Education News: బీఎస్సీ తర్వాత ఎంబీఏ?

ఈ మధ్యనే బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తిచేశాను. ఎంబీఏ చేయాలని ఉంది. బీఎస్సీ తర్వాత ఎంబీఏ చేస్తే ప్రయోజనం ఉంటుందా?

Published : 27 Jun 2024 00:07 IST

ఈ మధ్యనే బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తిచేశాను. ఎంబీఏ చేయాలని ఉంది. బీఎస్సీ తర్వాత ఎంబీఏ చేస్తే ప్రయోజనం ఉంటుందా?

టి.ఉమ

ఎంబీఏ ప్రోగ్రాం చదవడానికి అవసరమైన ప్రవేశ పరీక్షలు రాయడానికి డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివినా అర్హత ఉంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా చాలామంది గ్రాడ్యుయేట్లు డిగ్రీలో చదివిన సబ్జెక్టుల్లో కాకుండా మేనేజ్‌మెంట్‌లో పీజీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు- ఆ రంగంలో ఆసక్తి ఉండటం ఒక కారణమైతే, మేనేజ్‌మెంట్‌ చదివినవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండటం మరో కారణం. బీఎస్సీ (మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ) చదివిన కొన్ని వేలమంది ఎంబీఏ చదివి మంచి కెరియర్‌ నిర్మించుకున్నారు. అందుకని నిరభ్యంతరంగా ఎంబీఏ చేయండి. కానీ ఎంబీఏ చదివేముందు కనీసం రెండు సంవత్సరాల వృత్తి అనుభవం ఉండటం శ్రేయస్కరం.

చాలా సందర్భాల్లో విద్యార్థులు డిగ్రీ తరువాత నేరుగా ఎంబీఏ చదువుతున్నారు. దీనివల్ల పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఎలా పనిచేస్తాయో కనీస అవగాహన లేకుండానే మేనేజ్‌మెంట్‌ సూత్రాలు నేర్చుకోవడంతో ఆశించిన వృత్తి నైపుణ్యాలు పొందలేకపోతున్నారు. మీరు డిగ్రీలో చదివిన కెమిస్ట్రీకి సంబంధించి ఏదైనా ఫార్మా, కెమికల్‌ రంగంలో కనీసం రెండు సంవత్సరాలు పనిచేసి, ఆ తరువాత కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్, జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్, మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్, కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్, నార్సిమొంజి ఆప్టిట్యూడ్‌ టెస్ట్, సింబయాసిస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ లాంటి జాతీయ ప్రవేశపరీక్షలు రాసి, ప్రముఖ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో ఎంబీఏ చదివే ప్రయత్నం చేయండి. రాష్ట్ర యూనివర్సిటీల్లో, యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ చదవడానికి ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌) రాయవచ్చు. అంతర్జాతీయ బిజినెస్‌ స్కూల్స్‌లో ఎంబీఏ చేయాలంటే జీమ్యాట్‌తో పాటు టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ పరీక్షలు రాయాలి. చివరిగా- మేనేజ్‌మెంట్‌ రంగంలో రాణించాలంటే కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, బృంద నిర్మాణం, సరైన నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్థ్యం లాంటివి చాలా అవసరం. ఎంబీఏను ఒక డిగ్రీగా కాకుండా వ్యాపార సూత్రాలు, నైపుణ్యాలు, మెలకువలు నేర్చుకొనే అవకాశంగా భావిస్తూ చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని