Brain: మెదడు మీద వాతావరణం

వాతావరణ మార్పు మెదడు మీద తీవ్ర దుష్ప్రభావం చూపిస్తున్నట్టు తాజా అధ్యయన సమీక్ష పేర్కొంది.

Published : 21 May 2024 00:01 IST

వాతావరణ మార్పు మెదడు మీద తీవ్ర దుష్ప్రభావం చూపిస్తున్నట్టు తాజా అధ్యయన సమీక్ష పేర్కొంది. దీని మూలంగా పక్షవాతం, పార్శ్వనొప్పి, అల్జీమర్స్, మూర్ఛ, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ వంటి నాడీ జబ్బులు తీవ్రమయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. ముఖ్యంగా పక్షవాతం, నాడీవ్యవస్థ ఇన్‌ఫెక్షన్ల మీద వాతావరణం ప్రభావం చూపుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. విపరీత ఉష్ణోగ్రతలు (అధిక వేడి, అధిక చల్లదనం), రోజంతా ఉష్ణోగ్రతలో తీవ్రమైన తేడా వంటి వాతావరణ వ్యత్యాసాలతో ఎక్కువ ప్రభావం పడుతోందని వివరిస్తున్నారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో లేదా వడగాలులు వీచిన రోజుల్లో పక్షవాతం బారినపడుతున్నవారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. వడగాలి లేదా అతిచల్లదనం వంటివి మతిమరుపునకు దారితీస్తున్నట్టు తేలింది. వరదలు, కార్చిచ్చులు సైతం దీనికి కారణమవుతున్నాయి. వేడి వాతావరణంలో నీరు ఎక్కువగా తాగటం, గాలి ఆడేలా చూసే దుస్తులు ధరించటం వంటి జాగ్రత్తలతో జబ్బుల ముప్పును తగ్గించుకునే వీలుండటం విశేషం. రాత్రిపూట ఉష్ణోగ్రతలూ కీలకమే. అధిక ఉష్ణోగ్రతలు నిద్రను అస్తవ్యస్తం చేస్థాయి. నిద్రలేమి పలు మెదడు సమస్యలకు దారితీస్తుంది. భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో మున్ముందు వాతావరణం మరింతగా మార్పు చెందే అవకాశం ఉండటం వల్ల అధ్యయన ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని