జాగ్రఫీదే హవా!

ఇటీవల జరిగిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది పరీక్షతో పోలిస్తే... సరళంగా, సులభంగా ఉంది. సివిల్స్‌తో సంబంధమున్న ప్రశ్నలతో ఆచరణాత్మకంగా రూపొందిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 01 Jul 2024 04:16 IST

సివిల్స్‌ ప్రిలిమ్స్‌-2024 విశ్లేషణ

ఇటీవల జరిగిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది పరీక్షతో పోలిస్తే... సరళంగా, సులభంగా ఉంది. సివిల్స్‌తో సంబంధమున్న ప్రశ్నలతో ఆచరణాత్మకంగా రూపొందిందన్న
అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్ర సరళిని అధ్యయనం చేసి, విశ్లేషించడం ద్వారా ఈసారి ఏ అంశాలకు ప్రాధాన్యం లభించిందో గుర్తించవచ్చు.

‘‘వివిధ ఇన్‌స్టిట్యూట్ల ప్రశ్నల నిధులెన్నిటికో సమాధానాలు రాయటం అనవసరం. సాధన చేసిన ప్రశ్నలన్నీ వాస్తవ పేపర్‌ కంటే చాలా క్లిష్టంగా ఉన్నాయి. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1లో అడిగేవాటికంటే ఎక్కువ కష్టమైన ప్రశ్నలను ప్రాక్టీసు చేశాం. అనవసరంగా చాలా పేపర్లకు సమాధానాలు రాశాం...’’‘‘కిందటి సంవత్సరం సంక్లిష్టమైన ప్రశ్నలు ఎక్కువగా అడిగారు. ఈ ఏడాది కూడా అలాగే ఉంటాయని ఊహించినా అలా జరగలేదు.’’

‘‘ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివితే అత్యధికమైన ప్రశ్నలు కవర్‌ అవుతాయి. ఎక్కువ మెటీరియల్‌ చదవడం అనవసరం.’’

‘‘కిందటి ఏడాది పేపర్‌లాగే ఉంటుందనుకుని పరీక్ష రాయలేదు. నా సన్నద్ధత సరిపోదనుకున్నా. కానీ ప్రశ్నపత్రం చూశాక తప్పు చేశానని అర్థమైంది. పరీక్ష రాయక మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నా.’’

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ప్రిలిమినరీ జరగాక ఇవీ కొందరు విద్యార్థుల స్పందనలు. 

ప్రతి అభ్యర్థి స్పందనా భిన్నంగా ఉన్నప్పటికీ.. ఈ ఏడాది పేపర్‌ గత ఏడాది కంటే సులభంగా ఉందనేది ఎక్కువమంది అభిప్రాయం.

కిందటి ఏడాది సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం పేపర్‌ అసాధారణంగా ఉంది. ప్రశ్నల శైలీ, ఎంచుకోవల్సిన సమాధానాల శైలినీ మార్చేశారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల సమాధానాలు తికమకకు గురిచేశాయి. ఎక్కువమంది విద్యార్థులు సమాధానాలు రాయలేకపోయారు. రాసినవారివీ తప్పయ్యాయి. 

కిందటి ఏడాది విద్యార్థుల నిరసనలకు ప్రతిస్పందనగా ఈ ఏడాది పేపర్‌ను రూపొందించినట్లుంది. అంతా బాగుందనే భావన కలిగేలా ఉంది. ఈ సంవత్సరం ‘ఆన్‌లైన్‌ రిప్రజెంటేషన్‌ పోర్టల్‌’ను యూపీఎస్‌సీ అందుబాటులో ఉంచింది. విద్యార్థులు వివాదాస్పదమైన ప్రశ్నలుగా భావించినవాటిని దానిలో పోస్ట్‌ చేయొచ్చు. వారి సందేహాలు సరైనవేనని యూపీఎస్‌సీ భావిస్తే.. ఆ ప్రశ్నలను తొలగిస్తుంది. ఆ తొలగింపు ప్రభావం కటాఫ్‌ మార్కుల్లోనూ ప్రతిఫలిస్తుంది.  

వచ్చిన విమర్శల ఆధారంగా...

గత ఏడాది పేపర్‌ మీద వచ్చిన విమర్శల ఆధారంగా యూపీఎస్‌సీ ఇలా నిర్ణయించినట్లు అనిపిస్తుంది. 

ఎ) ఎవరూ ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా కచ్చితంగా సిలబస్‌ పరిధి నుంచే ప్రశ్నలు ఇవ్వడం  
బి) గత ఏడాదితో పోలిస్తే ప్రశ్నల మిశ్రమాన్ని మార్చడం. 
సి) కోచింగ్‌ సెంటర్ల వాళ్లు ముందుగా ఊహించడానికి అవకాశం ఇవ్వని ప్రశ్నలు అడగడం
డి) సరళమైన, సంక్లిష్టమైన ప్రశ్నలూ.. ఒకే సమాధానం, బహుళ సమాధానాల ప్రశ్నల సమ్మేళనంగా ప్రశ్నపత్రాన్ని తయారుచేయడం 

పేపర్‌-1  

ఇండియన్‌ పాలిటీ అండ్‌ గవర్నెన్స్‌ నుంచి అత్యధికంగా 21 ప్రశ్నలు, కరెంట్‌ అపైర్స్‌ నుంచి 20 ప్రశ్నలు వచ్చాయి. ఇండియన్‌ అండ్‌ వరల్డ్‌ జాగ్రఫీ నుంచి 18, జనరల్‌ సైన్స్, ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ల నుంచి 12 చొప్పున అడిగారు. 

  • పాలిటీ ప్రశ్నలు సరళంగా, ఈమధ్య నిర్వహించిన ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ ప్రశ్నల కంటే సులువుగా ఉన్నాయి. 
  • జాగ్రఫీ ప్రశ్నలు కూడా సులభంగానే ఉన్నాయి. చాలా ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే వచ్చాయి. 
  • 7 ప్రశ్నలు వచ్చిన ఎన్విరాన్‌మెంటల్‌ ఎకాలజీ తేలిగ్గానే ఉంది. దీనికి జాగ్రఫీతో సంబంధం ఉండటం వల్ల ప్రశ్నల్లో జాగ్రఫీ, ఎన్విరాన్‌మెంట్‌ల ఆధిపత్యం కనపడింది.
  • ఎకనామిక్, సోషల్‌ డెవలప్‌మెంట్‌ ప్రశ్నలు కొంత క్లిష్టంగా ఉన్నాయి. చాలా ప్రశ్నలు వర్తమాన ఆర్థిక ధోరణులపై అడిగారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం లభించింది. 
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రశ్నల స్థాయి మధ్యస్థంగా ఉంది. మౌలిక సైన్స్‌పై  ప్రశ్నలు అడిగారు. రాష్ట్ర సర్వీసు పరీక్షల పేపర్లలో అడిగిన ప్రశ్నలను పోలినవీ ఉన్నాయి. 
  • కరెంట్‌ అఫైర్స్‌ ప్రశ్నలు చాలామంది అంచనా వేసిన విషయాల నుంచే వచ్చాయి.  
  • ఆధునిక చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు లేకపోవడం, చరిత్రకు ప్రాధాన్యం తగ్గడం (8 ప్రశ్నలు) ఆశ్చర్యపరిచింది. 
  • ప్రశ్నలు ఆచరణాత్మకంగా ఉన్నాయని చెప్పొచ్చు. విద్యాసంబంధమైనవే కాకుండా.. సివిల్‌ సర్వీసెస్‌లాంటి పరీక్షకు నేరుగా సంబంధించినవిగా ఉన్నాయి.

 పేపర్‌-2

గత ఏడాది కంటే సరళంగా ఉంది. 

నంబర్‌ సిస్టమ్‌ నుంచి 16, డేటా సఫిషియన్సీ నుంచి 11 ప్రశ్నలు, పర్సంటేజెస్‌ నుంచి 4, టైమ్‌ అండ్‌ వర్క్‌ నుంచి 3 ప్రశ్నలు వచ్చాయి. మిగిలిన అంశాల నుంచి 1, 2 ప్రశ్నల చొప్పున అడిగారు. మొత్తం 53 ప్రశ్నలు. కాంప్రహెన్షన్‌ 27 ప్రశ్నలతో కలిపి మొత్తం ప్రశ్నలు 80.

కటాఫ్‌ మార్కుల అంచనా.. 

కటాఫ్‌ మార్కుల విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందడం సహజమే. అయితే కటాఫ్‌ అనేది ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పేపరు క్లిష్టత, పోటీ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. పోటీ అలాగే ఉన్నప్పటికీ కిందటి ఏడాది కటాఫ్‌ తక్కువగానే ఉంది. పేపరు కష్టంగా ఉండటంతో ఎవరూ సరిగా రాయలేకపోయారు. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది పేపరు సులభంగానే ఉండటం వల్ల కటాఫ్‌ మార్కులు పెరుగుతాయి.

కొన్ని సందేహాలూ.. సమాధానాలూ 

వచ్చే ఏడాది నుంచి పేపర్‌ ఇలాగే ఉంటుందా? 

అభ్యర్థులు ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రశ్నలే అడుగుతుంటారు. కచ్చితంగా కాదనే చెప్పొచ్చు. ఒక ఏడాది ఇచ్చిన ప్రశ్నపత్రాలు తర్వాతి సంవత్సరాల్లో అదే రకంగా ఉండవు, మారుతూనే ఉంటాయి. అభ్యర్థుల మారుతున్న సామర్థ్యానికి అనుగుణంగా ప్రశ్నల రూపకల్పన చేయాలన్న అలగ్‌ కమిటీ, రెండో ఏఆర్‌సీ, నిగ్‌వేకర్‌ కమిటీల సిఫారసుల ప్రకారమే ఇలా జరుగుతోంది. 

‘‘ఈ పేపర్‌ రాయడానికి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని ప్రధానాంశాలు చదివితే సరిపోతుంది’’ అంటున్నారు స్నేహితులు. నిజమేనా?

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు పునాదిని ఏర్పరుస్తాయి. కానీ పూర్తిగా వీటిమీదే ఆధారపడకూడదు. ప్రత్యేక పుస్తకాలనూ చదవాలి.

సివిల్స్‌కు కోచింగ్‌ అవసరమా? దీని ప్రయోజనంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

కోచింగ్‌ వల్ల ఉపయోగం అనేది పూర్తిగా వ్యక్తిగత అనుభవం. ఏ పోటీ పరీక్షకైనా కోచింగ్‌ అనేది ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలోనే ఉపయోగపడుతుంది. ఇది అకడమిక్స్‌ నుంచి పోటీ పరీక్షలకు వారధి నిర్మించడానికి సాయపడుతుంది. ఇక తరగతి బోధన విద్యార్థికి క్రమశిక్షణను నేర్పిస్తుంది. అది విజయానికి బాట వేస్తుంది. అయినప్పటికీ అంతిమ విజయం అనేది మాత్రం వ్యక్తిగత కృషి మీదే ఆధారపడుతుంది. 

మోడల్‌ పేపర్లకు సమాధానాలు రాయడం ఉపయోగమేనా? ఉంటే ఏ పేపర్లకు సమాధానాలు రాస్తే మేలు? 

మోడల్‌ పేపర్లకు సమాధానాలు రాయడమనేది ఒక స్థాయి వరకూ ఉపయోగపడుతుంది. మార్కెట్లో చాలా మోడల్‌ పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి. అవే ప్రశ్నలు యథాతథంగా ఎప్పుడూ రావు. ఒకవేళ వచ్చినా అది యాదృచ్ఛికమే. 

నేను పరీక్ష బాగా రాయలేదనే అనుకుంటున్నా. మార్కులు కూడా కటాఫ్‌ అంచనా కంటే తక్కువే వచ్చాయి. ఓ ప్రయత్నం వృథా అయిందనుకుంటున్నా. ఇప్పుడేం చేయాలి? 

సివిల్‌్్స పరీక్షను గౌరవించి.. మీ సామర్థ్యం మేరకు గట్టిగా సన్నద్ధమై రాసిననట్లయితే.. ప్రయత్నం వృథా అయిందనుకోవడం పొరపాటు. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడమనేది.. ఈత నేర్చుకోవడం లాంటిది. నీటిలోకి దూకకుండా ఈత నేర్చుకోలేరు. అలాగే అటెమ్ట్‌ చేయడం కూడా పరీక్ష సన్నద్ధతలో భాగమే. 

ఈ పరీక్ష నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి? 

పరీక్షను తక్కువగా అంచనా వేయొద్దు. సరళమైన ప్రశ్నల నుంచి సంక్లిష్టమైన వాటి వరకూ అన్ని రకాల ప్రశ్నలకూ తయారవ్వాలి. 

ఈ ఏడాది జరిగిన పరీక్ష ప్రత్యేకత ఏమిటి? 

ఈ సంవత్సరం సమయం విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష రాయడానికి అనుమతించలేదు. ఇదే పద్ధతి భవిష్యత్తులోనూ కొనసాగించనున్నారు.  

తెలుగు రాష్ట్రాల్లో...

  • రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 79,043 మంది దరఖాస్తు చేస్తే.. 42,560 మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే 53.84 శాతం. జాతీయ సగటు 47 శాతం కంటే ఇది చాలా ఎక్కువ. 
  • గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది హాజరైన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇటీవల జరిగిన టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమైన విద్యార్థులు ప్రిలిమినరీకి కూడా ప్రయత్నించడం దీనికి కారణం కావొచ్చు. 

వి. గోపాలకృష్ణ డైరెక్టర్, బ్రెయిన్‌ ట్రీ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని