కొనసాగించాలా.. వదిలేయాలా?

ప్రయాణాన్ని ఎవరైనా గమ్యం చేరుకోవాలనే ఉద్దేశంతోనే మొదలుపెడతారు. కానీ కొంత దూరం వెళ్లాకే అది తమకు సరికాదని తెలుస్తుంది. అప్పుడు వెనక్కు తిరిగి వెళ్లలేక.. అలాగని ముందుకు కొనసాగనూలేక ఇబ్బంది పడతారు.

Published : 06 Jun 2024 00:38 IST

ప్రయాణాన్ని ఎవరైనా గమ్యం చేరుకోవాలనే ఉద్దేశంతోనే మొదలుపెడతారు. కానీ కొంత దూరం వెళ్లాకే అది తమకు సరికాదని తెలుస్తుంది. అప్పుడు వెనక్కు తిరిగి వెళ్లలేక.. అలాగని ముందుకు కొనసాగనూలేక ఇబ్బంది పడతారు. ఇలాంటి  స్థితి కొన్నిసార్లు విద్యార్థులకూ ఎదురవుతుంది.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేయాలనుకున్నాడు మనీష్‌. కానీ స్నేహితులు ఉద్యోగావకాశాలు బాగుంటాయని చెప్పడంతో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరాడు. చేరిన కొన్ని రోజుల్లోనే అది అంత ఆసక్తికరంగా అనిపించకపోవడంతో కొనసాగాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయాడు.
లాయరు కావాలని కలలు కనేది లహరి. కానీ తను చదివే కాలేజీలో బీఎల్‌ కోర్సు లేకపోవడంతో సాధారణ డిగ్రీలో చేరింది. ఆ తర్వాత అసంతృప్తితో చదవలేక.. మధ్యలో మానేస్తానంటే ఇంట్లో ఏమంటారోననే భయంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది.

ఇలాంటి పరిస్థితులు సాధారణంగా కొంతమంది విద్యార్థులకు ఎదురవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు కాసేపు ప్రశాంతంగా ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. నిజంగానే కోర్సు నచ్చలేదా? లేదా మీ స్నేహితులెవరూ ఈ కోర్సులో లేకపోవడం వల్ల కొనసాగించలేరనే నిర్ణయానికి వచ్చారా? కాలేజీ కూడా నచ్చలేదా? అలాగే కొంతకాలం గడిస్తే.. ఆ తర్వాత సర్దుకోగలరేమో కూడా చూడాలి. ఇలా రకరకాల కోణాల్లో ఆలోచించి అవగాహన పెంచుకున్న తర్వాతే స్పష్టమైన నిర్ణయానికి రావాలి.

  • ప్రస్తుతం చదువుతోన్న కోర్సులో ఎదుర్కొంటోన్న ఇబ్బందుల గురించి వివరంగా రాసుకోవాలి. అలాగే వాటి పరిష్కారాల విషయంలో స్పష్టత ఉండాలి. చివరిగా సమస్యలను పరిష్కరించుకోవడం మీ వల్ల సాధ్యమవుతుందో లేదో కూడా నిజాయతీగా ఆలోచించాలి.  
  • ఒక పని చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని తెలిసి కూడా దాన్ని అలాగే కొనసాగించడం ఒకరకంగా అవివేకమే అవుతుంది. రాబోయే నష్టాన్ని ఊహించడమే కాదు.. దాన్ని మధ్యలోనే నిరోధించే అవకాశం ఉందని తెలిసీ చివరివరకూ స్తబ్ధుగా ఉండిపోవడం వల్ల సంవత్సరం మొత్తం వృథా అయ్యే ప్రమాదం ఉంటుంది.
  • ముందుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని.. స్పష్టమైన అవగాహనకు రావాలి. ఆ తర్వాత అధ్యాపకుల, కుటుంబపెద్దల సలహాలూ తీసుకోవాలి. ఇలాంటప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మీ సమస్య గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఈ తర్వాత కోర్సు మారే అవకాశం లేకపోవచ్చు. దాంతో ఇష్టంలేని కోర్సులోనే బలవంతాన కొనసాగాల్సి వస్తుంది.
  • స్వతహాగా సబ్జెక్టు మీద ఆసక్తి లేనప్పుడు ఎంత చదివిగా అర్థంకాకపోవచ్చు. ఒకవేళ బలవంతాన చదివినా అవేమీ పరీక్షల నాటికి గుర్తుండకపోవచ్చు కూడా. అదే ఇష్టంగా చదివితే పరిస్థితి సానుకూలంగా ఉంటుంది.
  • ఏదైనా పనిని ఇష్టంగా చేసినప్పుడు.. దాని కోసం ఎంత శ్రమపడటానికైనా వెనకాడరు. అది పెద్ద భారంగా అనిపించదు కూడా. దీంతో అనుకున్న మార్కులూ సాధించే అవకాశం ఉంటుంది. బలవంతాన చదివితే పాస్‌ మార్కులు తెచ్చుకోవడమూ కష్టమే కావచ్చు.
  • ఇష్టంలేని కోర్సును విద్యా సంవత్సరం మొదట్లోనే వదిలేశారు అనుకుందాం. అంతవరకూ బాగానే ఉందిగానీ.. ఆ తర్వాత ఏం చేస్తారనే విషయంలోనూ స్పష్టమైన అవగాహన ఉండాలి. అంటే మెరుగైన ప్లాన్‌ బి ఎప్పుడూ మీ దగ్గర సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఎలాంటి సంకోచం లేకుండా ధైర్యంగా నిర్ణయం తీసుకోగలుగుతారు. ఆ తర్వాత తీరిగ్గా చింతించాల్సిన పరిస్థితీ ఎదురు కాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని