Andhra News: నెల్లూరు జంట హత్యల కేసు.. హోటల్‌ సప్లయరే హంతకుడు: ఎస్పీ విజయరావు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కృష్ణారావు, సునీత దంపతులను అతి కిరాతకంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. కృష్ణారావు క్యాంటీన్‌లో

Published : 01 Sep 2022 03:21 IST

నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కృష్ణారావు, సునీత దంపతులను అతి కిరాతకంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. కృష్ణారావు క్యాంటీన్‌లో పనిచేసే సప్లయర్‌ శివ.. మృతుడి బంధువు రామకృష్ణ కలిసి ఈ హత్యలు చేసినట్లు జిల్లా ఎస్పీ విజయరావు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు.

‘‘హోటల్‌లో అనేక సార్లు తిట్టారని కృష్ణారావుపై శివ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో కోపం, డబ్బు కోసం పథకం ప్రకారమే వారిద్దరినీ హత్య చేశారు. ముందు కృష్ణారావు గొంతు కోసి.. ఆ తర్వాత నిద్రిస్తున్న సునీత తలపై బలంగా కొట్టి చంపేశారు. ఇంట్లోని రూ.1.60 లక్షలు తీసుకెళ్లారు. డబ్బుపై ఆశతో శివకు రామకృష్ణ సాయం చేశాడు. హత్య చేసినట్లు ఎవరికీ అనుమానం రాకుండా కృష్ణారావు, సునీత దంపతుల అంత్యక్రియల్లోనూ వారు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ద్వారా మరిన్ని వివరాలు సేకరించాం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన దర్యాప్తునకు అనుగుణంగా 15 రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసి నిందితులను న్యాయస్థానంలో హాజరుపరుస్తాం’’ అని ఎస్పీ తెలిపారు.

అసలేం జరిగింది..

నగరంలోని పడారుపల్లి అశోక్‌నగర్‌లో వాసిరెడ్డి కృష్ణారావు (54), సునీత (50) దంపతులు నివాసం ఉంటున్నారు. నెల్లూరులోని కరెంటు ఆఫీసు సెంటర్‌లో కృష్ణారావు హోటల్‌ నిర్వహించేవారు. రోజూ రాత్రి హోటల్‌ మూసేసిన తర్వాత.. ఆలస్యంగా ఇంటికి చేరుకునేవారు. ఈ నెల 27న రాత్రి 11 నుంచి 12 గంటల ప్రాంతంలో దంపతులను హత్య చేశారు. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో పాలు పోసేందుకు వచ్చిన రమణమ్మ.. కృష్ణారావు మృతదేహాన్ని చూసి భయంతో కేకలు వేసింది. స్థానికుల సాయంతో పోలీసులు, మృతుల కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన ఇల్లు ప్రధాన రహదారికి కాస్త దూరంగా ఉండటం, అర్ధరాత్రి కావడంతో చుట్టుపక్కల వారికి తెలియలేదు. వీరికి ఇద్దరు కుమారులు సాయిచంద్‌, గోపీచంద్‌లు ఉన్నారు. వివాహాలు అయ్యాక వాళ్లు వేరుగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు విశాఖపట్నంలోని పోస్టల్‌ శాఖలో ఉద్యోగి కాగా, చిన్న కుమారుడు నగరంలోని పొగతోట ప్రాంతంలో హోటల్‌ నిర్వహిస్తున్నారు. కృష్ణారావు కుటుంబం 15ఏళ్ల కిందట ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలం ఇందుగపల్లి నుంచి వచ్చి నెల్లూరులో స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని