ఒకేసారి చదవొచ్చా?

బీకాం కంప్యూటర్స్‌ ఈ ఏడాది పూర్తి చేశా. టీఎస్‌లాసెట్, పీజీఈసెట్‌ రెండిటిలోనూ అర్హత సాధించాను. లా డిగ్రీ, ఎంబీఏ ఒకేసారి చదివే అవకాశం ఉంటుందా?

Published : 24 Jun 2024 00:25 IST

బీకాం కంప్యూటర్స్‌ ఈ ఏడాది పూర్తి చేశా. టీఎస్‌లాసెట్, పీజీఈసెట్‌ రెండిటిలోనూ అర్హత సాధించాను. లా డిగ్రీ, ఎంబీఏ ఒకేసారి చదివే అవకాశం ఉంటుందా?

ఎస్‌.ఆనంద్‌ 

యూజీసీ నిబంధనల ప్రకారం రెండు డిగ్రీలూ ఒకే సమయంలో చదివే అవకాశం ఉంది. కానీ, వాటిలో ఒకటి రెగ్యులర్‌గా చదివితే, మరొకటి ఆన్‌లైన్‌/ దూరవిద్య/  ఓపెన్‌ యూనివర్శిటీ ద్వారా చదవాలి. ఒకవేళ రెండు ప్రోగ్రాముల తరగతుల సమయాలు వేర్వేరు సమయాల్లో ఉంటే మాత్రమే రెండు ఫుల్‌ టైమ్‌ ప్రోగ్రాంలు ఒకే సమయంలో రెగ్యులర్‌గా చదవొచ్చు. మీరు లా డిగ్రీ, ఎంబీఏ డిగ్రీలను ఒకేసారి చదవాలని అనుకొంటున్నారు. కానీ వీటిలో ఒకటి అండర్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీ అయితే, మరొకటి పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీ. పైగా ఇవి రెండూ ప్రొఫెషనల్‌ డిగ్రీలే. లా డిగ్రీ దూరవిద్య/ ఆన్‌లైన్‌ పద్ధతిలో అందుబాటులో లేదు. ఎంబీఏ ప్రోగ్రాంను దూరవిద్య/ ఆన్‌లైన్‌ ద్వారా చదివితే మెరుగైన ఉద్యోగాలు పొందే అవకాశాలు తక్కువ. 

ప్రొఫెషనల్‌ డిగ్రీలు చదివేవారు ఆ ప్రోగ్రాం మీదే పూర్తి దృష్టి పెట్టాలి. సంబంధిత నైపుణ్యాలు, మెలకువలు, విషయ పరిజ్ఞానం పెంపొందించుకొని ఆ రంగంలో మంచి ప్రొఫెషనల్‌గా ఎదగడానికి ప్రయత్నించాలి. ఒకే సమయంలో రెండు విభిన్న ప్రొఫెషనల్‌ ప్రోగ్రాంలు చదివితే దేనికీ న్యాయం చేసే అవకాశం ఉండదు. ఒకవేళ మీరు రెండు డిగ్రీలనూ ఒకేసారి చదవాలనుకుంటే- మొదటి డిగ్రీలో నైపుణ్యాలతో సంబంధం ఉండే రెండో ప్రోగ్రాంను ఎంచుకుంటే మేలు. మీ దీర్ఘకాలిక కెరియర్‌ ఆశయాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. లా, ఎంబీఏల్లో ఏదో ఒక డిగ్రీని మాత్రమే ఎంచుకొని ఆ రంగంలో మంచి కెరియర్‌ నిర్మించుకునే ప్రయత్నం చేయడం సముచితం. 

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని