Telugu Methodology: ఉత్సాహంగా.. ఉల్లాసంగా నేర్పించే శిక్షణ!

ప్రాథమిక దశలో చిన్నారులకు చదువులపై ఇష్టాన్ని పెంచాలంటే వారిని ఒప్పిస్తూ, మెప్పిస్తూ బోధించాల్సి ఉంటుంది. ఆట పాటలు అందులో భాగం కావాలి. ఉత్తేజపరిచే విధంగా, ప్రేరణ చెందించే రీతిలో, స్వేచ్ఛగా మనోవికాసం కలిగించే తీరులో ఆ బోధన సాగాలి.

Published : 01 Jul 2024 01:33 IST

టీఆర్‌టీ - 2024 తెలుగు మెథడాలజీ

ప్రాథమిక దశలో చిన్నారులకు చదువులపై ఇష్టాన్ని పెంచాలంటే వారిని ఒప్పిస్తూ, మెప్పిస్తూ బోధించాల్సి ఉంటుంది. ఆట పాటలు అందులో భాగం కావాలి. ఉత్తేజపరిచే విధంగా, ప్రేరణ చెందించే రీతిలో, స్వేచ్ఛగా మనోవికాసం కలిగించే తీరులో ఆ బోధన సాగాలి. ఈ దిశగా ఉన్న ప్రామాణిక బోధనా పద్ధతుల గురించి కాబోయే ఉపాధ్యాయులు సమగ్రంగా తెలుసుకోవాలి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు పరిమితులపై అవగాహన పెంచుకోవాలి.


క్రీడాపద్ధతి

హెన్రీ కాల్డ్వెల్‌ కుక్‌ తన అనుభవాల ఆధారంగా క్రీడాపద్ధతిని ప్రతిపాదించారు. పెర్సీనన్, గిఫ్రిత్, ఫ్రెడరిక్‌ ఫ్రోబెల్, మాంటిస్సోరి లాంటివారు విద్యారంగంలో క్రీడాపద్ధతికి విశేష ప్రాచుర్యాన్ని కల్పించారు.

  • ఒక వ్యక్తి ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఇష్టపూర్వకంగా, ఉల్లాసంగా నిర్వహించే ఏ కృత్యమైనా క్రీడే అవుతుంది. ఈ క్రీడ ఆనందాన్ని ఇస్తుంది. - గల్లిక్‌
  • క్రీడ అంటే జీవితంలో మున్ముందు దీక్షాభినివేశాలతో కార్యాచరణకు సమాయత్తపరిచే పీఠిక ప్రాయమైన సాధన. - కారల్‌ గ్రూస్‌
  • పిల్లల సంపూర్ణ అభివృద్ధికి క్రీడాపద్ధతి చక్కటి సాధన. - ఫ్రోబెల్‌
  • క్రీడల్లో బహిర్గతమయ్యే మానసిక శక్తిని విద్యావిధానంలో ఉపయోగించుకుంటే బోధన ఫలవంతం అవుతుంది. - పెర్సీనన్‌

క్రీడాపద్ధతిలోని ముఖ్యమైన అంశాలు

  • ఈ పద్ధతి చైతన్యవంతమైంది.
  • ఈ విధానంలో విద్యార్థుల మానసిక అవసరాలు తీరుతాయి.
  • విద్యార్థులకు సాధన, గుర్తింపు పట్ల ఉన్న అవసరం క్రీడాపద్ధతిలో తీరుతుంది.
  • పిల్లల్లోని కార్య కుతూహలత, నిర్మాణాత్మక, సామూహిక భావన లాంటి సహజాత లక్షణాలను క్రీడాపద్ధతి ఉపయోగించుకుంటుంది.
  • ఈ విధానం ఉపాధ్యాయులు, విద్యార్థులకు మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.
  • ఇది చక్కటి భాగస్వామ్యంతో అభ్యసన వాతావరణాన్ని కల్పిస్తుంది.

క్రీడాపద్ధతి ప్రయోజనాలు: భాషా బోధనలో క్రీడాపద్ధతి కింది ప్రయోజనాలను కలిగిస్తుంది.

  • శారీరక, మానసిక వికాసానికి; సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి ఉపకరిస్తుంది.
  • విద్యార్థుల్లో భావనాశక్తి, సృజనాత్మక శక్తి పెరుగుతాయి.
  • అవధానం, గ్రహణ శక్తి, వివేచన, సహనం, సమయస్ఫూర్తి, స్మృతి జ్ఞానం పెంపొందుతాయి.
  • సహృదయత, సానుభూతి, సహకార భావన, ఆత్మవిశ్వాసం, ఆత్మనిగ్రహం అలవడతాయి.
  • కుతూహలం, ఆర్జన, ఉత్సాహం లాంటి సహజాతాలు వినియోగంలోకి వచ్చి ఆలోచన, ఆచరణ, అనుభవం అనేవి సమన్వయం పొందుతాయి.
  • హాస్యపూరిత ప్రసంగ ధోరణి, సంభాషణా చాతుర్యం, నటనా కౌశలం అలవడతాయి.

పరిమితులు

  • అన్ని అంశాలను బోధించడానికి క్రీడాపద్ధతి ఉపయోగపడదు.
  • నేర్చుకోవడం కంటే ఆనందానికి ప్రాధాన్యం ఇచ్చే  అవకాశం ఉంది.

మాంటిస్సోరి పద్ధతి

దీనికి శిశు గృహం/క్లబ్‌ అనే పేర్లు ఉన్నాయి. దీన్ని  ప్రతిపాదించివారు మేరియా మాంటిస్సోరి.

ముఖ్యాంశాలు

  • శిశువుల మనస్తత్వంపై ఆధారపడిన పద్ధతి.
  • ఇదొక జీవన వికాస పద్ధతి.
  • పంచేంద్రియాలకు శిక్షణ ఇచ్చే పద్ధతి.
  • ఈ పద్ధతిలో విద్యార్థులకు ఒక క్లబ్‌ ్బశిశు గృహం్శ ఉంటుంది.
  • ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు పరిశీలకుడిగా ఉంటారు.
  • దర్శకురాలి ఆధ్వర్యంలో పాఠశాల నడుస్తూ ఆమెకు సహాయకురాలిగా ఒక ఉపాధ్యాయురాలు, వైద్యురాలు ఉండే పద్ధతి.
  • ఈ పద్ధతిలోని బాలబాలికల వయసు 37 ఏళ్లు.
  • దీనిలో ధన వ్యయం, కాల వ్యయం, స్వేచ్ఛ ఎక్కువ.
  • దీనిలో పిల్లలకు ఉపదేశాత్మక ఉపకరణాలు ్బడైడాక్టిక్‌ అవరాటస్శ్‌ ఇస్తారు.
  • పిల్లల శారీరక ఎదుగుదలను కొలవడానికి వాడే   పరికరాన్ని పీడో మెట్రా అంటారు.
  • గిజుబాయి అభిప్రాయం ప్రకారం ఇదొక జీవన ఆదర్శం.

కిండర్‌ గార్టెన్‌ పద్ధతి

దీనికి బాల ఉద్యానవన/తరగతి గది పద్ధతి అని పేరు. పాఠశాల ఒక తోట; అందులోని బాలబాలికలు మొక్కల లాంటివారు అని భావించేదే కిండర్‌ గార్టెన్‌ పద్ధతి. దీన్ని ప్రతిపాదించినవారు ఫ్రోబెల్‌. ఈయన జర్మన్‌ దేశస్థుడు. ఫ్రోబెల్‌ రాసిన గ్రంథం ‘ది ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్లాన్‌’. 

  • స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరిగే మొక్కలు ఎలాంటివో బాలబాలికలు కూడా అలాంటి వారేనని ఈ పద్ధతి భావిస్తుంది.
  • ఈ పద్ధతిలో బాలబాలికలకు ఇచ్చే ఉపకరణాలకు ఫ్రోబెల్‌ కానుకలు అని పేరు.
  • దీనిలో ధన వ్యయం, కాల వ్యయం, స్వేచ్ఛ తక్కువ.
  • ఇందులో ఉపాధ్యాయురాలు మార్గదర్శకురాలిగా ఉంటారు. 
  • మట్టితో నమూనాలు చేయించడం, రంగులు కలపడం, కాగితాలు కత్తిరించడం, వివిధ ఆకృతులు తయారు చేయడం ఈ పద్ధతిలోని వ్యూహాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని