స్థానిక స్వపరిపాలనే... ప్రజాస్వామ్య బలోపేతానికి మూలం

ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసి, ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కల్పించేవే స్థానిక స్వపరిపాలనా సంస్థలు. భారత్‌లో గ్రామపాలన ప్రాచీన కాలం నుంచే ఉంది.

Updated : 30 Jun 2024 01:37 IST

ఏపీపీఎస్సీ,ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ పాలిటీ

స్థానిక స్వపరిపాలన - పంచాయతీరాజ్‌ వ్యవస్థ

ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసి, ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కల్పించేవే స్థానిక స్వపరిపాలనా సంస్థలు. భారత్‌లో గ్రామపాలన ప్రాచీన కాలం నుంచే ఉంది.
స్వాతంత్య్రానికి పూర్వం, అనంతరం పరిపాలనా పరంగా అనేక మార్పులు వచ్చాయి.స్థానిక స్వపరిపాలన అభివృద్ధిలో భాగంగాప్రభుత్వాలు పలు కమిటీలను ఏర్పాటు చేశాయి.ఈ కమిటీలు అంచెల విధానాలను రూపొందించిప్రభుత్వాలకు నివేదికలు సమర్పించాయి. పలు సిఫార్సులు చేశాయి. వీటన్నింటిపై పోటీపరీక్షార్థులు అవగాహన కలిగి ఉండాలి.

భారత్‌లో ప్రాచీన కాలం నుంచే స్థానిక పాలన ఉంది.

  • చోళుల కాలం నాటి ఉత్తర మేరూర్‌ శాసనం ప్రకారం అప్పట్లోనే  ఈ వ్యవస్థ ఉండేదని తెలుస్తోంది. ఈ శాసనాన్ని మొదటి పరాంతకుడు వేయించాడు.
  • ఆధునిక కాలంలో బ్రిటిష్‌వారు భారత్‌లో జిల్లాను ఒక పరిపాలనా యూనిట్‌గా పరిగణించారు. 1772 మే 14న జిల్లా కలెక్టర్‌ పదవిని ప్రవేశపెట్టారు.
  • లార్డ్‌ రిప్పన్‌ 1882 మే 18న  స్థానిక సంస్థలకు సంబంధించి నిర్దిష్ట రూపాన్నిచ్చే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అందుకే ఈ తీర్మానాన్ని స్థానిక సంస్థల మాగ్నా కార్టా అని పిలుస్తారు. రిప్పన్‌ను స్థానిక సంస్థల పితామహుడిగా పేర్కొంటారు.
  • బ్రిటిష్‌ ప్రభుత్వం చార్లెస్‌ హబ్‌హౌస్‌ సారథ్యంలో 1907లో ఒక రాయల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.
  • 1909 మింటో- మార్లే రాయల్‌ కమిషన్‌ సూచనల మేరకు స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టారు.
  • 1919 మాంటెంగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల ప్రకారం రాష్ట్రంలో ద్వంద్వపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా స్థానిక స్వపరిపాలనను ది ట్రాన్స్‌ఫర్డ్‌ జాబితాలో చేర్చారు.
  • భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ, స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ప్రాధాన్యతనిస్తూ అనేక అధికారాలు బదిలీ చేశారు.
  • స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 40వ నిబంధన ప్రకారం, గాంధీజీ ఆశయాల మేరకు ‘గ్రామ స్వరాజ్యం - రామరాజ్యం’ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక స్వపరిపాలనకు సంబంధించి పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు.

కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (సీడీపీ)

సీడీపీని 1952 అక్టోబరు 2న ప్రారంభించారు. వి.టి.కృష్ణమాచారి సలహా మేరకు అమెరికన్‌ ఫోర్ట్‌ ఫౌండేషన్‌ సహకారంతో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సమితుల్లో ప్రవేశపెట్టారు. మొదటగా 55 బ్లాక్‌లలో ప్రవేశపెట్టి 5011 బ్లాక్‌లకు విస్తరించారు. )

  • మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో బాగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. సీడీపీ కోసం నిధులు ఉన్నా ప్రజల సహకారం కోరడంతో విఫలమైంది.

సామాజిక జాతీయ విస్తరణ సేవా పథకం (ఎన్‌ఈఎస్‌ఎస్‌)

జవహర్‌లాల్‌ నెహ్రూ 1953 అక్టోబరు 2న సీడీపీకి అనుబంధంగా దీన్ని ప్రారంభించారు. ఇందులో విద్య, వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమల విస్తరణ, సేవా కార్యక్రమాల్లో సౌకర్యాలు కల్పించారు. కానీ ఇది కూడా విఫలమైంది. నెహ్రూ సీడీపీ, ఎన్‌ఈఎస్‌ఎస్‌ల వైఫల్యాలకు కారణం తెలుసుకోమని, స్థానిక సంస్థలపై అధ్యయనం చేయమని
బల్వంత్‌రాయ్‌ మెహతా సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీని కోరారు.

అశోక్‌ మెహతా కమిటీ

మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంగా 1977 డిసెంబరులో అశోక్‌ మెహతా అధ్యక్షతన 18 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.

  • ఈ కమిటీ 1978 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వానికి 132 సిఫార్సులతో కూడిన ఒక నివేదిక సమర్పించింది.

ముఖ్యమైన సిఫార్సులు

ఈ కమిటీ పంచాయతీరాజ్‌ వ్యవస్థలో మూడంచెల విధానాన్ని కాకుండా రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పింది.
1. ఎగువ స్థాయిలో - జిల్లా పరిషత్‌
2. దిగువ స్థాయిలో - మండల పరిషత్‌లను ఏర్పాటు చేయాలి.

  • గ్రామ పంచాయతీలను రద్దు చేసి, వాటి స్థానంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలి.
  • జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి.
  • పంచాయతీ వ్యవస్థలకు పన్నులను తప్పనిసరిగా విధించే అవకాశం ఇవ్వాలి.
  • పంచాయతీరాజ్‌ సంస్థలు రద్దయిన 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి.
  • పంచాయతీరాజ్‌శాఖకు మంత్రిని నియమించాలి.
  • ఎస్సీ, ఎస్టీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి.
  • 15000 - 20000 జనాభా ఉండే గ్రామాల సముదాయాన్ని మండల పరిషత్తుగా ఏర్పాటు చేయాలి.
  • ఈ కమిటీ సూచనల మేరకు మండల పరిషత్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం - కర్ణాటక.
  • 1985 అక్టోబరు 2న నాటి సీఎం రామకృష్ణ హెగ్డే కర్ణాటకలో ఈ వ్యవస్థను ప్రారంభించారు.
  • మండల వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్‌.
  • 1986 జనవరి 13 నాటి సీఎం ఎన్టీఆర్‌ 333 తాలుకా / సమితులను రద్దు చేసి, 1104 మండలాలను ప్రవేశపెట్టారు. అయితే రెవెన్యూ మండలాలను మాత్రం 1985లోనే ఆయన ప్రవేశపెట్టారు.

బల్వంత్‌రాయ్‌ మెహతా కమిటీ

  • జాతీయాభివృద్ధి మండలి 1957 జనవరి 16న బల్వంత్‌రాయ్‌ గోపాల్‌ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
  • సీడీపీ, ఎన్‌ఈఎస్‌ఎస్‌ల పథకాల తీరును సమీక్షించి, గ్రామ పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి అవసరమయ్యే సంస్థాగత ఏర్పాటును సూచించడం ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం.
  • ఈ కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ - ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో 3 అంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను సిఫార్సు చేస్తూ 1957 నవంబరు 24న తన నివేదికను సమర్పించింది. దీన్ని 1958 జనవరిలో జాతీయాభివృద్ధి మండలి ఆమోదించింది.
  • ఈ కమిటీ సిఫార్సుల మేరకు మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం రాజస్థాన్‌. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1959 అక్టోబరు 2న రాజస్థాన్‌లోని నాగోర్‌ జిల్లాలో సికార్‌ అనే ప్రాంతంలో ప్రారంభించారు.
  • ఈ మూడంచెల విధానాన్ని ప్రారంభించిన రెండో రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్‌. 1959 నవంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ వద్ద నెహ్రూ ప్రారంభించారు. నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి.

ముఖ్యమైన సిఫార్సులు: దేశంలో 3 అంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
1) ఉన్నత స్థాయి - జిల్లా పరిషత్‌ 2) మధ్యస్థాయి - తాలుకా/పంచాయతీ సమితి
3) దిగువ స్థాయి - గ్రామ పంచాయతీ

  • గ్రామ స్థాయిలో ఎన్నికలు ప్రత్యక్షంగా నిర్వహించాలి. 
  • మధ్యస్థాయి, ఉన్నత స్థాయుల్లో పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరపాలి.
  • జిల్లా పరిషత్‌కు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షుడిగా వ్యవహరించాలి.
  • ప్రణాళికా, అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను స్థానిక సంస్థలకు బదలాయించాలి.
  • స్థానిక సంస్థలకు అవసరమైన వనరులను కచ్చితంగా నిర్దేశించి పంపిణీ చేయాలి.
  • వీటికి తగిన అధికారాలు, ఆర్థిక వనరులు సమకూర్చాలి.
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ స్థానిక సంస్థల ద్వారా నిర్వహించాలి.

దంతేవాలా, ఇతర కమిటీలు

బ్లాకు స్థాయి ప్రణాళికీకరణపై అధ్యయనం చేసేందుకు 1977లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది 1978లో తన నివేదిక సమర్పించింది.
సిఫార్సులు: బ్లాకు స్థాయిలో ప్రణాళికను సమర్థించింది.

  • జిల్లా ప్రణాళికలో కలెక్టర్‌ కీలకపాత్ర పోషించాలి.
  • జిల్లా స్థాయిలో ప్రణాళికా వికేంద్రీకరణ జరగాలి.

సి.హెచ్‌. హనుమంతరావు కమిటీ: ఇది 1984లో ఏర్పడింది.
సిఫార్సులు: ప్రత్యేక జిల్లా ప్రణాళికా సంఘాన్ని జిల్లా కలెక్టర్‌/ మంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేయాలి.

  • జిల్లా స్థాయిలో అభివృద్ధి ప్రణాళికా కార్యక్రమంలో కలెక్టర్‌ సమన్వయకర్తగా పనిచేయాలి.

జీవీకే రావు కమిటీ: గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలన ఏర్పాట్లు అనే అంశాలను పరిశీలించేందుకు జీవీకే రావు అధ్యక్షతన 1985లో కమిటీని ఏర్పర్చారు.

  • దేశంలోని పరిపాలనా ప్రక్రియ ఉద్యోగస్వామ్యంగా మారిందని, ఇది పంచాయతీ స్ఫూర్తిని బలహీనపరిచిందని, దీని ఫలితంగా ప్రజాస్వామ్యం వేర్లులేని వ్యవస్థగా మారిందని తీవ్రంగా విమర్శించింది.

సిఫార్సులు: జిల్లా పరిషత్‌లను పటిష్టపరచాలి. ఈ పరిషత్‌కు ఛైర్మన్‌గా కలెక్టర్‌ ఉండాలి.

  • జిల్లా అభివృద్ధి కమిషన్‌ను ఏర్పాటు చేసి,  జిల్లా పరిషత్‌కు సంబంధించిన అతి ముఖ్య కార్యనిర్వాహక బాధ్యతలు అప్పగించాలి.
  • బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పదవిని రద్దు చేసి, డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పదవిని ఏర్పాటు చేయాలి. ఇతడు జిల్లా పరిషత్‌ ప్రధాన కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు.

ఎల్‌.ఎం. సింఘ్వీ కమిటీ: పంచాయతీరాజ్‌ సంస్థల బలోపేతానికి అవసరమైన సిఫార్సులు చేయడానికి 1986లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఎల్‌.ఎం. సింఘ్వీ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది.

సిఫార్సులు:

  • గ్రామసభకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధతను కల్పించి, పరిరక్షించాలి.
  • కొన్ని గ్రామసముదాయాలకు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి.
  • గ్రామపంచాయతీ సక్రమంగా మనుగడ కొనసాగించడానికి గ్రామాలను పునర్‌వ్యవస్థీకరించాలి.
  • పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక జ్యుడీషియల్‌ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని