NEET PG Exam: పరీక్షకు 2 గంటల ముందే ప్రశ్నపత్రం రెడీ.. ‘నీట్‌ పీజీ’ నిర్వహణకు కీలక నిర్ణయం..!

NEET PG Exam: నీట్‌ పీజీ 2024 పరీక్షను ఈ నెలాఖరు లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ వారంలోనే షెడ్యూల్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Updated : 02 Jul 2024 16:08 IST

దిల్లీ: నీట్‌ యూజీ-2024 (NEET UG 2024) పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న వేళ నీట్‌ పీజీ 2024 (NEET PG 2024) పరీక్ష నిర్వహణను కేంద్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఈ నెలాఖరు లేదా ఆగస్టులో నీట్‌ పీజీ పరీక్ష ఉండొచ్చని తెలుస్తోంది. దీనిపై ఈ వారంలోనే రివైజ్డ్‌ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక, పరీక్షలో అక్రమాలకు తావులేకుండా ఉండేలా చివరి గంటల్లోనే ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేయాలని అధికారులు యోచిస్తున్నారట..!

జూన్‌ 23న జరగాల్సిన నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు పరీక్షకు ఒక రోజు ముందు ప్రకటించారు. రివైజ్డ్‌ షెడ్యూల్‌ను మంగళవారం (జులై 2న) ప్రకటించనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే పరీక్ష తేదీని నేడు వెల్లడించలేమని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (NBE) సీనియర్‌ అధికారి తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం తాము సిద్ధం చేసిన ప్రణాళికను కేంద్రం ఇంకా ఆమోదించలేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాతే షెడ్యూల్‌ ప్రకటిస్తామన్నారు.

ఆస్ట్రేలియా చదువులు మరింత భారం

జులై చివర్లో లేదా ఆగస్టులో పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయని ఆ అధికారి తెలిపారు. జులై 5వ తేదీలోగా షెడ్యూల్‌ను వెల్లడిస్తామన్నారు. ఇక, నీట్‌ యూజీ పేపర్‌ లీకేజ్‌ (NEET Row) వివాదం నేపథ్యంలో నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు ఎగ్జామినేషన్స్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరీక్షకు కేవలం 2 గంటల ముందు ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసి సెంటర్లకు పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన యూజీసీ నెట్‌ 2024 (UGC NET 2024) పరీక్షకు సంబంధించి కొత్త తేదీలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) ఇటీవల ప్రకటించింది. ఆగస్టు 21, సెప్టెంబర్‌ 4 మధ్య ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొంది. అంతకుముందు నిర్వహించిన పెన్ను, పేపర్‌కు బదులుగా ఈ సారి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు