Job Notification: బ్యాంకు కొలువు.. ఇలా సులువు!

దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లర్కు ఉద్యోగాల నియామకానికి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీని ద్వారా మొత్తం 6128 ఖాళీలు భర్తీ అవనున్నాయి. రెండు దశల్లో ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు రెండో దశలోని మెయిన్స్‌ పరీక్ష రాయాలి. మెయిన్స్‌ మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఈ కొలువు సాధనకు పరీక్షలో ఏయే మెలకువలు పాటించాలో తెలుసుకుందామా? 

Updated : 03 Jul 2024 09:20 IST

6128 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ ప్రకటన

దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లర్కు ఉద్యోగాల నియామకానికి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీని ద్వారా మొత్తం 6128 ఖాళీలు భర్తీ అవనున్నాయి. రెండు దశల్లో ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు రెండో దశలోని మెయిన్స్‌ పరీక్ష రాయాలి. మెయిన్స్‌ మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఈ కొలువు సాధనకు పరీక్షలో ఏయే మెలకువలు పాటించాలో తెలుసుకుందామా? 

ప్రకటించిన ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 105, తెలంగాణలో 104, పుదుచ్చేరి (ఈ రాష్ట్రంలో తెలుగులో పరీక్ష రాసే అవకాశం ఉంది)లో 8 ఉన్నాయి. ఇప్పటివరకూ 11 బ్యాంకుల్లో 6 మాత్రమే ఖాళీల వివరాలు ఐబీపీఎస్‌కు తెలియజేశాయి. ఇంకా 5 ఖాళీల వివరాలను తెలియజేయాల్సి ఉంది. అవి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ బ్రాంచీలున్న యూనియన్‌ బ్యాంక్‌ (పూర్వ ఆంధ్రాబ్యాంక్‌ కలిసిన కారణంగా) కూడా ఉన్నందున నియామక సమయానికి ఈ ఖాళీలు ఇంకా పెరగవచ్చు.

డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఆఖరి ఏడాది సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు 21 జులై 2024 లోగా వెల్లడైతే వాళ్లూ ఈ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. కేవలం పరీక్షలు పూర్తయితే మాత్రం అర్హత ఉండదు.

సన్నద్ధతకు ఇదీ దారి

ఐబీపీఎస్‌ క్లర్క్‌ పరీక్ష మొదటిసారి రాసే అభ్యర్థులు సన్నద్ధత మొదలుపెట్టే ముందు ఎంపిక, పరీక్ష విధానాలను తెలుసుకోవాలి. ఆ తర్వాత గతంలో జరిగిన పరీక్ష పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. దాంతో పరీక్షలోని వివిధ విభాగాల్లో ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో ఏయే టాపిక్స్‌ నుంచి ఎన్నెన్ని ప్రశ్నలు వస్తున్నాయో, అవి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. అప్పుడే విభాగాలవారీగా, టాపిక్స్‌వారీగా ఏ మేరకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుస్తుంది. అదేవిధంగా పరీక్షకు ఉన్న సమయాన్ని బట్టి, ప్రతిరోజూ ఏయే విభాగాలకు ఎంత సమయాన్ని కేటాయించాలో కూడా తెలుస్తుంది. దీని ప్రకారం సన్నద్ధత ప్రణాళికను రూపొందించుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలకు కలిపే సన్నద్ధత ఉండాలి. 

ప్రిపరేషన్‌ మూడు విధాలుగా ఉండేలా చూసుకోవాలి. 

1. కాన్సెప్టులు నేర్చుకోవడం 2. ప్రశ్నలు సాధన చేయడం
3. మాదిరి పరీక్షలు రాయడం
కాన్సెప్టులు/ టాపిక్స్‌: అభ్యర్థులు వివిధ టాపిక్స్‌/ కాన్సెప్టులు నేర్చుకునే విభాగాలు.. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌లు. ఈ రెండు విభాగాల్లోని అన్ని టాపిక్స్‌ను ప్రతిరోజూ ఒక్కో విభాగంలో కనీసం ఒక టాపిక్‌ చొప్పున నేర్చుకోవాలి. పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు వచ్చే టాపిక్స్‌ను ముందుగా నేర్చుకోవాలి. ఉదాహరణకు ఆప్టిట్యూడ్‌లో సింప్లిఫికేషన్స్‌ (దాదాపు 10 ప్రశ్నలు) క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ ( 5 ప్రశ్నలు), నంబర్‌ సిరీస్‌ (5 ప్రశ్నలు) డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ (5+ ప్రశ్నలు) నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. 
అదేవిధంగా రీజనింగ్‌లో సీటింగ్‌ అరేంజ్‌మెంట్, పజిల్స్‌ నుంచి దాదాపు 20 ప్రశ్నలుంటాయి. ముందుగా వీటిని పూర్తిచేసుకోవాలి.

4: 3: 2: 1 ఫార్ములా

న్నద్ధత సమయంలో ప్రతిరోజూ ఏ విభాగానికి ఎంత సమయం కేటాయించాలనే సందేహం చాలామంది అభ్యర్థులకు వస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో ఉన్న నాలుగు విభాగాలను ప్రతిరోజూ సాధన చేయాలి. ఆయా విభాగాల ప్రాధాన్యం, కాఠిన్యతలను అనుసరించి ప్రతిరోజూ వాటికి సమయాన్ని కేటాయించుకోవాలి. రోజూ పది గంటలు సాధన చేస్తే, ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్‌/ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ విభాగాలకు అదే వరుసలో 4, 3, 2 గంటలు, 1 గంట సమయాన్ని కేటాయించాలి. రోజు మొత్తంలో కేటాయించే సమయాన్ని బట్టి.. ఆయా విభాగాలకు ఆయా నిష్పత్తిలో సమయం కేటాయించుకోవాలి.


ప్రస్తుతం ఐబీపీఎస్‌ క్లర్కుతో పాటుగా ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ పీవో/క్లర్క్, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ పరీక్షల నోటిఫికేషన్లు ఉన్నాయి. త్వరలో ఐబీపీఎస్‌ పీవో, ఎస్‌బీఐ పీవో, ఎస్‌బీఐ క్లర్క్, రైల్వే నోటిఫికేషన్లు రాబోతున్నాయి. వీటన్నిటికీ కలిపి ఉమ్మడిగా సన్నద్ధతను కొనసాగిస్తే.. ఇన్ని అవకాశాలున్న ఈ సమయంలో తప్పకుండా ప్రభుత్వోద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది.

సాధన: విభాగాల్లోని టాపిక్స్‌/ కాన్సెప్టులు నేర్చుకున్న తర్వాత వాటిలో ఉండే మూడు స్థాయుల్లోని (తేలికపాటి, మధ్య, కఠిన స్థాయి) ప్రశ్నలు సాధన చేయాలి. ఇదే సమయంలో ప్రశ్నలు వేగంగా సాధించడంపై దృష్టి కేంద్రీకరించాలి. వివిధ షార్ట్‌కట్‌ పద్ధతులు, మెలకువలు నేర్చుకోవాలి. 

మాదిరి ప్రశ్నలు: టాపిక్స్‌ నేర్చుకున్న తర్వాత వివిధ తరహాల పరీక్షలు రాసినపుడే ఎంత వేగంగా, ఎంత కచ్చితత్వంతో ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుస్తుంది. అందుకోసం టాపిక్‌లవారీ పరీక్షలు, విభాగాలవారీ పరీక్షలు, ఐబీపీఎస్‌ క్లర్క్‌ పరీక్ష తరహాలోని మాదిరి పరీక్షలు రాయాలి. టాపిక్స్‌ పూర్తవగానే టాపిక్‌వారీ పరీక్షలు రాయాలి. అన్ని టాపిక్స్‌ పూర్తవగానే విభాగాలవారీ పరీక్షలు రాయాలి. 

ప్రిలిమ్స్‌ పరీక్షకు నెల రోజుల ముందు నుంచీ ప్రతిరోజూ ఒకటి చొప్పున మోడల్‌ పరీక్షను రాయడం ప్రారంభించాలి. పరీక్ష పూర్తవగానే దాన్ని విశ్లేషించుకోవాలి. ఆపై మెరుగుపరుచుకోవాల్సిన విభాగం/ టాపిక్‌పై దృష్టిపెట్టాలి. నిర్ణీత సమయంలో 90 శాతం ప్రశ్నలు దాదాపు వంద శాతం కచ్చితత్వంలో సాధించగలిగేలా సన్నద్ధత ఉండాలి. ప్రిలిమ్స్‌ పరీక్ష పూర్తయ్యాక మెయిన్స్‌ మాదిరి పరీక్షలు రాయాలి.  


ముఖ్యమైన అంశాలు 

ప్రిలిమ్స్‌/ మెయిన్స్‌ పరీక్షల్లో వివిధ విభాగాల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్న టాపిక్స్‌ ఏమిటో పరిశీలిద్దాం. 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (న్యూమరికల్‌ ఎబిలిటీ): సింప్లిఫికేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నంబర్‌ సిరీస్, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. (ఒక్కో దాని నుంచి కనీసం 5 ప్రశ్నలు). వీటితోపాటు అరిథ్‌మెటిక్‌లోని వివిధ టాపిక్స్‌ నుంచి 0-1 ప్రశ్నలు, మొత్తం మీద 10-12 ప్రశ్నలు వస్తాయి. వీటిలోని ముఖ్యమైన టాపిక్స్‌.. నంబర్‌ సిస్టమ్, రేషియోలు, పార్టనర్‌షిప్, ఏజెస్, యావరేజి, పర్సంటేజి, ప్రాఫిట్‌-లాస్, సింపుల్‌-కాంపౌండ్‌ ఇంటరెస్ట్, టైమ్‌-వర్క్, టైమ్‌-డిస్టెన్స్, మెన్సురేషన్, ఎలిగేషన్‌-మిక్చర్స్, పర్ముటేషన్‌-కాంబినేషన్, ప్రాబబిలిటీ. 

రీజనింగ్‌: దీనిలో సీటింగ్‌ అరేంజ్‌మెంట్, పజిల్స్‌ నుంచి దాదాపు 20 ప్రశ్నలు వస్తాయి. ఇతర ముఖ్యమైన టాపిక్స్‌- కోడింగ్‌-డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, డైరెక్షన్స్, ఆల్ఫాన్యూమరిక్‌ సిరీస్, ఇన్‌ఈక్వాలిటీస్, ఆర్డర్‌-ర్యాంకింగ్, సిలాజిజమ్, వెన్‌ డయాగ్రమ్‌తోపాటు స్టేట్‌మెంట్‌ ఆధార ప్రశ్నలు, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్, డెసిషన్‌ మేకింగ్‌ మొదలైనవి. 

ఇంగ్లిష్‌: దీనిలో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 7-10 ప్రశ్నలుంటాయి. ఆపై గ్రామర్‌ ఆధార ప్రశ్నలు వస్తాయి. ఉదా: ఎర్రర్‌ ఫైండింగ్స్, సెంటెన్స్‌ అరేంజ్‌మెంట్, సెంటెన్స్‌ కరెక్షన్, ఫిల్లర్స్, డబుల్‌ ఫిల్లర్స్, క్లోజ్‌ టెస్ట్‌ మొదలైనవి. ఒకాబ్యులరీ నుంచి కూడా ప్రశ్నలుంటాయి. 

జనరల్‌ అవేర్‌నెస్‌: దీంట్లో ఎకనామికల్‌/ ఫైనాన్షియల్‌/ బ్యాంకింగ్‌లకు సంబంధించిన తాజా పరిణామాలపై ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. వీటితోపాటుగా జాతీయ/అంతర్జాతీయ సంస్థలు, ముఖ్యమైన దినోత్సవాలు, వ్యక్తులు, ప్రదేశాలు, పుస్తకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు మొదలైనవీ ముఖ్యమే. 

కంప్యూటర్‌ అవేర్‌నెస్‌: దీనిలో ముఖ్యమైనవి కంప్యూటర్‌ బేసిక్స్, ఇన్‌పుట్, అవుట్‌పుట్‌ డివైజెస్, సీపీయూ, కీబోర్డ్‌ షార్ట్‌కట్, సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్‌ సిస్టమ్, ఎంఎస్‌-ఆఫీస్‌ (వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్‌), ఇంటర్నెట్‌/ఈ-మెయిల్, నెట్‌వర్కింగ్, సైబర్‌ సెక్యూరిటీ మొదలైనవి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు