సరైన మద్దతు ధర... రైతుల పాలిట వరం

Published : 02 Jul 2024 00:43 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
జాగ్రఫీ

ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగానిది కీలకపాత్ర. ఏ దేశంలోనైనా కాలానికి అనుగుణంగా పంటలను పండిస్తారు. పంట రకాలు, దిగుబడులు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఒక్కో పంటకు ఒక్కోరకమైన వర్షపాతం, ఉష్ణోగ్రతలు అనుకూలం. మనదేశంలో ఆహార పంటల సాగులో వరి, గోధుమ ముందు స్థానాల్లో ఉండగా, వినియోగించడంలోనూ వీటిదే అగ్రస్థానం. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏటా ఆయా పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటిస్తూ ఉంటుంది.

వ్యవసాయం - పంట రకాలు

ఆహార పంటలు వరి

దేశంలో ఎక్కువ మంది వినియోగించే అతిముఖ్యమైన ఆహార పంట వరి. 

  • ప్రపంచంలో చైనా తరువాత భారతదేశంలోనే అత్యధికంగా వరిని పండిస్తున్నారు.
  • భారతదేశంలో మొత్తం సాగుభూమిలో 1/4వ వంతు వరిని సాగుచేస్తున్నారు.

శీతోష్ణస్థితి పరిస్థితులు: 8o ఉత్తర అక్షాంశం నుంచి 30°o ఉత్తర అక్షాంశం వరకు, సముద్రమట్టం నుంచి 2500 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రాంతాలు వరి పండించడానికి అనువైనవి.

  • అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ తేమ ఉండే ప్రాంతాలు అంటే ఉష్ణ, అతి ఉష్ణ మండలాల్లో ఈ పంటను పండిస్తారు.
  • ఈ పంటకు సగటు  ఉష్ణోగ్రత 24oC ఉండాలి.
  • ఉష్ణోగ్రత 20oC - 22oC  ఉండే కాలంలో వరి నాట్లు వేస్తారు. 23oC - 25oC ఉష్ణోగ్రత ఈ పంట పెరుగుదలకు అవసరం. కోత కాలంలో ఉష్ణోగ్రత 25oC - 30oC గా ఉండాలి.
  • వరికి వార్షిక వర్షపాతం 150 సెం.మీ. నుంచి 200 సెం.మీ. వరకు అవసరం. భారత్‌లో ఈ పంటను ఖరీఫ్‌ కాలంలో 39.4%, రబీ కాలంలో 54.2%, వేసవి కాలంలో 6.4% చొప్పున పండిస్తారు.

వరి పంట రకాలు: రత్న, హంస, జయ, పూసా, పద్మ, మసూరి, బాస్మతి, బోరో, BR-43, BR-10, IR-36, IR-8, IR-20.

  • లూనిశ్రీ అనేది మొదటి సూపర్‌రైస్‌ వంగడం.
  • జాతీయ వరి పరిశోధన కేంద్రం ఒడిశాలోని కటక్‌లో ఉంది.
  • అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం మనీలా, ఫిలిఫ్పీన్స్‌లో ఉంది.

దేశంలో వరిని ఎక్కువగా పండించే రాష్ట్రాలు: పశ్చిమబెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌

శ్రీ వరిసాగు (SRI-System of Rice Intensification): దీన్ని హెన్రీ డి లౌలానీ అభివృద్ధి పరిచారు.

  • ఈ పద్ధతి నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకొని దిగుబడి ఇస్తుంది.
  • ఈ పద్ధతిలో మొదటిసారిగా వరిని సాగు చేసిన దేశం - మడగాస్కర్‌
  • వరి పంట శాస్త్రీయ నామం - ఒరైజా సటైౖవా.

మొక్కజొన్న  (Maize)

మొక్కజొన్న శాస్త్రీయ నామం - జియా మేజ్‌

  • ప్రపంచ మొక్కజొన్న ఉత్పత్తిలో భారత్‌ వాటా రెండు శాతం.
  • ఇది ఆహారంగా, పశువుల దాణాగా ఉపయోగపడుతుంది.
  • నీటిపారుదల సౌకర్యం ఉండే సారవంతమైన మాగాణి లేదా ఎర్రనేలలు ఈ పంటకు అనుకూలం.
  • నేల ఎంత మెత్తగా ఉంటే అంత దిగుబడి పొందవచ్చు.
  • ఈ పంటకు 75 సెం.మీ. వర్షపాతం, 21OC నుంచి 27OC ఉష్ణోగ్రతలు అవసరం.
  • అత్యధికంగా మొక్కజొన్న ఉత్పత్తి చేసే రాష్ట్రాలు కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర.
  • ఉత్పత్తిలో కర్ణాటక 15%, మధ్యప్రదేశ్‌ 15%, మహారాష్ట్ర 12%, తెలంగాణ 6% వాటా కలిగి ఉన్నాయి.
  • ప్రపంచవ్యాప్తంగా ఈ పంటను ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్‌ 7వ స్థానంలో ఉంది.

కనీస మద్దతు ధర (Minimum Support Price)

1966-67లో మొదటిసారిగా గోధుమ పంటకు కనీస మద్దతు ధర ప్రకటించి ఈ విధానాన్ని ప్రారంభించారు.

  • వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఆకస్మికంగా పతనమైనప్పుడు రైతులను ఆదుకోవడం, వారి ఆదాయం పెంచడమే దీని ఉద్దేశం. సాధారణంగా పంట విత్తడానికి ముందే కనీస మద్దతు ధరను ప్రకటిస్తారు.
  • భారత ఆహార సంస్థ (FCI) ను 1965లో ఏర్పాటు చేశారు. 
  • కె.ఎల్‌. ఝూ కమిటీ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం 1965లో వ్యవసాయ ధరల కమిషన్‌ (Agri Prices Commission) ను ఏర్పాటు చేసింది.
  • 1985 జనవరిలో వ్యవసాయ ధరల కమిషన్‌ను వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్‌గా మార్చారు.

CACP - Commission for Agricultural Cost and Prices. CACP ప్రతి సంవత్సరం కనీస మద్దతు ధరలు, సేకరణ, జారీ ధరలను ప్రకటిస్తుంది. వీటిని ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే కేంద్రమంత్రి మండలి ఆమోదిస్తుంది.

ఖరీఫ్‌ పంటలు: ఇవి 14 రకాలు. వరి, జొన్న, రాగి, సజ్జ, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశెనగ, పత్తి, పొద్దుతిరుగుడు, నువ్వులు, నైజర్‌ సీడ్స్, సోయాబీన్‌.

రబీ పంటలు: ఇవి 6 రకాలు. గోధుమ, బార్లీ, శెనగలు, పచ్చపెసలు, ఆవాలు, కుసుమ.

వాణిజ్య పంటలు: రెండు రకాలు. జనుము, కాప్ర.

  • CACP ఏటా 22 పంటలకు మాత్రమే కనీస మద్దతు ధరను సిఫార్సు చేస్తూ ఉంది.
  • టోరియా పంట మద్దతు ధర ఆవాల మద్దతు ధరపై, ఒలిచిన కొబ్బరికాయల మద్దతు ధర కాప్ర పంట మద్దతు ధరపై ఆధారపడి ఉంటాయి.
  • చెరకు పంటకు మద్దతు ధర బదులు వాస్తవిక గిట్టుబాటు ధర (Fair and Remunerative Price - FRP) ను కేంద్రం ప్రకటిస్తుంది.
  • మొత్తం 22 + 3 పంటలకు ధరల రక్షణ లభిస్తుంది.

సేకరణ ధర  (Procurement Price)

దీన్ని పంటల కాలానికి ముందు నిర్ణయిస్తారు. 

  • కనీస మద్దతు ధర కంటే కొంచెం ఎక్కువగా, మార్కెట్‌ ధర కంటే తక్కువగా ఉంటుంది.
  • ప్రజా పంపిణీ అవసరాల నిమిత్తం ప్రభుత్వం సేకరణ ధర ద్వారా ఆహార ధాన్యాలను రైతుల నుంచి కొనుగోలు చేస్తుంది. 
  • కేంద్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌కు సంబంధించిన 14 పంటల కోసం కనీస మద్దతు ధరను ప్రకటించింది. 
  • వరికి క్వింటాల్‌కు రూ. 117 పెంచింది. నువ్వులకు రూ. 632, కందులకు రూ.550 పెంచారు.

జొన్న (Jowar)

శాస్త్రీయ నామం- పెన్నిసెటమ్‌ గ్లాకమ్‌

  • దీన్ని ఖరీఫ్‌ పంటగా పండిస్తారు.
  • వరి, గోధుమ తర్వాత విస్తీర్ణంలో మూడో ప్రధాన ఆహార పంట.
  • దీన్ని ఉష్ణమండల పంట, ప్రధాన చిరుధాన్యం అని పిలుస్తారు.
  • ఈ పంటకు 16ాది కంటే ఎక్కువ ఉష్ణోగ్రత, 40 సెం.మీ. నుంచి 100 సెం.మీ. వరకు వర్షపాతం అనుకూలం.
  • అధికంగా పండించే రాష్ట్రాలు: మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు.

గోధుమ (Wheat)

శాస్త్రీయ నామం - ట్రిటికం వల్గేర్‌ / ఈస్టిరం.

  • వరి తర్వాత రెండో ముఖ్యమైన ఆహార పంట ఇది.
  • గోధుమలో ప్రోటీన్లు, విటమిన్లు, పిండి పదార్థాలు ఉండటం వల్ల ఇది సమీకృత ఆహారంగా ప్రాముఖ్యతను కలిగి ఉంది.
  • గోధుమ రబీ కాలపు పంట. దీన్ని శీతాకాలపు పంట అని కూడా అంటారు.
  • ఈ పంటకు మిత ఉష్ణోగ్రత ఉండి, కోతకు వచ్చే సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉండాలి.
  • పంట కాలమంతా సమానంగా విస్తరించి ఉండే 50 నుంచి 70 సెం.మీ. వర్షపాతం అవసరం.
  • మన దేశంలో గోధుమ పండే ముఖ్యమైన ప్రాంతాలు రెండు. అవి.. వాయవ్య ప్రాంతంలోని గంగా-సట్లెజ్‌ మైదానాలు, దక్కన్‌ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం.
  • భారత్‌లో 12.39% జనాభా గోధుమను ఆహారంగా స్వీకరిస్తారు.
  • గోధుమ సాగు విస్తృతమైన వ్యవసాయ పద్ధతికి చెందింది. అంటే తక్కువ వేతనం, తక్కువ కూలీలు, యాంత్రీకరణ పద్ధతుల్లో ఈ పంటను పండిస్తారు.
  • భారతదేశ ఉత్తర మైదాన ప్రాంతాల్లో గోధుమ పంట కేంద్రీకృతమైంది.
  • మన దేశంలో హరిత విప్లవం ద్వారా అధిక ప్రయోజనం పొందిన పంట గోధుమ.
  • ఈ పంటను అధికంగా పండించే రాష్ట్రాలు: ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హరియాణా. అత్యల్పంగా పండించే రాష్ట్రం తెలంగాణ.
  • అధిక దిగుబడి ఉన్న రాష్ట్రాలు పంజాబ్, హరియాణా కాగా, అత్యల్ప దిగుబడి ఉన్న రాష్ట్రం కర్ణాటక.
  • దేశంలో ముఖ్యంగా రెండు రకాల గోధుమను సాగుచేస్తున్నారు. అవి.

1. పిండి గోధుమ (Bread Wheat)

2. రవ్వ గోధుమ

  • పిండి గోధుమ పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో నీటిపారుదల వసతులతో పండిస్తారు.
  • రవ్వ గోధుమను వర్షధార పంటగా పిలుస్తారు. దీన్ని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో సాగుచేస్తారు.
  • భారత్‌లో గోధుమ, బార్లీ పరిశోధన కేంద్రం హరియాణాలోని కర్నాల్‌లో ఉంది.

రకాలు: సోనాలిక, కళ్యాణ్‌ సొన, జనక్, జయరాజ్, గిరిజ. నీటిపారుదల ఉన్న ప్రాంతాల్లో వీటిని పండిస్తారు.

రచయిత : పి.కె. వీరాంజనేయులు విషయ నిపుణులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని