Hyderabad News: హైదరాబాద్‌లో ‘డార్క్‌ వెబ్‌’ మత్తు దందా.. ముఠా అరెస్ట్‌

నగరంలో మరో మత్తు దందా గుట్టు రట్టయింది. మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హుమయూన్‌ నగర్‌లో

Updated : 01 Sep 2022 20:18 IST

హైదరాబాద్‌: నగరంలో మరో మత్తు దందా గుట్టు రట్టయింది. మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హుమయూన్‌ నగర్‌లో డ్రగ్స్‌ అమ్మేందుకు యత్నించిన ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.9లక్షల విలువైన సరకును నార్కోటిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ‘డార్క్‌ వెబ్‌’ ద్వారా మత్తు దందా చేస్తున్నారని చెప్పారు. 30మంది వినియోగదారులను సైతం అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. 

‘‘డార్క్‌ వెబ్‌ వెబ్‌సైట్‌ ద్వారా డ్రగ్స్ వ్యాపారం జరుగుతోంది. ‘విక్కర్‌ మీ’ అనే యాప్‌ ద్వారా మత్తు పదార్థాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించి దందా చేస్తున్నారు. గోవాకు చెందిన నరేంద్ర ఆర్య అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించాం. అతడు ఏడాది కాలంగా ఈ దందాతో దాదాపు రూ.30లక్షల లావాదేవీలు చేశాడు. దేశవ్యాప్తంగా 450 మంది వినియోగదారులకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు గుర్తించాం. 

రాజస్థాన్‌కు చెందిన ఫర్హాన్ అహ్మద్‌ అనే మరో వ్యక్తిని కూడా గుర్తించి అరెస్టు చేశాం. అతడు రూ.15లక్షల లావాదేవీలు చేసినట్లు తేల్చాం. యాప్‌లో రకరకాల పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. వాటన్నింటిపై నిఘా పెట్టాం. ఇతర రాష్ట్రాల్లో వాళ్లు నగరానికి డ్రగ్స్‌ తీసుకొచ్చేందుకు భయపడుతున్నారు. కానీ, గోవా, బెంగళూరు, దిల్లీ వెళ్లి డ్రగ్స్ తీసుకొస్తున్నారు. ఈ ముఠాపై దృష్టి సారించాం. సంపన్నులే లక్ష్యంగా డ్రగ్స్ దందా సాగుతోంది. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు జరిగాక కొరియర్‌లో డ్రగ్స్‌ సప్లయి చేస్తున్నారు. డ్రగ్స్‌ విక్రేతల వాట్సాప్ చాటింగ్‌ను పరిశీలించాం. తల్లిదండ్రులు కూడా తమ పిలల్లకు వచ్చే పార్సిళ్లను పరిశీలించాలి’’ అని సీవీ ఆనంద్‌ విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని