పార్కిన్సన్స్‌ను పట్టించే జీవ సూచికలు

పార్కిన్సన్స్‌ జబ్బును ముందే అంచనా వేయటానికి తోడ్పడగల ఎనిమిది ప్రొటీన్లను యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు గుర్తించారు.

Published : 25 Jun 2024 00:48 IST

పార్కిన్సన్స్‌ జబ్బును ముందే అంచనా వేయటానికి తోడ్పడగల ఎనిమిది ప్రొటీన్లను యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు గుర్తించారు. ఇవి ‘జీవ సూచికల’ మాదిరిగా ఉపయోగపడగలవని, వీటి సాయంతో లక్షణాలు ఆరంభం కావటానికి ఏడేళ్ల ముందే పార్కిన్సన్స్‌ను పట్టుకోవచ్చని చెబుతున్నారు. ప్రొటీన్‌ జీవ రసాయన శాస్త్రంతో కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని సమ్మేళనం చేసి ఈ సూచికలను కనుగొన్నారు. మెదడులోని సబ్‌స్టాన్షియా నైగ్రా అనే భాగంలో కణాలు క్షీణించటం, కీలక నాడీ సమాచార వాహకమైన డొపమైన్‌ రసాయనం మోతాదులు తగ్గటం మూలంగా పార్కిన్సన్స్‌ జబ్బు తలెత్తుతుంది. ఇది నెమ్మదిగా ముదురుతూ వచ్చే సమస్య. ఇందులో చేతులు, తల వంటి భాగాలు వణకటం.. నడక, కదలికలు నెమ్మదించటం.. ముందుకు వంగిపోవటం.. తూలటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం దీనికి డొపమైన్‌ను భర్తీ చేయటం ద్వారా చికిత్స చేస్తున్నారు. ఇప్పటివరకూ పార్కిన్సన్స్‌ను అంచనా వేయగలిగే జీవసూచికలు లేకపోవటం పెద్ద సవాలుగా నిలుస్తోంది. ఈ విషయంలో యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు గొప్ప పురోగతే సాధించారు. కొత్తగా కనుగొన్న జీవ సూచికలతో జబ్బు ముప్పు గలవారిని గుర్తించటానికి అవకాశం చిక్కుతుంది. ప్రయోగాత్మక చికిత్సల సామర్థ్యాలను తెలుసుకోవటానికి కూడా వీలవుతుంది. పార్కిన్సన్స్‌ త్వరగా ముదరకుండా చూసుకోవటానికి, నివారించుకోవటానికి మార్గం సుగమం కాగలదనీ ఆశిస్తున్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని