Saturday, February 13, 2016


Untitled Document
నాణ్యత.. నగుబాటు
సమపాళ్లలో కలపని కాంక్రీట్‌ మిశ్రమం
నాసిరకంగా సిమెంట్‌ పనులు
స్లైస్‌-3లో పరిస్థితి ఇదీ
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రపంచ బ్యాంకు చుట్టూ కాళ్లరిగేలా తిరిగి నిధులు సాధించినా ప్రయోజనం లేకుండా పోతోంది. నిధులు సాధించేందుకు పట్టినంత కాలం కూడా చేసిన పనులు ఉండటం లేదు. రూ.వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరులాగా మారుతున్నాయి. ఆ కోవలోకే ఆకురాజుపల్లి ఆధునికీకరణ పనులు చేరాయి. ఆకురాజుపల్లి మేజరు పరిధిలోని స్పైస్‌-3 పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. సమపాళ్లలో మిశ్రమాలు కలపక పోవటంతో కాంక్రీట్‌ నిర్మాణాలు తెల్లబోతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడింది.

మాచవరం, న్యూస్‌టుడే
ఆకురాజుపల్లి ఆధునికీకరణలో భాగంగా మేజరు పరిధిలోని మైనర్లను స్పైస్‌-1,2,3 భాగాలుగా అధికారులు విభజించారు. వేర్వేరుగా టెండర్లు పిలిచి గుత్తేదార్లకు పనులు అప్పగించారు. స్పైస్‌-3లో దాదాపు 10 మైనర్లు, మూడు సబ్‌ మేజర్లను ఆధునికీకరించాల్సి ఉంది. మొత్తం రూ.4.16 కోట్లు కేటాయించారు. 119 డ్రాపులు, 109 తూములు నిర్మించాల్సి ఉంది. 26.45 కి.మీ మేర పనులు చేయాలి. ప్రస్తుతం దాదాపు 90 శాతంపైనే మట్టి పనులు పూర్తి చేశారు.

జరుగుతున్న పనులు ఇలా... స్పైస్‌-3లో ఇప్పటికే 39, 42 మైనర్లలో డ్రాపులు నిర్మించారు. ప్రస్తుతం కొత్తపాలెం- మోర్జంపాడు గ్రామాల మధ్య 41వ మైనర్‌లో పనులు జరుగుతున్నాయి. డ్రాపుల నిర్మాణంలో.. బెడ్‌కు 40ఎంఎం, గోడలకు 40ఎంఎం(50శాతం), 20ఎంఎం(30శాతం), 12ఎంఎం(20శాతం) చొప్పున కంకర వినియోగించాలి. అయితే ఇక్కడ పనులు చూస్తే.. సమపాళ్లలో మిశ్రమాలు కలపకుండా చేస్తున్నారు. గోడల నిర్మాణానికి వేసే కాంక్రీట్‌లో 40ఎంఎం రాయి ఎక్కువ పరిమాణం కనిపిస్తోంది. అలాగే గుండ్రంగా ఉండాల్సిన 20ఎంఎం పల్చగా పలుకులు కనిపిస్తున్నాయి. సిమెంట్‌ తక్కువగా వేసి ఇసుక ఎక్కువగా కలపటం వల్ల గోడలన్నీ తెల్లగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు నిర్మాణాలకు నీటి తడులు అందించక పోవటంతో ప్రస్తుతం ఎండకు ఎండిపోతున్నాయి. అక్కడక్కడ సిమెంట్‌ పెచ్చులు వూడిపోతున్నాయి. కాంక్రీట్‌లో వినియోగించే మిశ్రమాల్లో నాణ్యత లేకపోవటం వల్ల అది నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మిశ్రమాన్ని బాగా కలపక పోవటంతో గోడలలో రంధ్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు నిర్మాణాలలో ఎక్కువగా 40 ఎంఎం రాయి ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పరిశీలిస్తాం..
కాంక్రీట్‌లో వినియోగించే 40ఎంఎం, 20ఎంఎం రాయిని పరిశీలిస్తాం. కోర్లు వస్తేనే బిల్లు చెల్లిస్తాం. లేకుంటే నిర్మాణాలు తిరిగి చేయాలి. డ్రాపుల నిర్మాణంలో మిశ్రమాలు అన్నీ సమపాళ్లలో కలిపేలా చర్యలు తీసుకుంటాం. ఎక్కడా రాజీ పడకుండా నిబంధనలకు అనుగుణంగా పనులు చేయిస్తాం.

-దాసరి వెంకటనర్సయ్య, సాగునీటి పారుదల శాఖ ఏఈ

నైపుణ్యాభివృద్ధితోనే రాణింపు
ఈనాడు, విజయవాడ : వివేకానంద, అబ్దుల్‌కలాం వంటి ప్రముఖులను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు లక్ష్యాన్ని చేరేందుకు ప్రయత్నించాలని కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ బి.ఉదయలక్ష్మి సూచించారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో యువతరంగం-2015 బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని విజయవాడలోని లయోలా కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సాంకేతిక, విద్యాశాఖ కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో 2015లో నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచిన 1145 మందికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉదయలక్ష్మి మాట్లాడుతూ.. చదువుతో పాటూ క్రీడలూ ముఖ్యమేనన్నారు. క్రీడల వల్ల పోటీతత్వం, స్నేహభావం పెరుగుతాయన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటూ నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకుంటేనే రాణిస్తారని సూచించారు. లక్ష్యాన్ని చేరేందుకు మరింత ఎక్కువగా శ్రమించాల్సి ఉందన్నారు. విద్యార్థులలో ఉత్తేజం నింపాలనే ఉద్దేశంతోనే ఈ పోటీలను నిర్వహించినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీ ఉన్నత విద్యాశాఖ వైస్‌ఛైర్మన్‌ పి.విజయప్రకాష్‌, కళాశాల విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ గీతాంజలి, సాంకేతిక విద్యాశాఖ ఇన్‌ఛార్జి జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.పి.శ్రీకాంత్‌, శాంకేతిక విద్యాశాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సంధ్యారాణి, నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఎ.రాజేంద్రప్రసాద్‌, కృష్ణా వర్సిటీ వీసీ రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు.

13 జిల్లాల నుంచి.. : రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 1200 మంది విద్యార్థులు, సాంకేతిక విద్యాశాఖ సిబ్బంది, తల్లిదండ్రులు యువతరంగం బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 7.30 వరకూ కార్యక్రమం కొనసాగింది. గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌, కంచికచర్ల కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 1145 మందికి ధ్రువపత్రాలు, పతకాలను కమిషనర్‌ ఉదయలక్ష్మి స్వయంగా అందజేశారు.మహాశివరాత్రి పనులు ప్రారంభం
అమరావతి, న్యూస్‌టుడే: మార్చి మొదటివారంలో జరిగే మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి పంచారామ ప్రథమ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో శుక్రవారం లాంఛనంగా పనులు ప్రారంభించారు. ముందుగా కోవెలకు రంగులు వేయించే పనులకు శ్రీకారం చుట్టడంతో ఆలయం నూతన శోభను సంతరించుకుంటోంది.


14న చెవిటి, మూగ క్రీడాకారుల రాష్ట్రస్థాయి చదరంగ పోటీలు
గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఈ నెల 14న చెవిటి, మూగ క్రీడాకారుల రాష్ట్రస్థాయి చదరంగ పోటీలను నిర్వహిస్తున్నట్లు గ్లోబల్‌ చెస్‌ అకాడమీ కార్యనిర్వాహక కార్యదర్శి ఖాశీం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి విజయవాడ సిద్దార్థనగర్‌లోని తమ అకాడమీలో ఈ పోటీలు ప్రారంభం అవుతాయన్నారు. మరిన్ని వివరాలకు 98495 14138 నెంబరులో సంప్రదించాలన్నారు.


20 నుంచి క్రీడావసతి గృహంలో ప్రవేశానికి ఎంపికలు
గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే : కర్నూలులోని క్రీడావసతి గృహంలో బాలుర ప్రవేశానికి ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఎంపికలు జరగనున్నాయని గుంటూరు జిల్లా అదనపు క్రీడల అభివృద్ధి అధికారి పి.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు స్టేడియంలో ఈ ఎంపికలు జరుగుతాయని ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌ క్రీడాంశాల్లో పాల్గొనే బాలురు 10 నుంచి 18 సం.రాలు, తైక్వాండోలో పాల్గొనే వారు 12 నుంచి 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలన్నారు. పుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌ క్రీడాకారులు గతంలో రాష్ట్రస్థాయి పోటీలు, తైక్వాండో క్రీడాకారులు జిల్లాస్థాయి పోటీల్లో మొదటి మూడుస్థానాలు, సంబంధిత క్రీడలో అర్హత ధ్రువపత్రం పొంది ఉండాలన్నారు.


ముగిసిన సమ్మె బ్యాలెట్‌
గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: ఏడో వేతన సవరణ సంఘంలో రైల్వే కార్మికులకు జరిగిన అన్యాయంతోపాటు నూతన పింఛను విధానాన్ని రద్దు చేయాలని పలు డిమాండ్లతో అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య(ఏఐఆర్‌ఎఫ్‌) పిలుపు మేరకు ద.మ.రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని నాలుగు జిల్లాల్లో నిర్వహించిన సమ్మె బ్యాలెట్‌ శుక్రవారం సాయంత్రంతో ముగిసిందని మండల కార్యదర్శి హనుమంతరావు తెలిపారు. శనివారం లెక్కించి వివరాలను ప్రధాన కార్యాలయానికి పంపుతామన్నారు.


23 సవర్ల బంగారం చోరీ
చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: నిత్యం జనసంచారం ఉండే ప్రాంతంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగుడు చొరబడి బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. స్థానిక సుబ్బయ్యతోట 1వ వీధిలో నివాసం ఉండే శిఖాకొల్లి లక్ష్మీనారాయణ గృహంలో ఆరు గంటల సమయంలో ఈ చోరీ జరిగింది. ఇంటి ముందు శుభ్రం చేసేందుకు లక్ష్మీనారాయణ భార్య కోటేశ్వరమ్మ బయటకు వచ్చిది. ఈ సమయంలో వెనుక వైపు నుంచి ఇంట్లోకి చొరబడి బీరువా తలుపులు తెరచి సుమారు 23 సవర్ల బంగారు ఆభరణాలను ముట కట్టుకుని తిరిగి వెళ్తుండగా లోనికి వచ్చిన కోటేశ్వరమ్మ గమనించి కేకలు వేసింది. అప్పటికే దుండగుడు గోడదూకి ఉడాయించాడు. భర్త వూరికి వెళ్లి ఉండటంతో జరిగిన ఘటన విషయాన్ని కోటేశ్వరమ్మ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


18న విష్ణు సహస్ర నామ విరాట్‌ పారాయణం
హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
తాడేపల్లి, న్యూస్‌టుడే: అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్దండ్రాయునిపాలెంలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈనెల 18న శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర విరాట్‌ పారాయణం నిర్వహిస్తున్నట్లు జీయర్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు తెలిపారు. అమరావతి కరకట్ట మార్గంలోని ఆయన అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్‌, వికాస తరంగిణి సంయుక్తంగా చేపట్టిన పారాయణంలో జీయర్‌ స్వామితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర నూతన రాజధాని అభివృద్ధి, రాజధాని సత్వరమే పూర్తి కావాలని కోరుతూ భీష్మ ఏకాదశి పర్వదినాన వేలాది మంది భక్తుల సమక్షంలో ఉపదేశాత్మకమైన శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర విరాట్‌ పారాయణం, సుదర్శన హవన కార్యక్రమం జరుగుతుందని జీయర్‌ ఆశ్రమ ప్రతినిధి గుదిమెళ్ళ శ్రీకూర్మనాథ్‌స్వామి తెలిపారు. తెలుగు మాట్లాడేవారందరిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 18వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. భారతీయ ధార్మిక పరిషత్‌ కన్వీనర్‌ సత్యనారాయణ, వికాస తరంగణి అధ్యక్షుడు లీలా చక్రధర్‌, నిర్మల ప్రసాద్‌, శ్రీహరి తదితరులు విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు.


‘మోసం గురించి జగన్‌ మాట్లాడటం హాస్యాస్పదం’
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: మోసం గురించి జగన్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోసం గురించి జగన్‌ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిందన్నారు. అక్రమ ఆస్తుల సంపాదనలో అగ్రగణ్యుడైన జగన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను ఏదోఒక విధంగా మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్‌కు వచ్చే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు షేక్‌ లాల్‌వజీర్‌, దారపనేని నరేంద్ర, మానుకొండ శివప్రసాద్‌, కొర్రపాటి నాగేశ్వరరావు, బత్తుల శ్రీనివాసరావు, చిగురుపాటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


అగ్రిగోల్ట్‌ కేసులపై సీఐడీ దృష్టి
పీటీ వారెంట్‌కు రంగం సిద్ధం
గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో ఆ సంస్థ ఛైర్మన్‌ రామారావు, ఎండీ నారాయణను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 20 వేలకుపైగా బాధితులు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో రాజమండ్రి, కడప, విశాఖ, విజయవాడ, తిరుపతి, నెల్లూరుతోపాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ అగ్రిగోల్డ్‌పై ఫిర్యాదులందాయి. శుక్రవారం రామారావు, నారాయణను అరెస్టు చేసిన క్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాల సీఐడీ అధికారులు ఆయా జిల్లాల్లో అగ్రిగోల్ట్‌పై నమోదైన కేసులను పునఃపరిశీలన చేపట్టారు. వారిద్దరిపై ఇక్కడి సీఐడీ అధికారులు పీటీ వారెంట్‌ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. న్యాయస్థానం అనుమతి తీసుకుని వారిద్దర్నీ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అరెస్టు చూపే అవకాశాలున్నాయి.


104 సమాచారం
గ్రామీణ మాచర్ల, న్యూస్‌టుడే : మాచర్ల యూనిట్‌ పరిధిలోని 104 సంచార వాహన సిబ్బంది శనివారం మాచర్ల మండలం కొత్తపల్లి, ద్వారకాపురి గ్రామాల్లో వైద్యసేవలు అందించనున్నట్లు క్లస్టర్‌ వైద్యాధికారి సాయిప్రసన్న శుక్రవారం తెలిపారు. సిబ్బంది ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తారని, ఆయా గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


ఆదమరిస్తే.. కాలవలోకే!
విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే : నాగార్జున సాగర్‌ కుడి కాలువ వద్ద రహదారి వెంట ప్రమాదం పొంచి ఉంది. నాగార్జున సాగర్‌ డ్యాంకు కిలోమీటర్‌ దూరంలో కుడి కాలువ బ్రహ్మానంద రెడ్డిపురం తండాకు వెళ్లే రహదారి వెంట(పారాపిట్‌వాల్‌) రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కుడి కాలువకు 12 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేసినప్పుడు ఈ రహదారిపైకి నీరు వచ్చి రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో బోదనంపాడు, సుబ్బారెడ్డిపాలెం గ్రామాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు ఇక్కడ గోడ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


రోడ్డుప్రమాదంలో బాలునికి తీవ్రగాయాలు
మాచర్ల: రోడ్డు దాటుతున్న బాలుడ్ని అరటి లోడుతో వస్తున్న చిన్న లారీ ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన సంఘటన పట్టణంలోని నాయుడు బిల్డింగ్‌ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... శుక్రవారం రాత్రి 13వ వార్డుకు చెందిన మూడేళ్ల కె.మోహనకృష్ణ రోడ్డు దాటుతున్నాడు. ఇదే సమయంలో రింగురోడ్డు వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. తీవ్ర రక్త స్రావం కావటంతో మోహనకృష్ణ అపస్మారక స్థితికి వెళ్లాడు. హుటాహుటిన మాచర్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన అరటిలోడు లారీని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


వైకాపా ఆధ్వర్యంలో తాగునీటి పంపిణీ
మండలంలో పెరిగిపోతున్న తాగునీటి ఎద్దడి నివారణకు వైకాపా కార్యకర్తలు మంచినీటి ట్యాంకు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం 1వ వార్డులో నీటి పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిన అల్లయ్య ప్రారంభించారు. కరాలపాడు సుబ్బారావు, చీతిరాల కోటేశ్వరరావు, బొంకూరి నాగేశ్వరరావు, మురళి తదితరులు పాల్గొన్నారు.
-కారంపూడి, న్యూస్‌టుడే


బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకోండి
దుర్గి, న్యూస్‌టుడే : భారతీయ స్టేట్‌ బ్యాంకు సేవలు గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దుర్గి స్టేట్‌ బ్యాంకు శాఖ మేనేజర్‌ సురేంద్రబాబు కోరారు. శుక్రవారం బ్యాంకు ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్‌ కూడలిలో కళాజాతా ద్వారా ప్రస్తుతం భారతీయ స్టేట్‌ బ్యాంకు నుంచి అందించే పలు సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధానంగా ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన, వ్యక్తిగత రుణాలు, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన బీమా పథకాల గురించి, వ్వయసాయపరంగా అందించే పలు రుణాలపై సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా తెరచి బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సహాయ మేనేజర్‌ రమేశ్‌బాబు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.


16 అంశాలతో అమరావతి డిక్లరేషన్‌కు ఆమోదం
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఆచార్య పిన్నమనేని ఉదయభాస్కర్‌ ముగింపు సదస్సుకు అధ్యక్షత వహిస్తూ సదస్సు తీర్మానాలను అమరావతి డిక్లరేషన్‌ పేరిట ప్రకటించారు. మొత్తం 16 తీర్మానాలను ప్రవేశపెట్టారు. అవి ఏమంటే.. కాలువ చివరి భూములను నీరు అందేలా ప్రణాళిక తయారు చేసుకుని కాలువ మొదటి, మధ్య ప్రాంతంలోని భూగర్భ జలాలను వినియోగించుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలి. అధిక నీటి వినియోగంతో జల స్తంభన ఏర్పడటాన్ని నిరోధించాలి. భూముల నాణ్యత పెంచడానికి నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరీక్షించాలి. నీటి పరివాహక ప్రాంతాల్లో రైతులకు కాలువ జలాలను పరిమితంగా, సమర్థంగా వాడే విధానాలను తెలపాలి.


ఐదేళ్లలో రూ.2.16 కోట్లు
నిఘా విభాగం తనిఖీలో వెల్లడైన వక్కపొడి కంపెనీ బాగోతం
ఈనాడు-గుంటూరు: రాజధాని ప్రాంతంలోని ఓ వక్కపొడి కర్మాగారం మార్కెటింగ్‌ శాఖకు పన్ను ఎగేసినట్లు నిఘావిభాగం అధికారులు గుర్తించారు. ముడి వక్కను ఎక్కడి నుంచి కొనుగోలు చేసినా ఆ మొత్తం కొనుగోళ్లపై ఒక శాతం చొప్పున వ్యవసాయ మార్కెటింగ్‌శాఖకు సదరు కంపెనీ నిర్వాహకుడు పన్ను చెల్లించాలి. ఆ కంపెనీ పన్ను చెల్లించకపోవగా కనీసం లైసెన్సు పొందలేదని అధికారులు చెబుతున్నారు. దశాబ్దంన్నరకు ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు నిఘా విభాగం తనిఖీల్లో వెల్లడైంది. కేవలం ఐదేళ్లలో కొనుగోలు చేసిన ముడి వక్కపై ఒక శాతం మార్కెటింగ్‌ సెస్‌ లెక్కిస్తే రూ.2.19 కోట్లు వసూలు కావల్సి ఉందని గుర్తించారు. సదరు కంపెనీ దశాబ్దంన్నరకు పైగా ఈ వ్యాపారంలో రాణిస్తోందని అప్పటి నుంచి రికార్డులు పరిశీలించి పన్ను లెక్కిస్తే మరో రూ.7-8 కోట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తోంది.


హామీలు అమలు చేసి విశ్వసనీయత పెంచుకోవాలి :పొన్నాల
గుడివాడ, న్యూస్‌టుడే: సమాజ హితం కోసమే ఆంధ్రాలో తెదేపాకు, తెలంగాణాలో టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆయా ప్రభుత్వాలు అమలుచేసి విశ్వసనీయతను పెంచుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త క్వాలిటీఫీడ్స్‌ అధినేత కోగంటి ఆంజనేయులు శుక్రవారం నూతన గృహ ప్రవేశం చేస్తున్న సందర్భంగా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు బడుగు బలహీనవర్గాలకు అండగా ఉండాలని ఆయన కోరారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, సాంకేతికతను చొప్పించి కాలానుగుణంగా వస్తున్న ప్రజావసరాలను తీర్చి, మెరుగైన జీవన ప్రమాణాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీఫీడ్స్‌ అధినేత కోగంటి ఆంజనేయులు, ఆర్డీవో చక్రపాణి, మున్సిపల్‌ ఛైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.


మిర్చియార్డులో ఆకస్మిక తనిఖీలు
అక్రమాలు, అవకతవకలపై పర్సన్‌ ఇన్‌ఛార్జి సమీక్ష
మిర్చియార్డు (గుంటూరు), న్యూస్‌టుడే: మిర్చియార్డులో పర్సన్‌ ఇన్‌ఛార్జి, జేసీ చెరుకూరి శ్రీధర్‌ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యార్డులో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై అధికారులు, ఎగుమతి, దిగుమతి వ్యాపారులతో సమీక్ష చేశారు. ముందుగా ఆయన మధ్యాహ్న భోజన పథకం జరుగుతున్న తీరు, తెన్నును పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతను మరింతగా పెంచాలని సూచించారు. అనంతరం యార్డులోని కమీషన్‌ దుకాణాలను పరిశీలించి క్రయవిక్రయాల తీరును గమనించారు. ఒక కమీషన్‌ దుకాణంలో ఎగుమతి వ్యాపారికి అమ్మిన ధర, రైతుకు చెప్పిన ధరలో వ్యత్యాసం ఉండటాన్ని పసిగట్టారు. దీనిపై అధికారులు, ఎగుమతి, దిగుమతి వ్యాపారులతో సమీక్ష చేశారు. ధరల్లో, అమ్మకాలు, కొనుగోళ్ళల్లో వ్యత్యాసం ఉంటే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. మచ్చు కాయల పేరిట ఎక్కువగా మిర్చిని తీసుకుంటున్నట్లు రైతులు పర్సన్‌ ఇన్‌ఛార్జ్‌ శ్రీధర్‌ దృష్టికి తీసుకుని వెళ్ళారు. నిబంధనల పేరిట ఎంతవరకైతే నమూనాలు తీయాలో అంతకుమించి మచ్చు పేరిట దోపిడీకి పాల్పడితేమాత్రం కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో యార్డు కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి, డిప్యూటీ డైరక్టర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


ఎల్‌ఎల్‌బీ పరీక్షలు వాయిదా
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 15 నుంచి ప్రారంభం కావాల్సిన ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సు మొదటి సెమిస్టరు, ఐదేళ్ల కోర్సుల 1, 5 సెమిస్టర్ల పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి సాయిబాబా శుక్రవారం తెలిపారు. మార్పు చేసిన పరీక్షల షెడ్యూలు వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌ www.anu.ac.in లో చూడవచ్చన్నారు.


14న చెవిటి, మూగ క్రీడాకారుల చదరంగం పోటీలు
గుంటూరు క్రీడలు: ఈ నెల 14న చెవిటి, మూగ క్రీడాకారుల రాష్ట్రస్థాయి చదరంగ పోటీలను నిర్వహిస్తున్నట్లు గ్లోబల్‌ చెస్‌ అకాడమీ కార్యనిర్వాహక కార్యదర్శి ఖాశీం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి విజయవాడ సిద్దార్థనగర్‌లో పోటీలు ప్రారంభమవుతాయన్నారు. వివరాలకు 98495 14138 నెంబరులో సంప్రదించాలన్నారు.


14న రథ సప్తమి వేడుకలు
7 వాహనాలపై శ్రీవారి గ్రామోత్సవం
మంగళగిరి, న్యూస్‌టుడే: సూర్యభగవానుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఈనెల 14న రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం సూర్యోదయం వేళ సప్త అశ్వాలతో కూడిన సూర్యప్రభ వాహనంపై శ్రీలక్ష్మీనృసింహస్వామి దర్శనమిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా సూర్యప్రభ, శేష, గరుడ, హనుమంత వాహనాలు, చక్రస్నానం, కల్పవృక్ష వాహనం, రాజధిరాజ, చంద్రప్రభ వాహనాలపై శ్రీవారి గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానాలలో మాదిరిగా మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సప్త వాహనాలపై వూరేగింపు నిర్వహిస్తామని దేవస్థానం అధికారులు వివరించారు.


కార్మిక పరిషత్‌తోనే బంగారు భవిష్యత్తు
తెదేపా జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు
గుంటూరువారితోట, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులకు బంగారు భవిష్యత్తును కార్మిక పరిషత్తు ఒక్కటే ఇవ్వగలదని తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్మిక పరిషత్తు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గుంటూరు బస్టాండు ఆవరణలో బహిరంగ సభ జరిగింది. ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రధాన కార్మిక సంఘాల్లో ఒకటి సమస్యల్లో కూరుకుపోగా, మరో సంఘం వైకాపా అధినేత జగన్‌ మాదిరి అవినీతిమయమైందని విమర్శించారు. ఆ రెండు సంఘాల వల్ల కార్మికులకు ప్రయోజనం ఉండబోదన్నారు. ఆసియా ఖండంలో అతి పెద్ద బస్‌స్టేషన్ల ఏర్పాటు తెదేపా వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా ప్రభుత్వం ఆర్టీసీకి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందన్నారు. ఉద్యోగ, కార్మికుల పక్షాన తెదేపా ఉంటుందని చెప్పారు. అన్ని డిపోల్లో కార్మిక పరిషత్తును బలోపేతం చేయాలన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల మాట్లాడుతూ.. సంస్థ రక్షణ, కార్మికులకు న్యాయం చేసేది తెదేపా ఒక్కటేనన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, కార్మిక పరిషత్తు రాష్ట్ర కార్యదర్శి వరహలనాయుడు, గౌరవాధ్యక్షుడు మురళి, ప్రాంతీయ అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్‌, రాజేష్‌, కార్యానిర్వాహక అధ్యక్షుడు ప్రసాద్‌, శేషగిరిరావు, మద్దాళి గిరి, లాల్‌వజీర్‌, షౌకత్‌ పాల్గొన్నారు. తొలుత ప్రదర్శన చేపట్టి బాణసంచా కాల్చారు.


ప్రమాదంలో దగ్ధమైన కందిపంట
తిమ్మాపురం(నూజండ్ల), న్యూస్‌టుడే: అగ్నిప్రమాదం సంభవించి కోతకొచ్చిన కందిపంట, జామాయిల్‌ చెట్లు కాలిపోయిన సంఘటన తిమ్మాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. పొలంలో సిగరెట్‌ తాగి పడేయడంవల్ల అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని రైతులు అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన అమరా వెంకట గుర్నాథంకు చెందిన 2 ఎకరాల కంది పంట, రావులపల్లి అంజమ్మకు చెందిన ఎకరం కందిపంట, ఒక వరిగడ్డివామి, నెక్కంటి ఏసురాజు, వూటకూరి గాలెయ్యకు చెందిన రెండెకరాల జామాయిల్‌ తోటలు కాలిపోయాయి. ఒక్కసారిగా గ్రామానికి సమీపంలోని పొలంలో మంటలు రావడంతో గ్రామస్థులు అందరూ స్పందించి తైవాన్‌ స్పెయర్లతో మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. అప్పటికే గ్రామం సరిహద్దుకు మంటలు చేరుకున్నాయి. గ్రామస్థులు స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేయడంతో గ్రామస్థులు వూపిరి పీల్చుకున్నారు. నష్టం రూ.1.50 లక్షలు పైగా ఉండవచ్చని అంచనా వేశారు. కోతకొచ్చిన కంది అగ్నికి ఆహుతవడంతో రైతులు తీవ్ర వేదనకు గురయ్యారు. కరవుకాలంలో ఆదుకున్న కంది కళ్లెదుటే కాలిపోయిందని ఆవేదన చెందారు.


చెరుకొంపాలెం పంచాయతీ కార్యదర్శి సస్పెండ్‌
చెరుకొంపాలెం(అచ్చంపేట), న్యూస్‌టుడే : పంచాయతీ నిధుల దుర్వినియోగం అభియోగంపై మండలంలోని చెరుకొంపాలెం పంచాయతీ కార్యదర్శి షేక్‌ ఆదం షఫీని సస్పెండ్‌ చేసినట్లు ఎంపీడీఓ డి.జి.నాయక్‌ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు జిల్లా పాలనాధికారి కాంతిలాల్‌దండే ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇటీవల గ్రామంలో ఆకర్షణీయ గ్రామ దత్తత సంస్థ ప్రతినిధి ఎం.భద్రయ్య తాము చేపట్టిన పనులకు పంచాయతీ బిల్లులు చేసుకొన్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీఓ, తహశీల్దార్‌లు బృందం విచారణ చేసి నివేదికలు అందజేశారు. సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని కోరిన భద్రయ్యకు వివరాలు అందజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలింది. పంచాయతీకి సంబంధించి విడుదలైన 12 లక్షలకు గాను చేసిన పనులకు సరైన బిల్లులు లేకుండా దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు.


బాల్య వివాహం నిర్వహించిన వారిపై కేసు
పొన్నూరు, న్యూస్‌టుడే : పొన్నూరు మండల పరిధి ఉప్పరపాలెంలోని 13 ఏళ్ల బాలికకు వివాహం చేసిన తల్లిదండ్రులపైన, పెండ్లి కుమారుడు తల్లిదండ్రులపై శిశు సంక్షేమ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాంబాబు శుక్రవారం వెల్లడించారు.


హైడ్రోజన్‌ సమ్మిళిత ప్రక్రియతో స్వచ్ఛమైన విద్యుత్‌
వడ్లమూడి (పొన్నూరు), న్యూస్‌టుడే : గైరాట్రాన్స్‌ ద్వారా 300 గిగా హెడ్జ్‌ విద్యుదయస్కాంత తరంగాల ఉత్పత్తి వినియోగించి హైడ్రోజన్‌ వాయువు సమ్మిళిత ప్రక్రియతో స్వచ్ఛమైన విద్యుత్‌ అందించవచ్చని ఐఐటీ రూర్కి ఈసీఈ విభాగాధిపతి డాక్టర్‌ ఎంవి.కార్తికేయన్‌ పేర్కొన్నారు. శుక్రవారం చేబ్రోలు మండల పరిధిలో వడ్లమూడి విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో ఈసీఈ విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిశోధన గురించి ప్రపంచ వ్యాప్తంగా చాలా ఆసక్తి నెలకొని ఉందని, విద్యార్థులకు ఈ అంశం మీద చాలా అవకాశాలుంటాయని పేర్కొన్నారు. ప్రపంచంలో మొట్టమొదటి గైరాట్రాన్‌ ఆధారిత 600 మెగావాట్స్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఫ్రాన్స్‌లో భారత్‌ సహకారంతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సంప్రదాయ విద్యుత్‌ శక్తి ఉత్పత్తి వల్ల కాలుష్యం, అణువిద్యుత్‌ వల్ల రేడియో ధార్మిక వ్యర్ధాలు వెలువడి మానవాళికి విపత్కర పరిస్థితులను కలిగిస్తాయన్నారు. అనంతరం కార్తికేయన్‌ను ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ డీన్‌ డాక్టర్‌ వల్లభనేని మధుసూదనరావు, పరిశోధన విభాగం డీన్‌ అవిరేని శ్రీనివాస్‌, ఇసిఇ విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌. ఉషారాణి, రవిశేఖర్‌, తదితరులు సన్మానించారు.


పరిశోధనాత్మక లక్షణాలను పెంపొందించుకోవాలి
పెదపలకలూరు(గ్రామీణ గుంటూరు), న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు పరిశోధనాత్మక లక్షణాలను పెంపొందించుకోవాలని టీసీఎస్‌ సంస్థ ప్రతినిధి ఎం.సంపత్‌ కూమార్‌ కోరారు. శుక్రవారం నగర శివారు పెదపలకలూరు విజ్ఞాన్‌ నిరుల మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు ‘సెలీనియం విత్‌ పైథాన్‌’ అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఆయన మాట్లాడుతూ మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థుల్లో మార్పులు రావాలని సూచించారు. ప్రిన్సిపల్‌ పాతూరి రాధిక మాట్లాడుతూ ఇలాంటి సదస్సుల ద్వారా విద్యార్థులు నూతన విషయాలను విస్తృతంగా తెలుసుకోవచ్చన్నారు. సీఎస్‌ఈ, ఐటీ విభాగాల విద్యార్థులకు పైథాన్‌ ప్రోగ్రామింగ్‌, లాంగ్వేజ్‌లపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయా విభాగాధిపతులు బి.రేణుకాదేవి, సురేష్‌కుమార్‌, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


తాగునీటి పైనే చర్చ
అజెండాలో 9 అంశాలను చేర్చినప్పటికీ ప్రధానంగా తాగునీటి పైనే చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఎక్కువ మంది తమ ప్రాంతాల్లో తాగునీటి ఇక్కట్లను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వేసవిలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో ఆర్‌డబ్ల్యూఎస్‌, ఏపీ ట్రాన్స్‌కో అధికారుల నిర్లిప్తతను ప్రశ్నించారు. చుండూరు ఎంపీపీ అప్పిరెడ్డి మాట్లాడుతూ ఆలపాడులో మూడేళ్ల కిందట నిర్మించిన రక్షిత నీటి పథకానికి విద్యుత్‌ కనెక్షన్‌ కోసం రూ.4.40 లక్షలు డీడీ చెల్లించి ఏడాది గడచినా ఎందుకు కనెక్షన్‌ ఇవ్వలేదని ప్రశ్నించారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించి ఏపీ ట్రాన్స్‌కో జిల్లా ఎస్‌ఈ జయభారతరావును వివరణ కోరారు. తక్షణం విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వటంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మాట్లాడుతూ రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల్లో తాగునీటికి పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో తాగునీటి సమస్యలను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల దృష్టికి తీసుకెళితే అనుమతులు రాలేదంటూ సమస్యను పరిష్కరించలేదని మంత్రి పుల్లారావు, కలెక్టరు కాంతిలాల్‌ దండేకు ఫిర్యాదు చేశారు. నరసరావుపేట డివిజన్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యనిర్వహక ఇంజినీరు జి.శర్మపై మంత్రి, కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈ, ఏఈలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టరును మంత్రి పుల్లారావు ఆదేశించారు. సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు జోక్యం చేసుకొని ఎస్సీ, ఎస్టీల జనాభా 40 శాతం ఉన్న గ్రామాల్లో తాగునీటి పథకాల కోసం ఉప ప్రణాళిక చట్టం కింద నిధులు విడుదల చేస్తామని తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో 120 బోర్లను మంజూరు చేశామన్నారు. జిల్లాపరిషత్తు సీఈవోను తాగునీటి సరఫరాను పర్యవేక్షించడానికి ప్రత్యేకాధికారిగా నియమిస్తున్నట్లు కలెక్టరు ప్రకటించారు. ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొడ్డు నాగేశ్వరరావు, ఏఎస్‌ రామకృష్ణ, అన్నం సతీష్‌ప్రభాకర్‌, పిడుగురాళ్ల, బెల్లకొండ, బొల్లాపల్లి జడ్పీటీసీ సభ్యులు రామిరెడ్డి, దేవళ్ల రేవతి, సంతోషమ్మ, దుర్గి ఎంపీపీతో పాటు పలువురు ప్రతినిధులు గ్రామాల్లో తాగునీటి సమస్యలను ప్రస్తావించి పరిష్కరించాలని కోరారు. తాగునీటి కోసం రూ.40 లక్షలు నరసరావుపేట మండల పరిషత్తు మంజూరు చేసినప్పటికీ ఎంపీడీవో బోర్లు వేసేందుకు అనుమతి ఇవ్వటంలేదని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపిస్తామని కలెక్టరు హామీ ఇచ్చారు.


కొనసాగిన దస్తావేజు లేఖర్ల నిరసన
అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌టుడే: రిజస్ట్రేషన్లను ప్రైవేటీకరణ చేయ్యొద్దంటూ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు పెన్‌డౌన్‌ కార్యక్రమాన్ని కొనసాగించారు. రెండోరోజైన శుక్రవారం జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద నినాదాలను చేశారు. ప్రైవేటీకరణ చేయటం వలన వేలాది మంది ఉపాధికోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని, ప్రభుత్వం ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని తమ ఉపాధికి గండికొట్టొద్దని కోరారు. దస్తావేజులేఖర్లు, స్టాంపు వెండర్లు పెన్‌డౌన్‌తో రిజిస్ట్రేషన్లు మందకొండిగా సాగాయి. నిరసనలో సంఘ రాష్ట్ర సలహాదారు ఎండీ మహమూద్‌, జిల్లా అధ్యక్షుడు రవి, జేఏసీ ప్రతినిధులు రషీద్‌, రామిరెడ్డి, చిన్నప్ప, జాన్‌సన్‌ తదితరులు పాల్గొన్నారు.


జడ్పీ బడ్జెట్‌కు ఆమోదం
ఆదాయం రూ.588.71 కోట్లు...వ్యయం 583.06 కోట్లు
జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే : జిల్లాపరిషత్తు 2016-17 వార్షిక బడ్జెట్‌ను ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్‌పై ఒకే మాటపై నిలవటంతో ఏవిధమైన చర్చ లేకుండానే ఆమోదించటం జరిగింది. శుక్రవారం జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్‌ అధ్యక్షత వహించి జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అజెండాలో బడ్జెట్‌ 9వ అంశమైనప్పటికీ జిల్లాపరిషత్తు ఇన్‌ఛార్జి గణాంక అధికారి రవిచంద్రారెడ్డిని బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలని ఛైర్‌పర్సన్‌ సూచించటంతో ఆయన 2015-16 సవరణ, 2016-17 అంచనా బడ్జెట్లను ఏక కాలంలో ప్రవేశ పెట్టి చదివారు. 2016-17 బడ్జెట్‌లో ఆదాయం/రాబడులు రూ.588,71,49,000గా, వ్యయాలు రూ.583,06,76,000 పేర్కొన్నారు. రూ.5.64 కోట్ల మిగులు చూపారు. 2015-16 సవరణ బడ్జెట్‌లో ఆదాయం రూ.356.02 కోట్లు, వ్యయం రూ.361.48 కోట్లు, మిగులు రూ.3.53 కోట్లని పేర్కొన్నారు.

బల్లలు చరిచి హర్షం.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఛైర్‌పర్సన్‌ దీనిపై సభ్యులు ఏమైనా మాట్లాడాలనుకొంటే సమాధానం చెపుతామన్నారు. సభ్యులు ఎవరూ ప్రశ్నించకపోవటంతో ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు ఛైర్‌పర్సన్‌ ప్రకటించటంతో సభ్యులు బల్లలు చరచి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం అజెండాలోని తొలి అంశమైన గ్రామీణ నీటి సరఫరా విభాగంపై చర్చను చేపట్టారు.

స్థాయీ సంఘం ఆమోదం
ఉదయం 9 గంటలకు జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్‌ జానీమూన్‌ ఛాంబర్లో జడ్పీ 1, 7వ స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. 2015-16 సవరణ, 2016-17 అంచనా బడ్జెట్లను ఏవో రవిచంద్రారెడ్డి చదివి వినిపించారు. ఒకటో స్థాయీ సంఘ సభ్యులు ఆమోదించటంతో జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రవేశ పెట్టారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత 2,3,4,5,6 స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, కలెక్టరు కాంతిలాల్‌ దండే, జడ్పీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు, సీఈవో సుబ్బారావు, తెదేపా ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్‌, ఎమ్మెల్సీ అన్న సతీష్‌ప్రభాకర్‌, వైకాపా ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ మహమ్మద్‌ జానీ, పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, ఎ.ఎస్‌.రామకృష్ణ హాజరయ్యారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి సభలో సభ్యుడు కానప్పటికీ సమావేశం చివరలో వచ్చి ఎమ్మెల్యేల పక్కన కూర్చున్నారు.


Untitled Document
నాణ్యత.. నగుబాటు
నైపుణ్యాభివృద్ధితోనే రాణింపు
మహాశివరాత్రి పనులు ప్రారంభం
14న చెవిటి, మూగ క్రీడాకారుల రాష్ట్రస్థాయి చదరంగ పోటీలు
20 నుంచి క్రీడావసతి గృహంలో ప్రవేశానికి ఎంపికలు
ముగిసిన సమ్మె బ్యాలెట్‌
23 సవర్ల బంగారం చోరీ
18న విష్ణు సహస్ర నామ విరాట్‌ పారాయణం
‘మోసం గురించి జగన్‌ మాట్లాడటం హాస్యాస్పదం’
అగ్రిగోల్ట్‌ కేసులపై సీఐడీ దృష్టి
104 సమాచారం
ఆదమరిస్తే.. కాలవలోకే!
రోడ్డుప్రమాదంలో బాలునికి తీవ్రగాయాలు
వైకాపా ఆధ్వర్యంలో తాగునీటి పంపిణీ
బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకోండి
16 అంశాలతో అమరావతి డిక్లరేషన్‌కు ఆమోదం
ఐదేళ్లలో రూ.2.16 కోట్లు
హామీలు అమలు చేసి విశ్వసనీయత పెంచుకోవాలి :పొన్నాల
మిర్చియార్డులో ఆకస్మిక తనిఖీలు
ఎల్‌ఎల్‌బీ పరీక్షలు వాయిదా
14న చెవిటి, మూగ క్రీడాకారుల చదరంగం పోటీలు
14న రథ సప్తమి వేడుకలు
కార్మిక పరిషత్‌తోనే బంగారు భవిష్యత్తు
ప్రమాదంలో దగ్ధమైన కందిపంట
చెరుకొంపాలెం పంచాయతీ కార్యదర్శి సస్పెండ్‌
బాల్య వివాహం నిర్వహించిన వారిపై కేసు
హైడ్రోజన్‌ సమ్మిళిత ప్రక్రియతో స్వచ్ఛమైన విద్యుత్‌
పరిశోధనాత్మక లక్షణాలను పెంపొందించుకోవాలి
తాగునీటి పైనే చర్చ
కొనసాగిన దస్తావేజు లేఖర్ల నిరసన
జడ్పీ బడ్జెట్‌కు ఆమోదం
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
 
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net