kalanjali_200
Comments
0
Recommend
0
Views
204
శబరిమల గుడిలోకి మహిళల ప్రవేశం వద్దు
అది మతాచారంతో ముడిపడ్డ అంశం సుప్రీంకు విన్నవించిన కేరళ
దిల్లీ: శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధం ‘మతానికి సంబంధించిన అంశమ’ని కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విన్నవించింది. ‘ఈ భక్తుల మతాచారాల హక్కును పరిరక్షించాల్సిన’ బాధ్యత తమపై ఉందంది. ఈ మేరకు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి థామ్సన్‌ ఒక అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఈ ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మద్దతునిస్తూ 2007లో అప్పటి ఎల్‌డీఎఫ్‌ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉపసంహరిస్తూ ఈ ప్రమాణ పత్రాన్ని సమర్పించారు. తాజా అఫిడవిట్‌లోని అంశాలివీ..

* ట్రావన్‌కోర్‌-కొచ్చిన్‌ హిందూ మత సంస్థల చట్టం ప్రకారం.. శబరిమల ఆలయపాలన బాధ్యత ట్రావన్‌కోర్‌ దేవస్థానంబోర్డుదే. ఆలయంలో పూజలకు సంబంధించి పూజార్ల నిర్ణయమే అంతిమం.

* ఆలయంలోకి మహిళల ప్రవేశంపై అనాదిగా నిషేధం ఉంది. విగ్రహ ‘ప్రతిష్ఠ సంకల్పానికి’ అనుగుణంగా ఇది కొనసాగుతోంది. అది భక్తుల మతాచారాల హక్కులో భాగమే. దానికి రాజ్యాంగంలోని 25, 26 అధికరణల కింద రక్షణ ఉంది.

* ఆలయంలోని దేవతామూర్తి ‘నైస్తిక బ్రహ్మచారి’రూపంలో ఉన్నాడు. మహిళల ఉనికివల్ల ఆ దేవతామూర్తి బ్రహ్మచార్యనికి, నిష్ఠకు స్వల్ప భంగం కూడా చోటుచేసుకోకుండా చూసేందుకు వారిని ఆలయంలో పూజలకు అనుమతించడం లేదు.

శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలంటూ భారత యువ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యానికి స్పందనగా ఈ అఫిడవిట్‌ను కేరళప్రభుత్వం దాఖలు చేసింది. జస్టిస్‌ దీపక్‌మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.వి.రమణలతో కూడిన ధర్మాసనం 8న ఈ అంశంపై విచారణ జరుపుతుంది.

Your Rating:
-
Overall Rating:
0