సమర్థంగా.. సామరస్యంగా!

ప్రాచీన భారతంలో మొదటి సువిశాలమైన, శక్తిమంతమైన సామ్రాజ్యాన్ని మౌర్యులు నిర్మించారు. దేశ తొలి చారిత్రక వంశీకులుగా, ఆదర్శ పాలకులుగా శాశ్వత కీర్తిని సొంతం చేసుకున్నారు. ఉపఖండాన్ని రాజకీయంగా ఏకం చేసి, సాంస్కృతిక ఐక్యతను సాధించి, సమర్థ పాలనా యంత్రాంగాలను ఏర్పాటు చేశారు.

Published : 02 Jul 2024 00:19 IST

జనరల్‌ స్టడీస్‌  ప్రాచీన భారతదేశ చరిత్ర

ప్రాచీన భారతంలో మొదటి సువిశాలమైన, శక్తిమంతమైన సామ్రాజ్యాన్ని మౌర్యులు నిర్మించారు. దేశ తొలి చారిత్రక వంశీకులుగా, ఆదర్శ పాలకులుగా శాశ్వత కీర్తిని సొంతం చేసుకున్నారు. ఉపఖండాన్ని రాజకీయంగా ఏకం చేసి, సాంస్కృతిక ఐక్యతను సాధించి, సమర్థ పాలనా యంత్రాంగాలను ఏర్పాటు చేశారు. పాలనా విభాగాలు, విధానాల రూపకల్పనలో తర్వాతి తరాలకు మార్గదర్శకులయ్యారు. మౌర్యుల పాలనలోని ప్రధాన సూత్రాలను కొన్నింటిని నేటికీ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం మౌర్యుల పాలనా విధానాలు, అమలు పద్ధతులపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. చక్రవర్తి నుంచి గ్రామిణి వరకు ఉన్న పటిష్ఠమైన ఉద్యోగ వ్యవస్థతో పాటు వ్యవసాయ, వాణిజ్యాభివృద్ధికి వారు చేసిన కృషి, కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఉన్న పరిపాలనా మార్గదర్శకాలు తదితర ముఖ్యాంశాల గురించి తెలుసుకోవాలి.

మౌర్యుల పాలన

భారతదేశ చరిత్రలో మౌర్యుల పాలన విశిష్టమైంది. వారు వేసిన పునాదిపైనే ప్రాచీన యుగంలో పరిపాలనా వ్యవస్థ రూపుదిద్దుకుంది. మౌర్యుల పాలనా విధానం తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీస్‌ ఇండికా గ్రంథాలు, అశోకుడి శాసనాలు.

కేంద్ర ప్రభుత్వం: మౌర్యులు రాచరిక ప్రభుత్వం, కేంద్రీకృత పాలనను స్థాపించారు. రాచరికం అనువంశికం. చక్రవర్తి రాజ్యంలో సైనిక, న్యాయ, కార్యనిర్వాహక విషయాల్లో సర్వోన్నత అధికారి అయినప్పటికీ పాలన అంతా ధర్మశాస్త్రాలు, ఆనాటి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పరిమితుల్లోనే సాగింది. కౌటిల్యుడు రాజ్యానికి సప్త అంగాలు (రాజు, మంత్రి, రాజ్యం, దుర్గం, కోశం, దండం, మిత్ర రాజ్యం) అవసరం గురించి ఉద్ఘాటించాడు. ప్రజల సుఖమే రాజుకు సుఖం, ప్రజల హితమే రాజుకు హితం అని అర్థశాస్త్రం రాజుకు హితవు పలికింది. అశోకుడు ప్రజలంతా తన సంతానమని ప్రకటించి రాచరికానికి కొత్త భాష్యం చెప్పాడు. కేంద్ర ప్రభుత్వంలో రాజుకు సలహాలివ్వడానికి, తోడ్పడటానికి ఒక మంత్రి పరిషత్తు ఉంటుంది. యువరాజు, మహామంత్రి, పురోహితుడు, సేనాని ఇందులో సభ్యులు. రాజు వీరిని సంప్రదించే పరిపాలన చేసేవాడు. వీరేకాకుండా అమాత్యులు, అధ్యక్షులు కూడా ఉన్నట్లు అర్థశాస్త్రం ప్రస్తావించింది. మౌర్యులు వివిధ విధులు నిర్వర్తించే గొప్ప ఉద్యోగ బృందాన్ని నియమించి విస్తారమైన పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

గూఢచారి వ్యవస్థ: మౌర్యుల పాలనలో గూఢచర్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. గూఢచారులను ‘గూఢ పురుష’ అని పిలిచేవారు. వీరు రాజ్యంలో సంచరిస్తూ ప్రభుత్వం పట్ల ప్రజల వైఖరిని, ఉద్యోగుల నడవడిక గురించి రాజుకు సమాచారం అందించేవారు. రాజు కూడా గూఢచారులకు ప్రాముఖ్యం ఇచ్చేవాడు. పాలనలో మహిళా గూఢచారులు కూడా ఉండేవారు.

సైనిక పాలన: మౌర్యులకు శక్తిమంతమైన సైనిక వ్యవస్థ ఉందని గ్రీకు రచయిత జస్టిన్‌ పేర్కొన్నాడు. చక్రవర్తి అత్యున్నత సైనికాధికారి. సైనిక పాలన నిర్వహించడానికి 30 మంది సభ్యులతో, ఆరు ఉపసంఘాలుగా పనిచేసేది. అవి: 1) కాల్బలం  2) అశ్విక బలం 3) గజబలం   4) రథబలం 5) నౌకాబలం 6) రవాణా నిర్వహణ. సైనిక విషయాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవడానికి సభ్యులు సమావేశమయ్యేవారు.

న్యాయ పాలన: చక్రవర్తి ఆస్థానమే సర్వోన్నత న్యాయస్థానం. నిష్పాక్షిక న్యాయం అమలయ్యేది. న్యాయం చెప్పడానికి ప్రమాణాలుగా బ్రాహ్మణీయ ధర్మశాస్త్రాలు, ఆనాటి సంప్రదాయాలు, చలితంగా ఉన్న ఆచార వ్యవహారాలు, చక్రవర్తి ఆజ్ఞలను ప్రామాణికంగా తీసుకునేవారు. ప్రాడ్వివాక్కుడు ఉన్నత న్యాయాధికారి.

దేశంలో ధర్మస్తేయ (సివిల్‌ వ్యాజ్యాలకు), కంటక శోధన (క్రిమినల్‌ వ్యాజ్యాలకు) అనే రెండు రకాల న్యాయస్థానాలుండేవి. న్యాయాధికారిని ‘వ్యవహారిక’ అని పిలిచేవారు. శిక్షలు చాలా కఠినంగా ఉండేవి. సాధారణంగా అంగచ్ఛేదనం, దేశ బహిష్కరణ అమలు చేసేవారు. అశోకుడి కాలంలో కూడా మరణశిక్షలు రద్దు కాలేదు. ప్రాంతీయ న్యాయస్థానాలు ఉండేవి. అవి- [ ప్రతి 10 గ్రామాలకు సంగ్రహ న్యాయస్థానం.[ ప్రతి 400 గ్రామాలకు ద్రోణముఖి న్యాయస్థానం.[ ప్రతి 800 గ్రామాలకు స్థానీయ న్యాయస్థానం.

రెవెన్యూ పాలన: చక్రవర్తి ప్రధాన ఆదాయం భూమిశిస్తు. రెవెన్యూ పాలనలో ప్రభుత్వం ప్రజల నుంచి భాగ, బాలి, కారా, సీత, వివిత లాంటి వివిధ రకాల పన్నులు సాగు భూముల ఆధారంగా వసూలు చేసినట్లు అర్థమవుతోంది. అవేకాకుండా వ్యాపారాలు, గనులు, ఎగుమతి, దిగుమతుల మీదా పన్నులు ఉండేవి.

రాష్ట్ర పాలన: పరిపాలనా సౌలభ్యం కోసం మౌర్య సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. అవి- 1) ఉత్తరాపథం: రాజధాని - తక్షశిల 2) దక్షిణా పథం: రాజధాని - సువర్ణగిరి 3) ప్రాచ్య పథం: రాజధాని - తోశాలి 4) పశ్చిమ లేదా అవంతి పథం: రాజధాని - ఉజ్జయిని 5) మధ్య పథం: రాజధాని - పాటలీపుత్రం 

రాష్ట్ర పాలన, కేంద్ర పాలనకు ప్రతీకగా ఉండేది. సాధారణంగా రాజ కుటుంబీకులే రాష్ట్ర పాలకులుగా నియమితులయ్యేవారు. వీరిని కుమార/ఆర్యపుత్ర అని పిలిచేవారు. రాష్ట్రాన్ని విషయాలుగా లేదా ప్రాదేశికాలుగా విభజించారు. విషయంలో ప్రాదేశికుడు (పరిపాలనాధికారి), రజుక (భూమిశిస్తు, న్యాయం), యుక్త (ముఖ్య గణకుడు) మొదలైన అధికారుల ప్రస్థావన కూడా ఉంది. గ్రామానికి అధికారి గ్రామిణి.

నగర పాలన: మెగస్తనీస్‌ తన ‘ఇండికా’ గ్రంథంలో పాటలీపుత్ర సౌందర్యానికి ముగ్ధుడై అమితంగా వర్ణించాడు. ఆ నగరాన్ని పలింబోత్ర అని సంబోధించాడు. మెగస్తనీస్‌ ప్రకారం నగర పాలనకు 30 మంది సభ్యులతో కూడిన ఒక సంఘం ఉండేది. ఇది అయిదుగురు సభ్యులతో కూడిన ఆరు ఉపసంఘాలుగా ఆరు విషయాలను పర్యవేక్షించేది. [ మొదటి సంఘం -  పరిశ్రమలు, పారిశ్రామిక విషయాలు, పారిశ్రామిక వస్తువుల ధరలు [ రెండో సంఘం - విదేశీయుల వ్యవహారాలు  [ మూడో సంఘం - జనన మరణాలు [ నాలుగో సంఘం - వాణిజ్య వ్యవహారాలు [ అయిదో సంఘం - వస్తూత్పత్తి [ ఆరో సంఘం - పన్నుల పర్యవేక్షణ.

నగరాధ్యక్షుడిని ‘నగరక’ అని పిలిచేవారు. సామాజిక వ్యవస్థను పరిశీలిస్తే అనాదిగా వస్తున్న చాతుర్వర్ణ వ్యవస్థ కులవ్యవస్థగా మారి సంక్లిష్టం అయ్యింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ సాధారణం. మెగస్తనీసు ‘ఇండికా’లో మౌర్య సమాజాన్ని ఏడు కులాలుగా వర్ణించాడు. వారు మేధావులు (తత్వవేత్తలు), వ్యవసాయదారులు, పశుకాపరులు, వ్యాపారులు, ఉపాధ్యాయులు, గూఢచారులు, సైనికులు. బహుశా ఇది వృత్తుల ఆధారంగా జరిగిన విభజన కావచ్చు.

మెగస్తనీస్‌ భారతదేశంలో బానిసత్వం లేదని చెప్పాడు. అయితే కౌటిల్యుడి అర్థశాస్త్రంలో, అశోకుడి శాసనాల్లో బానిసత్వం గురించి ప్రస్తావించారు. బౌద్ధ మతసంఘాల వల్ల విద్య బాగా వ్యాపించింది. తక్షశిల, వారణాసి, ఉజ్జయిని, పాటలీపుత్రం ఆనాటి గొప్ప  విద్యాకేంద్రాలు.

దేశంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. అర్థశాస్త్రంలో కౌటిల్యుడు భూములను అక్రిష్ట (వ్యవసాయ యోగ్యం కాని భూములు), ఆరామ (తోటలు), క్రిష్ట (వ్యవసాయ భూములు), కేదార (పంట  భూములు), మూలవాప (అల్లం, పసుపు పండే భూములు), సాంద (పూల తోటలు), స్థల (మెట్ట భూములు), వాత (చెరకు పండే భూములు), వన (అడవులు), వివిత (గడ్డిభూములు) అని వర్గీకరించాడు. అంటే ఆనాటికే వ్యవసాయ పద్ధతులు, పరిజ్ఞానం అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. కొత్తగా భూములు సాగులోకి తీసుకురావడాన్ని ప్రభుత్వం ప్రోత్సహించింది. అలాంటి భూములకు పన్ను మినహాయింపు ఉండేది. అధిక భూమి సాగులోకి తేవడంతో అధిక దిగుబడి, ఉత్పత్తి జరిగి వాణిజ్యాభివృద్ధికి దారితీసింది. ఉపఖండాన్ని ఒక పరిపాలనా ఛత్రం కిందకి తీసుకురావడం, పొరుగు రాజ్యాలతో మౌర్య చక్రవర్తుల సత్సంబంధాలు వ్యాపారాభివృద్ధికి దోహదపడ్డాయి. భారతదేశపు సుగంధ ద్రవ్యాలు ముఖ్యంగా మిరియాల (యవనప్రియ)కు పశ్చిమ దేశాల్లో మంచి గిరాకీ ఉండేది. ఈ యుగంలో వర్తకులు శ్రేణులుగా ఏర్పడేవారు.

ప్రధాన ఎగుమతులు: సుగంధ ద్రవ్యాలు, నూలు వస్త్రాలు, పట్టు వస్త్రాలు, ఏనుగు దంతాలు.

ప్రధాన దిగుమతులు: బంగారం, వెండి, గుర్రాలు, పండ్లు.

ముఖ్య వాణిజ్య కేంద్రాలు: పాటలీపుత్రం, శ్రావస్తి, ఉజ్జయిని, బాఱుకచ్చ, కాశి, తక్షశిల. అర్థశాస్త్రంలో నాణేల ప్రసక్తి కూడా ఉంది. పశ్చిమ తీరంలో తామ్రలిప్తి, తూర్పుతీరంలో బరుకచ్చ ముఖ్య రేవులు.

మౌర్యుల కాలంలో వైదిక, బౌద్దం, జైనం లాంటి భిన్న మతాలుండేవి. జైనాన్ని నిర్గ్రంధుల మతం అని పిలిచేవారు. మౌర్య చక్రవర్తులు మత సామరస్యం నెలకొల్పడానికి కృషి చేశారు.

రచయిత: వి.వి.ఎస్‌. రామాపతారం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని