మీ ఆరోగ్య సమస్యలను పోస్టుకార్డు మీదే, క్లుప్తంగా,
స్పష్టంగా రాయండి.

సమస్య-సలహా
సుఖీభవ,
ఈనాడు కాంపౌండ్‌,
సోమాజిగూడ,
హైదరాబాద్‌- 500082.

ఆటలకు...
గుండెమీద చెయ్యేసుకుని పంపండి!
దిగ్భ్రాంతికరం!!
అప్పటి వరకూ హాయిగా ఆడుతూ పాడుతూ తిరిగి న బిడ్డలే!

కానీ రెండు వారాల క్రితం.. గణతంత్ర వేడుకల సందర్భంగా బడిలో నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొని.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముక్కుపచ్చలారని ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే కుప్పకూలి మృత్యువాతపడ్డారు.

అదిలాబాద్‌ జిల్లా భైంసాలో సాయిచరణ్‌ (12) స్కూల్లో పెట్టిన చిన్న పరుగు పందెంలో పాల్గొని.. విజేతగా నిలిచి.. అభినందనలు అందుకుంటూనే.. అంతలోనే కుప్పకూలి అపస్మారంలోకి వెళ్లిపోయి నిమిషాల్లోనే మృత్యువు ఒడిలోకి చేరిపోయాడు.
ఖమ్మం జిల్లా పోకలగూడెం విద్యార్థి భద్రాచలం (13), వరంగల్‌ జిల్లా బత్తులపల్లిలో విజయ్‌కుమార్‌ (13).. ఇద్దరూ బడిలోనే ఆటల పోటీల్లో.. ఖోఖో ఆడుతూ కళ్లు తిరిగి పడిపోయి.. అపస్మారంలోకి జారిపోయి మళ్లీ లేవలేదు.
పోనీ వీళ్లు పాల్గొన్నవి ప్రమాదకరమైన క్రీడలా? అంటే అదేం కాదు.

వాస్తవానికి గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో, రెండు రోజుల వ్యవధిలోనే వరసగా జరిగిన విషాదాలు కాబట్టి ఇవి పత్రికల వరకూ వచ్చాయిగానీ.. అసలు ఇలాంటి ఘటనలు ఎక్కడ, ఎన్ని సంభవిస్తున్నాయో.. ఏ లెక్కా సరిగా ఉండని మన దేశంలో కచ్చితంగా చెప్పటం కష్టం.

పిల్లలకు ఆటలే బలం. ఆడుకోవాల్సిందే. కానీ ఆటల్లో ఈ అనూహ్య విషాదాలేమిటి?

పిల్లలే కాదు.. పెద్దల్లో కూడా.. పోలీసు, ఎస్‌ఐ ఉద్యోగాల కోసం శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించిన ప్రతిసారీ.. కనీసం ఒకరిద్దరు పరుగుల్లో ప్రాణాలొదలటాన్ని వార్తల్లో చూస్తూనే ఉంటాం.

అప్పటి వరకూ ‘అంతా బాగున్న’ పిల్లలూ, యువకులే- ఆటలు, పోటీల్లోకి వచ్చేసరికి ఎందుకిలా కుప్పకూలిపోతున్నారు? రేపు ఆటల మైదానంలో ఏ బిడ్డ అయినా ఇలాగే కుప్పకూలిపోవచ్చా? దీనికి కారణం ఏమై ఉంటుంది? ఈ విషాదాలను మనం ఆపలేమా? అందుకు మనమేం చెయ్యాలి?

చాలా కీలకమైన ప్రశ్నలివి! శారీరక శ్రమ చేసిన వెంటనే సంభవించే ఈ హఠాన్మరణాలన్నీ చాలా వరకూ ‘గుండెకు సంబంధించినవే’ అన్నది వైద్యుల విశ్లేషణ. అందుకే ఈ ప్రశ్నను ప్రముఖ పిల్లల హృద్రోగ నిపుణుల ముందుంచింది సుఖీభవ!

పిల్లలు పైకి అంతా బాగానే కనబడొచ్చు. కానీ వీరి గుండెలో అప్పటి వరకూ బయటపడని లోపాలుండి, అవి ఒక్కసారిగా కుప్పకూలిపోయేలా చెయ్యొచ్చు. పిల్లలకు ఆటలు చాలా అవసరం, వాళ్లను ఆటలకు పంపించే విషయంలో మనకు ఆందోళన అనవసరం గానీ... వాళ్ల చేత కాస్త కఠినమైన శ్రమ చేయించేటప్పుడు, శారీరక శ్రమ ఎక్కువగా ఉండే క్రీడల్లోకి పంపేటప్పుడు మాత్రం తల్లిదండ్రులు, పాఠశాలలు ఒక్కసారి తరచి చూడటం ముఖ్యమని నొక్కి చెబుతున్నారు నిపుణులు.

 

కంటికి రెప్పలా కాపాడుకుంటున్న బిడ్డలు, ఇంటికి ఇంటికి దీపంలా వెలిగిపోతున్న పిల్లలు హఠాత్తుగా, అదీ ఆటలాడుకుంటూ మరణించారంటే ఆ కుటుంబాల్లో ఎంతటి వేదన మిగులుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క కుటుంబంలోనే కాదు, అప్పటి వరకూ కలిసి మెలిసి తిరిగిన పిల్లవాడు హఠాత్తుగా కళ్ల ముందే మృత్యువు ఒడిలోకి జారిపోతే స్కూల్లోనూ, తోటి పిల్లల్లో కూడా ఎంతో ఆందోళన, తీవ్ర భావోద్వేగాలు రేగటం సహజం. ఇలా పిల్లలు ఆటలాడుతుండగా, తీవ్రమైన శారీరక శ్రమ చేస్తున్నప్పుడు సంభవించే హఠాత్‌ మరణాలకు సాధారణంగా గుండెలోని లోపాలే కారణమవుతుంటాయి. వైద్యపరంగా చూస్తే దీనికి గుండె నిర్మాణంలోగానీ లేక గుండెలో విద్యుత్‌ తరంగాలు ప్రవహించే తీరులో గానీ తేడా ఉండటమే ఇటువంటి హఠాత్‌ విషాదానికి కారణమవుతుంటుంది. మన దేశంలో కచ్చితమైన లెక్కలు లేవుగానీ అమెరికాలో అయితే పిల్లలు, యువ క్రీడాకారుల్లో ఇలా యేటా 100 వరకూ హఠాన్మరణాలు సంభవిస్తున్నాయి. వీరిలో సుమారుగా 65% హైస్కూలు వయసు పిల్లల్లోనే జరుగుతున్నాయి. నిశ్చింతగా తిరుగుతున్న పిల్లలు ఉన్నట్టుండి ఆటల్లో ఇలా కుప్పకూలిపోతుండటం చాలా తీవ్రమైన, ఆందోళనకరమైన విషయం కాబట్టి ఇటువంటి మరణాలను నివారించేందుకు- ముందుగానే పిల్లలకు ఏవైనా పరీక్షలు చెయ్యటం మంచిదా? కాదా? అన్న అంశంపై వైద్యరంగంలో చాలాకాలంగా చర్చ నలుగుతూనే ఉంది. ఇటువంటి హఠాన్మరణాలకు కారణమయ్యే గుండె సమస్యలను కొన్నింటిని (వీటి గురించి కింద వివరంగా) ముందుగానే గుండెకు సంబంధించిన కొన్ని ప్రాథమిక పరీక్షలు చెయ్యటం ద్వారా గుర్తించొచ్చు. అయితే మొత్తం పిల్లలందరికీ ఇటువంటి పరీక్షలు అవసరమా? అసలు అది సాధ్యమేనా? దానివల్ల ఫలితం ఉంటుందా? లేక పిల్లల్లో, తల్లిదండ్రుల్లో అనవసరపు ఆందోళనలు సృష్టించినట్లవుతుందా? దీనివల్ల తల్లిదండ్రులు అసలు పిల్లలను మొత్తానికే ఆటలకు దూరం చేసేప్రమాదం ఉంటుందా? ఇలా వైద్యులు చాలా రకాల అంశాలను పలు కోణాల నుంచి విశ్లేషించారు.

క్రీడలు: కఠినం.. సాధారణం!
సాధారణంగా 12-15 మెటబాలిక్‌ ఈక్వొలెంట్ల కన్నా ఎక్కువ తీవ్రత గల వ్యాయామాలు, ఆటలను కఠినమైనవిగా పరిగణిస్తారు. పరుగు పందెం, మారథాన్‌, కుస్తీ, ఫుట్‌బాల్‌, ఈత, హాకీ, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, సైక్లింగ్‌, రోయింగ్‌, బాక్సింగ్‌, పర్వాతారోహణ వంటి వాటికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఎప్పుడన్నా ఆటలు ఆడే వారికి పరీక్షల అవసరం పెద్దగా ఉండదు. కానీ క్రీడాకారులుగా ఎదగాలని అనుకునేవాళ్లు మాత్రం ముందుగానే గుండె ఆరోగ్యాన్ని నిర్ధరించే పరీక్షలు తప్పకుండా చేసుకోవాలి. ముఖ్యంగా సమస్యను అంచనా వేయటానికి తోడ్పడే ప్రశ్నావళిలోని ప్రశ్నలకు- ఏ కొంచెం అనుమానాస్పదమైన సమాధానం వచ్చినా పరీక్షలు చేయించాలి.

ఈ మరణాలను ఆపలేమా?
ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా వరకూ నివారించొచ్చు. ఇందుకు..
*కుటుంబ స్థాయిలో: తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రశ్నావళిలోని అంశాలను పరిశీలించాలి. అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించాలి.

*పాఠశాల స్థాయిలో: పీఈటీ, గేమ్స్‌ టీచర్లు- పిల్లల్లో ఎవరు ఫిట్‌గా ఉన్నారు? ఎవరు లేరు? అనేవి గుర్తించగలగాలి. అలాగే ఏదైనా అత్యవసర సందర్భం తలెత్తితే వెంటనే గుండెకు మర్దన చెయ్యటం, నోటితో శ్వాసనివ్వటం (సీపీఆర్‌), అత్యవసరంగా గుండెకు షాక్‌లు ఇచ్చే ‘ఏఈడీ పరికరాల’ వాడకం వంటి ప్రాణ రక్షణ పద్ధతుల్లో శిక్షణ పొంది ఉండాలి.

*ప్రభుత్వ స్థాయిలో: క్రీడా ప్రాంగణాల వంటివాటిలో- అత్యవసరంగా గుండెకు షాక్‌లు ఇచ్చే డిఫిబ్రిలేటర్ల వంటి పరికరాలను అందుబాటులో ఉంచాలి. అమెరికా వంటి దేశాల్లో ఈ పని ఎప్పుడో చేశారు. అలాగే క్రీడలనే వృత్తిగా ఎంచుకోవటానికి ముందు పరీక్షలను తప్పనిసరి చెయ్యాలి.

కళ్లు తిరిగి పడిపోవటం
కొందరు పిల్లలు స్కూల్లో అసెంబ్లీలోనూ, ప్రార్థనా సమయంలోనూ కళ్లు తిరిగి పడిపోతుంటారు. ఇదేమంత ప్రమాదకరం కాకపోవచ్చు. దీనికి చాలావరకూ ‘వ్యాసోవేగల్‌ సింకొపీ’ అనే సమస్య కారణమవుతుంటుంది. దీనిని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం అవసరం. అలాగే కొందరు వ్యాయామాలు చేసేటప్పుడు పడిపోవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు.

ఇది కీలకం!
పిల్లలు ఎదిగే వయసులో ఆటలాడుకోవటం, శారీరకంగా చురుకుగా ఉండటం, వ్యాయామం చెయ్యటం చాలా అవసరం. లేనిపోని భయాలు పెట్టుకుని పిల్లలను ఆటలకు, శారీరక వ్యాయామానికీ దూరంగా ఉంచటం తగదు. అయితే క్రీడాకారులు కావాలని ఆకాంక్షించేవాళ్లు, కొంత కఠినమైన క్రీడల్లో పాల్గొనే వారికి మాత్రం పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు చెయ్యటం అవసరం. బడుల్లో సాధారణ స్థాయి ఆటలు ఆడే పిల్లలకు మాత్రం ఎలాంటి పరీక్షలూ చెయ్యాల్సిన అవసరం ఉండదు. కాకపోతే... ఇటు తల్లిదండ్రులు, అటు స్కూలు యాజమాన్యాలు కూడా పిల్లల ఆరోగ్యం, వారి కుటుంబ చరిత్ర విషయంలో కొన్ని ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబట్టటం.. దానిలో ఏ కొంచెం అనుమానాలు వ్యక్తమైనా అప్పుడు మాత్రం.. తప్పనిసరిగా కొన్ని పరీక్షలు చేయించటం అన్ని విధాలా శ్రేయస్కరం.

ఈ ప్రశ్నలు అడగండి!
టల్లో హఠాన్మరణాలను నివారించేందుకు.. తీవ్రమైన శారీరక శ్రమ చేసినప్పుడు హఠాత్తుగా సంభవించే గుండెపోటులను అడ్డుకునేందుకు ‘అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌’తో సహా పలు కీలక సంస్థలు కొన్ని మార్గదర్శకాలను, ప్రశ్నావళిని రూపొందించాయి. వీటిని చాలా దేశాల్లో పాటిస్తున్నారు. కఠిన శ్రమ చేసినప్పుడు గుండె సమస్యలు తలెత్తే అవకాశం, ఆ ముప్పు ఎక్కువగా ఉన్న పిల్లలను గుర్తించటం ఈ ప్రశ్నావళి లక్ష్యం. దీనిలో మొత్తం 14 విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదటి 10 ప్రశ్నలకు తల్లిదండ్రులు, పిల్లలను అడిగి, సమాధానాలు తెలుసుకోవాలి. మిగిలిన 4 అంశాలను వైద్యులు పరిశీలించాల్సి ఉంటుంది.

ప్రశ్నావళి: తల్లిదండ్రులు చూడాల్సినవి
1. ఆటలాడేటప్పుడు, వ్యాయామం చేసేప్పుడు ఛాతీ నొప్పి వస్తోందా? ఛాతీలో ఇబ్బందిగా, బిగపట్టినట్టుందా? వ్యాయామం చేసినప్పుడు బాగా ఆయాసం వస్తోందా?

2. ఎప్పుడైనా కళ్లు తిరిగి పడిపోయారా? ముఖ్యంగా వ్యాయామం చేస్తున్నప్పుడు కళ్లు తిరిగి పడిపోతామేనని ఎప్పుడైనా అనిపించిందా?

3. వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె చాలా వేగంగా కొట్టుకొని, గుండెదడ, శ్వాస కష్టం కావటం వంటివి ఎదురవుతున్నాయా?

4. ఎప్పుడైనా డాక్టర్‌ దగ్గరకు వెళ్లినపుడు- గుండె చప్పుడులో తేడా ఉందని చెప్పారా?

5. బీపీ ఎక్కువగా ఉందా?

6. గతంలో వైద్యులు ఎవరైనా ఆటలు ఆడొద్దని సూచించారా?

7. ఇంతకు ముందు ఏవైనా గుండె పరీక్షలు చెయ్యాల్సి వచ్చిందా?

8. ఎలాంటి జబ్బులు, కారణాలు లేకుండా కుటుంబంలో ఎవరైనా 40 ఏళ్లలోపు హఠాత్తుగా చనిపోయారా?

9. రక్తసంబంధీకుల్లో ఎవరిలోనైనా పుట్టుకతోనే గుండె జబ్బులున్నాయా?

10. కుటుంబంలో ఎవరికైనా హైపర్‌ట్రోఫిక్‌ మయోపతీ, లాంగ్‌క్యూటీసీ వంటి గుండెజబ్బులు బయటపడ్డాయా?

ఇక డాక్టర్లు చూడాల్సినవి
11. గుండె చప్పుడు కాకుండా ఇతరత్రా ఏమైనా చప్పుళ్లు (మర్మర్స్‌) వినిపిస్తున్నాయా?

12. తొడ దగ్గరి నాడి అందుతోందా?

13. వేళ్లు పొడవుగా ఉండటం వంటి మార్ఫన్‌ సిండ్రోమ్‌ సంకేతాలేమైనా ఉన్నాయా?

14. రక్తపోటు ఎక్కువగా ఉందా?

*వీటిల్లో ఏ ఒక్కదానికి అవును అనే సమాధానం వచ్చినా.. తీవ్ర శారీరక శ్రమతో కూడిన వ్యాయామాలు, ఆటలు ఆడటానికి ముందు వీరికి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించటం అవసరం. కనీసం ఈసీజీ, ఎకో చేయాల్సి ఉంటుంది.

*ఈ ప్రశ్నావళిని- పోటీలకు, ఫిట్‌నెస్‌ పరీక్షలకు వెళ్లేటప్పుడు కాదు.. దానికి కనీసం రెండు వారాల ముందే పరిశీలించాలి. అప్పుడే ఏదైనా సమస్య ఉంటే తగు పరీక్షలు చేసే వీలుంటుంది.

*ఈ ప్రశ్నావళి, పరీక్షలతో హఠాత్తు మరణాలను పూర్తిగా నివారించగలమని హామీ ఇవ్వలేకపోయినా.. చాలావరకూ నివారించొచ్చని మాత్రం చెప్పొచ్చు. పాఠశాలలన్నీ పిల్లలను ఆటల్లోకి పంపే ముందు వీటి గురించి సమాచారం తెలుసుకోవాలి.

ఆటల్లో హఠాన్మరణానికి కారణమయ్యే గుండె లోపాలేమిటి?

ఠినమైన ఆటలాడుతున్నప్పుడు, తీవ్ర శారీరక శ్రమ చేస్తున్నప్పుడు హఠాన్మరణానికి కారణమయ్యే గుండె జబ్బులు కొన్ని ఉన్నాయి. వీటి గురించి క్లుప్తంగా చూద్దాం!
*హైపర్‌ట్రోఫిక్‌ కార్డియో మయోపతీ: హఠాత్తుగా గుండె కొట్టుకోవటం ఆగిపోయి, మరణించటానికి ఎక్కువమందిలో కనిపించే ప్రధాన కారణం ఇదే. ఈ సమస్య ఉన్నవాళ్లలో- గుండె కండరం చాలా దళసరిగా, మందంగా ఉంటుంది. దీంతో గుండె లోపలి గదుల్లో ఖాళీ తగ్గిపోయి, అవి చిన్నగా అవుతాయి. అలాగే గుండె నుంచి రక్తాన్ని బయటకు తీసుకువెళ్లే బృహద్ధమనిలోకి వెళ్లే రక్త ప్రవాహం తగ్గిపోతుంది. దీనివల్ల ఏం జరుగుతుందో చూద్దాం.

సాధారణంగా మనం వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరానికి శక్తి ఎక్కువ అవసరమవుతుంది. దీంతో సాధారణ స్థితిలో కంటే తీవ్ర శ్రమ చేస్తున్నప్పుడు రక్త ప్రసరణ 4 నుంచి 10 రెట్ల వరకూ పెరుగుతుంది. సాధారణంగా అయితే గుండె ఈ అదనపు ఒత్తిడిని బాగానే తట్టుకుంటుంది. కానీ ‘కార్డియో మయోపతీ’ సమస్య ఉన్నవారిలో వ్యాయామం చేసినప్పుడు గుండె ఈ ఒత్తిడిని తట్టుకోలేదు. దీంతో ‘అడ్రినల్‌’ అనే ఒత్తిడి హార్మోను ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. గుండె కండరం ఎక్కువగా సంకోచిస్తుంది. ఫలితంగా బృహద్ధమనిలోకి వెళ్లే రక్త ప్రవాహం తగ్గిపోతుంది. మరోవైపు శరీరానికేమో రక్తం అవసరం మరింతగా పెరుగుతుంటుంది. దీంతో గుండె ఈ ఒత్తిడిని తట్టుకోలేని స్థితికి చేరుకుని.. ఆయాసం, కళ్లు తిరిగిపోవటం వంటి లక్షణాలు బయల్దేరతాయి. నిమిషాల్లోనే హఠాత్తుగా గుండె ఆగిపోయి పిల్లలు కుప్పకూలిపోవచ్చు. కాబట్టి ఈ సమస్య ఉన్న పిల్లలు తీవ్ర ఆయాసం కలిగించే ఆటలు, వ్యాయామాల జోలికి వెళ్లకూడదు.

వాస్తవానికి ఈ హైపర్‌ట్రోఫిక్‌ మయోపతీ పుట్టుకతోనే వచ్చే జన్యుపరమైన సమస్య. కాకపోతే అందరిలోనూ ఒకే స్థాయిలో ఉండక్కర్లేదు. దీంతో కొందరికి ఏడాదిలోపే బయటపడితే.. మరికొందరికి 30-40 ఏళ్ల తర్వాత కూడా బయటపడొచ్చు. చిన్న వయసులో స్కానింగ్‌ చేసినప్పుడు గుండె కండరం మామూలుగానే ఉన్నా.. పది, పన్నెండేళ్ళకు సమస్యాత్మకంగా పరిణమించే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ముందుగానే గుర్తించి తగు చికిత్స ఆరంభించటం ఉత్తమం. అలాగే ఆటల్లోకి వెళ్లే విషయంలో వైద్యుల సలహా సూచనలు పాటించటం అవసరం. ఇది జన్యుపరంగా వచ్చే సమస్య కాబట్టి గతంలో సరైన కారణమేదీ లేకుండా కుటుంబంలో ఎవరైనా హఠాత్తుగా చనిపోవటం వంటి చరిత్ర ఉంటే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

*అరిత్మోజెనిక్‌ రైట్‌ వెంట్రిక్యులార్‌ డిస్‌ప్లేసియా (ఏఆర్‌వీడీ): ఇందులో పుట్టుకతోనే కుడి జఠరిక సరిగా ఉండదు. ఆ ప్రాంతంలో గుండె కండరానికి బదులుగా కొవ్వు కణజాలం ఉంటుంది. వయసుతో పాటే ఇదీ పెరుగుతూ వస్తుంది. వీరిలో వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె వేగం బాగా పెరిగిపోయి, ప్రాణాల మీదికి రావచ్చు.

*‘లాంగ్‌ క్యూటీసీ’, బ్రుగాడా సిండ్రోమ్‌లు: ఇవంత తరచుగా కనబడే సమస్యలేమీ కావు. కానీ ఈ సమస్యలున్నవారికి మాత్రం ఇవి హఠాన్మరణానికి కారణం కావచ్చు. మన గుండె సంకోచవ్యాకోచాలకు ఒక పద్ధతి ప్రకారం విద్యుత్‌ తరంగాలు ప్రవహిస్తుండటమే మూలం. ఈ విద్యుత్‌ తరంగాల ప్రవాహానికి గుండె కండరంలో సోడియం, పొటాషియం మార్గాలు ఉంటాయి.

సాధారణంగా గుండెలోని విద్యుత్తు తరంగాలు ఎస్‌ఏ నోడ్‌ వద్ద పుట్టి ఏవీ నోడ్‌ వరకూ ప్రయాణించి ఆ తర్వాత క్రమేపీ ఆగిపోతాయి. కానీ ‘లాంగ్‌ క్యూటీ సీ’ సమస్య ఉన్నవారిలో సోడియం, పొటాషియం మార్గాలు సరిగా లేకపోవటం వల్ల (అయాన్‌ ఛానలోపతి) కరెంటు తరంగాలు ఆగిపోకుండా అలాగే ఉండి గుండెను అస్తవ్యస్తం చేసేస్తాయి. దీంతో గుండె కొట్టుకునే లయ దెబ్బతింటుంది, వేగం పెరుగుతుంది. ఫలితంగా హఠాత్తుగా మరణం రావచ్చు. వీరిలో చూడటానికి గుండె కండరం అంతా మామూలుగానే ఉంటుంది. స్కానింగులోనూ పైకేమీ కనబడదు. ఈసీజీ ద్వారా సమస్యను గుర్తించొచ్చు. కొందరిలో ఈసీజీలోనూ బయటపడకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో కుటుంబంలో ఎవరైనా హఠాత్తుగా చనిపోయారా? ఎలాంటి కారణం లేకుండా అకాల మరణానికి గురయ్యారా? వంటి వాటిని పరిశీలించి సమస్యను అంచనా వేయొచ్చు.

*మార్ఫన్‌ సిండ్రోమ్‌: ఇందులో బృహద్ధమని గోడలు పలుచబడి, ఉబ్బిపోతాయి. దీంతో రక్తం ఉరవడితో ప్రవహించినప్పుడు అక్కడ ఉబ్బి, బలహీనపడిన భాగం చిరిగిపోయే అవకాశం ఎక్కువ.

జిమ్‌కు వెళ్లి ఎక్కువగా బరువులు ఎత్తటం, ఈత కొట్టటం, ఫుట్‌బాల్‌ ఆడటం వంటి కఠిన శ్రమ చేసినప్పుడు బృహద్ధమని ఉన్నట్టుండి చిరిగి, మనిషి చనిపోవచ్చు. ఈ మార్ఫన్‌ సిండ్రోమ్‌ ఉన్నవారికి నిరంతర పర్యవేక్షణ, చికిత్సలు, అవసరమైతే ఆపరేషన్‌ వంటి చెయ్యాల్సి రావచ్చు. వీరికి ముందుగా ఎలాంటి లక్షణాలూ ఉండకపోవచ్చు. కాబట్టి కఠినమైన క్రీడల్లోకి వెళ్లే ముందు ఇలాంటివేమీ లేవని నిర్ధారించుకోవటం చాలా అవసరం.

*మరికొన్ని: లెఫ్ట్‌ వెంట్రిక్యులార్‌ అవుట్‌ ఫ్లో ట్రాక్ట్‌ అబ్‌స్ట్రక్షన్స్‌, కోఆర్టేషన్‌ ఆఫ్‌ అయోర్టా, పల్మనరీ ఆర్టిరియర్‌ హైపర్‌టెన్షన్‌ వంటి పుట్టుకతో వచ్చే సమస్యలు కూడా హఠాత్తుగా మరణించటానికి దారితీయొచ్చు. గుండెకు రక్తసరఫరా చేసే నాళాల్లో లోపాలు కూడా దీనికి కారణం కావొచ్చు. ఇవి కాకుండా మరికొన్ని గుండె సమస్యలు కూడా దీనికి దోహదం చేస్తాయి.

మొత్తమ్మీద ఇటువంటి తీవ్రమైన గుండె లోపాలు, సమస్యలున్నా కూడా.. ఈ పిల్లలు చాలా ఏళ్లపాటు పైకి మామూలుగానే ఉంటారు. కానీ హఠాత్తుగా ఏదో ఒకనాడు తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు కుప్పకూలిపోవచ్చు.

పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం చేసే దారుఢ్య పరీక్షల్లో పరుగెత్తే యువకులు కూడా హఠాత్తుగా మరణిస్తున్న సందర్భాలు తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వారికి అప్పటికే అధిక రక్తపోటు లేదంటే హైపర్‌ట్రోఫిక్‌ కార్డియో మయోపతీ, లాంగ్‌క్యూటీసీ వంటి సమస్యలు ఉండి ఉండొచ్చు. వీటిని గుర్తించకుండా తీవ్రంగా పరుగెడితే.. గుండె శక్తికి మించి పని చేయటం వల్ల హఠాత్తుగా మరణించే అవకాశాలుంటాయి. అందువల్ల దారుఢ్య పరీక్షలకు, కఠినమైన క్రీడలకు వెళ్లే పిల్లలు, యువకులకు ముందుగానే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం.
 

cinema-300-50.gif
sthirasthi_300-50.gif