 2024 00:20 IST

మొండి బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు పెను సవాలుగా మారుతున్నాయి. వీటి మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని అంచనా. యాంటీ బయాటిక్‌ మందులకు లొంగని బ్యాక్టీరియాను మొండి బ్యాక్టీరియాగా భావిస్తుంటారు. ఇవి ఆసుపత్రుల నుంచే ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. ఇలాంటి బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల ముప్పు దివ్యాంగులకు మరింత ఎక్కువగా పొంచి ఉంటుండటం విచారకరం. శారీరక అంశాలతో పాటు ఆరోగ్య సమస్యలూ ఇందుకు దోహదం చేస్తుంటాయి. వైకల్యానికి చికిత్స తీసుకోవటానికో, దాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికో, ఇతరత్రా ఆరోగ్య సమస్యల కోసమో దివ్యాంగులు తరచూ ఆసుపత్రులకు వెళ్లటం గమనిస్తూనే ఉంటాం. ఆసుపత్రుల్లో యాంటీబయాటిక్‌ మందుల వాడకం ఎక్కువ. ఇది మందులను తట్టుకొనే బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది. దివ్యాంగులు తరచూ ఆసుపత్రులకు వెళ్లినప్పుడు వీటి బారినపడే ప్రమాదముంది. మరోవైపు వీరిలో చాలామంది దీర్ఘకాల సమస్యలతోనూ సతమతమవుతూ ఉంటారు. ఆహారం సరిగా తినకపోవటం, తగినంత వ్యాయామం చేయకపోవటం వల్ల రోగనిరోధకశక్తి కూడా క్షీణించే అవకాశమూ ఉంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు సోకితే తీవ్రంగానూ పరిణమించే ప్రమాదముంది. వెన్నుపాము దెబ్బతిన్నవారు, సెరిబ్రల్‌ పాల్సీ బాధితులు కొన్ని వైద్య పరికరాలనూ వాడుతుంటారు. ఇవీ కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్లు తెచ్చిపెట్టొచ్చు. ఇక మానసిక సమస్యలు గలవారిలోనైతే మందులు కచ్చితంగా వాడేలా చూడటం మరో సమస్య. ఇలాంటివన్నీ దివ్యాంగులకు మొండి బ్యాక్టీరియా ముప్పు పెరిగేలా చేస్తున్నాయి. అందువల్ల ఆసుపత్రుల్లో తగు రక్షణ చర్యలు తీసుకోవటం అవసరం. అలాగే యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీఫంగల్‌ మందుల వాడకంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని