Cloud computing: క్లౌడ్‌ కోటలో పాగా వేద్దాం!

టెక్నాలజీ ఉన్నచోటే ఎప్పుడూ ఉండదు. అవసరాల రీత్యా ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటుంది. అలా దూసుకు వచ్చిందే... క్లౌడ్‌ కంప్యూటింగ్‌. ఈ నవీన సాంకేతికత అపార అవకాశాలతో పురోగమిస్తోంది. వాటిని అందుకోవడానికి కావలసిందల్లా అవగాహన, సాధన, సంకల్పం.

Updated : 25 Jun 2024 00:13 IST

జాబ్‌ స్కిల్స్‌- 2024

టెక్నాలజీ ఉన్నచోటే ఎప్పుడూ ఉండదు. అవసరాల రీత్యా ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటుంది. అలా దూసుకు వచ్చిందే... క్లౌడ్‌ కంప్యూటింగ్‌. ఈ నవీన సాంకేతికత అపార అవకాశాలతో పురోగమిస్తోంది. వాటిని అందుకోవడానికి కావలసిందల్లా అవగాహన, సాధన, సంకల్పం. ఈ మూడూ తోడుంటే కోరుకున్న కెరియర్‌ మీదే!

క్ష్యం గురించి తెలుసుకోవడం వేరు. లక్ష్య సాధనకు అనుగుణంగా మసలుకోవడం వేరు. గమ్యాన్ని చేరుకునేందుకు కావలసిన అస్త్రాలు సమకూర్చుకోవడం వేరు. గగనయానం చేసే మేఘం మనోహరంగా ఉంటుంది. అల్లంత దూరాన కనిపించే మేఘాన్ని అందుకోవాలన్నది బాల్య స్మృతి అయితే క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కోటలో పాగా వేయాలన్నది నేటి యువత కెరియర్‌ లక్ష్యం.  

ఆగమేఘాలపై పరుగుపెడితే మేఘం సొంతం కాదు. క్షణాల్లో ఆకృతి దాల్చి... లిప్తపాటు కాలంలో వర్షించి అదృశ్యమయ్యే మేఘాన్ని తాకాలంటే ఎంతగా తపన ఉన్నా అందుకు కఠోర దీక్ష ఉండాలి. నేటి యువత కలల ప్రపంచం క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కెరియర్లో కాలు పెట్టాలంటే అది దుస్సాహసం కాదు. కానీ తగిన వ్యూహం ఉండాలి. పటిష్ఠ ప్రణాళిక ఏర్పర్చుకుని లక్ష్యం నెరవేర్చుకోవాలి. 

భారీ డేటాను పదిలపరచే పెద్ద సర్వర్లతో సహా అప్లికేషన్లు, నెట్‌వర్క్‌లు, డేటా, అనలిటిక్స్‌ను ఇంటర్నెట్‌ ప్రపంచంలో వర్చువల్‌గా నిర్వహించగలగడమే క్లౌడ్‌ కంప్యూటింగ్‌. పెద్దపెద్ద కంపెనీలు ఉన్నతస్థాయిలో తమ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించేందుకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఆస్కారం ఇస్తోంది. అందుకే ఈ టెక్నాలజీ వినియోగం రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌), గూగుల్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌ (జీసీపీ), మైక్రోసాఫ్ట్‌ అజర్‌ వంటి క్లౌడ్‌ సర్వీసులు లక్షలాది వినియోగదారులతో వృద్ధి పథంలో దూసుకెళుతున్నాయి. ఇవి కాక ద్వితీయశ్రేణి, చిన్నస్థాయి క్లౌడ్‌ సేవా సంస్థలు ఎటువంటి ఢోకా లేకుండా ముందుకెళుతుండటంతో ఈ రంగంలో యువతకు అపార ఉద్యోగావకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి.


అదనంగా ఆదుకునే మూడు లక్షణాలు

సమాచారం: క్లౌడ్‌ కంపూటింగ్‌ సాంకేతిక రంగంలోకి ప్రవేశించాలనుకునేవారికి ఈ నూతన క్షేత్రంపై తగిన అవగాహన ఉండాలి. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ శక్తి సామర్థ్యాలు, విస్తరిస్తున్న వేగం, ఈ రంగంలో నిక్షిప్తమైన వాణిజ్య అవకాశాలు, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ పరిమితులను తెలుసుకొని ఎంపిక సమయంలో ఏదో ఒక దశలో వ్యక్తీకరించగలగాలి.

సృజనాత్మకత: మూస పనులను ఆటోమేషన్‌ చట్రంలోకి తీసుకెళ్లి సృజనాత్మక పని వాతావరణంలో ఉద్యోగుల నుంచి నాణ్యమైన సేవలను సంస్థలు ఆశిస్తున్నాయి. అటువంటి అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. క్లౌడ్‌ వ్యవస్థను అర్థం చేసుకున్న ఉద్యోగార్థి దాని పరిమితులపై అవగాహనతో తనదైన ఆలోచనా సరళితో వాటిని అధిగమించే మార్గాలు సూచించగలిగితే కంపెనీల ప్రతినిధులు ప్రసన్నులవుతారు. అభ్యర్థిలోని సృజనాత్మక ఆలోచనా సరళి కంపెనీకి ఉపకరిస్తుందన్న నమ్మకం ఇంటర్వ్యూయర్‌కు ఏర్పడితే క్లౌడ్‌ ప్రపంచంలోకి పాదం మోపే అవకాశం చిక్కినట్టే.

సంకల్పం: దృఢ సంకల్పం లేనివారు ఎన్ని వాగ్దానాలు చేసినా వ్యర్థమే. ఉద్యోగార్థిలోని పట్టుదల, దీక్ష ఏదైనా సాధించాలన్న కాంక్ష చొరవ కంపెనీ ప్రతినిధులను ఆకట్టుకుంటాయి. వ్యక్తిగత జీవితం పట్ల ఒక దృక్పథం, ఉద్యోగ జీవితం పట్ల నిబద్ధత గల యువతీ యువకులను ఎంపిక సమయంలో ఇట్టే గుర్తించి తమ కంపెనీలోకి సాదరంగా ఆహ్వానిస్తారు.


ఏడు దారులు

కంటికి కనిపించని మాయాజాలం వంటి క్లౌడ్‌ కోటలో పాగా వేయాలంటే ఏడు మార్గాలున్నాయి. విద్యాపరమైన డిగ్రీలు, సర్టిఫికెట్లు, తగిన అనుభవం ఆధారంగా ఈ కెరియర్‌ ప్రారంభించవచ్చు. 

1 కంప్యూటర్‌ సైన్స్‌: క్లౌడ్‌ కార్యకలాపాలన్నీ నిత్యం వివిధ అప్లికేషన్లలో ఓలలాడటం, విభిన్న నెట్‌వర్క్‌లను మచ్చిక చేసుకోవడం చుట్టూ తిరుగుతుంటాయి కాబట్టి ప్రాథమికంగా కంప్యూటర్‌ సైన్స్‌తో డిగ్రీ చేసివుంటే మంచిది. ఇప్పుడిప్పుడే డిగ్రీ వైపు కదులుతున్న విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌ డిగ్రీ చేయవచ్చు. ఆపై క్లౌడ్‌ లోకంలోకి కాలుపెట్టడం సులభమవుతుంది. ఆ దశ దాటిపోయి ఇప్పటికిప్పుడు డిగ్రీ చేసే అవకాశం లేని విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇతర మార్గాల ద్వారా క్లౌడ్‌ నైపుణ్యాలు అలవర్చుకొని అలవోకగా ప్రవేశించవచ్చు. ప్రస్తుతం క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో ఉన్నవారిలో 11 శాతం మందికి మాత్రమే ఈ టెక్నాలజీతో నేరుగా సంబంధమున్న డిగ్రీ ఉంది. మిగతా 89 శాతం మంది నిపుణులు వేర్వేరు దారుల ద్వారా క్లౌడ్‌ సామర్థ్యాలతో రాణిస్తున్నవారే. ఆశ్చర్యకరమైన విషయమేమంటే వీరిలో 6 శాతం మంది కేవలం హైస్కూల్‌ స్థాయి డిప్లొమాతో క్లౌడ్‌ కెరియర్‌ ప్రారంభించి సమర్థంగా సేవలందిస్తున్నారు.

2 నైపుణ్యాలు: కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ ఉన్నా లేకపోయినా అవసరమైనవి క్లౌడ్‌ నైపుణ్యాలు. పైతాన్, జావా స్క్రిప్ట్‌ వంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లపై పట్టు ఉండాలి. క్లౌడ్‌ వ్యవస్థపై అవగాహన కోసం ఏడబ్ల్యూఎస్, జీసీపీ, మైక్రోసాఫ్ట్‌ అజర్‌ వంటి వాటిలో ఏదైనా ఒక కోర్సు చేసుండాలి. వీటితోపాటు డేటా బేస్‌ నిర్వహణా నైపుణ్యాలు అనివార్యం. లైనెక్స్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలపై కనీస అవగాహన అవసరం. అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేజ్‌ (ఏపీఐ)తో పరిచయం ఉంటే కెరియర్‌కు పోటీపడవచ్చు. నాలుగేళ్ల కంప్యూటర్‌ సైన్స్‌ డిగ్రీ చేయపోయినా క్లౌడ్‌ టెక్నాలజీకి అవసరమైన ఈ నైపుణ్యాలు నేర్చుకుంటే దరఖాస్తుకు అర్హత సాధించినట్టే.

3 సర్టిఫికేషన్‌: క్లౌడ్‌ వ్యవస్థలో సంచరించేందుకు అవసరమైన నైపుణ్యాలు ఇచ్చే ఏదైనా ఒక సర్టిఫికెట్‌ కోర్సు చేసినా ఈ కెరియర్లో ప్రవేశించవచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌ వంటి డిగ్రీ లేకపోయినా సిస్కో సర్టిఫైడ్‌ నెట్‌వర్క్‌ అసోసియేట్‌ వంటి కోర్సు చేసి ఐటీ ప్రాఫెషనల్‌ అవుతున్నవారు కోకొల్లలు. ఏదైనా ప్రాథమిక సర్టిఫికెట్‌ కోర్సుతో క్లౌడ్‌ ప్రపంచంలోకి ప్రవేశించిన ఉద్యోగి కొంత అనుభవం గడించాక తన నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు ఏడబ్ల్యూఎస్, జీసీపీ, మైక్రోసాఫ్ట్‌ అజర్‌ సంస్థలు ఉన్నతస్థాయి కోర్సులు ఆఫర్‌ చేస్తున్నాయి. క్లౌడ్‌ వ్యవస్థను నిర్వహించే కీలకమైన కాన్సెప్టులు, సొల్యూషన్స్, వివిధ టూల్స్, ప్రైవసీ విధానాలను ఈ ఉన్నతనస్థాయి సర్టిఫికేషన్‌ ద్వారా నేర్చుకొని కెరియర్లో ముందుకు వెళ్లవచ్చు. 

4 సాంత ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌: నీటిలో ఈదడం ఎలాగో తెలియడం కాదు, నీటిలో దూకి ఈదగలగాలి. విమాన పైలట్‌ ఏం చేస్తాడో తెలిసి ఉండటం కాదు. పైలట్‌ కావాలంటే కాక్‌పిట్‌లో కూర్చుని ఒత్తిడి వాతావరణంలో విమానాన్ని నడపగలగాలి. అలాగే, క్లౌడ్‌ డిగ్రీలు, సర్టిఫికేషన్‌ పత్రాలు ఎన్ని ఉన్నా ఉద్యోగ సాధనకు ఇవి ఎంట్రీ మాత్రమే. నిజంగా కావలసింది - క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో ఎంతటి నైపుణ్యం సముపార్జించామన్నదే. ఇందుకు తగిన మార్గం ఫ్రెషర్స్‌కు ప్రాజెక్ట్‌ వర్క్‌. ఏరికోరి క్లౌడ్‌ సంబంధిత ప్రాజెక్టును ఎంపిక చేసుకొని వర్క్‌ చేయడం మొదటి మెట్టు. ఆపై ఆన్‌లైన్‌లో నిరంతరం అన్వేషిస్తూ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అనుభవం మిగిల్చే ఇంటర్న్‌షిప్‌ అవకాశాన్ని చేజిక్కించుకోవాలి. ఒకటి, రెండు అవకాశాలు విఫలమైనా పట్టుదలతో ప్రయత్నం చేస్తే అనుకున్న ఫలితం సాధించవచ్చు. 

ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణ పేరిట ఊరికే కాలక్షేపం చేయకుండా ప్రాజెక్టు వర్క్, ఇంటర్న్‌షిప్‌ స్వల్పకాల అనుభవం ఆధారంగా ఆన్‌లై న్‌లో ఫ్రీలాన్స్‌ వర్క్‌ కోసం ప్రయత్నిస్తుండాలి. అలాంటి అవకాశం ఇచ్చేది స్టార్టప్‌ అయినా, పారితోషికం ఎంతైనా ముందడుగు వేయాలి. పని అనుభవం సంపాదించాలి.

5 క్లౌడ్‌ పోర్ట్‌ఫోలియో: ఇప్పుడిక పోర్ట్‌ఫోలియో తయారు చేసుకునేందుకు తగిన నేపథ్యం మీకు సమకూరినట్టే. ప్రాజెక్టు వర్క్‌ ఇంటర్న్‌షిప్, ఫ్రీలాన్స్‌ వర్కులన్నింటిలోనూ ఉమ్మడిగా ఉన్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌ నైపుణ్యాన్ని ఫోకస్‌ చేస్తూ బేసిక్‌ డిగ్రీ/ సర్టిఫికేషన్‌ను జోడిస్తూ బలమైన పోర్టు ఫోలియో రూపొందించుకోవాలి. క్లౌడ్‌ ప్రపంచంలోకి సులువుగా మిమ్మల్ని తీసుకెళ్లే వాహనం ఇదే.

6 నెట్‌వర్క్‌: వాహనం సిద్ధంగా ఉంటే సరిపోదు. దరికి చేర్చే దారులు ఉండాలి. అదే నెట్‌వర్క్‌. పరిచితుల అల్లిక. లింక్డ్‌ ఇన్‌లోనో, కంపెనీ ప్లేస్‌మెంట్‌ పేజీలోనో దరఖాస్తు పెట్టేసి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఉద్యోగాలు అభ్యర్థులనే వెతుక్కుంటూ వచ్చే రోజులు కావివి. హైరింగ్‌ మేనేజర్లు, సీనియర్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌తో అనుసంధానమయ్యే మార్గాలు చూసుకోవాలి. టెక్‌ మీట్స్, టెక్‌ ఫెస్ట్‌ వంటి వాటిల్లో పాల్గొనేందుకు ప్రయత్నించాలి. కాలేజీలో సీనియర్లు ఎవరెవరెవరు ఎక్కడెక్కడ ప్లేస్‌ అయ్యారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సోషల్‌ మీడియా ద్వారా టచ్‌లో ఉండటం వల్ల వారి రిఫరెన్స్‌ కోసం అడిగే చనువు ఏర్పడుతుంది. అభ్యర్థి నెట్‌వర్కింగ్‌ ఎంత విస్తృతంగా, ఎంత పటిష్ఠంగా ఉంటే అంత త్వరగా ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు.

7 తుది ఎంపిక: పటిష్ఠమైన పోర్టుఫోలియో, నెట్‌వర్కింగ్‌ ద్వారా ఉద్యోగావకాశం వచ్చి ఎంపిక ప్రక్రియకు తెర తీసినప్పుడు... ఇదే కదా క్లౌడ్‌ ప్రపంచంలోకి అడుగిడే తరుణం! ఇక్కడే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. విద్యాపరమైన మౌలికాంశాలతో పాటు క్లౌడ్‌ ప్రపంచంలోకి ప్రవేశించేందుకు కావలసిన నైపుణ్యాలూ తనవద్ద ఉన్నాయన్న విశ్వాసాన్ని అభ్యర్థి కంపెనీ ప్రతినిధులకు కలిగించాలి. ఇతర అవకాశాలు సిద్ధంగా ఉన్నా క్లౌడ్‌ డొమైన్‌పై ప్రత్యేక ఆసక్తి ఉందనే సంగతిని అభ్యర్థి ఇంటర్వ్యూలో స్పష్టంగా వ్యక్తీకరించాలి. కంపెనీ- ఇటువంటి అభ్యర్థిని వదులుకోకూడదనే నిర్ణయానికి వచ్చేంత బలంగా ఆ ఆకాంక్ష ఉండాలి! 


సంస్థ విలువ పెంచేలా...

టెక్‌ చదువే ఉద్యోగ సాధనకు పూర్తిగా ఆలంబన కాలేదు. కంపెనీలు అభ్యర్థుల మేధాపరమైన ప్రజ్ఞ (ఐక్యూ)తో పాటు వారిలో సహజసిద్ధంగా ఇమిడిఉన్న ఉద్వేగ ప్రజ్ఞకు (ఈక్యూ) కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐక్యూ అభ్యర్థి ఎదుగుదలకు దోహదపడేదైతే ఈక్యూ కంపెనీ వృద్ధికి తోడ్పడుతుందని కంపెనీలు భావిస్తుండటమే ఇందుకు కారణం. అందుకే ఎంపిక సమయంలో తాము ఉద్యోగం ఇస్తే కేవలం అభ్యర్థులకే ఉపయోగమా? వారి వల్ల కంపెనీకి ఏమైనా విలువ పెరుగుతుందా? అన్న కోణంలోనూ పరిశీలిస్తుంటారు.

ఉద్యోగి తనకు నిర్దేశించిన పని మాత్రమే చేస్తే అది కేవలం కంపెనీ గమనానికి ఉపకరిస్తుంది. అదే ఉద్యోగి సృజనాత్మకంగా ఆలోచించి సమస్యా పరిష్కర్తగా వ్యవహరించగలిగితే అతడి సేవలు కంపెనీ విలువను పెంచుతాయి. ఇటువంటివారినే కంపెనీ ‘ప్రామిసింగ్‌ ఎంప్లాయీస్‌’గా పరిగణిస్తుంది. ఆ లక్షణాలను ఎంపిక సమయంలో గుర్తించేందుకు కంపెనీ ప్రతినిధులు ప్రయత్నిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని