SHRESHTA 2024: పేద విద్యార్థులకు వరం.. ‘శ్రేష్ఠ’మైన విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రతిభావంతులైన షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన పేద విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. శ్రేష్ఠ పథకం కింద ప్రైవేటు సీబీఎస్‌ఈ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు మొదలయ్యాయి.

Published : 13 Mar 2024 18:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతిభ ఉన్నా.. ఆర్థిక స్థోమత లేక కార్పొరేట్‌ విద్యకు దూరమవుతోన్న ఎస్సీ విద్యార్థులకు ఇదో సువర్ణావకాశం. కేంద్ర సామాజిక న్యాయం-సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ (SHRESHTA) (NETS) 2024 పథకానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులు సీబీఎస్‌ఈ (CBSE) అనుబంధ ప్రముఖ ప్రైవేటు రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం ద్వారా వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి చేయూతనందించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ శ్రేష్ఠ విద్యా పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 3వేల సీట్లను భర్తీ చేయనున్నారు. 

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

  • అర్హతలు: 2023-24 విద్యా సంవత్సరంలో ఎనిమిది, పదో తరగతి చదువుతోన్న విద్యార్థులు ఈ ఎంట్రన్స్‌ పరీక్షకు అర్హులు.  తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించరాదు.
  • దరఖాస్తులు:  మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 4 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు లేదు. ఏప్రిల్‌ 6 నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం
  • మే 24న పరీక్ష నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్‌ పరీక్ష (పెన్ను, పేపర్‌ విధానం) ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 3 గంటల పాటు ఉంటుంది.
  • మే 12 నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  • ఫలితాలు పరీక్ష జరిగిన నాలుగు లేదా ఆరు వారాల్లో ప్రకటిస్తారు. 
  • రాతపరీక్ష విధానం: ఈ పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్‌, సైన్సు, సోషల్‌సైన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌/నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగెటివ్‌ మార్కులు ఉండవు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాసే విద్యార్థులు.. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌లో ఎనిమిదో తరగతి సిలబస్‌ చదవాలి. 11వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాసే విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ పదో తరగతి సిలబస్‌ చదవాలి.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే..: ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, అమరావతి, తెలంగాణలో హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌. పూర్తి సమాచారం ఈ కింది బుక్‌లెట్‌లో చూడొచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని