Social problems: సామాజిక క్రమతను అడ్డుకునే రుగ్మతలు!

సమాజం ఒక సాంఘిక సంస్థ. ఒకే ప్రాంతంలో, ఒకే సంస్కృతీ సంప్రదాయాలతో, ఒకే లక్ష్యంతో జీవించే వ్యక్తుల సమూహం.  కుటుంబం, స్నేహం, పని, రాజకీయాలు, మతం మొదలైన సంబంధాల ద్వారా ఏర్పడుతుంది.

Published : 01 Jul 2024 01:33 IST

సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజావిధానాలు/పథకాలు

సమాజం ఒక సాంఘిక సంస్థ. ఒకే ప్రాంతంలో, ఒకే సంస్కృతీ సంప్రదాయాలతో, ఒకే లక్ష్యంతో జీవించే వ్యక్తుల సమూహం.  కుటుంబం, స్నేహం, పని, రాజకీయాలు, మతం మొదలైన సంబంధాల ద్వారా ఏర్పడుతుంది. ఎక్కువమందికి ఆమోదనీయం కాని, అత్యధిక మందిని ప్రభావితం చేసే పేదరికం, నిరుద్యోగం, నేరాలు, అసమానతలు, పర్యావరణ క్షీణత తదితరాలు అందులో తలెత్తే సామాజిక సమస్యలు. అవి సమాజం సజావుగా సాగకుండా అడ్డుకునే రుగ్మతలు. వాటిని పరిష్కరించడానికి, సమాజాన్ని సక్రమంగా అర్థం చేసుకోవడానికి సామాజిక సమస్యలను అధ్యయనం చేయాలి. ఈ నేపథ్యంలో  సమాజం, ప్రాంతం, పరిస్థితులు, వ్యక్తులు, వర్గాల వారీగా మారుతూ ఉండే సామాజిక సమస్యలు, రకాలు, వాటి స్వభావం, కారణాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. పారిశ్రామిక విప్లవం అనంతరం పెరిగిపోయిన ఈ తరహా సమస్యల పరిష్కారానికి జరుగుతున్న ప్రయత్నాలపై అవగాహన కలిగి ఉండాలి.


సమాజం - సామాజిక సమస్యలు

మాజం నిలకడగా ఉండి సజావుగా సాగిపోతున్నప్పుడు అనుకోకుండా కొన్ని పరిస్థితులు ఉత్పన్నమై గందరగోళాన్ని సృష్టిస్తాయి. వాటినే సామాజిక సమస్యలుగా పేర్కొంటారు. సమాజంలో ఒకవైపు సామాజిక క్రమతకు దోహదం చేసే అంశాలు, మరోవైపు ఆ క్రమతను భంగపరిచే విషయాలు కూడా ఉంటాయి. ప్రాచీన సమాజంలో సామాజిక సమస్యలు అంతగా ఉండేవి కావు. కాలక్రమేణా సమాజం సంక్లిష్ట స్థితిని సంతరించుకోవడంతో సామాజిక సమస్యలు ఎక్కువై సమాజ మనుగడకు సవాలుగా నిలిచాయి. కొన్ని సందర్భాల్లో సామాజిక అవ్యవస్థలు తలెత్తుతున్నాయి.

సామాజిక సమస్యలు - స్వభావం

పలువురు శాస్త్రవేత్తలు సామాజిక సమస్యలను నిర్వహించిన తీరును పరిశీలిస్తే వాటి స్వభావం అర్థమవుతుంది. 

  • సమాజంలోని అధిక శాతం ప్రజలు అప్పటికి సమాజంలో ఉన్న కొన్ని పరిస్థితులను నీతి లేనివిగా భావించినప్పుడు, వాటిని సామాజిక సమస్యలుగా భావిస్తారు. - గ్రీన్‌
  • సమాజంలోని ప్రజలు కొన్ని పరిస్థితులను మంచివిగా భావించకుండా, వాటికి తమ అంగీకారాన్ని తెలియజేయనప్పుడు వాటిని సామాజిక సమస్యలుగా పరిగణిస్తారు. - లండ్‌ బర్గ్‌

ఈ నిర్వచనాల ఆధారంగా సమాజంలోని అధిక శాతం ప్రజల ఆమోదం పొందలేని పరిస్థితులు లేదా అంశాలను సామాజిక సమస్యలుగా భావించవచ్చు. ఈ విధంగా పరిగణించిన పరిస్థితులు సమాజంలోని వ్యక్తుల స్థితిగతులతోపాటు సామాజిక వ్యవస్థాపన సజావుగా సాగకుండా అడ్డుకుంటాయి.

సామాజిక వ్యవస్థాపన - విస్తరణ

సామాజిక సమస్యల స్వభావం మారుతూ ఉంటుంది. ఒక ప్రాంతంలో ఒక అంశాన్ని సమస్యగా భావిస్తే అదే అంశాన్ని మరో ప్రాంతంలో సమస్యగా పరిగణించకపోవచ్చు. అదేవిధంగా ఒక కాలంలో సామాజిక సమస్యగా పరిగణించిన అంశం మరొక కాలంలో సామాజిక సమస్యగా కనిపించకపోవచ్చు. ఒకే సమాజంలో ఒక వర్గం వారికి సమస్యగా ఉన్న అంశం మరొక వర్గం వారికి సమస్యగా ఉండకపోవచ్చు. ఈ విధంగా సామాజిక సమస్యల స్వభావం ప్రాంతానికి, ప్రాంతానికి, కాలానికి, కాలానికి, వ్యక్తికీ, వ్యక్తికీ మారుతూ ఉంటుంది.

ఉదాహరణకు విడాకుల సంఖ్య పెరగడం భారతీయ సమాజంలో ఒక సామాజిక సమస్యగా భావిస్తే, అమెరికా సమాజం ఇదే పరిస్థితిని ఒక సమస్యగా చూడకపోవచ్చు. అదేవిధంగా భారత సమాజంలో ఒకప్పుడు వరకట్నం దుష్ఫలితాలను ఇచ్చేది కాదు. అప్పట్లో దాన్ని దురాచారంగా, సామాజిక సమస్యగా గుర్తించలేదు. కానీ ప్రస్తుతం వరకట్నం అరాచకమైన ప్రభావాన్ని ప్రదర్శించడంతో దురాచారంగా, ముఖ్యమైన సామాజిక సమస్యగా మారింది.

నాలుగు సమస్యల్లో మూడు అంశాలు: ప్రపంచవ్యాప్తంగా అన్ని  సమాజాల్లో, అన్ని కాలాల్లో యుద్ధం, నేరం, నిరుద్యోగం, పేదరికం అనే సామాజిక సమస్యలు కనిపిస్తున్నాయి. అవి మూడు అంశాలను వ్యక్తీకరిస్తున్నాయి. అవి - 1) సామాజిక సమస్య ఏర్పడినప్పుడు దాని నిర్మూలనకు పరిస్థితులను మార్చాలి. 2) అప్పటికీ నెలకొన్న సామాజిక క్రమతను ఆ సామాజిక సమస్య నివారణకు దోహదపడే విధంగా మార్పు చేయాలి. 3) సామాజిక సమస్యగా గుర్తించిన స్థితి అనంగీకారమైనప్పటికీ ఆ పరిస్థితి నెలకొనడం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితులను గమనించినప్పుడు ఏదో ఒకటి చేయాలని, ఆ పరిస్థితిని తొలగించాలని కోరుకోవడం సహజం.

సామాజిక సమస్యలు - అధ్యయనం:

భారతదేశంలో ఇటీవల కాలం వరకు సామాజిక సమస్యలపై అధ్యయనం ప్రారంభం కాలేదు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.  1) భారత సమాజంలో సమాజశాస్త్ర బోధన చాలా ఆలస్యంగా మొదలైంది. ప్రప్రథమంగా సమాజ శాస్త్రాన్ని 1919లో బాంబే విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టారు. డిగ్రీ స్థాయిలో బోధనా పాఠ్యాంశంగా 1936లో చేర్చారు.  2) భారత సమాజంలో అధిక శాతం పేదరికాన్ని అనుభవించడంతో మేధావుల అధ్యయనం ఆర్థిక సమస్యలకు మాత్రమే పరిమితమైంది. సామాజిక సమస్యలపై దృషి పెట్టలేదు. 3) మహాత్మా గాంధీ తదితర నాయకులు మద్యపానం, కులతత్వం, స్త్రీ స్థితిగతులు లాంటి సామాజిక సమస్యలను వెలుగులోకి తెచ్చినప్పటికీ బ్రిటిష్‌ ప్రభుత్వం వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయలేదు. 4) ప్రపంచంలోని ఇతర సమాజాల్లో పారిశ్రామికీకరణ, నగరీకరణ ప్రక్రియలు జరగడంతో వివిధ సామాజిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ సమాజాల్లో సామాజిక సమస్యల అధ్యయనం ప్రారంభమైంది. కానీ భారత సమాజంలో ఆ రెండు ప్రక్రియలు ఆలస్యంగా, నిదానంగా సంభవించడంతో ఇతర దేశాల సమాజాల సామాజిక సమస్యల అధ్యయనాలకు ఇక్కడ అంత ప్రాధాన్యం లభించలేదు.  5) సంక్షేమ రాజ్యం అనే భావన పాశ్చాత్య దేశాల్లో ఏర్పడటం వల్ల వారు సామాజిక సమస్యల పరిష్కారాలను ఆలోచించడం మొదలుపెట్టారు. ఆనాడు భారత సమాజాన్ని పరిపాలించిన బ్రిటిష్‌ ప్రభుత్వం ఆ భావనను అంగీకరించకపోవడంతో ఇక్కడ సామాజిక సమస్యల అధ్యయనం మొదలు కాలేదు. 6) భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సంక్షేమరాజ్య భావనను అంగీకరించినప్పటికీ ప్రభుత్వం సామాజిక సమస్యలపై వెంటనే దృష్టి సారించలేకపోయింది. 7) 1954లో కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు స్థాపించిన తర్వాత సామాజిక సమస్యల అధ్యయనం ప్రారంభమైంది. 1950లో   ప్రణాళికా సంఘం ఏర్పాటైంది.

ఈ కారణాలతో భారత సమాజంలో సామాజిక సమస్యల అధ్యయనం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. కానీ ప్రస్తుతం పరిష్కారాల కోసం విస్తృత ప్రయత్నాలు సాగుతున్నాయి. 

ముగింపు: సామాజిక సమస్యలు సమాజానికి సవాలు లాంటివి. వీటిని ఎప్పటికప్పుడు ఏకాగ్రతతో ఎదుర్కొంటూ పరిష్కరించుకోవాలి.


సామాజిక సమస్యలు కారణాలు

సామాజిక సమస్యలు ఏదో ఒక కారణం వల్ల లేదా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఏర్పడ్డాయని చెప్పడం సరికాదు. ప్రతి సమస్య కొన్ని విభిన్న కారణాల ఆధారంగా ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో అన్ని కారణాలనూ వివరించలేకపోవచ్చు. ఉదాహరణకు ఆధునిక నేర శాస్త్ర పితామహుడు (లాంబ్రోసో) వ్యక్తుల్లో నేర స్వభావాన్ని జైవిక ప్రాతిపదిక ఆధారంగా వివరించారు. ఈ భావనను కొందరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, సమాజ శాస్త్రవేత్తలు అంగీకరించలేదు. నేర స్వభావానికి కొందరు మానసిక కారణాలను, మరికొందరు ఆర్థిక కారణాలను, ఇంకొందరు భౌగోళిక  కారణాలను ప్రాతిపదికలుగా చెప్పారు.

మరికొన్ని కారణాలు: భారత సమాజంలో కొన్ని సమస్యలను ముఖ్యమైన సామాజిక సమస్యలుగా పరిగణించి, వాటి నిర్మూలన కోసం పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారు. అవి: అంటరానితనం - వరకట్నం - పేదరికం - నిరుద్యోగం - భిక్షాటన - నేరం - బాలల నేరాలు - వ్యభిచారం - మద్యపానం; కుల, మత ఘర్షణలు.


సామాజిక సమస్యలు - రకాలు

సామాజిక సమస్యలను సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి కొందరు సమాజ శాస్త్రవేత్తలు వాటిని వర్గీకరించారు. హరాల్డ్‌ ఎ.ఫెల్ప్స్‌ ప్రకారం ఇవి నాలుగు రకాలు.

1) ఆర్థికపరమైన సామాజిక సమస్యలు: పేదరికం, నిరుద్యోగం, ఆధారపడి జీవించడం లాంటి వాటిని ఇందులో చేర్చారు.

2) జైవికపరమైన సామాజిక సమస్యలు: వ్యాధులు, ఇతర జైవిక లోపాలు మొదలైనవి.

3) మానసికపరమైన సామాజిక సమస్యలు: మానసిక అవలక్షణం, బలహీనమైన మనసు, ఆత్మహత్య, మద్యపానం.

4) సంస్కృతిపరమైన సామాజిక సమస్యలు: సంస్కృతిపరంగా ఏర్పడుతూ ఉండే వృద్ధాప్యం, గృహకొరత, వితంతువులు, విడాకులు, అక్రమ సంతానం, నేరం, బాలల నేరాలు లాంటివి.

ఈ సామాజిక సమస్యల వర్గీకరణం లోపభూయిష్టంగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు పేదరిక సమస్యను ఆర్థికపరమైన సమస్యగా వర్గీకరించారు. కానీ కొందరు వ్యక్తులకు వ్యాధుల కారణంగా  పేదరికపు సమస్య ఏర్పడవచ్చు. ఈవిధంగా చూస్తే పేదరికం జైవికపరమైన సమస్యగా ఉంది. ఇదే పేదరికం సమర్థ శిక్షణ కొరత వల్ల కూడా ఏర్పడుతుంది. ఆ కోణంలో చూస్తే ఇది సంస్కృతిపరమైన సమస్యగా ఉంటుంది. అందువల్ల ఏ సామాజిక సమస్య కూడా నిర్దిష్ట తరగతికి చెందుతుందని చెప్పడం సమంజసం కాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని