Rohit - Virat : విరాట్ కోహ్లీని అధిగమించిన రోహిత్ శర్మ‌.. అయితే ధోనీనే టాప్‌!

గత సంవత్సరం విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ టీమ్ఇండియా సారథ్య బాధ్యతలను అందుకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ విషయంలో విరాట్ కోహ్లీని...

Updated : 01 Sep 2022 13:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గత సంవత్సరం విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ టీమ్ఇండియా సారథ్య బాధ్యతలను అందుకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ విషయంలో విరాట్ కోహ్లీని రోహిత్ అధిగమించాడు. ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై భారత్‌ విజయం సాధించింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్‌గా 31 టీ20ల్లో భారత్‌ జట్టును గెలిపించినట్లైంది. ఇది రోహిత్‌కు 37వ మ్యాచ్‌ మాత్రమే కావడం విశేషం. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లీ సారథిగా 30 విజయాల (50 మ్యాచ్‌ల్లో) రికార్డును రోహిత్ తుడిచిపెట్టాడు. ఇక టీమ్‌ఇండియా తరఫున అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా మాజీ సారథి ఎంఎస్ ధోనీ కొనసాగుతున్నాడు. ధోనీ నాయకత్వంలో 72 మ్యాచ్‌లకుగాను భారత్‌ 41 విజయాలను నమోదు చేసింది. 

3500 మార్క్‌ను దాటిన రోహిత్

టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుడిగా రోహిత్ శర్మ (134 మ్యాచుల్లో 3,520 పరుగులు) కొనసాగుతున్నాడు. పాక్‌పై 12 పరుగులు సాధించిన రోహిత్ అప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న మార్టిన్ గప్తిల్ (121 మ్యాచుల్లో 3,497)ను అధిగమించిన విషయం తెలిసిందే. తాజాగా హాంకాంగ్‌పై 21 పరుగులు చేసిన రోహిత్ శర్మ టీ20ల్లో 3,500 పరుగుల మార్క్‌ను దాటిన తొలి బ్యాటర్‌గా అవతరించాడు. మరోవైపు హాంకాంగ్‌పై అదరగొట్టిన విరాట్ కోహ్లీ కూడా ఓ ఘనతను తన ఖాతాలో వేసుకొన్నాడు. 101 టీ20ల్లోనే 50.78 సగటుతో 3,402 పరుగులు సాధించిన కోహ్లీ అత్యధిక రన్స్‌ చేసిన వారి జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

ఆరేళ్ల తర్వాత కోహ్లీ బౌలింగ్‌

విరాట్ కోహ్లీ రెగ్యులర్‌ బౌలింగ్‌ వేయడు. అయితే హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక ఓవర్‌ వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అదీనూ హాంకాంగ్‌ ఇన్నింగ్స్‌లోని 17వ ఓవర్‌ కావడం విశేషం. ఈ ఓవర్‌లో కేవలం ఆరు పరుగులను మాత్రమే ఇచ్చాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత బంతిని సంధించిన విరాట్ కోహ్లీ ఎంతో కంట్రోలింగ్‌గా బౌలింగ్‌ వేశాడు. దీంతో నెట్టింట్లో వైరల్‌గా మారిపోయాడు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని