మీ సూచనలు, అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా మాకు పంపాల్సిన
చిరునామా:

ఐటీ అండ్‌ సైన్స్‌ డెస్క్‌,
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు, రామోజీ ఫిల్మ్‌ సిటీ
అనాజ్‌పూర్‌ గ్రామం, హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512.
ith@eenadu.net

పదిలమైన పాస్‌వర్డ్‌ కోసం...
అన్నీ ఆన్‌లైన్‌ సర్వీసులే...వాడాలనుకుంటే?యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ తప్పనిసరి! మరి, మీ పాస్‌వర్డ్‌ ఏ మేరకు పదిలం?హ్యాకర్‌ వూహకు అందుతుందా?ఒకసారి చెక్‌ చేసుకోండి!
నెట్టింట్లో సర్వీసులు అంటే కేవలం మెయిల్‌ సర్వీసులు, సోషల్‌ నెట్‌వర్క్‌ వేదికలే కాదుగా... నిత్యం బ్యాంకింగ్‌ వ్యవహారాల్ని చక్కబెట్టేస్తున్నాం. క్లౌడ్‌ సర్వీసుల్ని వాడుకుని ముఖ్యమైన డాక్యుమెంట్స్‌, ఫొటోలు, వీడియోలు... ఇలా డేటా ఏదైనా నెట్టింట్లోనే భద్రం చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే టిక్కెట్టు బుకింగ్‌... ఈ-షాపింగ్‌... ఒకటా రెండా... రోజువారీ అవసరాలకు తెరవాల్సినవి అన్నీ ఆన్‌లైన్‌ లాకర్లే. అన్నింటికీ పాస్‌వర్డ్‌ తప్పనిసరి. మరి, పాస్‌వర్డ్‌ని క్రియేట్‌ చేయడంలో ఏ మాత్రం అలసత్వం పనికి రాదు. మీదైన పద్ధతిలో పాస్‌వర్డ్‌ని పెట్టేసి ఎవ్వరూ కనిపెట్టలేరులే అనుకుంటే పొరబాటే. ఎందుకంటే హ్యాకర్లు చిటికెలో కనిపెట్టేస్తారు. మరైతే... పాస్‌వర్డ్‌ని పెట్టుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్లిష్టమైన పాస్‌వర్డ్‌ని ఎలా ఎంపిక చేయాలి? ఇవిగోండి కొన్ని పాస్‌వర్డ్‌ చిట్కాలు. ఫాలో అయితే పటిష్టమైన పాస్‌వర్డ్‌ని పెట్టుకోవడం చాలా సులభం...

సులభం అనుకోవద్దు.
టైప్‌ చేసేందుకు పాస్‌వర్డ్‌ సులువుగా ఉండేలా చూసుకోవడం చాలా మందికి అలవాటు. కానీ, అదెంత ప్రమాదకరమైనదో నెటిజన్లకు తెలియదు. అలాంటి పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు ఇట్టే పసికట్టేస్తారు. ఈ తరహా సులభమైన పాస్‌వర్డ్‌ల (Worst Passwords) జాబితాను గత ఏడాది ఓ సెక్యూరిటీ సంస్థ విడుదల చేసింది కూడా. వాటిల్లో 123456, 12345678, qwerty, 2345, 1234567890, qwertyuiop... పాస్‌వర్డ్‌లు ప్రథమ స్థానాల్లో ఉన్నాయి. వీటిని యూజర్లు వాడడానికి ప్రధాన కారణం... సులువుగా టైప్‌ చేయడానికి వీలుండడమే! ఈ తరహా పాస్‌వర్డ్‌లను వాడడం ప్రమాదం.

‘డీఫాల్ట్‌’గా ఉంచొద్దు
నెట్టింట్లో కొన్ని సర్వీసులు వాడే సమయంలో డీఫాల్ట్‌ పాస్‌వర్డ్‌లు జనరేట్‌ అవుతాయి. ఉదాహరణకు వై-ఫై నెట్‌వర్క్‌ని సెట్‌ అప్‌ చేయడం. డీఫాల్ట్‌గా పరికరం అందించే యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లను అలాగే వాడేయడం. admin/admin లేదా admin/Password అనే పేర్లతో జనరేట్‌ అయితే అవే యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లుగా పెట్టేస్తారు. తర్వాత మార్చుకోవచ్చులే అనుకూంటూ వాడేస్తుంటారు. కానీ, ఎప్పటికీ మార్చరు. ఇదో ప్రమాదకరమైన బద్దకపు ప్రక్రియ. హ్యాకర్లు ఈ తరహా నెట్‌వర్క్‌లను క్షణాల్లో హ్యాక్‌ చేస్తారు.
తక్కువ అక్షరాలు...
పాస్‌వర్డ్‌ తక్కువ అక్షరాలతో చిన్నగా ఉండాలనుకుంటారు. అందుకే 1234 లేదా solo అనో పాస్‌వర్డ్‌లను క్షణాల్లో ఎంపిక చేసి పెట్టేస్తుంటారు. ఇవో చెత్త పాస్‌వర్డ్‌లుగా సెక్యూరిటీ సంస్థలు నివేదకల్లో చెబుతున్నాయి. ఈ తరహా పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడం నెటిజన్‌ అమాయకత్వాన్ని సూచిస్తుంది.
కలగలుపుగా...
అక్షరాలు, అంకెలు, గుర్తులు ఉన్న తక్కువ నిడివి పాస్‌వర్డ్‌ కంటే కేవలం అక్షరాలతో కూడిన పొడవైన పాస్‌వర్డ్‌నే శ్రేయస్కరం. కానీ, కేవలం అక్షరాలతో కూడిన పాస్‌వర్డ్‌ని హ్యాకర్లు విశ్వప్రయత్నం చేసి పసిగట్టేందుకు అవకాశం లేకపోలేదు. అందుకే మరింత పటిష్టమైన పాస్‌వర్డ్‌ని సెట్‌ చేయాలంటే? కచ్చితంగా అన్నింటి (అక్షరాలు, అంకెలు, గుర్తులు) కలగలుపుతోనే పొడవైన పాస్‌వర్డ్‌ని పెట్టుకోవాలి. అప్పుడే హ్యాకర్‌కి పాస్‌వర్డ్‌ని క్రాక్‌ చేయడానికి చెమటలు పడతాయి. వూహించడం అసాధ్యం అవుతుంది.
లాజిక్కులు...
అక్షరాలు, అంకెలు, గుర్తులూ ఉన్న పాస్‌వర్డ్‌ అయినప్పటికీ అక్షరాలకు దగ్గరగా ఉన్న అంకెలు, గుర్తుల్ని వాడడం మంచిది కాదు. ఎందుకంటే హ్యాకర్లు పలు రకాల లాజిక్‌లతో పాస్‌వర్డ్‌లను క్రాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తారన్న విషయాన్ని మర్చిపోవద్దు.
వ్యక్తిగతం...
అభిరుచులు... అలవాట్లు... లాంటి ఇతర వ్యక్తిగతమైన వాటిని పాస్‌వర్డ్‌లుగా సెట్‌ చేయడం సురక్షితం కాదు. పటిష్టమైన పాస్‌వర్డ్‌లో పేర్లు, వ్యక్తిగతమైనవి ఉండరాదు. ఉదాహరణకు ఇష్టమైన ఆటలు, ఆహార పదార్థాల పేర్లను పాస్‌వర్డ్‌గా ఎంపిక చేయకూడదు. ఎందుకంటే మీ ఎకౌంట్‌ని హ్యాక్‌ చేయాలనుకుంటే హ్యాకర్లు మీ సోషల్‌ ప్రొఫైల్‌ని (సోషల్‌ ఇంజినీరింగ్‌) క్షుణ్ణంగా పరిశీలిస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

పోలి ఉండొద్దు...
సర్వీసు ఏదైనా యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ రెండూ అనివార్యం. రెండూ ఒకేసారి క్రియేట్‌ చేస్తాం. పెట్టుకున్న పాస్‌వర్డ్‌కి యూజర్‌నేమ్‌తో ఎలాంటి పోలిక ఉండకూడదు.

భద్రంగా దాచుకోండి
ఒకటా... రెండా? నెట్టింట్లో అనేక సర్వీసుల్ని వాడుతుంటాం. అన్ని పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాలంటే? కొంచెం కష్టమే. అందుకే వాడుతున్న పీసీ, కంప్యూటర్‌లలో పాస్‌వర్డ్‌లను మేనేజ్‌
చేసుకునేందుకు తగిన టూల్స్‌ వాడితే మంచిది. ముందుగాLastPassఅప్లికేషన్‌ని ప్రయత్నించొచ్చు. ఇదో ఉచిత సర్వీసు. బ్రౌజర్‌లోనే కాకుండా డెస్క్‌టాప్‌ అప్లికేషన్‌ని పీసీలో ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడొచ్చు. ముందుగా మాస్టర్‌ పాస్‌వర్డ్‌ని క్రియేట్‌ చేసుకుని అన్ని సర్వీసుల్ని మేనేజ్‌ చేయవచ్చు. మీరు పెట్టుకున్న పాస్‌వర్డ్‌లు ఎంత పటిష్టమైనవో తెలుసుకునే వీలుంది. ఎప్పటికప్పుడు కొత్త పాస్‌వర్డ్‌లను జనరేట్‌ చేసి వాడుకోవచ్చు. కొత్త సర్వీసుల్లోకి లాగిన్‌ అయ్యే సమయంలోనూ కొత్త పాస్‌వర్డ్‌లను LastPass సర్వీసుతోనే క్రియేట్‌ చేయవచ్చు. వాడుతున్న సర్వీసుల పాస్‌వర్డ్‌లు ఆటోమాటిక్‌గా మారేలా సెట్‌ చేయవచ్చు కూడా. పాస్‌వర్డ్‌లే కాదు... ముఖ్యమైన వివరాలతో కూడిన నోట్స్‌ని Secure Notes విభాగంలో మేనేజ్‌ చేయవచ్చు. బ్రౌజర్‌పై వెబ్‌ సర్వీసుగానే కాకుండా యాడ్‌ఆన్స్‌ రూపంలోనూ వాడుకోవచ్చు. మ్యాక్‌, లినక్స్‌ ఓఎస్‌లనూ సపోర్ట్‌ చేస్తుంది. ఫోన్‌ లేదా ట్యాబ్‌ వాడుతున్నట్లయితే ఆప్‌లా ఇన్‌స్టాల్‌ చేసుకుని ఎప్పుడైనా... ఎక్కడైనా... పాస్‌వర్డ్‌లను యాక్సెస్‌ చేయవచ్చు. అన్ని ఫ్లాట్‌ఫాంలకు తగిన డౌన్‌లోడ్స్‌ కోసం https:// lastpass.com/misc_download2.phpలింక్‌ని చూడండి.

ఇవి పాటించాల్సిందే!
* ఒకే పాస్‌వర్డ్‌ని ఎక్కువ ఎకౌంట్‌లకు వాడొద్దు.
* అంకెలు, గుర్తులతో కూడిన 16 అక్షరాల పాస్‌వర్డ్‌ అయితే సురక్షితం.
* కుటుంబ సభ్యులు, స్నేహితులు, పెంపుడు జంతువుల పేర్లను పాస్‌వర్డ్‌లుగా పెట్టొద్దు.
* పోస్టల్‌కోడ్‌లు, ఇంటి నెంబర్లు, ఫోన్‌ నెంబర్లు, పుట్టిన తేదీ, ఐడీ కార్డ్‌ నెంబర్‌లను పాస్‌వర్డ్‌లుగా ఎంపిక చేయవద్దు.
* నిఘంవుటులోని అర్థవంతమైన పదాల్ని వాడొద్దు.
* వెబ్‌ బ్రౌజర్లలో పాస్‌వర్డ్‌లను స్టోర్‌ చేయవద్దు.
* పబ్లిక్‌ వై-ఫై నెట్‌వర్క్‌తో వాడే కంప్యూటర్లలో ముఖ్యమైన ఎకౌంట్స్‌లోకి లాగిన్‌ అవ్వడం సురక్షితం కాదు.
* లాగిన్‌ వివరాల్ని నెట్టింట్లోని సర్వీసుల ద్వారా షేర్‌ చేయాల్సివస్తే సర్వీసు https ఎన్‌క్రిప్షన్‌ రక్షణ వలయంతో ఉన్నాయో లేదో చెక్‌ చేయండి.
* 10 వారాలకోసారి పాస్‌వర్డ్‌ని కచ్చితంగా మార్పు చేయాలి.
* ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను క్లౌడ్‌ స్టోర్‌ల్లో భద్రం చేయరాదు.
* మాస్టర్‌ పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకుని ఇతర సర్వీసుల పాస్‌వర్డ్‌లను టెక్స్ట్‌ ఫైల్‌లో పెట్టుకుని ఎన్‌క్రిప్షన్‌ మోడ్‌లో దాచుకోండి. ఎన్‌క్రిప్ట్‌ చేసిన ఫైల్‌ని వివిధ లొకేషన్స్‌లో బ్యాక్‌అప్‌ చేసి పెట్టుకోండి.
* వాడుతున్న సర్వీసులో 2-Step Authentication ఉంటే ఎనేబుల్‌ చేసి వాడుకోవడం మేలు.
* నిత్యం లాగిన్‌ అయ్యే ముఖ్యమైన సర్వీసుల్ని బుక్‌మార్క్‌ చేసుకుని లాగిన్‌ అవ్వడం సురక్షితం. ఒకవేళ అడ్రస్‌బార్‌లో డొమైన్‌ని టైప్‌ చేసి ఎంటర్‌ అయ్యే ముందు మరోసారి సైట్‌ పేరుని సరిగా టైప్‌ చేశారో లేదో చెక్‌ చేయడం మేలు.
* ఆన్‌లైన్‌లో స్క్రీన్‌క్యాప్చర్‌, క్లిప్‌బోర్డ్‌ సర్వీసుల్ని వాడుతున్నట్లయితే జాగ్రత్త. లాగిన్‌ వివరాలతో కూడిన ఫైల్స్‌ ఆటోమాటిక్‌గా క్లౌడ్‌లోకి అప్‌లోడ్‌ అవ్వకుండా చూడండి.

జనరేట్‌ చేయండి
క్లిష్టమైన పాస్‌వర్డ్‌ని పెట్టుకోవడం మీకు కష్టమైతే ఆ పనిని నెట్టింట్లో సురక్షితమైన టూల్స్‌కి అప్పగించొచ్చు. కావాలంటే LastPass సర్వీసుని ప్రయత్నించండి. https:// lastpass.com/generatepassword.php లింక్‌లోకి వెళ్తే Generate A Password విభాగం కనిపిస్తుంది. మీకో కొత్త పాస్‌వర్డ్‌ కావాలంటే ‘జనరేట్‌’ బటన్‌ నొక్కండి. ఎన్నయినా జనరేట్‌ చేసుకునే వీలుంది. ఒకవేళ పాస్‌వర్డ్‌ సెట్టింగ్స్‌ని మార్చాలంటే? కిందే ఉన్న Password Length, Password Formula సెట్టింగ్స్‌లో చూడండి. పాస్‌వర్డ్‌ ఎన్ని అక్షరాలు ఉండాలో నిర్ణయించొచ్చు.
* మరోటి ప్రయత్నిద్దాం అనుకుంటే https://www.passweird.com వెబ్‌ సర్వీసుని వాడొచ్చు. హోం పేజీలోని Generate Password బటన్‌పై నొక్కి జనరేట్‌ చేయవచ్చు.

మీకు తెలుసా?
* సుమారు రెండు వేల ఏళ్ల క్రితమే పాస్‌వర్డ్‌లు మనుగడలో ఉన్నాయట.
* కంప్యూటర్‌లు వెలువడ్డాక 1961 నుంచి పాస్‌వర్డ్‌లు వాడకంలోకి వచ్చాయి.
* పాస్‌వర్డ్‌ గురించి రెండు మాటల్లో చెప్పాలంటే... గుర్తుంచుకోవడానికి సులువుగా ఉండాలి. కనుక్కోవడానికి కష్టంగా ఉండాలి.
* ప్రపంచంలో ఎక్కువ మంది వాడే సాధారణ పాస్‌వర్డ్‌ 123456
* నెటిజన్లలో పావు వంతు తమ పాస్‌వర్డ్‌లను బ్రౌజర్లలో సేవ్‌ చేస్తున్నారట.
* ఎక్కువ శాతం యూజర్లు అన్ని ఎకౌంట్‌లకూ ఒకే పాస్‌వర్డ్‌ని వాడేందుకు మొగ్గుచూపుతున్నారట.
* ఎక్కువ శాతం పాస్‌వర్డ్‌లు అభిమానించే వ్యక్తుల పేర్లు, పెంపుడు జంతువులు, పుట్టిన రోజు తేదీలు, వాహనాల నెంబర్లతోనే క్రియేట్‌ చేస్తున్నారట.

  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • sthirasthi_300-50.gif