AP History: రాతల్లో రగిలిన చైతన్యం!

ఆంధ్ర ప్రజలకు సాహసం, ధిక్కారం, తిరుగుబాటు లాంటి ధోరణులను అలవాటు చేసి, దేశభక్తిని, విప్లవ భావాలను పెంపొందించిన ఘనత విప్లవ రచయితలకు దక్కుతుంది. సులువైన మాటలతో అందరికీ సులభంగా అర్థమయ్యే, చేరువయ్యే పాటలు, నినాదాలు రాసి సామాజిక అణచివేతను, ప్రభుత్వాల నిర్బంధాలను ఎదిరించారు.

Published : 01 Jul 2024 01:33 IST

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర

ఆంధ్ర ప్రజలకు సాహసం, ధిక్కారం, తిరుగుబాటు లాంటి ధోరణులను అలవాటు చేసి, దేశభక్తిని, విప్లవ భావాలను పెంపొందించిన ఘనత విప్లవ రచయితలకు దక్కుతుంది. సులువైన మాటలతో అందరికీ సులభంగా అర్థమయ్యే, చేరువయ్యే పాటలు, నినాదాలు రాసి సామాజిక అణచివేతను, ప్రభుత్వాల నిర్బంధాలను ఎదిరించారు. నవతరం ఆలోచనల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. జాతీయోద్యమంతో పాటు స్వాతంత్య్రానంతరం సామాజిక, రాజకీయ పోరాటాలకు స్ఫూర్తినిచ్చారు. కర్షక, కార్మిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. సినీగీతాల్లోనూ నిప్పులు కురిపించారు. ఆ విధంగా తమ రాతలతో చైతన్యం రగిలించిన కవులు, వారి రచనలు, చేసిన కృషి గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. తెలుగు గడ్డపై నాటకాల ద్వారా సామాజిక విప్లవాలకు బాటలు వేసిన సంస్థలు, సమాజాలు, వాటి నుంచి వచ్చి రాజకీయాల్లో రాణించిన ప్రముఖ నాయకుల గురించి తెలుసుకోవాలి.


ఉద్యమాలు - విప్లవ సాహిత్యం

విప్లవ సాహిత్యం మొదటగా 1967లో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లా సిలిగిరి డివిజన్‌లో నక్సల్‌బరిలో జరిగిన ప్రతిఘటనలతో ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆంధ్రాలో శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలో రైతుల తిరుగుబాటులో విప్లవ కవిత్వం మొదలైంది. ఈ పోరాటానికి నాయకత్వం వహించినవారు పాణిగ్రాహి సుబ్బారావు, వెంపటావు సత్యం, ఆదిభట్ల కైలాసం. విప్లవ ప్రచారానికి శక్తిమంతమైన సాధనం ‘పాట’. ఇతర రచనలతోపాటు విప్లవ సాహిత్యాన్ని రచించిన ప్రముఖులు ఎందరో ఉన్నారు. 


శ్రీశ్రీ: శ్రీరంగం శ్రీనివాసరావు స్వస్థలం  విశాఖపట్నం. బిరుదు మహాకవి.

రచనలు: మహాప్రస్థానం, మరో ప్రస్థానం, చరమరాత్రి, ఖడ్గసృష్టి, సావిత్రి, సత్యవంతుడు మొదలైనవి.

నవలలు: వీరనరసింహరాయ విజయం, పరిణయ రహస్యం.

ఈయన ‘తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా’ పాటకు ఉత్తమ గీత రచయితగా 1974లో జాతీయ అవార్డు అందుకున్నారు. 1970, ఫిబ్రవరిలో విశాఖపట్నంలో శ్రీశ్రీ షష్టిపూర్తి సభలో ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు సభకు హాజరైన రచయితలకు ‘సవాల్‌’ అనే కరపత్రాన్ని పంచారు. ఈ కరపత్రమే ఆంధ్రదేశంలో విప్లవానికి బీజం వేసింది. 1970, జులైలో శ్రీశ్రీ అధ్యక్షులుగా విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భవించింది. దీని తొలి సమావేశం ఖమ్మంలో జరిగింది. ఈ సంఘం 1970లోనే మొదటిసారిగా ‘ఝుంఝు’ అనే విప్లవ కవితా సంకలనాన్ని వెలువరించింది. శ్రీశ్రీ ప్రముఖ నినాదాలు ‘మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తాను’, ‘కార్మిక లోకపు కల్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి కలం పట్టిన కవి’.


ఆరుద్ర: అసలు పేరు భాగవతుల సదాశివశాస్త్రి.

కవితా రచనలు: పైలా పచ్చీసు,   ఏటికేదారి, గాయాలు గేయాలు.

కావ్యాలు: సినీవాలి, ఇంటింటి పద్యాలు, కూనలమ్మ పదాలు.

పరిశోధన గ్రంథాలు: సమగ్రాంధ్ర సాహిత్యం, రాముడికి సీత ఏమవుతుంది?

అనువాదాలు: వీర తెలంగాణ విప్లవ గీతాలు, వెన్నెల వేసవి.

ఆరుద్ర 1925లో జన్మించారు. ఈయన శ్రీశ్రీ బంధువు. ఉన్నత విద్య అనంతరం చాగంటి సోమయాజులు లాంటివారితో ఏర్పడిన పరిచయం తర్వాత కమ్యూనిజం వైపు ఆకర్షితులయ్యారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు. మద్రాసుకు చెందిన ‘ఆనందవాణి పత్రిక’కు రెండేళ్లు సంపాదకుడిగా వ్యవహరించారు. చిత్ర పరిశ్రమలో అనేక చిత్రాలకు మాటలు, పాటలు రాశారు.


విద్వాన్‌ విశ్వం: అసలు పేరు విశ్వరూపాచార్య. 1915లో అనంతపురం జిల్లాలో జన్మించారు. గురువు శంకరశాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నారు. విశ్వం మరొక గురువు నారాయణరావుతో కలిసి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ప్రజలను చైతన్యపరిచేందుకు గ్రంథ ప్రచురణ అవసరమని భావించి, ‘నవ్య సాహిత్యమాల’ అనే ప్రచురణ సంస్థను ఏర్పాటు చేశారు. ‘నవ్య సాహితి’ అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. ఈయన రాసిన పద్యకావ్యం ‘పెన్నేటి పాట’. ఇతర రచనలు కాదంబరి, అధర్వణ వేద. విప్లవ రచనల కారణంగా బ్రిటిష్‌ ప్రభుత్వం ఈయనపై దేశద్రోహం కేసు పెట్టి తిరుచిరాపల్లి కారాగారంలో నిర్బంధించింది. అక్కడే ఆయనకు అనేక మంది జాతీయ నాయకులతో పరిచయం ఏర్పడింది.


పాణిగ్రాహి సుబ్బారావు: 1933లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ప్రారంభంలో ఆలయ పూజారిగా పనిచేసేవారు. నక్సల్బరీ తిరుగుబాటులో పాల్గొన్నారు. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో చేరారు. ఉత్తరాంధ్రలో రైతుల ఉద్యమానికి అండగా నిలిచారు. ఈయన తన పాటలతో, జముకు కథలతో శ్రీకాకుళం పోరాటాన్ని ముందుండి నడిపారు. గ్రామీణ ఆంధ్రాలో పీపుల్స్‌వార్‌ను రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈయన రాసిన ప్రతిపద్యం గిరిజనుల నోట ఊతపదంగా మారింది.  శ్రీకాకుళ విప్లవ పోరాటంలో వీరమరణం పొందారు. ప్రముఖ రచనలు అరుణ కిరణాలు, అగ్ని కిరణాలు, తూర్పు జెండా, దేశభక్తులు. నినాదాలు ‘‘ఎరుపంటే కొందరికి భయం భయం.. వారికన్నా పసిపిల్లలు నయంనయం’’, ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు’’.


నాటక సంస్థలు

సురభి నాటక రంగం: 1850లో మహారాష్ట్ర నుంచి ఆంధ్ర దేశానికి వచ్చిన సైనికజాతి రాయలసీమ ప్రాంతంలో స్థిరపడింది. వీరిలో కొందరు వ్యవసాయం, తోలుబొమ్మలాటలు, వీధి నాటకాలు ప్రదర్శిస్తూ జీవితం గడిపేవారు. వీరిని ‘అరెకాపులు’ లేదా ‘అరె మరాఠీలు’ అనేవారు. వీరంతా వనారస కుటుంబానికి చెందినవారు. వీరి కుటుంబాలు పెరగడంతో రాయదుర్గం వారు, బాలకొండ వారు, సురభి వారు అనే మూడు శాఖలుగా విడిపోయారు. రాయదుర్గం వారు వ్యవసాయ రంగం, బాలకొండ వారు బొంబాయి సినీ పరిశ్రమలో, సురభి వారు నాటక ప్రదర్శనలు కొనసాగిస్తూ జీవితాన్ని గడిపారు. సురభి వారు కడప జిల్లా రాయచోటి తాలూకాలోని సురభి గ్రామంలో కీచకవధ నాటకం ప్రదర్శించారు. తర్వాతి కాలంలో వీరు ఆ ప్రాంతంలోనే స్థిరపడ్డారు. అందుకే వారిని సురభి వారుగా పిలుస్తారు. ఈ నాటక సమాజం అసలు పేరు ‘శ్రీశారదా మనోవినోదిని సంగీత నాటక సభ’. వీరు సురభి ప్రాంతంలో స్థిరపడినప్పటికీ సంచార నాటకాలను ప్రదర్శించేవారు. ఈ సురభి సమాజంలో స్త్రీ పాత్రని స్త్రీలు, పురుషుల పాత్రను పురుషులు ధరించేవారు. వీరి ప్రదర్శనలు అధికంగా రాయలసీమ ప్రాంతంలో సాగేవి. తర్వాతి కాలంలో మూడు  సమాజాలుగా విడిపోయి ప్రదర్శనలు ఇచ్చారు.

గుంటూరు హిందూ నాటక సమాజం: దీన్ని గుంటూరు ఫస్ట్‌ కంపెనీగా పిలిచేవారు. కొండుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి దీన్ని స్థాపించారు. దేశభక్త కొండా వెంకటప్పయ్య ఈ నాటక సమాజంలో ఉండి  స్త్రీ పాత్రలో నటించేవారు.

మైలవరం కంపెనీ - బెజవాడ: బాలభారతీ సమాజం మైలవరం కంపెనీగా పేరు పొందింది. స్థాపించినవారు మైలవరం జమీందారు వెంకట పాపారావు. ఈ సంస్థను తర్వాత విజయవాడకు మార్చారు.

జువైనల్‌ హిందూ థియేటర్‌ - మచిలీపట్నం: స్థాపించినవారు వెంకట శివరావు బాలకృష్ణయ్య. ఈ సమాజం ద్వారా మొదట తెలుగు నాటకాలు, తర్వాత హిందీ నాటకాలను ప్రదర్శించారు. ఈమని లక్ష్మణస్వామి ఈ నాటక సమాజంలో అనేక పాత్రలు ధరించి ప్రసిద్ధి పొందారు.

హిందూ నాటక సమాజం: ఈ సమాజాన్ని రాజమండ్రిలో స్థాపించారు. ఇమ్మనేని హనుమంతరావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, తోలేటి వేంకట సుబ్బారావు నాటకాలు రాశారు. టంగుటూరి ప్రకాశం, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాటకాలు వేశారు.

ధార్వాడ నాటక సమాజం: దీన్ని రాజమహేంద్రవరంలో స్థాపించారు. ఈ సమాజం ద్వారా హిందీలో నాటకాలు ప్రదర్శించారు. ఆ స్ఫూర్తితో గుంటూరులో కొండుభట్ల సుబ్రమణ్య శాస్త్రి నాటకాలు రచించి ప్రదర్శించారు. ఈ నాటక సమాజం తెలుగుదేశంలో నాటక ప్రదర్శనలకు స్ఫూర్తినిచ్చింది. దీని స్ఫూర్తితో నెల్లూరులో రెండు నాటక సమాజాలను స్థాపించారు.

మరికొన్ని నాటక సంస్థలు - ప్రాంతాలు:

  • రామవిలాస సభ - చిత్తూరు
  • సుగుణ విలాస సభ - మద్రాసు
  • వినోదిని సభ - బళ్లారి
  • బాలభారత సమాజం -   విజయవాడ
  • వాణీ విలాససభ - విజయ నగరం.

ఆంధ్రనాటక కళా పరిషత్తు 

వృత్తి నాటక కళాకారులకే కాకుండా భారతదేశంలో నాటక కళను విస్తృతం చేయడానికి, స్వయం ప్రతిభ ఉన్న కళాకారులను నాటకరంగం వైపు ఆకర్షించి తద్వారా వారిని ప్రోత్సహించడానికి స్థాపితమైందే ఆంధ్ర నాటక కళాపరిషత్తు. నాటకరంగం అభివృద్ధికి ఒక పత్రిక అవసరమని భావించి ‘నాట్యకళ’ అనే పత్రిక నడిపారు. వీటితోపాటు అనేక ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో నాటక సమాజాలు వెలసి జాతీయోద్యమాన్ని వ్యాప్తి చేశాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రజల్లో చైతన్యం తెచ్చాయి. సమాజంలో మూఢవిశ్వాసాల నిర్మూలనకు కృషి చేశాయి. విద్యావ్యాప్తికి పాటుపడ్డాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని