Virat - SKY : విరాట్ - సూర్యకుమార్‌.. ఇప్పుడిలా.. అప్పుడలా!

అది 2020 అక్టోబర్‌ 28.. భారత టీ20 లీగ్‌లో మరుపురాని రోజు.. మైదానంలో దూకుడుగా ఉండే పరుగుల రారాజుకి సవాల్‌ విసిరేలా ఓ యువ బ్యాటర్‌ ఆడిన తీరు అప్పట్లో...

Updated : 01 Sep 2022 15:25 IST

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: అది 2020 అక్టోబర్‌ 28.. భారత టీ20 లీగ్‌లో మరుపురాని రోజు.. మైదానంలో దూకుడుగా ఉండే పరుగుల రారాజుకి సవాల్‌ విసిరేలా ఓ యువ బ్యాటర్‌ ఆడిన తీరు అప్పట్లో వైరల్‌గా మారింది. వారిద్దరి మధ్య నాటకీయ సన్నివేశాలు చోటుచేసుకొన్నాయి. ఇంతకీ మ్యాచ్‌ను ఎగరేసుకుపోయిన ఆ బ్యాటర్‌ ఎవరో కాదు.. తాజాగా హాంకాంగ్‌పై విరుచుకుపడిన సూర్యకుమార్‌ యాదవ్. ఇక పరుగుల రారాజు విరాట్ కోహ్లీ అని తెలుసు కదా.. ఇప్పుడు మరోసారి ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. ఎందుకంటే అప్పుడు ప్రత్యర్థులుగా ఆగ్రహావేశాలకు లోనుకాగా.. ఇప్పుడు సహచరులుగా అభినందనల వర్షం కురిపించుకొన్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ప్రత్యర్థిగా ఉంటే మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో.. సహచరుల అద్భుత ఆటతీరును అభినందించడంలోనూ ముందుంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోండి..

ఇప్పుడిలా..

తాజాగా హాంకాంగ్‌పై భారత్ భారీ స్కోరు సాధించడంలో విరాట్ కోహ్లీ (59*), సూర్యకుమార్‌ యాదవ్ (68*) కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. దీంతో భారత్‌ 192/2 స్కోరు చేసింది. భారత్‌ ఇన్నింగ్స్‌లోని చివరి ఓవర్‌లో సూర్య కుమార్‌ నాలుగు సిక్సర్లు బాదేశాడు. దీంతో నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ‘ఏంటి భాయ్‌ ఆ కొట్టుడు’ .. ఇదిగో అందుకో ‘టేక్‌ ఏ బౌ’ అని అభినందించాడు. విరాట్ ప్రశంసలపై సూర్యకుమార్‌ స్పందించాడు. విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటిది ఊహించలేదని పేర్కొన్నాడు. ‘‘కోహ్లీ అలా చేయడం నాకు హృదయపూర్వకంగా అనిపించింది. అలానే ఇన్నింగ్స్‌ ముగియగానే వెళ్లకుండా విరాట్ వేచి ఉండటం చూసి కాస్త ఆశ్చర్యానికి లోనయ్యా.  చివరికి ఇలా చేస్తాడని ఊహించలేదు’’ తెలిపాడు.

గతంలో ఏం జరిగిందంటే..?

రెండేళ్ల కిందట టీ20 లీగ్‌లో ముంబయి, బెంగళూరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. కీరన్ పొలార్డ్‌ ముంబయికి కెప్టెన్‌గా వ్యవహరించాడు. కోహ్లీ నాయకత్వంలోని బెంగళూరు తొలుత బ్యాటింగ్‌ చేసింది. పడిక్కల్‌ (74), ఫిలిప్ (33) రాణించడంతో 20 ఓవర్లలో 164/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబయి 19.1 ఓవర్లలో ఐదు వికెట్లను మాత్రమే కోల్పోయి 166 పరుగులు సాధించింది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ (79*) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 14 ఓవర్లకు 107 పరుగులకు నాలుగు వికెట్లను నష్టపోయిన ముంబయిని హార్దిక్‌ పాండ్య (17)తో కలిసి సూర్య ఆదుకున్నాడు. విజయానికి మరో ఆరు పరుగులు అవసరమైన క్రమంలో హార్దిక్‌ పెవిలియన్‌కు చేరాడు. అయితే, ‘నేను ఉన్నాను’ అంటూ సూర్యకుమార్‌ ఫోర్‌ కొట్టి ముంబయిని గెలిపించాడు. ఈ క్రమంలో విరాట్, సూర్యకుమార్‌ మధ్య వాడీవేడీ సన్నివేశాలు వైరల్‌గా మారాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని