పొదుపు, మదుపు, పన్నులు, బీమా, బ్యాంకులు, రుణాలు, ఆస్తులు-హక్కులు... ఇలా వ్యక్తిగత ఆదాయానికి సంబంధించిన మీ సందేహాలేమైనా సరే కార్డుపై క్లుప్తంగా రాయండి.

సిరి,
ఈనాడు బిల్డింగ్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌,
రామోజీ ఫిల్మ్‌ సిటీ
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512.
siri@eenadu.net

మదుపు కోసం... వ్యూహం ఏది?
మార్కెట్‌ అంటేనే అనిశ్చితి ఉంటుంది. ఒకరోజు పెరగడం.. మరో రోజు తగ్గడం ఇక్కడ సర్వసాధారణం. మరి, ఇలాంటి ఆటుపోట్లలోనూ మన పెట్టుబడి వృద్ధి చెందాలంటే మనం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? నష్టాలు తగ్గించుకొని, లాభాల తీరాన్ని చేరాలంటే ఏం చేయాలి?

పరిస్థితులు ఎలా ఉన్నా.. కొంతమంది మార్కెట్లో పెట్టుబడుల నుంచి లాభాలు ఆర్జిస్తుంటారు. కచ్చితమైన వ్యూహాన్ని ఎంచుకొని దాన్ని పాటించడమే ఇందుకు కారణం. కొంతమంది నష్టాలు కొనితెచ్చుకుంటారు. వీరు తమ వ్యూహాలను ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఒక వ్యక్తికి నప్పిన పెట్టుబడి సూత్రం మరో మదుపరికి సరిపోకపోవచ్చు. ఎవరికి వారు దీన్ని నిర్ణయించుకోవాల్సిందే.. అన్ని పరిస్థితుల్లోనూ మదుపరులను విజయవంతంగా నిలిపే కొన్ని సూత్రాలు ఏమిటో మనం చూద్దాం!

సమతౌల్యం పాటించాలి
పెట్టుబడులకు కేటాయించే మొత్తం డబ్బును ఒకే పథకంలో మదుపు చేయడం ఎప్పుడూ మంచిది కాదు. ఈ మొత్తాన్ని షేర్లు, స్థిరాస్తి, బాండ్లు, కమోడిటీలు, మ్యూచువల్‌ ఫండ్లు, బీమా పాలసీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తదితర వైవిధ్యమైన పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. ఇలా చేయడం వల్ల కష్టకాలంలో పెట్టుబడి మొత్తానికి పెద్దగా నష్టాలు వచ్చే ప్రమాదం ఉండదు. ఉదాహరణకు.. ‘గుడ్లన్నీ ఒకే బుట్టలో పెట్టకూడదు.. పొరపాటున జారితే అన్ని గుడ్లూ పగిలిపోతాయి. దీన్ని నివారించాలంటే.. వాటిని వేర్వేరు చోట్ల భద్రపర్చాలి.’ ఈ సూత్రమే పెట్టుబడులకూ వర్తింపజేయాలి.

పెట్టుబడుల్లో వైవిధ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వైవిధ్యంగా మదుపు చేసినంత మాత్రాన నష్టభయం నుంచి తప్పించుకోగలం అనే హామీ ఏమీ ఉండదు. కాకపోతే విభిన్న పథకాలు, పరిశ్రమలు, రంగాలు, సంస్థలను ఎంచుకోవడం ద్వారా నష్టభయాన్ని తగ్గించుకోగలం.


పొదుపా? మదుపా?
పొదుపు.. పెట్టుబడి.. ఈ రెండింటి మధ్య అర్థం తెలియక చాలామంది పొరపడుతుంటారు. సంపాదనలో అవసరమైన ఖర్చులు పోను మిగిలింది పొదుపు. ఇలా మిగిలిన పొదుపు మొత్తాన్ని దీర్ఘకాలిక అవసరాల కోసం మంచి రాబడిని ఆర్జించే లక్ష్యంతో వివిధ పథకాలకు కేటాయించడం పెట్టుబడి. దీంతోనే సంపదను సృష్టించేందుకు వీలవుతుంది. పొదుపు మొత్తాన్ని డబ్బు రూపంలోనో.. బ్యాంకు పొదుపు ఖాతాలోనో భద్రపర్చుకుంటే.. ఎలాంటి నష్టభయం ఉండదు. రాబడీ తక్కువే. షేర్లు, బాండ్లు, స్థిరాస్తి తదితర వాటిల్లో మదుపు చేసినప్పుడు మాత్రం పెట్టుబడికీ, రాబడికీ ఎలాంటి హామీ ఉండదు. నష్టభయం అధికంగా ఉన్నచోట రాబడికీ అంతే అవకాశం ఉంటుంది.

ముందే నిర్ణయం...
పెట్టుబడి పెట్టేముందు మనం ఏ వ్యూహాన్ని అనుసరించాలన్నది ముందే తెలుసుకోవాలి. దీనికోసం వ్యక్తి ఆర్థిక లక్ష్యాలు, వ్యవధి, నష్టభయాన్ని భరించే సామర్థ్యం, ఆర్థిక పరిస్థితులు ఏమిటన్న వివరాల్లో స్పష్టత ఉండాలి. ఆ తర్వాత ఆ వ్యూహానికి కట్టుబడి క్రమశిక్షణతో పెట్టుబడులు ప్రారంభించాలి. ఉదాహరణకు.. ఒక వ్యక్తి చాలా తక్కువ నష్టాన్నే భరించగలడు అనుకుందాం. ఇలాంటివారు స్థిరాదాయం ఇచ్చే ప్రభుత్వ బాండ్లు, ఇతర సురక్షిత పథకాలను ఎంచుకోవాలి. సంప్రదాయ మదుపరులు ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు లార్జ్‌క్యాప్‌ సంస్థలతోపాటు, ఒడిదొడుకులు తక్కువగా ఉండే రంగాలు, డివిడెండు ఇచ్చే సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కాస్త దూకుడుగా పెట్టుబడులు పెట్టేవారు అధిక నష్టభయం భరించగలిగే వారు మిడ్‌ క్యాప్‌/ స్మాల్‌ క్యాప్‌ షేర్లపై దృష్టి పెట్టొచ్చు. వృద్ధికి అవకాశం, పరిస్థితుల ఆధారంగా పనితీరు బాగుండే కంపెనీల్లో ఎప్పటికప్పుడు పెట్టుబడులను మారుస్తూ ఉండాలి. ఇక్కడ నష్టభయం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో రాబడీ అధికంగా ఆశించొచ్చు.

తొందరగా ప్రారంభిస్తే...
ప్పుడే పెట్టుబడులకు తొందర ఏమొచ్చింది? ఈ ధోరణి చాలామందిలో కనిపిస్తుంది. పెట్టుబడులను ఎప్పుడూ వీలైనంత తొందరగానే ప్రారంభించాలి. అంటే, ఆర్జన మొదలు పెట్టిన నాటి నుంచే పెట్టుబడులూ ప్రారంభం కావాలి. అప్పుడే చక్రవడ్డీ ప్రభావంతో సంపద సృష్టి జరుగుతుంది. చిన్న వయసు నుంచే మదుపు చేయడం వల్ల దీర్ఘకాలం పాటు పెట్టుబడి కొనసాగించేందుకు వీలవుతుంది. ఫలితంగా తక్కువ మొత్తంతోనూ పెద్ద నిధిని సంపాదించేందుకు వీలవుతుంది. ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి సాధించడమూ సాధ్యం అవుతుంది.

క్రమం తప్పకూడదు...
వనం మొత్తం ఒకేసారి కట్టలేం. అంచెలంచెలుగా నిర్మాణం పూర్తి చేయాలి. పెట్టుబడులూ అంతే. ఒకేసారి మొత్తం డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా కొన్నిసార్లు నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే, ఎప్పుడూ క్రమానుగత పెట్టుబడులకే ప్రాధాన్యం ఇవ్వాలి. మార్కెట్‌ వివిధ స్థాయుల వద్ద మదుపు చేయాలి. మార్కెట్‌లో మదుపు చేసేందుకు సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. ఆ సమయాన్ని గుర్తించడం ఎవరికీ సాధ్యం కాదు కూడా. మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయడం ఎప్పుడూ ఆచరణీయం.

దీర్ఘకాలం కొనసాగాలి
పెట్టుబడి అంటే ఒక రోజుతో ముగిసే ప్రక్రియ కాదు. ఎంత దీర్ఘకాలం కొనసాగితే అంత మంచి ఫలితాలు అందుతాయి. చిన్న వయసు నుంచే మదుపు ప్రారంభించిన వారు దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంతో ముందుకు సాగాలి. తరచూ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం లేదా కంపెనీలను మార్చడం వల్ల మీకు వచ్చే రాబడులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సరైన వ్యూహాన్ని ఎంచుకోవాలి. దానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే దీర్ఘకాలంలో మీ డబ్బు మీ కోసం పనిచేయడం ప్రారంభిస్తుంది.

పెట్టుబడి.. వ్యాపారం..
చాలామంది మదుపరులు తాము పెట్టుబడి (ఇన్వెస్ట్‌మెంట్‌) పెడుతున్నామా? వ్యాపారం (ట్రేడింగ్‌) చేస్తున్నామా? అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోరు. ఇద్దరి లక్ష్యమూ లాభాలను ఆర్జించడమే అయినా.. ఈ రెండు వ్యూహాల్లో చాలా వ్యత్యాసం ఉంది. వ్యాపారం స్వల్ప కాలానికి సంబంధించింది. ఇందులో దీర్ఘకాలిక ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి ఆశలూ ఉండవు. డివిడెండ్లు, వడ్డీలు వస్తాయని మదుపు కొనసాగించడం వీరికి ఇష్టం ఉండదు. అప్పటికప్పుడు లాభాలు వచ్చాయా లేదా? అంతవరకే చూస్తారు. వార్తలు, పరిస్థితుల ప్రభావంతో ఒక షేరు ధర తక్కువకు దొరికినప్పుడు వాటిని కొని, మంచి ధర వచ్చినప్పుడు అమ్మేస్తుంటారు.

పెట్టుబడి అంటే.. ఒక షేరులో ఏడాది లేదా అంతకు మించిన వ్యవధిపాటు కొనసాగడం. ఇలాంటప్పుడు కంపెనీ వ్యాపారం, దాన్ని యాజమాన్యం, ఆర్థిక పరిస్థితులు, డివిడెండు చరిత్ర, మూలధనం తదితర అనేక అంశాలను పరిగణనలోనికి తీసుకొని మదుపు చేయాలి.


భావోద్వేగాలకు దూరంగా...
త్యాశ, ఆందోళన, భయం ఇవన్నీ పెట్టుబడికి శత్రువులు. వీటిని సాధ్యమైనంత వరకూ దరిచేరనీయొద్దు. చాలామంది మదుపరులు వీటిని అదుపులో పెట్టుకోలేక, తమ పెట్టుబడులను నష్టపోతుంటారు. మదుపరులు, ట్రేడర్లు తాము తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత లేకుండా, ఈ భావోద్వేగాలు వారిని నడిపించి, అకారణంగా నష్టాలకు కారణం అవుతాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.

తెలియకుంటే వద్దు..
నకు బాగా తెలిసిన మార్గంలో ప్రయాణించడం చాలా సులువు. కొత్త దారిలో వెళ్లేప్పుడు ఎక్కడ మలుపులున్నాయో.. గుంతలు ఉన్నాయో కాస్త గమనిస్తూ సాగాలి. పెట్టుబడుల విషయం కూడా అంతే. షేర్లలో మదుపు చేసేప్పుడు వాటి గురించి తెలుసుకోకపోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. వదంతులు, ఫలానా షేరు ధర పెరుగుతుందనే సందేశాల(టిప్స్‌) ఆధారంగా షేర్లను ఎంచుకోవడం మంచిది కాదు. దీనివల్ల చాలా సందర్భాల్లో మదుపరులకు నష్టాలే మిగిలాయి. ఒక షేరు/పెట్టుబడి పథకం ద్వారా మంచి రాబడిని ఆర్జించాలంటే దానిపై పూర్తి అవగాహన ఉండాలి. మీకు అంతంతమాత్రం తెలిసిన పథకాల జోలికి సాధ్యమైనంత వరకూ వెళ్లకపోవడమే ఉత్తమం. మీకు సొంతంగా పరిశోధన చేసుకునేంత తీరిక లేకపోతే.. పెట్టుబడుల గురించి అవగాహన ఉన్న నిపుణులను సంప్రదించడం మంచిది.

అందరికన్నా భిన్నంగా..
దుపు చేసేప్పుడు అనుసరించే తత్వాన్ని వదిలేసుకోవాలి. ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొంది అందరూ మదుపు చేస్తున్నారని మనమూ అదే దారిలో పయనిస్తే చివరకు నష్టం వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందరూ పెట్టుబడి పెడుతున్నప్పుడు వాటి విలువ అధిక ధరలకు చేరుతుంది. తిరిగి పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు ఆశించిన రీతిలో ఫలితం లభించకపోవచ్చు.

తక్కువ నష్టభయంతో అధిక రాబడిని ఇచ్చేదే.. సరైన పెట్టుబడి వ్యూహం. ముందే అనుకున్నట్లు.. ప్రతి ఒక్కరికీ ఒక్కో వ్యూహం సరిపోతుంది. గుర్తించాల్సిందల్లా మీకు ఏ మదుపు వ్యూహం/సూత్రం నప్పుతుందనేదే. కొంత ఓపిక, అనుభవం ఉంటే అది అంత కష్టమేమీ కాదు. దీర్ఘకాలిక లక్ష్యాలూ సులువుగా సాకారం అవుతాయి.

  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • sthirasthi_300-50.gif