Stock Market Closing Bell: సెన్సెక్స్‌ 770 పాయింట్లు డౌన్‌..అంతర్జాతీయ మార్కెట్లలోని అమ్మకాల ఎఫెక్ట్‌!

Stock Market Closing Bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి.....

Updated : 01 Sep 2022 16:10 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సెప్టెంబరు నెలను భారీ నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య భారీ నష్టాలతో ట్రేడింగ్‌ మొదలుపెట్టిన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. మధ్యలో స్వల్పంగా కోలుకున్నప్పటికీ.. తిరిగి అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగియగా.. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు అదే బాటలో పయనించాయి. మధ్యాహ్నం ప్రారంభమైన ఐరోపా మార్కెట్లు సైతం అప్రమత్తంగానే కదలాడుతున్నాయి. 

నష్టాలకు ప్రధాన కారణాలు..

రేట్ల పెంపు భయాలు, ద్రవ్యోల్బణం మార్కెట్లను వెంటాడుతూనే ఉన్నాయి. దీనికి ఐరోపా, ఆసియా ప్రాంతంలో తయారీ కార్యకలాపాలు నెమ్మదించాయన్న నివేదికలు జత కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు చమురు ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందన్న సంకేతాలూ మదుపర్లను కలవరపెట్టాయి. దేశీయంగా చూస్తే నిన్న వెలువడిన జీడీపీ గణాంకాలు మార్కెట్లను నిరాశపర్చాయి. ఏప్రిల్‌-జులై త్రైమాసికంలో వృద్ధి రేటు 16.5 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేయగా.. అది 13.5 శాతానికి పరిమితమైంది. మరోవైపు ప్రముఖ రేటింగ్స్‌ సంస్థ మూడీస్‌ ఈ ఏడాది భారత వృద్ధిరేటును 8.8 శాతం నుంచి 7.7 శాతానికి సవరించింది. అలాగే మంగళవారం నాటి భారీ లాభాల నేపథ్యంలో మదుపర్లు కీలక కౌంటర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమూ నష్టాలకు ఆజ్యం పోసింది. 

* నిఫ్టీ ఉదయం 17,485.70 వద్ద భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,468.45 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 216.50 పాయింట్ల నష్టంతో 17,542.80 వద్ద స్థిరపడింది. 58,710.53 వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ 58,522.57 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరింది. చివరకు సెన్సెక్స్‌ 770.48 పాయింట్ల భారీ నష్టంతో 58,766.59 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.58 వద్ద నిలిచింది.

* సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టైటన్‌, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. రిలయన్స్‌, టీసీఎస్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు  నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని