Apply Now: మీ పిల్లల్ని సైనిక్‌ స్కూళ్లలో చేర్పిస్తారా? ఇదిగో సువర్ణావకాశం!

దేశంలోని సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్‌ 16లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..

Updated : 08 Nov 2023 16:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్ననాటి నుంచే దేశ రక్షణ రంగంలో పనిచేయాలని కలలుగనే విద్యార్థులకు ఇదో సువర్ణావకాశం. త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల విద్య నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వచ్చేసింది. వచ్చే విద్యా సంవత్సరం(2024-25)లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (AISSEE 2024) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహించనుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న 33 సైనిక పాఠశాలల్లో 6, 9 తరగతులకు; కేంద్ర రక్షణ శాఖ కొత్తగా ఆమోదం తెలిపిన 19 కొత్త సైనిక పాఠశాల(ఎన్జీవో/ప్రైవేటు/రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచేవి )ల్లో వచ్చే ఏడాది నుంచే ఈ పరీక్ష ద్వారా ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నారు. 

నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలివే..

  • ఆసక్తి కలిగిన విద్యార్థులు డిసెంబర్‌ 16న సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో https://aissee.ntaonline.in/ దరఖాస్తు చేసుకోవచ్చు.  ఈ స్కూళ్లన్నీ సీబీఎస్‌ఈ అనుబంధ ఇంగ్లిష్‌ మీడియం రెసిడెన్షియల్‌ పాఠశాలలే.  నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ నేవీ అకాడమీ, ఇతర శిక్షణా అకాడమీలకు ఇక్కడ క్యాడెట్లను సిద్ధం చేస్తారు.
  • ప్రవేశ పరీక్ష జనవరి 21న (ఆదివారం) నిర్వహిస్తారు. పెన్ను, పేపర్‌ (OMR షీట్‌) విధానంలోనే పరీక్ష ఉంటుంది. మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలే ఉంటాయి.
  • దేశ వ్యాప్తంగా 186 పట్టణాలు /నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు. 
  • ఆరో తరగతికి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు మార్చి 31, 2024 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. బాలికలకు ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. సీట్ల లభ్యత, వయస్సు ప్రమాణాలు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. అలాగే, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు అభ్యర్థుల వయస్సు 13 నుంచి 15 ఏళ్లు మధ్య ఉండాలి. ఎనిమిదో తరగతి పాసై ఉండాలి.
  • దరఖాస్తు రుసుం: జనరల్‌, రక్షణ రంగంలో పనిచేస్తున్నవారి పిల్లలు, ఓబీసీలు (నాన్‌ క్రిమీలేయర్‌), ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ పిల్లలకు రూ.650; ఎస్సీ/ఎస్టీలకు రూ.500ల చొప్పున నిర్ణయించారు. 
  • తెలుగు రాష్ట్రాల్లో సైనిక పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి? పరీక్ష కేంద్రాలేంటి?, పరీక్షా విధానం, సిలబస్‌, రిజర్వేషన్‌ తదితర సమగ్ర సమాచారం ఈ బుక్‌లెట్‌లో పొందొచ్చు.

బుక్‌లెట్‌ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని