హ్యాకింగ్‌లో శిక్షణ తీసుకోనా?

ఎంసీఏ చదువుతున్నా. హ్యాకింగ్‌లో శిక్షణ తీసుకుంటే ఈ కోర్సుపై ప్రతికూల ప్రభావం పడుతుందా?  

Updated : 19 Jun 2024 03:52 IST

ఎంసీఏ చదువుతున్నా. హ్యాకింగ్‌లో శిక్షణ తీసుకుంటే ఈ కోర్సుపై ప్రతికూల ప్రభావం పడుతుందా? - సంతోష్‌

ప్రస్తుత ఉద్యోగమార్కెట్‌లో డిగ్రీల కంటే నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరుగుతూ ఉంది. నైపుణ్యాలు లేకుండా ఎన్ని డిగ్రీలు చదివినా ఉపయోగం లేదు. అదే సమయంలో నైపుణ్యాలు ఉండి, డిగ్రీ లేకపోయినా ఇబ్బందే! ప్రస్తుతం ఎంసీఏ ప్రోగ్రామ్‌ను నాలుగు సెమిస్టర్లతో రెండు సంవత్సరాల వ్యవధిలో అందిస్తున్నారు. గతంలో ఈ ప్రోగ్రాం ఆరు సెమిస్టర్లతో మూడు సంవత్సరాలు ఉండేది. గతంతో పోలిస్తే, ఇప్పటి ఎంసీఏ సిలబస్‌ కొంత తక్కువ. ఎంసీఏ చదివినవారు బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ), బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్, ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లు చదివినవారితో ఉద్యోగాలకోసం పోటీ పడాలి. దీన్ని తట్టుకొని ఉద్యోగం పొందాలంటే ఎంసీఏ డిగ్రీతో పాటు మరేదైనా కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత రంగంలో నైపుణ్యాలు పెంచుకోవడం తప్పనిసరి. నిత్యం జరుగుతూ ఉన్న సైబర్‌ మోసాలను ముందే పసిగట్టడానికీ, మోసం జరిగాక నేరపరిశోధనకూ హ్యాకింగ్‌లో నైపుణ్యాలున్నవారు చాలా అవసరం. భవిష్యత్తులో కూడా హ్యాకింగ్‌లో నైపుణ్యాలు ఉన్నవారికి మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. హ్యాకింగ్‌ కూడా కంప్యూటర్‌ రంగానికి సంబంధించిన విభాగమే కాబట్టి అది మీ ఎంసీఏ కోర్సుపై ఎలాంటి ప్రభావమూ చూపదు. ఎంసీఏతో పాటు హ్యాకింగ్, డేటా సైన్స్, బిజినెస్‌ అనలిటిక్స్, మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డిజిటల్‌ బిజినెస్‌ లాంటి కోర్సుల్లో మీకు నచ్చినవాటిని కూడా నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రపంచంలో అందరికీ రోజుకు 24 గంటల సమయమే ఉంటుంది. మీరు ప్రణాళిక ప్రకారం సమయాన్ని విభజించి నిరభ్యంతరంగా హ్యాకింగ్‌లో శిక్షణ తీసుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంసీఏ ప్రోగ్రామ్‌ను అశ్రద్ధ చేయకండి.
- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని