కౌన్సెలింగ్‌, ఇంగ్లిష్‌ విభాగాలకు మీ సందేహాలు పంపాల్సిన చిరునామా:

చదువు డెస్క్‌,
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు, రామోజీ ఫిల్మ్‌ సిటీ
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512
edc@eenadu.net

వైద్య విద్యకు దారులు ఇవిగో!
వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం ఎన్నో పరీక్షలు జరుగుతుంటాయి. కేవలం రాష్ట్రస్థాయి ఎంసెట్‌కే పరిమితం కాకుండా జాతీయస్థాయి ప్రవేశపరీక్షల్లో తగినవాటిని ఎంపిక చేసుకుని, వాటికి సంసిద్ధమవటం సముచితమైన చర్య. దీనికి తొలిమెట్టు... వివిధ ప్రవేశపరీక్షలపై స్థూల అవగాహన. దానికి ఉపకరించే కథనమిది!
సీనియర్‌ ఇంటర్‌, లాంగ్‌టర్మ్‌ బైపీసీ విద్యార్థులకు జాతీయ, రాష్ట్రస్థాయి వైద్యవిద్య ప్రవేశపరీక్షల ప్రక్రియ మొదలైంది. ఇంజినీరింగ్‌ విభాగం వారు ఎక్కువగా జాతీయస్థాయి పోటీ పరీక్షలవైపు మొగ్గుచూపుతుంటారు. కానీ బైపీసీ వారు రాష్ట్రస్థాయి పోటీ పరీక్ష- ఎంసెట్‌పైనే అధిక దృష్టి కేంద్రీకరించి ఉంటారు.

దీనికి ముఖ్య కారణం- సీట్ల పరిమిత సంఖ్యే. ఈ ప్రతిబంధకంతో పాటు సిలబస్‌లలోని స్వల్ప వ్యత్యాసాలు, పరీక్షా విధానాల్లోని మార్పులు, రుణాత్మక మార్కులు... వీటిమూలంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జాతీయస్థాయి పరీక్షలకు మొగ్గుచూపడం లేదు.

అఖిలభారత ప్రీ మెడికల్‌ పరీక్ష (AIPMT) రాయడానికి రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకూ అర్హత లేదు. మిగిలిన జాతీయస్థాయి పరీక్షలు రాసేవారి సంఖ్య చాలా తక్కువ. AIPMT పరీక్షలో జాతీయ కోటా కింద ప్రతి రాష్ట్రంలోని 15 శాతం సీట్లను ఈ ర్యాంకు ద్వారా నింపుతారు.

మన తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సీట్లు సుమారుగా 7000 వరకు ఉన్నాయి. వాటిలో 15 శాతం అంటే 1000 సీట్ల వరకు కోల్పోతాము. ఒకవేళ మనం నేషనల్‌ పూల్‌లో ఉన్నా 200 పైన సీట్లు రావు. ఎక్కువ సీట్లు కోల్పోయే అవకాశమున్నందున మనం నేషనల్‌ పూల్‌ వెలుపల ఉండాలనే ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని చెప్పవచ్చు.

కొన్నిటిని ఎంపిక చేసుకుని...
దీంతో జాతీయస్థాయి పరీక్షలకు తెలుగు రాష్ట్రాల బైపీసీ విద్యార్థులు మొగ్గు చూపడం లేదు. అయినప్పటికీ మిగిలిన పరీక్షల విధివిధానాలు తెలుసుకొని కొన్నిటిని మాత్రమే ఎంచుకుని వాటికి దరఖాస్తు చేసి, తయారుకావటం సముచితం!

ఏపీ ఎంసెట్‌, టీఎస్‌ ఎంసెట్‌, ఏపీ ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌ పరీక్ష, టీఎస్‌ ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌ పరీక్ష, గీతమ్‌ మెడికల్‌ పరీక్ష... ఇవి తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరీక్షలు.
మెడికల్‌ విభాగంలో చేరే మన విద్యార్థులకు మూడు రకాలుగా చూడవచ్చు.
* మొదటి రకం విద్యార్థులు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో కౌన్సెలింగ్‌ ద్వారా చేరతారు.
* రెండో రకం విద్యార్థులు ప్రయివేట్‌ మెడికల్‌ కళాశాలల్లో కేటగిరీ ‘ఎ’లో కౌన్సెలింగ్‌ ద్వారా చేరతారు.
* మూడో రకం విద్యార్థులు ఆంధ్ర, తెలంగాణలలో ప్రయివేట్‌ మెడికల్‌ కళాశాలలు నిర్వహించే వారి పరీక్షల ద్వారా కేటగిరి ‘బి’, ‘సి’లలో ప్రవేశం పొందుతారు.
COMEDK అనేది కర్ణాటకలోని ప్రయివేట్‌ మెడికల్‌ కళాశాలల పరీక్ష. జాతీయస్థాయి పోటీ పరీక్షల పరీక్షా విధానం, సీట్ల సంఖ్యపై ప్రాథమిక అవగాహన ఏర్పరచుకొందాం.


ఎయిమ్స్‌-2016
మనదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వైద్య విద్యాసంస్థ. దీనిలో UG కోర్సులకంటే PG కోర్సులకు అత్యధిక ప్రాధాన్యం. తొలిగా దిల్లీలో మాత్రమే ఉండేది. దిల్లీలోని సంస్థలో 72 సీట్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో జనరల్‌ కేటగిరికీ కేవలం 36- 38 సీట్లు. పోటీ దేశమంతటా కాబట్టి సగటున రాష్ట్రానికి ఒకటి లేదా రెండు సీట్లు వచ్చేవి. మూడేళ్ళ కిందట అదనంగా ఆరు AIIMS సంస్థలు (భోపాల్‌, పాట్నా, జోధ్‌పూర్‌, రిషికేష్‌, రాయ్‌పూర్‌, భువనేశ్వర్‌) ప్రారంభమయ్యాయి. వీటిలో ప్రతి సంస్థలో 100 సీట్ల చొప్పున 600 సీట్ల వరకు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి మంగళగిరిలోని AIIMS కూడా ప్రారంభం కావచ్చు.

ఎయిమ్స్‌ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే జరుగుతుంది. పరీక్ష కాల వ్యవధి 3 గం. 30 నిమిషాలు. పరీక్షలో 200 ప్రశ్నలుంటాయి. అన్నీ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలే. ఈ 200 ప్రశ్నలలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ) లలో 60 ప్రశ్నల చొప్పున మొత్తం 180. మిగిలిన 20 ప్రశ్నలు జనరల్‌ నాలెడ్జిలో ఉంటాయి. మొదటి 180 ప్రశ్నలలో 60 ప్రశ్నలు Assertion and Reasoning ప్రశ్నలుంటాయి. ప్రతి సరి అయిన సమాధానానికి +1 మార్కు, తప్పు సమాధానానికి -1/3. ర్యాంకు పొందటానికి జనరల్‌ విద్యార్థులకు 50%, ఓబీసీ వారికి 45 శాతం, ఎస్‌.సి./ఎస్‌.టి. వారికి 40 శాతం మార్కులు కటాఫ్‌ మార్కులుగా ఉంటాయి.


ఎంజీఐఎంఎస్‌
మహారాష్ట్రలోని వార్ధా వద్దగల MGIMS కూడా ఒక ప్రతిష్ఠాత్మకమైన సంస్థ. దీనిలో 100 సీట్లు ఉన్నాయి. మహారాష్ట్ర విద్యార్థులకు 54, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 46 సీట్లు ఉంటాయి. వీటిలో నేషనల్‌ కోటా కూడా ఉన్నది కాబట్టి జనరల్‌ కేటగిరీలో 10 సీట్ల లోపే అవుతుంది. అంటే పోటీ బాగా ఎక్కువ. పరీక్ష రెండు భాగాలుగా 3 గంటల వ్యవధితో జరుగుతుంది. మొదటి భాగంలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీలలో 60 ప్రశ్నల చొప్పున మొత్తం 180 ప్రశ్నలకు జవాబులు 3 గంటల్లో గుర్తించవలసి ఉంటుంది. రెండో భాగం 3 గంటల్లో గాంధీ ఆలోచనలపై 60 మార్కులకు జరుగుతుంది. దరఖాస్తు ఖరీదు కూడా చాలా ఎక్కువ- రూ. 5000/-

జిప్‌మర్‌
పాండిచ్చేరిలోని ఈ సంస్థకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కొంత మక్కువ చూపుతున్నారు. దీనికి కారణం పాండిచ్చేరిలోని భాగమైన యానాం కాకినాడ దగ్గరలో ఉండటం. దీనిలో కూడా స్నాతకోత్తర విభాగాలకు అదనపు ప్రాధాన్యం ఉంటుంది. జిప్‌మర్‌లో ఎంబీబీఎస్‌లో మొత్తం 150 సీట్లు ఉన్నాయి. వాటిలో పాండిచ్చేరికి 40 సీట్లు, సెల్ప్‌ ఫైనాన్స్‌డ్‌ NRI రూపంలో 5 సీట్లు ఉన్నాయి. మిగిలిన 105 సీట్లలో 50 జనరల్‌, 28 OBC , 16 SC, 11 STలకు కేటాయించి ఉంటాయి. ర్యాంకింగ్‌ కూడా కేటగిరీ పరంగానే ఇస్తారు.

పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. పరీక్ష కాల వ్యవధి 2.30 గంటలు. పరీక్షలో 200 ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ+ జువాలజీ)లలో 60 ప్రశ్నల చొప్పున మొత్తం 180 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలుంటాయి. మిగిలిన 20 ప్రశ్నల్లో 10 ప్రశ్నలు లాజిక్‌, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌లలో, 10 ప్రశ్నలు ఇంగ్లిష్‌, కాంప్రహెన్షన్‌లో ఉంటాయి. ఈ పరీక్షలో తుది ర్యాంకు నిర్ధారణకు చివరి 20 ప్రశ్నలు అంటే రీజనింగ్‌, ఇంగ్లిష్‌ బాగా ఉపయోగపడతాయి. ఎంసెట్‌ తర్వాత కనీసం నెల వ్యవధి దొరుకుతుంది కాబట్టి ఆ సమయాన్ని వినియోగించుకోగల్గినా ఈ పరీక్షలో నెగ్గటానికి అవకాశాలు ఎక్కువ.


సీఎంసీ
సీఎంసీ, వెల్లూరు కాలేజి ముఖ్యంగా క్రైస్తవ మైనారిటీ సంస్థలకు చెందినది కాబట్టి వివిధ చర్చిల ద్వారా స్పాన్సర్‌ అయిన విద్యార్థులకు అధిక శాతం సీట్లు కేటాయిస్తారు. ఇక్కడ మొత్తం 100 సీట్లు ఉంటే వాటిలో 84 సీట్లు స్పాన్సర్‌ అయిన విద్యార్థులకూ, మిగిలిన 16 సీట్లలో 12 జనరల్‌, 3 రిజర్వేషన్‌ ప్రాతిపదికగా కేటాయిస్తారు. అయితే అందరూ ప్రవేశపరీక్ష రాయవలసి ఉంటుంది.

పరీక్ష 3.10 గంటలు జరుగుతుంది. దీనిలో బయాలజీ- 60, ఫిజిక్స్‌- 60, కెమిస్ట్రీ- 60 కలిపి ఈ 180 ప్రశ్నలకు 2 గంటల వ్యవధి ఇస్తారు. ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ సెక్షన్‌- Iలో 60 ప్రశ్నలను 50 నిమిషాల కాల వ్యవధిలో, సెక్షన్‌-IIలో వేగం, కచ్చితత్వ నిర్థారణకు 60 ప్రశ్నలను 20 నిమిషాల్లో పూర్తిచేయాల్సివుంటుంది.

ప్రతి సరి అయిన సమాధానానికీ 1 మార్కు, తప్పు జవాబుకి సున్నా మార్కూ కేటాయిస్తారు. అయితే తప్పు జవాబు గుర్తించకుండా వదిలివేసిన ప్రతి ప్రశ్నకూ 0.2 మార్కులు ఇస్తారు. రుణాత్మక మార్కులు లేవు. కానీ జవాబు గుర్తించకుండా వదిలివేస్తే మార్కులు వస్తాయి కాబట్టి ఒక విధంగా రుణాత్మక మార్కులు ఉన్నట్లే!


ఏఐపీఎంటీ/ఏఎఫ్‌ఎంసీ
ఏఎఫ్‌ఎంసీ ప్రవేశ పరీక్ష అంటే ఇప్పుడు AIPMT మాత్రమే. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా ఒకవేళ AFMCలో ప్రవేశానికి అయితే AIPMT రాయవలసి ఉంటుంది. మొత్తము 130 సీట్లు ఉన్నాయి. 105 సీట్లు బాలురకు, 25 సీట్లు బాలికలకు కేటాయించివున్నాయి. మిలిటరీ కళాశాల కాబట్టి నిబంధనలు కఠినంగానే ఉంటాయి. ఇక్కడ చేరిన విద్యార్థులకు P.G. చేయడం చాలా సులభమవుతుంది. అయితే ఇక్కడ కోర్సు పూర్తిచేసిన తర్వాత మిలిటరీలో పనిచేస్తానని బాండ్‌ ఇవ్వవలసి ఉంటుంది.

ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీలలో కలిపి మొత్తం 180 ప్రశ్నలు. ప్రతి సరి అయిన సమాధానానికి +4 మార్కులు, తప్పు సమాధానానికి -1 మార్కు ఉంటుంది. రుణాత్మక మార్కులున్నాయి కాబట్టి తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాబు గుర్తించడం మేలు. పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో మే 1వ తేదీ జరుగుతుంది.


మణిపాల్‌
మణిపాల్‌ ఎంబీబీఎస్‌ ఫీజు తెలుగు రాష్ట్రాలోని Category B సీట్ల ఫీజు కంటే చాలా తక్కువగానే ఉంది. అందుకని అధిక శాతం విద్యార్థులు ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్త ఫీజు ప్రకారము తెలుగు రాష్ట్రాల్లో B కేటగిరి సీట్లకు ఫీజు 55 లక్షలు అయితే మణిపాల్‌లో 40 లక్షలలోపు ఉంది.

మణిపాల్‌ పరీక్ష సిలబస్‌కు మన విద్యార్థులు అదనంగా తయారు కావలసిన అవసరం కూడా లేదు. ఈ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతుంది. ప్రశ్నపత్రంలో 200 ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో 50 చొప్పున మొత్తం 100, బయాలజీలో 70 ప్రశ్నలు, ఇంగ్లిష్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌లో 30 ప్రశ్నలు కలిపి మొత్తము 200 ప్రశ్నలు 2 గం. 30 ని.లలో జవాబు గుర్తించవలసి ఉంటుంది. రుణాత్మక మార్కులు లేవు. 160 పైన విద్యార్థి తెచ్చుకోగల్గితే సీటు సాధించుకున్నట్లే. ఈ రెండు వందల మార్కులకు గాను 175 మార్కులపైన సాధిస్తే ఉపకారవేతనం పొందటానికి కూడా అవకాశం ఉంది. సీట్ల సంఖ్య కూడా 600 వరకు ఉంది. ఎటువంటి రిజర్వేషనూ లేదు.


కేఐఐటీఈ-2016
కళింగ విద్యాసంస్థలు ఒరిస్సాలో అధిక ప్రాధాన్యం ఉన్నవి. దీనికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. కోర్సు ఫీజు కూడా చాలా తక్కువ. 1500 వరకు సీట్లు ఈ పరీక్ష ద్వారా నింపుతారు. కానీ దానిలో 200 వరకు కళింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (KIMS) లోనే ఉన్నాయి. విద్యార్థి జాగ్రత్తగా తయారుకావడానికి ప్రణాళిక వేసుకోగల్గితే సీటు సాధించుకోవచ్చు.

ఈ ప్రవేశ పరీక్ష 3 గంటలు జరుగుతుంది. దీనిలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీల నుంచి 60 ప్రశ్నల చొప్పున 180 ప్రశ్నలు 3 గంటల వ్యవధిలో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. రుణాత్మక మార్కులు లేవు. ఎంసెట్‌ కంటే సులువైనదికాబట్టి నెగ్గే అవకాశాలు చాలా ఎక్కువ.

బేసిక్‌ సైన్సెస్‌ వైపు ఆసక్తి ఉన్న విద్యార్థులకు NEST-2016 ఉత్తమమైన పరీక్ష. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల ఎంసెట్‌ పరీక్షలు.

అందుబాటులో ఉన్న ఈ పరీక్షలన్నిటి గురించీ ముందుగా తెలుసుకొని వాటిలో ఏవి రాయటానికి తమకు అనుగుణంగా ఉన్నాయో ఎంచుకోవటం ముఖ్యం. వాటిపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించి సన్నద్ధమైతే సీటును సంపాదించిపెట్టే ర్యాంకును పొందవచ్చు.


  • Railway Recuritment Board
  • Kovida