ఫంగస్‌ ప్రమాదం

ఇన్‌ఫెక్షన్లు అనగానే ముందుగా వైరస్, బ్యాక్టీరియానే గుర్తుకొస్తుంటాయి. ఫంగస్‌ కూడా తక్కువేమీ కాదు. నిజానికి చాలారకాల ఫంగస్‌లు హానేమీ చేయవు. పుట్టగొడుగుల వంటి వాటిని తింటుంటాం కూడా.

Published : 28 May 2024 00:18 IST

ఇన్‌ఫెక్షన్లు అనగానే ముందుగా వైరస్, బ్యాక్టీరియానే గుర్తుకొస్తుంటాయి. ఫంగస్‌ కూడా తక్కువేమీ కాదు. నిజానికి చాలారకాల ఫంగస్‌లు హానేమీ చేయవు. పుట్టగొడుగుల వంటి వాటిని తింటుంటాం కూడా. కానీ కొన్నిరకాల ఫంగస్‌లు చర్మ సమస్యలు, ఊపిరితిత్తి ఇన్‌ఫెక్షన్ల వంటి జబ్బులకు దారితీస్తాయి. తీవ్రమైతే ప్రాణాపాయానికి కారణమవుతాయి కూడా.

ఫంగస్‌ సర్వాంతర్యామి అనుకోవచ్చు. సాధారణంగా ఇది నేల, చెట్ల మీద జీవిస్తుంటుంది. కానీ ఇళ్లల్లోనూ మనుగడ సాగించగలదు. ఇతర క్రిముల మాదిరిగా గాల్లోనూ తేలియాడొచ్చు. ఆ మాటకొస్తే మనం రోజూ ఫంగస్‌లను శ్వాస ద్వారా పీల్చుకుంటుంటాం కూడా. అయితే ఇతర క్రిములతో పోలిస్తే వీటితో ఇన్‌ఫెక్షన్లు తలెత్తటం తక్కువ. ఒకవేళ వచ్చినా చాలావరకూ అంత తీవ్రం కావు. తామర.. పాదం మీద దురద, పొక్కులను కలగజేసే అథ్లెట్స్‌ ఫుట్‌ వంటివి ఇలాంటి సమస్యలే. అలాగని అన్నీ మామూలువే కావు. కొన్ని ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, రక్తం, మెదడులోకి విస్తరించే ఫంగస్‌లు చాలా ప్రమాదకరం. కొవిడ్‌ సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ ఎంత హాని కలిగించిందో తెలిసిందే. 

ఎవరికైనా రావొచ్చు

ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఎవరికైనా రావొచ్చు. అయితే రోగనిరోధకశక్తి తగ్గినవారికి వీటి ముప్పు ఎక్కువ. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ గలవారికి, అవయవాలు మార్పిడి చేయించుకున్నవారికి, క్యాన్సర్‌ చికిత్స తీసుకునేవారికి, కొన్ని చికిత్సల కోసం ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండేవారికి, ఏదైనా సమస్య కోసం మూలకణాల మార్పిడి చేయించుకున్నవారికి, రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు వేసుకునేవారికి, మధుమేహం గలవారికి ఎక్కువగా వచ్చే అవకాశముంది. వీరికి ఇన్‌ఫెక్షన్ల తీవ్రత కూడా అధికమే. 

గుర్తించటం కష్టమే

శరీరం లోపల ఉన్న ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించటం అంత తేలిక కాదు. చాలా లక్షణాలు వైరస్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లనూ పోలి ఉంటాయి. అందువల్ల వీటిని విడదీసి చూడటం కష్టమైన పనే. తీవ్రమైన ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌లో జ్వరం, దగ్గు, శ్వాస సరిగా ఆడకపోవటం, చలి, తలనొప్పి, ఛాతీ నొప్పి, బాగా అలసిపోవటం వంటి లక్షణాలు కనిపి స్తుంటాయి. వీటిని బట్టి డాక్టర్లు ఒక అంచనాకు వస్తారు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌గా అనుమానిస్తే రక్తం లేదా మూత్ర పరీక్ష చేయిస్తారు. ఊపిరితిత్తుల ఎక్స్‌రే, స్కాన్‌ కూడా చేయాల్సి రావొచ్చు. అయినా కూడా అన్నిసార్లూ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ బయట పడకపోవచ్చు. వైరస్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లకు చేసే చికిత్సలతో ఫలితం కనిపించకపోతే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ అయ్యిండొచ్చని అనుమానించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మందుల కొరతే ఇబ్బంది

ప్రస్తుతం తీవ్రమైన ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల చికిత్సకు కొన్ని యాంటీఫంగల్‌ మందులే అందుబాటులో ఉన్నాయి. వీటితో చాలా దుష్ప్రభావాలూ పొంచి ఉంటాయి. ఎందుకంటే ఫంగల్‌ కణాలు దాదాపుగా మనుషుల కణాల మాదిరిగానే ఉంటాయి. దీంతో యాంటీఫంగల్‌ మందులకు వీటి మధ్య తేడాను కనుక్కోవటం కష్టమవుతుంది. ఫంగస్‌ను చంపే క్రమంలో మన కణాల మీదా దాడి చేస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు తక్కువ దుష్ప్రభావాలు కలగజేసే కొత్తరకం యాంటీఫంగల్‌ మందులను రూపొందించటం మీద పరిశోధకులు దృష్టి సారించారు. 

బ్యాక్టీరియా సాయంతో

చాలారకాల బ్యాక్టీరియా సహజంగా ఫంగస్‌ను చంపే రసాయనాలను విడుదల చేస్తుంటాయి. అందుకే జంతువుల్లో నివసించే బ్యాక్టీరియా నుంచి పుట్టుకొచ్చే రసాయనాల మీద పరిశోధకులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని జంతువుల్లోనూ మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. వీటి నుంచి వచ్చే రసాయనాలు జంతువులకు హాని చేయకపోతే మనుషులకూ కీడు చేయవు కదా. ఇదే కొత్త యాంటీఫంగల్‌ మందుల రూపకల్పనలో ఆశలు కల్పిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ పరిశోధకులు ఇటీవల సముద్రంలో నివసించే సీ స్కిర్ట్‌ జీవుల్లో కనిపించే టర్బిన్‌మిసిన్‌ అనే రసాయనాన్ని గుర్తించారు. ఇది ప్రస్తుత చికిత్సలకు లొంగని చాలా రకాల ఫంగస్‌లను చంపుతున్నట్టు తేలింది. అదీ మానవ కణాలకు ఎలాంటి హాని కలిగించకుండా. యాంటీఫంగల్‌ మందులు ఎంతకాలం ప్రభావం చూపుతాయో అర్థం చేసుకోవటానికి పరిశోధకులు అధునాతన పరిజ్ఞానాల సాయమూ తీసుకుంటున్నారు. ఇలా మందులు సురక్షితంగా, మరింత ఎక్కువ ప్రభావవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకు అంతగా మందులు అందుబాటులో లేని ప్రస్తుత తరుణంలో ఇది మంచి అవకాశంగా కనిపిస్తోంది. వీలైనంత త్వరగా ఫంగస్‌ పని పట్టేందుకు వీలు కల్పించనుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని