Food Habits - Dinner: రాత్రి భోజనం ఆలస్యంగా తింటే ఏమవుతుందో తెలుసా?

Dinner - Health: రాత్రి భోజనం ఆలస్యం చేయకూడదని, కొవ్వులు, చక్కెరతో కూడిన ఆహారం ఎక్కువగా తినొద్దని నిపుణులు చెబుతుంటారు. అదెందుకంటే?

Updated : 13 Jun 2024 16:16 IST

ఆలస్యంగా రాత్రి భోజనం (Dinner) చేయొద్దని.. ముఖ్యంగా కొవ్వులు, చక్కెరతో కూడిన ఆహారం ఎక్కువగా తినొద్దని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇదెంత ముఖ్యమో మరోసారి రుజువైంది. పడుకోవటానికి 3 గంటల్లోపు భోజనం చేసేవారిలో (వారానికి కనీసం నాలుగు రోజుల పాటు) పెద్దపేగు చివర (కొలోరెక్టల్‌) క్యాన్సర్‌ వచ్చే ముప్పు పెరుగుతున్నట్టు తాజాగా బయటపడింది. రాత్రి భోజనాన్ని పెందలాడే తినేవారితో పోలిస్తే ఆలస్యంగా తినేవారికి చిన్న కణితి (అడినోమా) ఏర్పడే అవకాశం 46% ఎక్కువగా ఉంటున్నట్టు షికాగోలోని రష్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. వీరిలో మూడు కన్నా ఎక్కువ కణితులు తలెత్తే ముప్పు 5.5 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

నిజానికి ఇలాంటి కణితులు క్యాన్సర్‌ (Cancer) రహితమే. కానీ వీటిల్లో కొన్ని క్యాన్సర్‌గా మారే ప్రమాదముంది. జీర్ణకోశంలో ఇవి ఉన్నచోటు, సైజును బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇంతకీ పెద్దపేగు క్యాన్సర్‌కూ ఆలస్యంగా భోజనం చేయటానికీ మధ్య సంబంధమేంటి? జీర్ణకోశంలోని జీవగడియారం గతి తప్పటమేనని పరిశోధకులు భావిస్తున్నారు. ఆలస్యంగా భోజనం చేసినప్పుడు మెదడు అది రాత్రి సమయమని, ఇక పేగులేమో పగలని అనుకుంటాయని చెబుతున్నారు. పైగా ఆలస్యంగా భోజనం చేసేవారు చాలాసార్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోరు. కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తింటుంటారు. ఇది పేగుల్లోని జీవగడియారాన్ని అస్తవ్యస్తం చేయటమే కాదు, బరువు పెరగటానికీ దారితీస్తుంది. ఇదీ క్యాన్సర్‌ ముప్పును పెంచేదే.

పేగుల్లోని కొన్ని బ్యాక్టీరియాకు తమవైన జీవగడియారాలుంటాయి. ఇవి రోజువారీ లయను అనుసరిస్తాయి. తినే ఆహారాన్ని బట్టి కొన్నిరకాల బ్యాక్టీరియా మరింత చురుకుగా వ్యవహరించొచ్చు. కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను ఆలస్యంగా తిన్నప్పుడు వీటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చాలా అధ్యయనాలు ఎప్పుడు తింటున్నామనే దాని కన్నా ఏం తింటున్నాయనే దానిపై జరుగుతుంటాయి. అయితే భోజన వేళలనూ పరిగణనలోకి తీసుకోవటం ముఖ్యమని తాజా అధ్యయనం సూచిస్తోంది.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని