National Income: వస్తు, సేవల ద్రవ్యరూప విలువే.. జాతీయాదాయం!

ఒక దేశంలోని ప్రజలు ఆ దేశంలో లభించే వివిధ వనరులను ఉపయోగించుకుని వస్తు,సేవల ఉత్పత్తిని పెంచుకోవడాన్నిఆర్థికాభివృద్ధిగా పరిగణిస్తారు.

Updated : 27 Jun 2024 00:32 IST

ఏపీపీఎస్సీ,ఇతర పోటీపరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ
జాతీయాదాయం

ఒక దేశంలోని ప్రజలు ఆ దేశంలో లభించే వివిధ వనరులను ఉపయోగించుకుని వస్తు,సేవల ఉత్పత్తిని పెంచుకోవడాన్నిఆర్థికాభివృద్ధిగా పరిగణిస్తారు. ఈ వస్తు, సేవలకు ద్రవ్యరూపంలో విలువకడితే అది జాతీయాదాయం అవుతుంది.ఆర్థిక వ్యవస్థలో జరిగే ఆర్థిక కార్యకలాపాలవల్ల వస్తు, సేవల ఉత్పత్తి పెరిగితేఆ దేశ  ఆదాయం పెరుగుతుంది. జాతీయాదాయంలో పెరుగుదల అనేదిఆర్థికాభివృద్ధితో ముడిపడి ఉంటుంది.

న దేశంలో ప్రణాళికా కాలం మొదలైనప్పటి నుంచి జాతీయాదాయ కూర్పులో నిర్మాణపరమైన మార్పుల వల్ల ఆర్థికవృద్ధి సాధ్యమైంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు రెండింటి సమాహారమే జాతీయాదాయం. 1951 కంటే ముందు ప్రభుత్వరంగ వాటా స్వల్పంగా ఉండేది. ప్రణాళికీకరణ ప్రారంభమయ్యాక జాతీయాదాయంలో ప్రభుత్వరంగ వాటా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం భారతదేశ నికర దేశీయోత్పత్తిలో (ఎన్‌డీపీ) సేవల రంగానికి అధిక ప్రాధాన్యం లభిస్తోంది. ఆర్థిక వ్యవస్థ ఏ మార్గంలో పయనిస్తోంది? ఏ రంగం పాత్ర ఎంత ఉంది? వివిధ వర్గాల ప్రజల మధ్య ఆదాయ వ్యత్యాసాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి జాతీయాదాయ అంచనాలు ఉపయోగపడతాయి.

మన దేశంలో ప్రణాళికా కాలం మొదలైనప్పటి నుంచి జాతీయాదాయ కూర్పులో నిర్మాణపరమైన మార్పుల వల్ల ఆర్థికవృద్ధి సాధ్యమైంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు రెండింటి సమాహారమే జాతీయాదాయం. 1951 కంటే ముందు ప్రభుత్వరంగ వాటా స్వల్పంగా ఉండేది. ప్రణాళికీకరణ ప్రారంభమయ్యాక జాతీయాదాయంలో ప్రభుత్వరంగ వాటా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం భారతదేశ నికర దేశీయోత్పత్తిలో (ఎన్‌డీపీ) సేవల రంగానికి అధిక ప్రాధాన్యం లభిస్తోంది. ఆర్థిక వ్యవస్థ ఏ మార్గంలో పయనిస్తోంది? ఏ రంగం పాత్ర ఎంత ఉంది? వివిధ వర్గాల ప్రజల మధ్య ఆదాయ వ్యత్యాసాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి జాతీయాదాయ అంచనాలు ఉపయోగపడతాయి.

నిర్వచనాలు - వివిధ ఆర్థికవేత్తల అభిప్రాయాలు

భారత జాతీయాదాయ కమిటీ (1951):

ఒక దేశంలో ఏడాది కాలంలో తయారైన మొత్తం వస్తు, సేవల అంతిమ నికర విలువను జాతీయాదాయం అంటారు.

జె.ఆర్‌.హిక్స్‌:

జాతీయాదాయ విలువ ఒక సమాజంలోని నికర సాంఘిక ఉత్పత్తి. సరిగ్గా ఆ సమాజంలో ఉన్న వ్యక్తుల మొత్తం ఆదాయానికి సమానంగా ఉంటుంది. ఈ భావనను అనుసరించి జాతీయాదాయం, జాతీయ ఉత్పత్తికి సమానం.

ఎ.సి.పిగూ:

ఒక సమాజంలోని వ్యక్తులు లేదా కుటుంబాలు ఏటా ద్రవ్యరూపంలో అంచనా వేసే స్వదేశీ, విదేశాల నుంచి పొందేదే జాతీయాదాయం

  • జాతీయాదాయాన్ని కింది అంశాల ద్రవ్యశీలతగా పేర్కొనవచ్చు. అవి:
  • అన్ని వస్తు, సేవల నికర విలువ
  • ఒక ఏడాదికి సంబంధించిన గణాంకాలు
  • తరుగుదల, అరుగుదలను అనుమతించిన తర్వాత విలువలు 
  • ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లోని వస్తు, సేవలు
  • వినియోగ, మూలధన వస్తువుల విలువ
  • అంతర్జాతీయ లావాదేవీల నికర విలువ
  • ఏ అంశాన్ని అయినా రెండుసార్లు లెక్కించకూడదు

జాతీయాదాయాన్ని నిర్ణయించే అంశాలు

ఒక దేశ జాతీయాదాయం కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:

  • సహజ వనరులు (ఉదా: భూమి, గాలి, నీరు, నేల, ఖనిజాలు తదితరాలు)
  • ఉత్పత్తి కారకాల లభ్యత, నాణ్యత (భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన)
  • సాంకేతిక విజ్ఞానం, ప్రగతి
  • రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం.

జాతీయాదాయ భాగాలు

జాతీయాదాయంలో నాలుగు భాగాలు ఉంటాయి. అవి:

  • వినియోగం (Consumption - C)
  • స్థూల దేశీయ పెట్టుబడి (Investment - I)
  • ప్రభుత్వ వ్యయం (Government Expenditure - G)
  • నికర విదేశీ ఆదాయం (Net Foreign Income from Abroad - NFIA)

వినియోగం: మానవుడి కోరికలను ప్రత్యక్షంగా సంతృప్తిపరిచే వస్తు, సేవలపై కుటుంబం (గృహరంగం) చేసే మొత్తం ఖర్చు లేదా ఒక దేశంలోని వ్యక్తులు వివిధ వస్తు, సేవలపై చేసే వ్యయాన్ని ఇది తెలుపుతుంది.

పెట్టుబడి: ప్రస్తుత వినియోగానికి వీలుకాని వస్తువులను, సేవలను ఉత్పత్తి చేయడానికి ఉత్పాదక లేదా మూలధన వస్తువులపై సంస్థలు చేసే ఖర్చును పెట్టుబడి అంటారు. దీంతో భవిష్యత్‌లో వినియోగ వస్తువుల ఉత్పత్తికి తోడ్పడే మూలధన వస్తువులు, అంటే యంత్రాలు, యంత్ర పరికరాలు, కర్మాగారాలు, రోడ్లు, వంతెనలు మొదలైన వాటిపై సంస్థలు చేసే ఖర్చు కలిసి ఉంటుంది. దీన్ని స్థిర పెట్టుబడి అంటారు.

ప్రభుత్వ వ్యయం: ప్రభుత్వం సమాజ సంక్షేమం కోసం వస్తు, సేవలను ఉత్పత్తి చేస్తుంది. మౌలిక వసతులైన రోడ్లు, విద్య, వైద్యం లాంటి వాటికి ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చును ప్రభుత్వ వ్యయం అంటారు. 

నికర విదేశీ ఆదాయం: అంతర్జాతీయ వ్యాపారం ద్వారా ఒక దేశం పొందిన ఆదాయమే నికర విదేశీ ఆదాయం. ప్రతి దేశం తాను ఉత్పత్తి చేసిన వస్తువుల్లో కొంత పరిమాణాన్ని ఎగుమతి చేస్తుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల ఒక దేశ జాతీయాదాయ గణనలో ఎగుమతులు - దిగుమతుల విలువల మధ్య వ్యత్యాసాన్ని పరిగణించాల్సి ఉంటుంది. విదేశీ వ్యాపారం వల్ల ఏర్పడిన మిగులును స్థూల జాతీయోత్పత్తికి కలుపుతారు. లోటు ఉంటే జాతీయాదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయాలి. ఈ తేడాలను నికర ఎగుమతులు అంటారు. నికర విదేశీ ఆదాయం ప్రభుత్వ ఎగుమతి - దిగుమతి విధానం, స్వదేశీ, అంతర్జాతీయ మార్కెట్‌లో సాపేక్ష ధరల స్థాయిపై ఆధారపడి ఉంటుంది.

Y = C + I + G + (X - M)

జె.ఎం.కీన్స్‌

ఈయన ఆదాయ, ఉద్యోగ సమష్టి భావనల ఆధారంగా జాతీయాదాయాన్ని నిర్వచించారు. 1936లో తాను ప్రచురించిన ది జనరల్‌ థియరీ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్, ఇంట్రస్ట్‌ అండ్‌ మనీ అనే పుస్తకంలో జాతీయాదాయానికి సంబంధించిన మూడు భావనలను కీన్స్‌ పేర్కొన్నారు. అవి:

1) సమష్టి వ్యయం (వినియోగం, పెట్టుబడి వస్తువులు)

2) ఉత్పత్తి కారకాలు (భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన) ఆదాయం (భాటకం, వేతనం, వడ్డీ, లాభం)

3) వస్తు అమ్మకాల రాబడి నుంచి వ్యయాల మినహాయింపు

  • జె.ఎం.కీన్స్‌ మొత్తం జాతీయాదాయం నుంచి తరుగుదల, పునఃస్థాపిత వ్యయాన్ని మినహాయించకుండా కేవలం ఉపయోగిత వ్యయాన్ని మాత్రమే మినహాయించి ఈ భావనను అభివృద్ధి చేశారు.
  • కీన్స్‌ అభిప్రాయం ప్రకారం సమష్టి అమ్మకాల రాబడి నుంచి సమష్టి ఉపయోగిత వ్యయాన్ని మినహాయించడం ద్వారా జాతీయాదాయాన్ని లెక్కించవచ్చు. 

జాతీయాదాయ అంచనాల ప్రాధాన్యత

ఒక దేశ ఆర్థిక విధానాలు, ఆర్థిక ప్రణాళికల రూపకల్పనకు, బడ్జెట్‌లో వివిధ రంగాలకు సంబంధించిన కేటాయింపులకు జాతీయాదాయ అంచనాలు తోడ్పడతాయి. ఆర్థిక వ్యవస్థలో జరిగే మార్పులను గుర్తించవచ్చు. ఈ అంచనాల సాయంతో కింది అంశాల గురించి తెలుసుకోవచ్చు.

  • ఆర్థిక వ్యవస్థ పనితీరు 
  • ప్రజల జీవన ప్రమాణ స్థాయి  
  • ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల పాత్ర
  • వివిధ వర్గాల మధ్య ఆదాయ పంపిణీ
  • వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య పోలిక  
  • ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల పాత్ర 
  • దేశంలో ఉన్న సహజ వనరుల వినియోగ స్థాయి 

ఆర్థిక వ్యవస్థ పనితీరు: జాతీయాదాయ అంచనాలు దేశ ఆర్థిక పురోగమనానికి సూచిక. వరుసగా కొన్నేళ్లపాటు జాతీయాదాయ గణాంకాలను పరిశీలిస్తే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందో, క్షీణిస్తుందో లేదా నిలకడగా ఉందో తెలుస్తుంది. ఆర్థిక వృద్ధి రేటును లెక్కించేందుకు, ఆర్థిక వ్యవస్థలోని మార్పులను తెలుసుకోవడానికి జాతీయాదాయ గణన ఉపయోగపడుతుంది.

ప్రజల జీవన ప్రమాణ స్థాయిని కనుక్కోవడం: జాతీయాదాయ అంచనాల్లో భాగంగా తలసరి ఆదాయం, తలసరి వినియోగాన్ని తెలుసుకోవచ్చు. ఇవి ప్రజల జీవన ప్రమాణ స్థాయిని సూచిస్తాయి. వీటిలో మార్పును బట్టి దేశంలోని ప్రజల జీవన ప్రమాణ స్థాయి గతం కంటే మెరుగ్గా ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. 

ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల పాత్ర: జాతీయాదాయంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల వాటా ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. భారతదేశంలోని నికర దేశీయోత్పత్తిలో సేవల రంగం మూడింట ఒకటో వంతు వాటాను మాత్రమే కలిగి ఉండేది. దేశీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా గణనీయంగా తగ్గింది.

ఆల్ఫ్రెడ్‌ మార్షల్‌:

ఒక దేశంలో ఒక ఏడాదిలో శ్రమ, మూలధనం, సహజ వనరుల సహాయంతో ఉత్పత్తి చేసే వస్తు, సేవల నికర విలువే జాతీయాదాయం.

సైమన్‌ కుజ్నెట్స్‌:

ఒక ఏడాదిలో ఒక దేశ ఆర్థిక ఉత్పత్తి ప్రక్రియలో ఏర్పడిన నికర వస్తు, సేవలు అంతిమంగా వినియోగదారుల మధ్య మారకం చెందే మొత్తమే జాతీయాదాయం.

ఫిషర్‌:

ఒక ఏడాదిలో ఉత్పత్తి చేసిన ఒక పియానో లేదా ఓవర్‌కోటు ఆ ఏడాది మూలధనంలో అదనంగా కలిసే మొత్తం మాత్రమే. కాగా ఆ ఏడాది నుంచి ప్రతి ఏడాది వాటిని లేదా దాన్ని వినియోగించడం ద్వారా వినియోగదారుడు అంతిమంగా పొందే ప్రయోజన విలువను మాత్రమే జాతీయాదాయ లెక్కింపులో కలపాలి. 

ఫిషర్‌ జాతీయాదాయ లెక్కింపులో ఉత్పత్తిని కాకుండా వస్తు వినియోగం ద్వారా వినియోగదారు పొందే ఆర్థిక సంక్షేమాన్ని పరిగణించారు. అంటే వినియోగ భావనను అనుసరించి నిర్వచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని