తెల్ల మచ్చకు బెదరొద్దు!

తీవ్ర మానసిక వేదనకు గురవుతుంటారు. నలుగురిలోకి వెళ్లటానికీ నామోషీ పడుతూ, ఆత్మ న్యూనతకు లోనవుతుంటారు. తెల్ల మచ్చ, తెల్ల పూత.. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా సమాజంలో దీని మీద ఎన్నో భయాలు ఉన్నాయి.

Published : 25 Jun 2024 00:36 IST

నేడు వరల్డ్‌ విటిలిగో డే

బొల్లి (విటిలిగో) ప్రాణాంతకమేమీ కాదు. ఆ మాటకొస్తే అసలు జబ్బే కాదు. అయినా తీవ్ర మానసిక వేదనకు గురవుతుంటారు. నలుగురిలోకి వెళ్లటానికీ నామోషీ పడుతూ, ఆత్మ న్యూనతకు లోనవుతుంటారు. తెల్ల మచ్చ, తెల్ల పూత.. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా సమాజంలో దీని మీద ఎన్నో భయాలు ఉన్నాయి. ఇది కేవలం చర్మంలో రంగు ఏర్పడే ప్రక్రియలో లోపం మూలంగానే వస్తుంది. చూడటానికి ఇబ్బందిగా అనిపించటం తప్పించి ఇతరత్రా సమస్యలేవీ ఉండవు. ఇదేమీ అంటువ్యాధి కాదు. ఈ విషయాలు తెలియకపోవటమే అపోహలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌ విటిలిగో డే సందర్భంగా సమగ్ర కథనం మీకోసం. 
మనం అందంగా కనిపించేలా, చూడగానే ఆకట్టుకునేలా చేసేది చర్మమే. అందుకే చర్మం మీద ఎలాంటి తేడా కనిపించినా మనసు కలుక్కుమంటుంది. బొల్లి మచ్చ కూడా ఇలాగే కలవర పెడుతుంది. నిజానికి ఇందులో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. మచ్చల మీద దురద, మంట వంటి బాధలేవీ తలెత్తవు. కానీ చాలామంది.. ముఖ్యంగా నలుగురికీ ప్రస్ఫుటంగా కనిపించే ముఖం, చేతులు, పాదాల మీద మచ్చలు ఏర్పడినప్పుడు నామోషీ పడుతుంటారు. తామేదో తప్పు చేసినట్టు నలుగురిలోకి రావటానికి వెనకాడుతుంటారు. అయితే బొల్లి అంతలా కుమిలిపోవాల్సిన సమస్యేమీ కాదు. ఇప్పుడు దీనికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే పూర్తిగా నయమయ్యే అవకాశముంది కూడా. 

ఎందుకొస్తుంది?

ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో బొల్లి ఎక్కువ. సుమారు 0.5 నుంచి 0.8 శాతం మందిలో దీన్ని చూస్తుంటాం. ఇది ఎందుకొస్తుందనేది కచ్చితంగా తెలియదు. మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన మీదే దాడి చేయటం వల్ల (ఆటోఇమ్యూన్‌) వస్తున్నట్టు గుర్తించారు. చర్మం పైపొరలో మెలనోసైట్‌ కణాలుంటాయి. ఇవి మెలనిన్‌ అనే వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా చర్మానికి రంగును తెచ్చిపెడతాయి. వీటి మీద రోగనిరోధక వ్యవస్థ పొరపాటున దాడి చేసినప్పుడు అవి ధ్వంసమవుతాయి. దీంతో రంగు ఉత్పత్తి తగ్గిపోయి, చర్మం పాలి పోయినట్టు అవుతుంది. అక్కడ తెల్లగా, లేత గులాబి రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీన్నే బొల్లి (విటిలిగో) అని పిలుచుకుంటున్నాం. ఇది ఎవరికైనా, ఏ వయసులోనైనా రావొచ్చు. సాధారణంగా 25 ఏళ్ల లోపు బయటపడుతుంటుంది. చిన్నవయసులో బొల్లి వస్తే త్వరగా విస్తరిస్తుంది. తీవ్రంగానూ ఉంటుంది. మధ్యవయసులో, పెద్ద వయసులో మొదలైతే అంత తీవ్రంగా ఉండదు. చికిత్సకూ బాగా స్పందిస్తుంది. మధుమేహం, ల్యూపస్, అనుసంధాన కణజాల సమస్యల వంటి ఆటోఇమ్యూన్‌ జబ్బులు గలవారికి బొల్లి వచ్చే ముప్పు ఎక్కువ. పోషణలోపంతోనూ అక్కడక్కడ తెల్ల మచ్చలు రావొచ్చు. ఇవీ బొల్లి మాదిరిగా కనిపిస్తాయి. 

 రకరకాలుగా..

బొల్లి మచ్చలు ఒంట్లో ఎక్కడైనా రావొచ్చు. కొందరికి ఏదో భాగంలో, ఏదో ఒక చోట వస్తుంటాయి (లోకలైజ్డ్‌). కొందరికి ఒళ్లంతా రావొచ్చు (వల్గారిస్‌). కొందరికి శరీరంలో ఒక వైపుననే.. అంటే ఒక చేయి, ముఖం, ఛాతీలో ఏదో ఒకవైపో కనిపించొచ్చు (సెగ్మెంటల్‌). కొందరికి కేవలం వేలి చివర్లు, పెదవుల చివర్లు, ముక్కు కొసలు, రెప్పల చివరల్లో రావొచ్చు (యాక్రోఫేషియల్‌). ఇది చికిత్సకు అంతగా స్పందించదు. కొందరిలో ఒకట్రెండు మచ్చలకే పరిమితం కావొచ్చు. కొందరిలో పెరుగుతూ రావొచ్చు, కొందరికి అక్కడితోనే ఆగిపోవచ్చు. ఇది ఆయా వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు బాహ్య కారణాలతోనూ బొల్లి మచ్చలు రావొచ్చు. దీన్ని ల్యూకోడెర్మా అంటారు. ఉదాహరణకు- చెప్పుల పైకప్పులు రాసుకున్న చోట తెల్ల మచ్చ ఏర్పడొచ్చు. కొన్నిరకాల రసాయనాలు తాకటం మూలంగానూ రావొచ్చు. స్టిరాయిడ్‌ క్రీములు, మలాములు ఎక్కువగా వాడేవారిలోనూ చర్మం పలుచబడి తెల్లగా అవ్వచ్చు. ల్యూకోడెర్మాకు చికిత్స అవసరం లేదు. కారణాన్ని తొలగిస్తే రంగు తిరిగి వస్తుంది. కొన్ని ఇతర సమస్యలూ బొల్లి మాదిరిగా కనిపిస్తుంటాయి. కొందరు పిల్లల్లో ఎదుగుతున్న దశలో తెల్లమచ్చలు (పిటీరియాసిస్‌ ఆల్బా) రావొచ్చు. జన్యుపరంగా, పుట్టుకతో వచ్చే ఇవీ బొల్లి మచ్చల్లాగే కనిపిస్తాయి. అయితే వీటి సైజు పెరగదు. మచ్చ తీరు తెన్నులు, ఆకారం, అవి మొదలైన వయసు వంటి ఆధారంగా బొల్లి అవునో కాదో తేలికగానే గుర్తించొచ్చు. కొన్నిసార్లు అల్బునిజం జబ్బూ బొల్లి మాదిరిగా కనిపిస్తుంటుంది. ఇది జన్యుపరంగా పుట్టుకతోనే వచ్చే సమస్య. శరీరమంతా తెల్లగా అవటం దీని ప్రత్యేకత. ఇందులో జుట్టు, కనుగుడ్డు, కనురెప్పలు కూడా తెల్లగా అవుతాయి. దీనికి కారణమయ్యే జన్యువులు చాలావరకూ నిద్రాణంగానే ఉంటాయి. కానీ కొందరిలో ఇవి వ్యక్తమయ్యి సమస్యకు కారణమవుతాయి. 

 నిర్ధరణ ఎలా?

చాలావరకూ మచ్చల తీరును బట్టే బొల్లిని గుర్తించొచ్చు. భూతద్దంతో చూస్తే అక్కడ పాల మాదిరిగా తెల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు డెర్మోస్కోప్‌ పరికరమూ అందుబాటులోకి వచ్చింది. దీన్ని కాంతిని వెలువరించే భూతద్దం అనుకోవచ్చు. దీంతో మచ్చలు స్పష్టంగా కనిపిస్తాయి. అతి నీలలోహిత కిరణాలను వెలువరించే వుడ్స్‌ ల్యాంప్‌తో పరిశీలించి కచ్చితంగా నిర్ధరించొచ్చు. ఫంగస్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లయితే వేర్వేరు కాంతులు కనిపిస్తాయి. పిటీరియాస్‌ ఆల్బా అయితే మిశ్రమ రంగులు కనిపిస్తాయి. బొల్లి అయితే కేవలం పాల మాదిరిగానే కనిపిస్తుంది. నిర్ధరణ సంక్లిష్టంగా అనిపించినప్పుడు చర్మం నుంచి చిన్న ముక్కను కత్తిరించి (బయాప్సీ) పరీక్షించాల్సి ఉంటుంది. మైలనోసైట్‌ కణాలు ఉన్నాయో లేవో కచ్చితంగా తెలుస్తుంది. ఇతర చర్మ సమస్యలేవైనా ఉన్నా బయటపడతాయి. 

 అపోహలొద్దు

  • తాకటం వల్ల బొల్లి ఒకరి నుంచి మరొకరికి అంటుకోదు. శృంగార జీవితానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు.  
  • తల్లిదండ్రులకు బొల్లి ఉంటే పిల్లలకు వస్తుందని భయపడుతుంటారు. ఇది నిజం కాదు. దీన్ని మనసులోంచి తొలగించుకోవాలి. తల్లిదండ్రులకు ఉన్నా పిల్లలకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.  
  • ఆహారానికీ బొల్లికి సంబంధం లేదు. కాకపోతే సొరలిన్‌ రకం మందులు వాడేటప్పుడు పులుపు పదార్థాలు తినొద్దు. ఇవి మందులను శరీరం గ్రహించుకోకుండా నిలువరిస్తాయి. 
  • కొందరు బొల్లిని కుష్టుగా పొరపడుతుంటారు. ఈ రెండింటికీ సంబంధం లేదు. బొల్లి మచ్చలో స్పర్శ దెబ్బతినదు. అదే కుష్టులో స్పర్శ పోతుంది. బొల్లి మచ్చలో చెమట పడుతుంది. కుష్టులో చెమట పట్టదు, పొడిగా ఉంటుంది. బొల్లిలో వెంట్రుకలు రాలవు. కానీ కుష్టులో వెంట్రుకలు రాలతాయి. బొల్లి మచ్చ పాలలా తెల్లగా ఉంటుంది. కుష్టులో అంత తెల్లగా అవ్వదు. బొల్లిలో నాడులు దెబ్బతినవు. కుష్టులో నాడులు మొద్దుబారి, మందంగా తయారవుతాయి. బొల్లికి సూక్ష్మక్రిములకూ సంబంధం లేదు. కానీ కుష్టు వ్యాధి మైకోబ్యాక్టీరియం లెప్రా అనే సూక్ష్మక్రిమితో వస్తుంది. కాబట్టి రెండూ వేర్వేరు సమస్యలని, కారణాలూ వేరేనని తెలుసుకోవాలి.

 తాత్సారం చేయరాదు

శరీరం మీద తెల్ల మచ్చ కనిపిస్తే ముందు డాక్టర్‌ను సంప్రదించటం ముఖ్యం. అది బొల్లి మచ్చనా? జన్యుపరమైనదా? కుష్టు జబ్బా? ఫంగల్‌ ఇన్‌ఫెక్షనా? అనుసంధాన కణజాల సమస్యతో ముడిపడిందా? అనేది కచ్చితంగా నిర్ధరించుకోవాలి. దీంతో అనుమానం, భయం నివృత్తి అవుతాయి. మానసిక వేదన తప్పుతుంది. ఒకవేళ ఇతరత్రా జబ్బులైతే ముందుగానే గుర్తించి, త్వరగా చికిత్స తీసుకోవటానికి వీలుంటుంది. బొల్లి అయినా కూడా అప్పుడే చికిత్స తీసుకుంటే సమస్య ముదరకుండా చూసుకోవచ్చు. 
మందుల దుకాణాలకు వెళ్లి సొంతంగా మలాములు కొనుక్కొని, పూయటం తగదు. దుకాణాల్లో చాలావరకూ స్టిరాయిడ్‌ మలాములే అమ్ముతుంటారు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లయితే వీటితో సమస్య ఉద్ధృతమయ్యే ప్రమాదముంది. కొన్నిసార్లు ఒళ్లంతా ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించి, ప్రాణాల మీదికీ రావొచ్చు. 

 చికిత్సలు- అవసరాన్ని బట్టి

బొల్లి గలవారికి ఆత్మ విశ్వాసాన్ని కల్పించటం ముఖ్యం. ఇందుకు కౌన్సెలింగ్‌ ఉపయోగపడుతుంది. ‘మచ్చలతో వచ్చిన నష్టమేమీ లేదు, ఇదేమీ జబ్బు కాదు, కొద్ది రోజుల్లో అదే తగ్గిపోతుంది’ అని భరోసా ఇవ్వటం మేలు చేస్తుంది. నూటికి 70 మందికి చిన్న, మామూలు మచ్చలు దీంతోనే తగ్గుతాయి. మచ్చలు తగ్గకుండా, క్రమంగా పెరుగుతున్నట్టయితే చికిత్స అవసరమవుతుంది.
సోరలిన్స్‌: ఒకట్రెండు మచ్చలుంటే ఇవి ఉపయోగపడతాయి. సోరలిన్‌ మలామును మచ్చల మీద రాసి, కాసేపు ఎండ తగలనీయాల్సి ఉంటుంది. ఈ మలాము సూర్యరశ్మి సమక్షంలో మెలనోసైట్‌ కణాలను ప్రేరేపిస్తుంది. దీంతో వర్ణద్రవ్యం ఉత్పత్తి అయ్యి, మచ్చలు తగ్గుతాయి. సమస్య తీవ్రంగా ఉంటే సోరలిన్‌ మాత్రలూ అవసరమవుతాయి. మాత్ర వేసుకున్న గంట తర్వాత మచ్చలకు ఎండ తగలనీయాలి. 
జాక్‌ ఇన్‌హిబిటార్స్‌: ఇవి కొత్తరకం మందులు. రోగనిరోధకశక్తిని అదుపులో ఉంచుతూ వర్ణద్రవ్యం విచ్ఛిన్నం కాకుండా చూస్తాయి. దీంతో చర్మం తిరిగి మునుపటి రంగుకు మారుతుంది. ఇవిప్పుడు మలాముల రూపంలోనూ వస్తున్నాయి. లోపలికి తీసుకుంటూ, పైకి రాసుకుంటే ఎక్కువ ఫలితముంటుంది. 
మినీ పల్స్‌ థెరపీ: ఇందులో వరుసగా రెండు రోజుల పాటు తక్కువ మోతాదులో స్టిరాయిడ్‌ మాత్రలను ఇస్తారు. ఇలా వారానికి ఒకసారి చొప్పున ఆరు నెలల పాటు తీసుకోవాలి. ఇది మెలనోసైట్స్‌ మీద దాడి చేసే యాంటీబాడీలను నిలువరిస్తుంది. రంగు తిరిగి ఉత్పత్తి అవుతుంది. 
రోగనిరోధక శక్తిని అణచేవి: సొరలిన్‌ మాత్రలు, మలాములతో ఫలితం కనిపించకపోతే రోగనిరోధక శక్తిని అణచిపెట్టే స్లైక్లోస్పోరిన్‌ వంటి మాత్రలు అవసరమవుతాయి. వీటితో మంచి ఫలితం కనిపిస్తుంది. 
విటమిన్లు: బొల్లి ఉన్నవారికి ఎ, డి, ఇ విటమిన్లు మేలు చేస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రోగనిరోధకశక్తి గతి తప్పకుండా చూస్తాయి. ఇలా పరోక్షంగా వర్ణద్రవ్యం విచ్ఛిన్నం కాకుండా కాపాడతాయి. 
పిటీరియాసిస్‌ ఆల్బా మచ్చలకు పోషకాహారం తీసుకుంటూ, మామూలు మాయిశ్చరైజర్‌ రాసుకుంటే చాలు. 

 శస్త్రచికిత్సలు

మందులతో తగ్గకుండా, మచ్చ స్థిరంగా ఉంటున్నప్పుడు శస్త్రచికిత్సలు ఉపయోగపడతాయి. వీటిల్లో రకరకాలున్నాయి. కనీసం ఏడాది వరకూ మచ్చ పెరగకుండా, కొత్త మచ్చలు ఏర్పడకుండా ఉన్నవారికి వీటిని చేస్తారు. 
చర్మం మార్పిడి: శరీరంలో మచ్చలు లేని చోటు నుంచి చర్మం ముక్కలను కత్తిరించి, వాటిని మచ్చల మీద అతికించటం దీనిలోని కీలకాంశం. అతికించిన చర్మం మచ్చ భాగంలో కలిసిపోతుంది. మెలనోసైట్‌ కణాలు చుట్టుపక్కలకు విస్తరించి రంగును ఉత్పత్తి చేస్తాయి. శాశ్వతంగా మచ్చ నయమవుతుంది. ఇది సెగ్మెంటల్‌ విటిలిగోకు బాగా ఉపయోగపడుతుంది. పెదవుల మీద మచ్చ గలవారికి అతి పలుచటి చర్మాన్ని తెచ్చి అతికిస్తారు (అల్ట్రా థిన్‌ గ్రాఫ్టింగ్‌). చర్మం పైపొరను బొబ్బల్లా పైకి లేపి, వాటిని కత్తిరించి మచ్చ ఉన్నచోట జిగురుతో అతికించే (బ్లిస్టర్‌ గ్రాఫ్టింగ్‌) పద్ధతి కూడా ఉంది. కొందరికి మచ్చ భాగంలో చిన్న రంధ్రాలు చేసి చర్మాన్ని తొలగించి, వేరే భాగం నుంచి ఇలాగే చర్మాన్ని కత్తిరించి తెచ్చి అతికిస్తుంటారు (పంచ్‌ గ్రాఫ్టింగ్‌). కనుబొమ్మలు, పెదవుల వంటి చోట్ల మచ్చలు తగ్గటానికిది ఉపయోగపడుతుంది. 
నాన్‌ కల్చర్డ్‌ మెలనోసైట్‌ ట్రాన్స్‌ఫర్‌: చర్మంలోని మెలనోసైట్‌ కణాలను వేరు చేసి, మచ్చ ఉన్న చోట ప్రవేశపెట్టటం దీనిలోని ప్రత్యేకత. చర్మాన్ని కొద్దిగా కత్తిరించి ప్రయోగశాలలో ద్రావకంలో పెడితే చర్మ కణాలన్నీ పోయి, మెలనోసైట్స్‌తో కూడిన పొర మిగులుతుంది. దీన్ని మచ్చ మీద అతికిస్తే త్వరగా అతుక్కుంటుంది. మరీ ఎక్కువ భాగానికి ఈ పద్ధతి అవసరమైనప్పుడు ప్రయోగశాలలో మెలనోసైట్స్‌ను వృద్ధి చేసే ప్రక్రియను ప్రయత్నిస్తారు. దీన్ని కల్చర్డ్‌ మెలనోసైటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ అంటారు.
డీపిగ్మెంటేషన్‌: శరీరమంతా మచ్చలుంటే అక్కడక్కడా మిగిలిన రంగును తొలగిస్తే చర్మమంతా ఒకేలా అవుతుంది. మచ్చలున్నట్టు కనిపించదు. 

 జీవనశైలి మీద దృష్టి

బొల్లి మచ్చలు గలవారు జీవనశైలి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. మానసిక ఒత్తిడి, నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థ మీద విపరీత ప్రభావం చూపుతాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలి. రాత్రిపూట కంటి నిండా నిద్ర పోయేలా చూసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. మద్యం, పొగ తాగటం, మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దు.  

కాంతి చికిత్స: అక్కడక్కడా చిన్న చిన్న మచ్చలు గలవారికి న్యారోబ్యాండ్‌ యూవీబీ చికిత్స మేలు చేస్తుంది. ఇందులో మచ్చలను నేరుగా అతి నీలలోహిత కాంతి కింద ఉంచుతారు. దీన్ని వారానికి రెండు మూడురోజులు చేస్తారు. చర్మం తట్టుకునేంత వరకూ నెమ్మదిగా కాంతి తీవ్రతను పెంచుకుంటూ వస్తారు. సోరలిన్‌ మాత్రలు వేసుకొని, మలాము రాసుకొని అతి నీలలోహిత కాంతి ప్రసరించేలా చేయటం మరో పద్ధతి (పూవా థెరపీ). ఇందులో మచ్చలున్న భాగాన్ని కాంతిని ప్రసరింపజేసే ప్యానెల్‌ కింద పెడతారు. ఒకవేళ శరీరంలో చాలా చోట్ల మచ్చలుంటే కాంతిని వెదజల్లే ఛాంబర్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని