UGC NET 2024: యూజీసీ నెట్‌-2024 పరీక్ష కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ

యూజీసీ నెట్‌ పరీక్ష కొత్త తేదీలను జాతీయ పరీక్ష సంస్థ (NTA) ప్రకటించింది. ఈ సారి పెన్ను పేపర్‌ విధానంలో కాకుండా కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. 

Updated : 29 Jun 2024 00:53 IST

దిల్లీ: ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన యూజీసీ నెట్‌ 2024 (UGC NET 2024) పరీక్షకు సంబంధించి కొత్త తేదీలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) ప్రకటించింది. ఆగస్టు 21, సెప్టెంబర్‌ 4 మధ్య ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఎన్టీఏ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇక సీఎస్‌ఐఆర్‌ నెట్‌ (CSIR NET) పరీక్షను జులై 25-27 మధ్య, ఎన్‌సెట్‌ (NCET) పరీక్షను జులై 10న నిర్వహించనున్నట్లు తెలిపింది. అంతకుముందు నిర్వహించిన పెన్ను, పేపర్‌కు బదులుగా ఈ సారి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆల్‌ ఇండియా ఆయుష్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ పరీక్ష (AIAPGET) 2024ను షెడ్యూల్‌ ప్రకారమే జులై 6న నిర్వహించనున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెల్లోషిప్‌కు అర్హత సాధించడానికి, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఎన్టీఏ ఈ ఏడాది నిర్వహించిన యూజీసీ నెట్‌లో అక్రమాలు జరిగాయంటూ నివేదిక రావడంతో కేంద్రం ఆ పరీక్షను రద్దు చేసింది. మొత్తం దేశవ్యాప్తంగా 317 నగరాల్లోని 1,205 సెంటర్లలో పెన్ను-పేపర్‌ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు 11 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. రెండు షిఫ్ట్‌ల్లో నిర్వహించిన పరీక్షలో అక్రమాలు జరిగాయని  కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే భారతీయ సైబర్‌ నేర విచారణ సమన్వయ కేంద్రానికి (ఐసీసీసీసీ) చెందిన జాతీయ సైబర్‌ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం యూజీసీకి నివేదిక ఇచ్చింది. దీంతో పారదర్శకత, విశ్వసనీయత కోసం ఈ పరీక్షను రద్దు చేస్తున్నామని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని