స్వేచ్ఛా జీవనానికి సంకెళ్లు ఫలితమే గిరిజన తిరుగుబాట్లు

వర్తకం కోసం భారత్‌లోకి ప్రవేశించిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ క్రమంగా స్వదేశీ వ్యవహారాల్లో కలగజేసుకోవడం మొదలుపెట్టింది. యుద్ధాలు, పలు రకాల విధానాలతో ఎదురులేని శక్తిగా అవతరించింది.

Published : 29 Jun 2024 00:57 IST

టీజీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
భారతదేశ చరిత్ర

వర్తకం కోసం భారత్‌లోకి ప్రవేశించిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ క్రమంగా స్వదేశీ వ్యవహారాల్లో కలగజేసుకోవడం మొదలుపెట్టింది. యుద్ధాలు, పలు రకాల విధానాలతో ఎదురులేని శక్తిగా అవతరించింది. తమ సామ్రాజ్యాన్ని అన్ని దిశలకు విస్తరించింది. ఈ క్రమంలోనే వారు ప్రవేశపెట్టిన కొన్ని విధానాల వల్ల దేశంలోని రైతులు, గిరిజనులు అనేక ఇక్కట్లు పడ్డారు. శ్రమ, ఆర్థిక దోపిడీకి గురయ్యారు. వీరంతా పరాయి పాలనకు వ్యతిరేకంగా గళం విప్పి,  ఉద్యమాలు చేపట్టారు. భావితరాలకు పోరాటస్ఫూర్తిని నేర్పారు. ఇవన్నీ దేశ చరిత్రలో కీలక పరిణామాలుగా నిలిచాయి.

బ్రిటిష్‌ కాలంలో రైతాంగ, గిరిజన తిరుగుబాట్లు

ఈస్ట్‌ ఇండియా కంపెనీ క్రీ.శ. 1600లో వర్తకం కోసం భారతదేశంలోకి ప్రవేశించింది. 1740 తర్వాత స్వదేశీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించింది.

  • ఇక్కడి పాలకుల మధ్య నెలకొన్న అనైక్యత, బలహీనతలను గుర్తించిన ఆంగ్లేయులు తమ సైన్యాలతో స్వదేశీ రాజ్యాలపై యుద్ధాలు చేశారు.
  • క్రీ.శ. 1757-1856 మధ్యకాలంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ భారతదేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. సువిశాల సామ్రాజ్యాధినేత అయింది.
  • భారతదేశాన్ని ఇంగ్లండ్‌కు వలస రాజ్యంగా రూపొందించారు. 
  • దీని ఫలితంగా భారతదేశంలోని అన్ని వర్గాల వారు కంపెనీ పాలనలో తీవ్రంగా నష్టపోయారు. జీవనభృతి, పదవులు, రాజ్యాలు కోల్పోయారు.
  • దేశ జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న రైతులు కంపెనీ భూమిశిస్తు విధానాల వల్ల, కంపెనీ తరపున హక్కులు పొందిన వర్గాల దోపిడీ వల్ల, రెవెన్యూ ఉద్యోగుల దౌర్జన్యాల కారణంగా చితికిపోయారు.
  • దేశంలోని అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతూ, అటవీ సంపదనే జీవనాధారంగా నమ్ముకుని బతుకుతున్న ఆదివాసీలు కంపెనీ చట్టాల వల్ల తీవ్రంగా నష్టపోయి, ఇబ్బందులకు గురయ్యారు.
  • 1857 కంటే ముందే దేశంలోని పలు ప్రాంతాల్లోని రైతులు, ఆదివాసీలు కంపెనీ వలసవాదానికి, సామ్రాజ్యవాదానికి, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు సాగించారు.
  • వీటిని చరిత్రకారులు రైతాంగ, గిరిజన ప్రతిఘటనోద్యమాలుగా అభివర్ణించారు.

ఉద్యమాలకు కారణాలు

రైతాంగ, గిరిజన ఉద్యమాలు జరగడానికి ముఖ్యంగా మూడు కారణాలు. అవి...

1) రాజకీయ కారణాలు
2) ఆర్థిక కారణాలు
3) గిరిజనుల అసంతృప్తి

రాజకీయ కారణాలు

మొగల్‌ పాలకుల పట్ల ప్రజల్లో అభిమానం ఉండేది. వారి వారి సమస్యలను చక్రవర్తికి విన్నవించుకునే అవకాశం దేశవాసులకు ఉండేది. కానీ విదేశీ పాలకులైన ఇంగ్లిష్‌వారు ఈ విధానాన్ని రద్దు చేశారు.

  • దీనివల్ల దేశవాసుల్లో ముఖ్యంగా రైతుల్లో కంపెనీ పాలన పట్ల తీవ్ర అసంతృప్తి కలిగింది.
  • అనాది నుంచి భారతీయులు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని గడుపుతున్నారు. వీరి శ్రేయస్సును బ్రిటిష్‌ వారు అంతగా పట్టించుకోలేదు.
  • కంపెనీ తాను ఆక్రమించిన ప్రాంతాల్లోని వ్యవసాయ భూములపై శిస్తులు నిర్దాక్షిణ్యంగా వసూలు చేసేది.
  • బెంగాల్, కర్ణాటక, మైసూర్, హైదరాబాద్‌ ప్రాంతాల్లో కంపెనీ నుంచి భూమిశిస్తు హక్కులు పొందిన వర్గాలు, వారి ఉద్యోగులు భారతీయ రైతులను అన్ని రకాలుగా నష్టాలకు గురిచేశారు.
  • దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రైతు కుటుంబాలు చితికిపోయాయి. రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడ్డారు. 

ఆర్థిక కారణాలు

బ్రిటిష్‌ వారి ఆర్థిక సామ్రాజ్యవాదానికి, స్వార్థపూరిత పన్ను వసూలు విధానానికి దేశంలోని అన్ని వర్గాల మాదిరిగానే రైతులు, గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. 

  • కంపెనీ అధికారులు రూపొందించిన వ్యవసాయ, భూమిశిస్తు విధానాలు, తరతరాలుగా కొనసాగుతూ వచ్చిన భారతీయ రైతు సామాజిక వ్యవస్థను విచ్ఛిన్నం చేశాయి.
  • శాశ్వత శిస్తు విధానం, రైత్వారీ విధానం, మహల్వారీ విధానం కంపెనీ కోశాగారాన్ని బలోపేతం చేశాయి. 
  • శిస్తు వసూలు అధికారులు, జమీందార్లు అధిక శిస్తురేట్లతో రైతులను హీనస్థితికి తీసుకువచ్చారు.
  • అతివృష్టి, అనావృష్టిలో రైతులను ఆదుకోవడానికి కంపెనీ చేపట్టిన చర్యలు నామమాత్రంగా ఉండేవి. రైతులపై ప్రభుత్వం, జమీందారు, వడ్డీ వ్యాపారులు మూకుమ్మడిగా తమ దౌర్జన్యాలను కొసాగించారు.
  • క్రీ.శ. 1770-1856 మధ్యకాలంలో కంపెనీ అధీనంలోని ప్రాంతాల్లో సంభవించిన పలు ప్రధాన కరవులు భారతీయ రైతులను మరింత అవస్థలకు గురిచేశాయి.
  • గ్రామీణ భారత్‌లో వ్యవసాయ రంగంలో రైతులకు కేవలం రుతుబద్ధమైన ఉద్యోగాలుండేవి. మిగిలిన వారు చేతివృత్తులు, కుటీర పరిశ్రమలపై ఆధారపడేవారు.
  • మర్కంటలిజం, స్వేచ్ఛా వాణిజ్య విధానం ఫలితంగా ఇంగ్లండ్‌ పరిశ్రమల్లో ఉత్పత్తి చేసిన వస్తువులు భారత గ్రామీణ, పట్టణ మార్కెట్లలోకి ప్రవేశించాయి. దీంతో సంప్రదాయ చేతివృత్తులు, కులవృత్తులకు డిమాండ్‌ తగ్గిపోయింది.
  • స్వదేశీ కుటీర పరిశ్రమ కుంటుపడటంతో జీవనోపాధి కోల్పోయిన వారు తమ బతుకుదెరువు కోసం పూర్తిగా వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు. దీంతో వ్యవసాయ రంగంపై ఒత్తిడి పెరిగి అనేకులు వ్యవసాయ కూలీలుగా మారారు.
  • సమాజంలో భూస్వాములు, వ్యవసాయ కూలీలు అనే రెండు వర్గాలు ఏర్పడ్డాయి. దీనంతటికీ పరదేశీ పాలనే కారణమని  గ్రహించిన రైతులు తిరుగుబాట్లు లేవనెత్తారు.

గిరిజనుల అసంతృప్తి

భారతీయ సామాజిక వ్యవస్థలో గిరిజనులు ముఖ్యపాత్ర పోషించారు.

  • అటవీ సంపదను తమ ఆస్తిగా, తల్లిగా భావించిన గిరిజనులు బ్రిటిష్‌ పాలనా కాలంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
  • కోలి (మహారాష్ట్ర), తమల్, చిరో-చొగటా (పలమౌ) (చోటానాగ్‌పుర్‌), మెంటి (అసోం), కోల్‌ (బిహార్‌), నాయక్‌ (గుజరాత్‌), ఖోండ్‌లు (ఒడిశా), సంథాల్‌ (బిహార్‌) గిరిజన తెగకు చెందిన వారు కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసినవారిలో ముఖ్యలు.
  • కంపెనీ పాలన గిరిజనుల స్వేచ్ఛను హరించగా, బ్రిటిష్‌ చట్టాలు వారి ఆదాయాన్ని కొల్లగొట్టాయి.
  • గిరిజన ప్రాంతాల్లోని సంప్రదాయ పరిపాలనా వ్యవస్థను బ్రిటిష్‌ అధికారులు విచ్ఛిన్నం చేశారు.
  • తండాల అధిపతులను తొలగించి, వారి స్థానాల్లో గిరిజనేతరులైన సిక్కులు, ముస్లింలను పెత్తందార్లుగా నియమించారు.
  • 1831-32లో కోల్‌ గిరిజనుల తిరుగుబాటుకు తక్షణ కారణం ఈ పెత్తందారుల నియామకమే.
  • ఒడిశాలోని ఖోండ్‌ గిరిజనులు అనాదిగా నరబలిని, శిశు హత్యలను తమ ఆచారంగా పాటించేవారు. 1846కు ముందు ప్రభుత్వం వీటిని నిషేధిస్తూ చట్టాలు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఖోండ్‌లు 1846-48 మధ్యకాలంలో తిరుగుబాటు చేశారు.
  • బ్రిటిష్‌ వారు నియమించిన గిరిజనేతర అధికారులు బిహార్‌లోని సంథాల్‌ గిరిజనులపై ఎక్కువ ఆధిపత్యం చెలాయించేవారు. స్త్రీలపై అత్యాచారాలు జరిపేవారు. దీన్ని ధిక్కరిస్తూ 1855-56లో సంథాల్‌ తిరుగుబాటు జరిగింది.

1757-1857 మధ్య జరిగిన గిరిజన తిరుగుబాట్లు

ఉత్తర, మధ్య భారత్‌లోని అనేక ప్రాంతాలపై బ్రిటిష్‌ వారు తమ అధికారాన్ని నెలకొల్పారు. 

  • దీనివల్ల అన్ని దేశీయ వర్గాల మాదిరిగానే గిరిజనులు కూడా కంపెనీ పాలన వల్ల నానా అవస్థలు పడ్డారు.
  • బ్రిటిష్‌ అధికారాన్ని అంతమొందించాలనే లక్ష్యంతో గిరిజనులు పలుచోట్ల హింసాత్మక పద్ధతిలో తిరుగుబాటు చేశారు.
  • బ్రిటిష్‌ పాలనలోని మరాఠా ప్రాంతంలోని కోలి గిరిజనులు 1784-85లో తొలిసారిగా తిరుగుబాటు చేశారు. 
  • ఫ్రెంచ్‌ విప్లవం జరిగిన సంవత్సరంలోనే అంటే 1789లో చోటానాగ్‌పుర్‌ ప్రాంతంలోని తమల్‌ తెగ గిరిజనులు అక్కడి కంపెనీ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
  • క్రీ.శ. 1800, 1817లో చోటానాగ్‌పుర్, పలమౌ ప్రాంతంలోని చిరో-చొగటా తెగ గిరిజనులు స్థానికులతో ఐక్యమై బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
  • 1857లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుబాటు ప్రారంభంకాగానే పలమౌ, రాంచీ, హజారీబాగ్‌ ప్రాంతాల్లో పితాంబర్‌ నాయకత్వంలో చిరో తెగ గిరిజనులు భారీ తిరుగుబాటు లేవదీశారు.

బిల్‌ గిరిజనుల తిరుగుబాటు

హేస్టింగ్స్‌ గవర్నర్‌ జనరల్‌గా పనిచేస్తున్న రోజుల్లో పశ్చిమ కనుమల్లోని ఖాందేశ్‌ ప్రాంతంలో నివసించే బిల్‌ తెగ గిరిజనులు ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనను నిరసిస్తూ తిరుగుబాటు చేశారు.

  • రెండో పీష్వా బాజీరావ్, అతని సేనాధిపతి త్రయంబిక్‌జీ డాంగ్లియా బిల్‌ తెగ వారిని రెచ్చగొట్టారని బ్రిటిష్‌వారు ఆరోపించారు.
  • కొత్త పాలకుల పరిపాలనలో తమకు కష్టాలు ఎదురవుతాయని వ్యవసాయం చేసుకునే బిల్‌ తెగ గిరిజనులు నమ్మారు. వారిలో అభద్రతా భావం ఏర్పడింది. ఈ కారణంతోనూ బిల్‌ తెగలు తిరుగుబాటు చేయగా బ్రిటిష్‌ సైన్యాలు వారిని అణచివేశాయి.
  • బర్మా యుద్ధంలో బ్రిటిష్‌ సేనలకు ఎదురుదెబ్బ తగలగానే 1824-25లో బిల్‌లు సేవారాం నేతృత్వంలో మరోసారి తిరుగుబాటు చేశారు.
  • బిల్‌ తెగ వారు 1846 వరకు పోరాటాన్ని కొనసాగించారు.

రమోసే తెగ తిరుగుబాట్లు

భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో నివసించే ఆటవిక, గిరిజన తెగల్లో రమోసేలు కూడా ముఖ్యలు. 

  • వీరు బ్రిటిష్‌ పరిపాలన వల్ల నష్టపోయినందువల్ల తిరుగుబాటు చేయడానికి సిద్ధపడ్డారు.
  • చిత్తుర్‌సింగ్‌ నాయకత్వంలో రమోసే తెగవారు 1822లో తిరుగుబాటు లేవదీశారు.
  • సతారా పరిసరాల్లో దాడులు చేసి భీభత్సం సృష్టించారు. 
  • 1825-26, 1829ల్లో కూడా రమోసేలు తిరుగుబాట్లు చేశారు. కానీ వీటన్నింటిని బ్రిటిష్‌ సైన్యాలు అణచివేశాయి.

రచయిత : డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని