Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu


అతిగా నమ్మితే చిక్కే
భారతీయ సనాతన సంప్రదాయంలో తోటివారికి సహాయం చెయ్యండని, అతిథులను పూజించండని చెప్పి ఉన్నమాట వాస్తవమే. అంతమాత్రంచేత కనిపించిన ప్రతివారినీ గుడ్డిగా నమ్మకూడదు. వారి ప్రవర్తన, గుణగణాలను తెలుసుకొన్న తర్వాతే అతిథి పూజాసత్కారాలు చేయటం కానీ లేదా స్నేహాన్ని కొనసాగించటం కానీ చేయటం మంచిది. ఈ విషయాన్ని ఉదాహరణ పూర్వకంగా వివరించే ఈ కథ మహభారతం శాంతిపర్వం కృతఘ్నోపాఖ్యానంలో ఉంది. మంచితనం ఉండొచ్చు కానీ అతిమంచితనం పనికిరాదు. దానం చేయొచ్చు కానీ అపాత్రదానం చేయకూడదు. ఎదుటి వ్యక్తిని ఓ కంట కనిపెడుతూ అతడు మంచివాడని రూఢి అయిన తర్వాతే ఏదైనా చెయ్యదలచుకున్న సహాయాన్ని చెయ్యాలి. ఒకవేళ వచ్చినవాడు దుర్మార్గుడే అయి ఉంటే అతడికి చేసిన సహాయం సహాయం చేసినవారికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ విషయం గౌతముడు అనే క్రూరాత్ముడిలో రుజువుకావటం ఈ కథలో గమనించదగ్గ విషయం. గౌతముడు వేదపండితుల ఇంట్లో జన్మించాడు. అయితే ఆ ఇంటివారికి ఉన్న మంచి లక్షణాలు ఏవీ అతడికి అబ్బలేదు. ఓ దోపిడీ దొంగ సహాయాన్ని పొంది హింసతో జీవితాన్ని గడపటం నేర్చుకున్నాడు. అతడి గురించి తెలిసిన ఓ సన్యాసి ఇదేమిటి ఇలా బతుకుతున్నావు, ఇది మంచి పద్ధతికాదు అని వివరించినప్పుడు తన పద్ధతి మార్చుకోవాలని ఇల్లు విడిచి బయలుదేరాడు.

కుట్రను పసిగట్టని కొంగ
అలా వెళుతున్న గౌతముడికి సముద్రతీరంలో ఓ వ్యాపారుల సమూహం కనిపించింది. వాళ్లవెంట వెళ్లి వ్యాపారంచేసి డబ్బు సంపాదిద్దామనుకున్నాడు. ఇంతలోనే ఓ మదపుటేనుగు వ్యాపారుల సమూహం మీద దాడి చేసింది. తలా ఓ దిక్కుకు పరుగెత్తారు. అలా గౌతముడు కూడా ఓ అడవికి చేరుకున్నాడు. ప్రకృతి సౌందర్యంతో విరాజిల్లుతున్న ఆ అడవిలో పెద్ద మర్రిచెట్టు కనిపించింది. కాసేపు ఆ చెట్టుకింద విశ్రమించాడు. సాయంసమయం అవుతూ ఉండగా నాడీజంఘుడు అనే ఓ కొంగ అటుగా వచ్చింది. ఆ చెట్టుమీదే ఆ కొంగ గూడు కట్టుకొని ఉంటోంది. నాడీజంఘుడికే రాజధర్ముడు అనే పేరు కూడా ఉంది. రాజధర్ముడు మర్రిచెట్టు కింద విశ్రాంతి తీసుకొంటున్న గౌతముడిని చూశాడు. సకల సద్గుణాలను కలిగిఉన్న ఆ రాజధర్ముడు తన చెట్టుకింద విశ్రాంతి తీసుకొంటున్నవాడు తన ఇంటికి వచ్చిన అతిథేనని, అతిథి దేవుడితో సమానుడని అనుకొని ఎలా అతిథి పూజ చేయాలా? అని ఆలోచించసాగాడు. అదే సమయానికి గౌతముడు ఆ పక్షివంక చూశాడు. బాగా బలిసిఉన్న ఆ పక్షి మాంసాన్ని తింటే బాగుండునని అనుకొన్నాడు. అతిమంచితనంతో ఉన్న రాజధర్ముడు మాత్రం ఆ విషయాన్ని పసిగట్టలేదు. పైగా మెల్లగా అతడి పక్కనవాలి మంచిగా పలుకరించింది. అంతేకాక అతడికి ఆహారాన్ని కూడా సమకూర్చిపెట్టింది. ఆ తరువాత నిదానంగా ఎక్కడనుంచి వస్తున్నావు? నీ గోత్రనామాలేమిటని అడిగింది. గౌతముడు సరిగా సమాధానం చెప్పలేకపోయాడు. అప్పటికి కూడా రాజధర్ముడు గౌతముడిని అనుమానించకపోగా ఆ రాత్రికి అతడు పడుకొనేందుకు పువ్వులు, చిగురుటాకులతో మెత్తని పక్కను కూడా ఏర్పాటుచేసింది. పక్క మీద తన అతిథి పడుకొంటున్నప్పుడు ఎక్కడిదాకా వెళుతున్నావు? ఏ పనిమీద వెళుతున్నావు? అని అడిగింది. అప్పుడు గౌతముడు తాను ధనసంపాదన కోసం బయలుదేరినట్లు చెప్పాడు.

మిత్రుడిపై విశ్వాసంతో సాయం
రాజధర్ముడిలో ఎదుటివ్యక్తిని సరిగా అంచనా వేసే శక్తి లేకపోవటంవల్ల దుర్మార్గుడైన గౌతముడిని తన మిత్రుడిగానే భావించింది. అంతేకాక ఆ రాత్రికి హాయిగా నిద్రపోయి తెల్లవారగానే తన ఆప్తమిత్రుడైన విరూపాక్షుడు అనే ఓ రాక్షసరాజు ఉంటున్న నగరానికి దారిచూపి విరూపాక్షుడి దగ్గరకు వెళ్లి తన పేరు చెప్పమని, కావలసిన ధనాన్ని అతడిస్తాడని చెప్పి పంపింది. గౌతముడు విరూపాక్షుడి నగర ద్వారం దగ్గరకు వెళ్లగానే గూఢచారులు నాడీజంఘుడి దగ్గర నుంచి గౌతముడు వస్తున్నాడనే విషయాన్ని గ్రహించి తమరాజుకు చెప్పారు. విరూపాక్షుడు తన మిత్రుడి మీద ఉన్న గౌరవం, నమ్మకాలతో వెంటనే గౌతముడిని తన దగ్గరకు తీసుకురమ్మనటంతో చారులు అలాగే చేశారు. విరూపాక్షుడు అతిథికి తగిన సత్కారాలను చేశాడు. కానీ నాడీజంఘుడిలా గుడ్డిగా నమ్మలేదు. గౌతముడి పుట్టు పూర్వోత్తరాలను, చదువు లాంటివాటిని గురించి అడిగి గౌతముడిలో సరైన లక్షణాలను లేవని గ్రహించాడు. దాంతోపాటు గౌతముడిని అంచనా వేయటంలో రాజధర్ముడు పొరపాటు పడ్డాడని కూడా గ్రహించాడు. కానీ చేసేది లేక తన మిత్రుడు మీద ఉన్న గౌరవంతో ఆ రోజున తాను పలువురు వేదపండితులకు దానాలు చేస్తుండటంతో ఆ పండితుల వరుసలో గౌతముడిని కూడా కూర్చోమన్నాడు. అందరితోపాటు అతడికీ బంగారం, రత్నాలు, ధనంలాంటివి ఇచ్చి పంపాడు. గౌతముడు తాను మొయ్యలేనంత బరువును నెత్తికెత్తుకొని మెల్లగా రాజధర్ముడున్న మర్రిచెట్టు దగ్గరకు చేరాడు. ఆ ధనాన్నంతా తీసుకొని తన ఇంటికి వెళ్లాలంటే బాగా శక్తి కావాలి. దానికోసం బాగా తినాలి. అందుకు ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నంతలో రాజధర్ముడు అక్కడికొచ్చి తన మిత్రుడు చలికాచుకొనేందుకు నిప్పురాజేసి మిత్రుడిమీద విశ్వాసంతో ఆ పక్కనే విశ్రమించాడు. దుర్మార్గుడైన గౌతముడు ఒక నిప్పు కొరివి తీసుకొని నిద్రపోతున్న రాజధర్ముడి తలమీద కొట్టి చంపి ఆ మాంసాన్ని తిన్నాడు. ఈ కథా సందర్భంలో అతిమంచితనంతో దుర్మార్గులను నమ్మి మోసపోకూడదనే విషయం స్పష్టమవుతోంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

40ల నాటి సెట్స్‌లో ఫరా ఖాన్‌, విశాల్‌ భరద్వాజ్‌

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో కంగనా రనౌత్‌, షాహిద్‌ కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌లు ప్రధాన తారాగణంగా........

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net