రొమ్ముక్యాన్సర్‌ తర్వాతా సంతాన భాగ్యం

చిన్న వయసులో రొమ్ముక్యాన్సర్‌ బారినపడి, చికిత్సతో బయటపడ్డవారికి శుభవార్త. ఇలాంటివారు మున్ముందు గర్భం ధరించటం, సంతానాన్ని కనటం సాధ్యమేనని డానా-ఫార్బర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనంలో బయటపడింది.

Published : 04 Jun 2024 00:21 IST

చిన్న వయసులో రొమ్ముక్యాన్సర్‌ బారినపడి, చికిత్సతో బయటపడ్డవారికి శుభవార్త. ఇలాంటివారు మున్ముందు గర్భం ధరించటం, సంతానాన్ని కనటం సాధ్యమేనని డానా-ఫార్బర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనంలో బయటపడింది. ఇందులో రొమ్ముక్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న 200 మందిని పరిశీలించారు. చికిత్స అనంతరం సగటున 11 ఏళ్ల తర్వాత గర్భధారణకు ప్రయత్నించిన వారిలో చాలామంది సఫలమవటమే కాకుండా పండంటి బిడ్డలను కన్నట్టు తేలింది. రొమ్ముక్యాన్సర్‌ నుంచి గట్టెక్కినవారిలో గర్భధారణ, ప్రసవాలకు సంబంధించి గత అధ్యయనాల్లో తేలని ఎన్నో అంశాలు ఇందులో బయటపడ్డాయి. రొమ్ముక్యాన్సర్‌ బాధితులకు చేసే రేడియేషన్, కీమోథెరపీ, హార్మోన్‌ చికిత్సలతో కొన్ని దుష్ప్రభావాలు పొంచి ఉంటాయి. ఇవి సంతానం కలగటంలో ఇబ్బంది కలిగిస్తాయి. ఇప్పుడు టార్గెటెడ్, ఇమ్యూన్‌థెరపీల వంటి కొత్త చికిత్సలూ వచ్చాయి. అయితే ఇవి గర్భిణులు, గర్భధారణకు ప్రయత్నించేవారి మీద చూపే ప్రభావాల మీద ఇంకా అధ్యయనాలు జరగలేదు. ఇప్పటివరకూ కొన్ని అధ్యయనాలే రొమ్ముక్యాన్సర్‌ నిర్ధరణ అయిన తర్వాత గర్భధారణకు ప్రయత్నించిన వారిపై దృష్టి సారించాయి. అదీ తక్కువ సమయానికి, కొన్నిరకాల క్యాన్సర్లకే పరిమితయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా అధ్యయన ఫలితాలు కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. ఇందులో 40, అంతకన్నా తక్కువ వయసులో క్యాన్సర్‌ నిర్ధరణ అయినవారిని ఎంచుకున్నారు. వీరంతా సగటున 32 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ బారినపడగా.. చాలామంది హార్మోన్‌ రిసెప్టర్‌ పాజిటివ్‌ రకం గలవారే. కొందరిలో రొమ్ముక్యాన్సర్‌ క్షీరనాళాలకే పరిమితమైతే.. కొందరిలో లింఫ్‌ గ్రంథులకూ వ్యాపించింది. ఏ దశలో క్యాన్సర్‌ నిర్ధరణ అయినా కూడా గర్భధారణ విషయంలో పెద్ద తేడా ఏమీ కనిపించకపోవటం విశేషం. కాకపోతే ఆలస్యంగా గర్భధారణకు ప్రయత్నించిన వారిలో అంతగా సఫలం కావటం లేదని తేలింది. గర్భధారణకు ప్రయత్నించినవారిలో 73% మంది సఫలం కాగా.. 65% మంది సంతానాన్ని కన్నారు. క్యాన్సర్‌ చికిత్సకు ముందు అండం/పిండాన్ని శీతలీకరించి భద్రపరచుకున్నవారిలో మరింత ఎక్కువగా సంతానం కలగటం గమనార్హం. అందువల్ల చిన్న వయసులో రొమ్ముక్యాన్సర్‌ బారినపడి, మున్ముందు సంతానాన్ని కనాలని అనుకునేవారికి అండం లేదా పిండాన్ని సంరక్షించుకునే పద్ధతిని అందుబాటులో ఉండేలా చూడాలని పరిశోధకులు సూచిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని